children doctors
-
థర్డ్ వేవ్‌ను తరిమేసేలా..!
సాక్షి, అమరావతి: కోవిడ్–19 థర్డ్ వేవ్‌లో వైద్యపరంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 19 ఆర్టీపీసీఆర్ ల్యాబొరేటరీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న సర్కారు.. చిన్నారులకు అందించే వైద్యంపైనా కసరత్తు పూర్తి చేసింది. థర్డ్ వేవ్‌లో 18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా సోకితే మన దగ్గర ఉన్న వనరులు ఏమిటి, ఎంతమంది వైద్యులున్నారు, పడకలు ఎన్ని అందుబాటులో ఉన్నాయనే విషయాలపై సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. పీడియాట్రిక్ ఐసీయూలు, ఆక్సిజన్ పడకలు సిద్ధం చేస్తోంది. రానున్న 3, 4 నెలల్లో అంచనాల మేరకు వైరస్ పరిస్థితులను అంచనా వేసి.. ప్రతి చిన్నారికీ వైద్యపరంగా ఉన్న ప్రతి వనరునూ ఉపయోగించేలా సిద్ధమైంది. చిన్న పిల్లల వైద్యమే ముఖ్యం రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌లో 4.50 లక్షల మంది చిన్నారులకు కరోనా సోకుతుందనేది ప్రాథమిక అంచనా. ఈ స్థాయిలో కరోనా వేవ్ రావచ్చు.. రాకపోవచ్చు. కానీ.. గరిష్ట అంచనాలతో కార్యాచరణ చేపట్టింది. చిన్నారులకు కరోనా సోకితే ఏం చేయాలన్న దానిపై సర్కారు రెండు వారాలపాటు కసరత్తు చేసింది. రాష్ట్రం నలుమూలలా ఆస్పత్రులు, ప్రత్యేక పడకలు, డాక్టర్లు, నర్సులు వంటి వనరులను గుర్తించింది. వాటిలో చిన్నారులకు అవసరమయ్యే చికిత్సలకు అన్నిరకాల మౌలిక వసతులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పడకలు, వైద్యులను గుర్తించారు. రెండు నెలల్లో కావాల్సిన వైద్య ఉపకరణాలన్నీ సమకూర్చేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఇలా చేస్తారు.. – రాష్ట్రంలో ఎక్కడైనా సరే 5 శాతానికి మించి పాజిటివిటీ లేకుండా చూడటం – గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో పాజిటివిటీ శాతాన్ని బట్టి అన్‌లాక్ సడలింపులు – మాస్క్, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోడం వంటి జాగ్రత్తలపై నిఘా పెట్టడం – జన సందోహ ప్రాంతాలను పూర్తిగా నియంత్రించి, నియంత్రణకు అనుగుణంగా ఆర్థిక కార్యకలాపాలు ఉండేలా చూడటం – ఒకరినొకరు తాకేలా ఉండే రద్దీ ప్రాంతాలను భారీగా తగ్గించడం – అన్ని ప్రాంతాల్లో టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవడం – ఫీవర్ సర్వే కొనసాగిస్తూ.. ముందే బాధితులను గుర్తించి వారికి వైద్యసేవలు అందించడం – ఆటోలు, బస్సులు, సినిమా హాళ్లు, పర్యాటక ప్రాంతాలు, కాలేజీలు, ఫార్మసీ ఔట్లెట్లు, వార్డు, గ్రామ సచివాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద కరోనా నియంత్రణకు పోస్టర్లు – కరోనా నియంత్రణకు ఎన్జీవోలను విరివిగా వినియోగించుకోవడం – డిజిటిల్ మీడియా, పాపులర్ యాప్స్, ఇ–కామర్స్ కంపెనీలు, వాట్సాప్‌ల ద్వారా నియంత్రణపై ప్రచారం -
ఆందోళనకరంగా శిశు మరణాలు
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ శిశు మరణాలు చోటు చేసుకున్నాయని తేలింది. 2017లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి ప్రసవాలకు 32 మంది శిశువులు అశువులు బాశారు. తాజాగా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్–బులెటిన్) ఈ నిజాలను వెల్లడించింది. 2017కు సంబంధించి దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ శిశు మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపింది. తెలంగాణలో ప్రతి వెయ్యికి 29 మంది శిశువులు మృతి చెందగా ఈ సంఖ్య కర్ణాటకలో 25, తమిళనాడులో 16, కేరళలో 10గా ఉంది. జాతీయ సగటు 33 ఉండగా ఏపీ సగటు 32గా నమోదైంది. ఎస్ఎన్సీయూలే పెద్దదిక్కు ప్రస్తుతం రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్లు (ఎస్ఎన్సీయూలు) ఏర్పాటు చేశారు. వీటిలో శిక్షణ పొందిన నర్సులు, వైద్యులతోపాటు అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. మొత్తం ఐదు జిల్లాల్లో 21 సెంటర్లు ఏర్పాటు చేసి నవజాత శిశువులకు కేంద్ర నిధులతో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. దీనివల్ల ఆ ప్రాంతాల్లో శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. ఈ కేంద్రాలను మైదాన ప్రాంతాలకు కూడా విస్తరిస్తే శిశుమరణాలను నియంత్రించొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ శిశు మరణాలు ఉన్న ప్రాంతాలను గుర్తించాలి ఇక్కడ ఏర్పాటు చేసిన ఎస్ఎన్సీయూ వల్ల ఈ ప్రాంతంలో శిశు మరణాలు బాగా తగ్గాయి. ఏ ప్రాంతంలో ఎక్కువ శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయో గుర్తించి అక్కడ ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. –డా.జీవన్, చిన్నపిల్లల వైద్య నిపుణులు, ఎస్ఎన్సీయూ, అడ్డతీగల, తూర్పుగోదావరి -
ఆ హాస్పిటల్‌కే వెళ్లండి
మంచిర్యాలలో పిల్లల వైద్యుల కాఠిన్యం పరిస్థితి చేయి దాటితే రెఫర్ లేకపోతే రెట్టింపు బిల్లులు వసూల్ ఇటీవల బెల్లంపల్లికి చెందిన మధుకర్(పేరు మార్చాం) తన ఆరు నెలల బాబు అస్వస్థతకు గురి కావడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో చూపించాడు. వైద్యుడు పరీక్షించి మందులు రాసిచ్చాడు. మరుసటి రోజే ఆ చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. వెంటనే అదే ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో వైద్యుడు లేరు. దీంతో స్థానికంగా ఉన్న మరో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఇది వరకే మరో ఆస్పత్రిలో చూపించినట్లు తెలుసుకున్న వైద్యుడు.. రోగి నాడీ పట్టేందుకు కూడా ఇష్టపడలేదు. మరో ఆస్పత్రిలో చూపించుకోవాలని పంపించేశాడు. ఇలా.. మధుకర్ మంచిర్యాల పట్టణంలో ఉన్న అన్ని ఆస్పత్రులూ తిరిగాడు. కానీ ఏ ఆస్పత్రిలోనూ వైద్యుడు ఆ చిన్నారికి వైద్యం అందించలేదు. ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో కరీంనగర్ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. ఇంకాస్త ఆలస్యమైతే బాలుడి ప్రాణం పోయేదని వైద్యులు చెప్పారు. ఇలాంటి అనుభవమే తూర్పూ జిల్లాలో చాలామందికి ఎదురవుతోంది. ఒకరు చూస్తే.. మరొకరు చూడరు సాక్షి, మంచిర్యాల : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మంచిర్యాలలో ప్రైవేటు వైద్యం ఓ వ్యాపారంగా మారింది. పరిస్థితి విషమించి ఆస్పత్రికి వచ్చే రోగి జబ్బు గురించి తెలుసుకోకముందే.. ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు అతను గతంలో స్థానికంగా మరో ఇతర ఆస్పత్రిలో చూపించుకున్నాడా...? లేదా..? అని ఆరా తీస్తున్నాయి. ఇతర ఆస్పత్రిలో చూపించుకుంటే సదరు రోగికి వైద్యం అందించేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారు. మరో ఆస్పత్రిలో చూపించుకోవాలంటూ ఉచిత సలహాలిస్తున్నారు. ఇంకొందరైతే మరో ఆస్పత్రిలో చూపించుకుని వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జరిమానాగా తాము అందించిన వైద్యానికి రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందుతుందనే ఉద్దేశంతో.. రోగి బంధువులూ తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేసైనా ఫీజులు చెల్లిస్తున్నారు. ఇదంతా యథేచ్ఛగా.. బహిరంగంగా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రోగి పరిస్థితి కొంత విషమంగా ఉంటే చాలు.. దీన్ని ఆసరాగా చేసుకుని తమ ఆస్పత్రిలో చేరిన ఆ రోగికి వైద్యం అందించి యాజమాన్యాలు దోచుకుంటున్నాయి. ఆస్పత్రికి వెళ్లాలంటే భయం..! రోజులు గడుస్తున్నా కొద్దీ.. మంచిర్యాల పట్టణం కార్పొరేట్ ఆస్పత్రుల హబ్‌గా మారుతోంది. ఇప్పటికే పట్టణంలో సుమారు వంద వరకు ఆస్పత్రులున్నాయి. వసతులు.. డాక్టర్ల విద్యార్హతలకు అనుగూణంగా ఆయా ఆస్పత్రులు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. స్థానిక పలు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు మాత్రం ఒకరి కేసును మరొకరు తీసుకోవడం లేదు. చిన్న జబ్బు అయినా సరే.. రోగిని పరీక్షించేందుకు నిరాకరిస్తున్నారు. పలు ఆస్పత్రుల్లోనయితే.. ఇది వరకు మరో ఆస్పత్రిలో చూపించుకున్నారని తెలిస్తే చాలు... రిసిప్షన్లోనే కంపౌండర్లు డాక్టర్ బిజీగా ఉన్నారంటూ రోగిని తిరిగి పంపేస్తున్నారు. వైద్యుల మద్య ఒప్పందమో..? వ్యతిరేకతో తెలియదు గానీ వీరి తీరుతో.. ఇది వరకే ఓ ఆస్పత్రిలో చూపించుకున్న రోగులు ఇతర ఆస్పత్రులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అందుకే ముందుగా ఏ ఆస్పత్రికి తీసుకెళ్లాలనే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. రోగి బంధువులను చూసి.. ఆర్థిక స్థోమత బాగున్నట్లు తెలుసుకున్న పలు ఆస్పత్రి యాజమాన్యాలు ముందు చికిత్స కోసం నిరాకరించి.. ఆ తర్వాత అత్యవసర కేసు కింద రోగిని తీసుకుంటున్నారు. డిశ్చార్జ్ సమయంలో రెట్టింపు డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజు దోపిడీ.. తీరుపై వైద్యశాఖ దృష్టిసారించకపోవడంతోనే ఆయా యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి జలపతినాయక్ వివరణ కోసం ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు.