ఆరోగ్యశ్రీ కార్డుదారులకు తేల్చి చెబుతున్న ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు
ఉచిత చికిత్స అందక చితికిపోతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు
ఆస్పత్రులకు రూ.3 వేల కోట్లకుపైగా పేరుకుపోయిన బకాయిలు
నిర్వహణ కష్టంగా మారిందంటూ సర్కారుకు యాజమాన్యాల లేఖ
పేదల ఇక్కట్లను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు సర్కారు
బీమా ప్రవేశపెట్టేందుకు ఆరు నెలల్లో ఆరోగ్యశ్రీని అంపశయ్య ఎక్కించిన వైనం
పేరుకే పెద్దాసుపత్రులు.. దూదికీ దిక్కులేదు.. మందులన్నీ బయట కొనుక్కోవాల్సిందే
సర్జికల్ సరంజామా తెచ్చుకోవాల్సింది రోగులే
ఆరోగ్యశ్రీ అంటే రానివ్వడం లేదు
తిరుపతి కొర్లగుంటలో ఉంటున్నాం. ఆటో డ్రైవర్‌గా పనిచేసే నా భర్తకు కడుపు నొప్పి రావడంతో స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లగా కడుపులో గడ్డ ఉందని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించగా ఆరోగ్యశ్రీ అయితే ఆపరేషన్ చేయమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు రూ.3 లక్షల విలువ చేసే సేవలు ఉచితంగా పొందాం. ఇప్పుడేమో ఆస్పత్రి లోపలకు కూడా అనుమతించడం లేదు.
– రమణమ్మ, తిరుపతి
⇒ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక కావేరి డెంగీ బారిన పడటంతో ఈ ఏడాది ఆగస్టు 23న తల్లిదండ్రులు కర్నూలులోని ఓ నెట్‌వర్క్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందకపోవడంతో చేతి నుంచి రూ.లక్షల్లో చెల్లించారు. బాధిత బాలిక చికిత్స పొందుతూ అదే నెల 26న మృతి చెందింది.
⇒ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాగేశ్వరరావుకు కొద్ది రోజుల క్రితం ఛాతీలో నొప్పి రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. వైద్య పరీక్షలు, యాంజియో చేయాలని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని నాగేశ్వరరావు చెప్పడంతో.. ‘ఇక్కడ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లవు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. డబ్బు కడితేనే వైద్యం చేస్తాం’ అని అనడంతో చేసేదేమీ లేక చేతి నుంచి రూ.20 వేలు చెల్లించారు.
⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామానికి చెందిన పామర్తి వీరవెంకట సత్యనారాయణ (55) రైతు కూలీ. ఎరువుల బస్తాతో సైకిల్‌పై వెళ్తుండగా జారి పడిపోవడంతో చువ్వలు వెన్నెముకకు గుచ్చుకుని తీవ్ర గాయాలయ్యాయి.
రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించలేమని చేతులెత్తేశారు. దీంతో తెలిసిన వారి వద్ద అప్పుతెచ్చి కుటుంబ సభ్యులు అరకొర వైద్యం చేయించారు. మెరుగైన వైద్యం అందక అనంతరం ఆయన మృతి చెందారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందించి ఉంటే పెద్ద దిక్కును కోల్పోయే వాళ్లం కాదని సత్యనారాయణ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెడుతున్నారు.
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లూ ప్రజారోగ్యానికి భరోసా కల్పించిన ఆరోగ్యశ్రీ పథకానికి సుస్తీ చేసింది. చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య నెలకొన్న పరిస్థితులు మళ్లీ దాపురిస్తున్నాయి. ఆరోగ్యశ్రీని నీరుగార్చడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు వైద్యం కోసం అప్పుల పాలవుతూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఒకపక్క ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడం.. మరోపక్క శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే సమయంలో జీవన భృతి కింద గత ప్రభుత్వం అందించిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా సాయం అందక అల్లాడుతున్నాయి.
ఆరోగ్యశ్రీ ట్రస్టు స్థానంలో బీమా కంపెనీని ప్రవేశపెట్టేందుకు ఆరునెలల్లో ఆరోగ్యశ్రీని కూటమి సర్కారు అంపశయ్య ఎక్కించింది. ఆరోగ్యశ్రీని అమలు చేసేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవని టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే కుండబద్ధలు కొట్టారు. ప్రజలు ఉచిత వైద్యం కోసం రూ.25 లక్షల వరకూ పరిమితి ఉండే ఆరోగ్యశ్రీని కాకుండా.. కేంద్రం అమలు చేసే పీఎం జన్ ఆరోగ్య యోజన(ఆయుష్మాన్ భారత్) పథకాన్ని వినియోగించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు టీడీపీ కూటమి ప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయడం లేదు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్ల మేర బకాయి పడటంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. పెద్ద మొత్తంలో బిల్లులు రాకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారిందని ఆస్పత్రి వర్గాలు చేతులెత్తేస్తున్నాయి.
దురదృష్టవశాత్తూ అనారోగ్యం పాలైతే నిరుపేదలు, మధ్య తరగతి వర్గాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డుతో లబ్ధిదారులు ఆస్పత్రులకు వెళితే.. ‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఉచితంగా చికిత్సలు చేయలేం..’ అని ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఖరాకండిగా చెబుతున్నాయి. చికిత్స కోసం చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నాయి.
ఉచిత వైద్యం కలే..
అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వస్తున్న రోగులు తమకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని మొత్తుకుంటున్నా ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆలకించడం లేదు. వాస్తవానికి నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలతో పాటు వైద్య పరీక్షలు, అవసరమైన సర్జరీలు, అనంతరం వాడాల్సిన మందులను ఉచితంగా ఇవ్వాలి. కార్డుదారుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. అయితే చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం.. నిర్వహణ భారంగా మారడంతో ఆస్పత్రులు నిక్కచ్చిగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి.
ఓపీ, రకరకాల పరీక్షలు, మందులు కొనాలంటూ పేదల జేబులు గుల్ల చేస్తున్నాయి. కడుపులో గడ్డ, ప్రసవం, చిన్నపాటి ఎముకల ఫ్రాక్చర్ లాంటి సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లిన వారి నుంచి కొన్ని చోట్ల రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక గుండె, న్యూరో, కిడ్నీ, క్యాన్సర్ సంబంధిత అనారోగ్య బాధితులైతే రూ.50 వేల నుంచి రూ.లక్షలకు పైబడి వసూలు చేస్తున్నారు.
ప్రజారోగ్యానికి పెద్దపీట
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి అండగా నిలిచారు. కిడ్నీ, గుండె సంబంధిత, క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బుల బాధితులు, సీజనల్ వ్యాధుల బారిన పడిన వారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి భరోసా కల్పించారు. వైరల్ జ్వరాలు, డెంగీ బారినపడిన వారికి పథకం ద్వారా ఉచితంగా చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైరల్ జ్వరాలు, డెంగీ బాధితులకు ఉచిత చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో అనారోగ్యం పాలైన ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సివస్తుంది. ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స లభించకపోవడంతో బాధిత కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి.
ప్రభుత్వానికి ఆస్పత్రుల లేఖ..
ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో అప్‌లోడ్ చేసినవి, చేయాల్సినవి కలిపితే రూ.3 వేల కోట్ల వరకూ ప్రభుత్వం బిల్లులు బకాయిపడింది. నెలల తరబడి చెల్లింపులు నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి లేఖ రాసింది. త్వరితగతిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది.
రోగులపై మందుల భారం
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది. అనారోగ్యం బారినపడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్థోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై చంద్రబాబు సర్కారు మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత నెలకొంది. ఏపీఎంఎస్‌ఐడీసీ సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీఎస్)లలో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండటం లేదు.
ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్‌ల సూపరింటెండెంట్‌లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో లేవు.
బీపీ, షుగర్, గ్యాస్ బాధితులకు పూర్తి స్థాయిలో మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ఇచ్చే హ్యూమన్ మిక్సా్టర్డ్ ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. ఏపీఎంఎస్‌ఐడీసీ నుంచి కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయింది. సర్జికల్ గ్లౌజులు కూడా సరిపడా సరఫరా చేయడం లేదు.
శస్త్ర చికిత్సల సమయంలో, అనంతరం గాయాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఇచ్చే అనస్తీషియా మందుల కొరత తీవ్రంగా ఉంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి వినియోగించే స్టోమా బ్యాగ్స్, కుట్లు వేసే దారాలు, మూత్ర నమూనాలు సేకరించే బాటిల్స్ కూడా అందుబాటులో లేక వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉచిత వైద్యం లేదన్నారు
గత నెలలో వైరల్ జ్వరం వచ్చింది. ప్లేట్‌లెట్స్ పడిపోయాయి. ఆస్పత్రికి వెళ్లగా ఈ సమస్యకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స లేదని చెప్పడంతో చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. రూ.20 వేలకు పైగానే ఖర్చు అయింది.
– పి.వాణి, కాకినాడ జిల్లా
రూ.30 వేలు డిమాండ్ చేశారు
ప్రమాదవశాత్తు కింద పడటంతో మోకాలికి తీవ్ర గాయమైంది. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేస్తారని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లా. పథకం కింద ఉచితంగా సర్జరీ వర్తించినా రూ.30 వేలు అదనంగా ఇవ్వాలన్నారు. డబ్బు కట్టే స్థోమత లేక అనంతపురం జీజీహెచ్‌కు వెళ్లా. రూ.వేలు ఇవ్వాలంటే నాలాంటి పేదల పరిస్థితి ఏమిటి?
– చంద్రశేఖర్, పోతులగాగేపల్లి, శ్రీసత్యసాయి జిల్లా
కార్డున్నా ఆపరేషన్ చేయలేదు
నా భర్త రఫీ కొద్ది నెలల క్రితం ప్రమాదవశాత్తు కింద పడటంతో ఎడమచేతికి గాయమైంది. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే ఫ్రాక్చర్ అయిందన్నారు. మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఆ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ఉన్నప్పటికీ ఉచిత చికిత్సకు నిరాకరించారు.
– ఆసియా, అనంతపురం
ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ వైద్యం బంద్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పేద క్యాన్సర్ రోగులకు పెద్ద కష్టం వచ్చిపడింది. విశాఖలో క్యాన్సర్ చికిత్సను అందించే ప్రముఖ ఆస్పత్రి హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) ద్వారా అందించే క్యాన్సర్ చికిత్సలను నిలిపివేసింది. ఆరోగ్యశ్రీ కింద ఈ ఆస్పత్రికి భారీగా బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అధునాతన పరికరాలతోపాటు వైద్య నిపుణులు, సిబ్బంది ఉన్న ఈ ఆస్పత్రికి ప్రధానంగా ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. వారం రోజులుగా ఆరోగ్యశ్రీ కింద సేవలు నిలిపివేయడంతో పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దివంగత సీఎం వైఎస్ చొరవతో...
ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు గతంలో క్యాన్సర్‌కు చికిత్స కోసం హైదరాబాద్ లేదా ముంబైకి వెళ్లాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోనే క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్ణయించారు. హోమీబాబా క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) ద్వారా 77 ఎకరాలను కేటాయించారు.
రూ.540 కోట్లతో ఏర్పాటైన ఈ ప్రముఖ సంస్థలో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన అధునాతన పరికరాలతోపాటు మంచి వైద్య నిపుణులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్, టాటా మెమోరియల్ సెంటర్‌ల సంయుక్త సహకారంతో ఈ క్యాన్సర్ ఆస్పత్రి 2014 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 200 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం సేవలు నిలిచిపోవడంతో క్యాన్సర్ బాధిత పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు
మూడు రోజుల క్రితం మా మామయ్యని తీసుకుని ఆస్పత్రికి వెళ్లాం. క్యాన్సర్ స్టేజ్–2లో ఉందని వైద్యులు చెప్పారు. దీంతో హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువెళితే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. డబ్బులు చెల్లిస్తేనే సేవలు అందుతాయని సిబ్బంది చెప్పారు. చేసేదేమీ లేక వెనుదిరిగాం. ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించకపోవడం వల్లే నిలిపివేశామని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. నిరుపేద రోగులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూడాలి.
– ఎస్.శంకరరావు, అగనంపూడి
నిర్వాసిత కాలనీ, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment