రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ కేసలి అప్పారావు, కమిషన్ సభ్యులు
సాక్షి, అమరావతి: బాలలను రాజకీయ పార్టీల ప్రచారాలకు, ధర్నాలు, నిరసనలకు తీసుకెళ్తే ఉపేక్షించబోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ హెచ్చరించింది. అందుకు బాధ్యులైన నిర్వాహకులపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అవినీతి కేసులో అరెస్టు అయిన చంద్రబాబుకు మద్దతుగా నారా భువనేశ్వరి నిర్వహించిన సభలో ఒక బాలుడితో మాట్లాడించిన అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.
టీడీపీ సభలో సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసేలా ఆ పిల్లాడిని ప్రేరేపించడం సరికాదని అభిప్రాయ పడింది. మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ కేసలి అప్పారావు సభ్యులు జంగం రాజేంద్రప్రసాద్, త్రిపర్ణ ఆదిలక్ష్మీ, ఎం.లక్ష్మీదేవితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ కేసలి అప్పారావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కొందరు రాజకీయ నాయకులు చిన్నారులను తమ రాజకీయాలకు వాడుకోవడంపై తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
బాలలను రాజకీయ ప్రచారాలకు, ప్రసంగాలకు, వేడుకలకు, ధర్నాలకు, ఊరేగింపులకు ఉపయోగిస్తే వారికి బాలల హక్కుల కమిషన్ నుంచి సంజాయిషీ నోటీసులు జారీ చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అసభ్యకర పదజాలంతో, అసహ్యకర వ్యాఖ్యలతో ప్రసంగాలు చేయించటం ద్వారా బాలల మనస్సులో విష బీజాలు నాటడం సరికాదన్నారు.
ఇటువంటి చర్యల వల్ల పిల్లలు చదువుపై ఆసక్తి సన్నగిల్లి పెడతోవ పట్టే ప్రమాదం ఉందన్నారు. బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం 18 ఏళ్లలోపు వారిని చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు, సదస్సులు, సమావేశాల్లో భాగస్వామ్యం చేయకూడదని స్పష్టం చేశారు. బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడే వారిపై సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment