ఆ హాస్పిటల్కే వెళ్లండి
ఆ హాస్పిటల్కే వెళ్లండి
Published Mon, Sep 19 2016 2:44 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
మంచిర్యాలలో పిల్లల వైద్యుల కాఠిన్యం
పరిస్థితి చేయి దాటితే రెఫర్
లేకపోతే రెట్టింపు బిల్లులు వసూల్
ఇటీవల బెల్లంపల్లికి చెందిన మధుకర్(పేరు మార్చాం) తన ఆరు నెలల బాబు అస్వస్థతకు గురి కావడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో చూపించాడు. వైద్యుడు పరీక్షించి మందులు రాసిచ్చాడు. మరుసటి రోజే ఆ చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. వెంటనే అదే ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో వైద్యుడు లేరు. దీంతో స్థానికంగా ఉన్న మరో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఇది వరకే మరో ఆస్పత్రిలో చూపించినట్లు తెలుసుకున్న వైద్యుడు.. రోగి నాడీ పట్టేందుకు కూడా ఇష్టపడలేదు. మరో ఆస్పత్రిలో చూపించుకోవాలని పంపించేశాడు. ఇలా.. మధుకర్ మంచిర్యాల పట్టణంలో ఉన్న అన్ని ఆస్పత్రులూ తిరిగాడు. కానీ ఏ ఆస్పత్రిలోనూ వైద్యుడు ఆ చిన్నారికి వైద్యం అందించలేదు. ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో కరీంనగర్ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. ఇంకాస్త ఆలస్యమైతే బాలుడి ప్రాణం పోయేదని వైద్యులు చెప్పారు. ఇలాంటి అనుభవమే తూర్పూ జిల్లాలో చాలామందికి ఎదురవుతోంది. ఒకరు చూస్తే.. మరొకరు చూడరు
సాక్షి, మంచిర్యాల : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మంచిర్యాలలో ప్రైవేటు వైద్యం ఓ వ్యాపారంగా మారింది. పరిస్థితి విషమించి ఆస్పత్రికి వచ్చే రోగి జబ్బు గురించి తెలుసుకోకముందే.. ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు అతను గతంలో స్థానికంగా మరో ఇతర ఆస్పత్రిలో చూపించుకున్నాడా...? లేదా..? అని ఆరా తీస్తున్నాయి. ఇతర ఆస్పత్రిలో చూపించుకుంటే సదరు రోగికి వైద్యం అందించేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారు. మరో ఆస్పత్రిలో చూపించుకోవాలంటూ ఉచిత సలహాలిస్తున్నారు. ఇంకొందరైతే మరో ఆస్పత్రిలో చూపించుకుని వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జరిమానాగా తాము అందించిన వైద్యానికి రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందుతుందనే ఉద్దేశంతో.. రోగి బంధువులూ తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేసైనా ఫీజులు చెల్లిస్తున్నారు. ఇదంతా యథేచ్ఛగా.. బహిరంగంగా జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రోగి పరిస్థితి కొంత విషమంగా ఉంటే చాలు.. దీన్ని ఆసరాగా చేసుకుని తమ ఆస్పత్రిలో చేరిన ఆ రోగికి వైద్యం అందించి యాజమాన్యాలు దోచుకుంటున్నాయి.
ఆస్పత్రికి వెళ్లాలంటే భయం..!
రోజులు గడుస్తున్నా కొద్దీ.. మంచిర్యాల పట్టణం కార్పొరేట్ ఆస్పత్రుల హబ్‌గా మారుతోంది. ఇప్పటికే పట్టణంలో సుమారు వంద వరకు ఆస్పత్రులున్నాయి. వసతులు.. డాక్టర్ల విద్యార్హతలకు అనుగూణంగా ఆయా ఆస్పత్రులు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. స్థానిక పలు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు మాత్రం ఒకరి కేసును మరొకరు తీసుకోవడం లేదు. చిన్న జబ్బు అయినా సరే.. రోగిని పరీక్షించేందుకు నిరాకరిస్తున్నారు. పలు ఆస్పత్రుల్లోనయితే.. ఇది వరకు మరో ఆస్పత్రిలో చూపించుకున్నారని తెలిస్తే చాలు... రిసిప్షన్‌లోనే కంపౌండర్లు డాక్టర్ బిజీగా ఉన్నారంటూ రోగిని తిరిగి పంపేస్తున్నారు. వైద్యుల మద్య ఒప్పందమో..? వ్యతిరేకతో తెలియదు గానీ వీరి తీరుతో.. ఇది వరకే ఓ ఆస్పత్రిలో చూపించుకున్న రోగులు ఇతర ఆస్పత్రులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అందుకే ముందుగా ఏ ఆస్పత్రికి తీసుకెళ్లాలనే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు.
రోగి బంధువులను చూసి.. ఆర్థిక స్థోమత బాగున్నట్లు తెలుసుకున్న పలు ఆస్పత్రి యాజమాన్యాలు ముందు చికిత్స కోసం నిరాకరించి.. ఆ తర్వాత అత్యవసర కేసు కింద రోగిని తీసుకుంటున్నారు. డిశ్చార్జ్ సమయంలో రెట్టింపు డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజు దోపిడీ.. తీరుపై వైద్యశాఖ దృష్టిసారించకపోవడంతోనే ఆయా యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి జలపతినాయక్ వివరణ కోసం ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు.
Advertisement