Andhra Pradesh: నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు | Aarogyasri Services Stopped In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు

Published Tue, Jan 7 2025 4:54 AM | Last Updated on Tue, Jan 7 2025 4:54 AM

Aarogyasri Services Stopped In Andhra Pradesh

ఉద్యోగుల ఆరోగ్య పథకానిదీ అదే దారి 

ఆస్పత్రులకు రూ.3 వేల కోట్లు బకాయి పెట్టిన ప్రభుత్వం

ఇప్పటికే నాలుగుసార్లు సర్కారుకు ఆస్పత్రుల నోటీసులు 

అయినా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం 

నిరసనగా సేవలు ఆపేసిన ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు 

ప్రజలు, ఉద్యోగుల తీవ్ర అవస్థలు

సాక్షి, అమరావతి: బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు ప్రాథేయపడ్డా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్య సేవ), ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌) సేవలను ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు నిలిపేశాయి. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఈహెచ్‌ఎస్‌ కింద ఔట్‌పేషెంట్‌ (ఓపీ), ఇన్‌ పేషెంట్‌ (ఐపీ) ఇలా పూర్తి స్థాయిలో సేవలు నిలిచి పోవడంతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ‘రూ. 3 వేల కోట్ల బిల్లులు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున బకాయిలతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా ఉంటోంది. 

సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. మందులు, సర్జికల్స్, ఇతర పరికరాలు సరఫరా చేసిన వారికి చెల్లింపులు చేయలేకపోతున్నాం. దీంతో విక్రేతలు సరఫరా నిలిపేశారు. వెంటనే ఆదుకుని రూ.2 వేల కోట్లు విడుదల చేసి ఆదుకోకపోతే ఈ నెల ఆరో తేదీ నుంచి సేవలు ఆపేస్తాం’ అని వారం క్రితమే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ (ఆశా) ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ ద్వారా అందిస్తున్న సేవలను ఆపేశాయి.  

ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటం..  
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడు నెలల వ్యవధిలో బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వానికి నెట్‌వర్క్‌ ఆస్పత్రులు నాలుగుసార్లు నోటీసులు ఇచ్చాయి. ఉద్యోగుల వేతనాలు, పింఛన్‌లతోపాటు ప్రతి నెల గ్రీన్‌ చానెల్‌లో ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని పలుమార్లు కోరాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గత కొద్ది నెలలుగా చాలావరకు ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఐపీ సేవలను కూడా నిలిపేశాయి. 

అనారోగ్యం బారినపడి ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు పేదలు వెళుతుంటే.. ‘ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. ఉచిత వైద్యం ఆపేశాం.. మీరే చేతి నుంచి డబ్బు పెట్టుకోవాలి’ అని నిక్కచ్చిగా ఆస్పత్రుల యజమానులు తేల్చిచెబుతున్నారు. ఓ వైపు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌–6, ఇతర హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తూ.. మరోవైపు ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేట్‌పరం చేయడం కోసం ప్రజారోగ్యంతో సైతం చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

లాభాపేక్షకు పెద్దపీట వేసే కంపెనీలతో బీమా కార్యక్రమం అమలు కోసం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం చర్చలకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చిందని.. చర్చల అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చే హామీ ఆధారంగా తదుపరి నిర్ణయం ఉంటుందని ఆశా అధ్యక్షులు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ సేవలను నిలిపేసినట్టు వివరించారు.  
 
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌  
కాగా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ పథకం ద్వారా వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020, జనవరి 1 నుంచి రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుందని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్, ఎంప్లాయీస్‌ యూనియన్‌ హర్షం వ్యక్తం చేశాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement