అభిప్రాయం
డిసెంబర్ 19న జరగనున్న ఎన్టీపీసీ 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ జీవించే హక్కుకే వ్యతిరేకం. దీన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాలి. రామగుండం ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్టేషన్ టీఎస్‌టీపీపీ 4,000 మెగా వాట్ల (మె.వా.) విస్తరణలో భాగంగా రెండోదశలో 3గీ800 మె.వా. స్థాపనకు, విద్యుత్పత్తికి పర్యావరణ అనుమతి కోసం (ఈసీ) పెద్దపల్లి కలెక్టర్ ఆధ్వర్యంలో నియమానుసారం... ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నది. కేవలం 13 కి.మీ. దూరంలో గోదావరి నది పక్కన మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఎస్‌సీసీఎల్ సొంత 1,200 మె.వా. థర్మల్ ప్లాంట్‌కు తోడుగా రామగుండం ఎన్టీపీసీలోని 4,200 మెగా వాట్లకు ఇది నూతన స్థాపిత సామర్థ్య ప్రతిపాదన.
కొత్తగా టీజెన్‌కో రామగుండంలో 1,200 మెగావాట్లు, సింగరేణి వారు జైపూర్‌లోనే మరో 1,200 మెగావాట్ల విస్తర ణకు ప్రతిపాదిస్తున్నారు. ప్రభుత్వ, ప్రజామోదంతో ఈ పరిశ్రమల ప్రతిపాదనలన్నీ కార్యరూపానికి వస్తే... కేవలం 13 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు ఆధార విద్యుదుత్పత్తి సామర్థ్యం (10,200 మె.వా.) ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర కాలుష్య కేంద్రంగా మారుతుంది.
రాక్షసి బొగ్గు, విద్యుత్తు ప్లాంట్లు, సిమెంటు, ఎరువుల పరిశ్రమలన్నీ దేశాభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. వీటికోసం స్థానికంగా రామగుండం, కమాన్పూర్, మంచిర్యాల మండలాల్లో సేకరించిన 90,000 ఎకరాల భూమికి ఇప్పుడున్న మార్కెట్ ధరలతో పోల్చితే అత్యంత స్వల్ప పరిహారం సమర్పించారు. ఈ 15 కి.మీ. పరిధిలోని దాదాపు 3 లక్షల పైచిలుకు కుటుంబాలలోని 12 లక్షల మంది ప్రజలు తమ శాశ్వత జీవనాధార వ్యవసాయ, ఉపాధులను కారు చౌకగా త్యాగం చేశారు. అయినా స్థానిక యువతకు భూములు కోల్పోయిన కారణాన పరిహారంగా పట్టుమని 100 ఉద్యోగాలు కూడా అందలేదు. ఈ పచ్చినిజాన్ని అసత్యమని ఎవ్వరైనా అనగలరా?
విద్యుత్ భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం క్రిటికల్, సూపర్, అల్ట్రా సూపర్, సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ల ఇంధన దహన సామర్థ్యం 35– 40 శాతం లోపే కదా! దూర ప్రాంతాల థర్మల్ విద్యుత్ స్టేషన్లకు బొగ్గు రవాణా చేసే ఖర్చు ఆదా చేయడానికి రామగుండం నుండి 13 కిలోమీటర్ల పరిధిలో 10,200 మె.వా. సాంద్ర స్థాయిన థర్మల్ విద్యుత్పత్తి చేయ డాన్ని, చౌకధరకు (యూనిట్ 12 రూపాయలు) విద్యుత్పత్తి చేసే నెపంతో అనుమతించడమంటే... రామగుండం నుండి 15 కిలోమీటర్ల పరిధిలో 21,000 మెగావాట్లకు సమానమైన ఉష్ణరాశితో, పరిసరాలను వేడిచేసే హీటర్లతో నిరంతరాయంగా మంటలు పెట్టినట్టే కదా?
భారత ప్రభుత్వ అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, నవరత్న ఎన్టీపీసీ సంస్థ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారందరూ కలసి స్థానిక ప్రజారోగ్యాలను, జీవన నాణ్యతను రాజ్యాంగ నియమాలను పణంగా పెట్టి ఈ విస్తరణ చేపట్టడం సబబేనా? 15 కిలోమీటర్ల పరిధిలోని పర్యావరణ కాలుష్య మోతాదు తీవ్రతను పరిగణనలోకి తీసుకొన్న తర్వాతే ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ, ఎమ్‌ఓఎఫ్‌ఈసీసీ వారు కొత్త పరిశ్రమలకు, పాతవాటి విస్తరణలకు అనుమతులివ్వా లని సుప్రీంకోర్టు సూచించిన విషయాన్నెలా విస్మరించారు?
సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, అధిక లాభాపేక్షతో 706 చ.కి.మీ. విస్తీర్ణంలో అధిక సాంద్ర పారిశ్రా మికీకరణ చేపట్టడమే కదా! తక్కువ స్థలంలో ఎక్కువ ఒత్తిడితో, మనుషులు, జంతువులు కనీసం జీవించలేని పరిస్థితులను సృష్టిస్తున్న వైనాన్ని ప్రశ్నించడం ప్రజల రాజ్యాంగబద్ధ హక్కే కదా! పక్కనే పారుతున్న గోదావరి నది నీరు నాణ్యతా ప్రమాణాల్లో ఏ, బీ, సీ, డీ కేటగిరీలు దాటి హెచ్ కేటగిరీలోకి చేరింది. ఈ నీరు కనీసం జంతువులు తాగడానికి కూడా పనికి రాదు. 1,465 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే గోదావరిని అతి ఎక్కువగా కలుషితపరిచేది, ట్రీట్మెంట్ చేయకుండా రామగుండం ఎన్టీపీసీ, సింగరేణి మైన్స్ వాడుకొని వదిలేస్తున్న వ్యర్థ జలాలు. ఇందుకు కారణం అది కాదని, పర్యావరణ మంత్రిత్వ శాఖ లేదా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు చెప్పగలరా?
ప్రజారోగ్య సంరక్షణార్థం ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్లు విధిగా థర్మల్ స్టేషన్ల నిర్వహణలో అంతర్భాగంగా నిర్మించాలి. పర్యావరణంలోకి విడుదలవుతున్న సల్ఫర్ డయాక్సైడ్‌ను 2022 నాటికే నివారించవలసిందిగా భారత సుప్రీంకోర్టు కఠినమైన డెడ్‌లైన్ విధించింది. ఇంతవరకు దేశంలో ఎన్నో థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వీటి నిర్మాణం ప్రారంభమే కాలేదు. ఉన్నవి కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు.
ఎన్‌టీపీసీ వెబ్‌సైట్‌లో స్పష్టంగా చెప్పిన ప్రకారం... 76,531 మె.వా. విద్యుదుత్పత్తి కోసం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 17,794. ఒక మెగా వాట్ విద్యుదుత్పత్తికి ఆరుగురికి ఉద్యోగం కల్పిస్తామని ఎన్టీపీసీ సంస్థ ప్రారంభంలో చెప్పారు. ప్రస్తుత ప్రతిపాదిత 2,400 మెగావాట్లకు 96 మందికి ఉద్యో గాలిస్తామని ఈఐఏ రిపోర్ట్ ‘సోషల్ ఇంపాక్ట్’ సెక్షన్‌లో చెప్పారు. అంటే, 25 మెగావాట్ల స్థాపనకు ఒక ఉద్యోగాన్ని కల్పించగలుగుతారట. రేపు ఆచరణలో ఏం చేస్తారో తెలియదు.
చదవండి: మూసీ మృత్యుగానం ఆగేదెన్నడు?
ఈ ప్రాంతంలో స్థానికంగా ప్రతిపాదిత ప్లాంట్‌కు 15 కి.మీ. పరిధిలోని పరిసర ప్రాంతాలలో 12 లక్షల జనాభా ప్రతీ క్షణం పీల్చుకుంటున్న సాధారణ గాలి నాణ్యతా ప్రమాణం 45కు దిగువన ఉందనీ, ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు దిగువన, ధ్వని తీవ్రత 50 డెసిబల్స్‌కు దిగువన ఉన్నాయనీ... అంటే అన్నీ సాధారణ స్థాయిలో ఉన్నాయని అవాస్తవ సమాచారాన్ని నివేదికలో సమర్పించి, ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ ద్వారా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పొందారు. మరిన్ని పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజాభిప్రాయ సేకరణకు రామగుండం ఎన్టీపీసీ విస్తరణ ప్రాజెక్టుకు పూనుకుంటున్నది.
ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టులో సుప్రీంకోర్టు ఆర్డర్లు, పర్యావరణ చట్టాలు తెలియనట్లు అమాయక రీతిలో 10 కి.మీ. పరిధిలో సర్వే చేసినామని చెబుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపాదించిన ప్రాంతంలో... గాలి నాణ్యత 48 ఏక్యూఐ కన్నా దిగువన ఉన్నట్టు, ధ్వని తీవ్రత 40 డెసిబెల్స్ కన్నా తక్కువ ఉన్నట్టు, స్థానికంగా అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్లు రాయడం పచ్చి అబద్ధాలే.
చదవండి: మళ్లీ తెరపైకి రెండో రాజధాని?
నిరూపిత శాస్త్ర సాంకేతిక సత్యాల పరిమితిలో విషయాలను అర్థం చేసుకోవాలి. రామగుండం ఎన్టీపీసీ– టీఎస్‌ఎస్‌టీపీపీ ప్రతిపాదిత 2,400 మె.వా. విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయదలచిన వేదికపై ఈ విషయాలన్నీ కలెక్టర్ గారు అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి చొరవ చూపాలి.
ఇదివరకే జంతువులు, మనుషులు జీవించడానికి వీలుకాకుండా పరిసరాలు అధిక సాంద్ర పారిశ్రామికీకరణ వల్ల విధ్వంసమైపోయాయి. అందుకే జల, వాయు, ఘన వ్యర్థాల కాలుష్యాన్ని పరిహరించాలి. గాలి నాణ్యతను మెరుగుపరచాలి. సర్వత్రా కలుషితమైన భూగర్భ జలాలనూ, గోదావరి నదినీ మెరుగుపరిచే అన్ని చర్యలూ తీసుకోవాలి. ఇకముందు సుస్థిరాభివృద్ధికి దోహదం చేసే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ పరి శ్రమలనే ఈ కాలానికి కావలసినవిగా గుర్తించాలి. దేశాభివృద్ధి కోసం అంతటా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిర్మించాలి.
- ఉమామహేశ్వర్ దహగామ
పర్యావరణ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment