
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని శిశు గృహాల్లో చోటు చేసుకుంటున్న శిశు మరణాల వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. శిశు గృహాల్లో 40 మంది శిశువులు చనిపోయిన విషయం వాస్తవమో కాదో తెలపాలని పేర్కొంది. ఒకవేళ నిజమే అయితే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. మరణాలను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు గృహాల్లో పెద్ద ఎత్తున శిశు మరణాలు సంభవిస్తున్నాయని, శిశు విక్రయాలు కూడా జరుగుతున్నాయని, ఇందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసేలా ఆదేశించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లోని శిశు గృహాల్లో చిన్నారులు పెద్ద సంఖ్యలో మరణించారని పేర్కొన్నారు. ఇక్కడి శిశువులకు లాక్టోజన్ పాలను వాడాల్సి ఉండగా, సాధారణ గేదె పాలను వాడుతున్నారని, దీంతో సమస్యలు తలెత్తి మృత్యువాత పడుతున్నారని వివరించారు. ఒక్క నల్లగొండ జిల్లాల్లోనే ఏడాదిలో దాదాపు 32 మంది చిన్నారులు మృతి చెందారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది శిశువుల వరకు మరణించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment