'మార్పు' లేదు | maarpu scheme fails infant mortality rate increases in village areas in nellore district | Sakshi
Sakshi News home page

'మార్పు' లేదు

Published Wed, Jul 22 2015 11:47 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

maarpu scheme fails infant mortality rate increases in village areas in nellore district

  •   మూడేళ్లలో 1,114 మాతా శిశు మరణాలు
  •   నెలలో 30 నుంచి 35 మరణాలు నమోదు
  •   నివారణ చర్యల్లో సర్కారు వైఫల్యం
  •   పౌష్టికాహారంపై అవగాహన అంతంతమాత్రమే
  •  సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పౌష్టికాహారలోపం.. రక్తహీనతతో మాతా శిశు మరణాలు అధికమవుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఈ మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పౌష్టికాహారలోపం.. సమయానికి వైద్యం అందకపోవటం కారణంగానే మరణాలు సంభవిస్తున్నట్లు తేలింది. వైద్యసిబ్బంది నిర్లక్ష్యం తోనూ మరణాలు పెరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. మాతా శిశు మరణాలు అధికమవుతున్నాయని తెలిసినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.  మాతా శిశుమరణాల నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన 'మార్పు' కార్యక్రమం పూర్తిగా విఫలమైంది. జిల్లాలో మాతా శిశుమరణాలపై ఓ స్వచ్ఛంద సంస్థ సర్వే నిర్వహించినట్లు సమాచారం. ఆ సర్వేలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. జిల్లాలో నెలలో 30 నుంచి 35 మధ్య మాతా శిశుమరణాలు సంభవిస్తున్నాయి. 2015 జనవరి నుంచి జూన్ వరకు 224 మంది చిన్నారులు మరణించగా... 41 మంది గర్భిణులు మృతిచెందారు. అదే 2014లో 290 మంది చిన్నారులు, 36 మంది గర్భిణులు మరణించినట్లు తెలిసింది. 2013 సంవత్సరంలో చూస్తే 487 మంది చిన్నారులు మృత్యువాతపడినట్లు సర్వేలో తేలింది. గర్భిణులు విషయానికి వస్తే 36 మంది మరణించినట్లు చెబుతున్నారు. మొత్తంగా మూడేళ్లలో 1,114 మంది మరణించినట్లు సర్వే నిర్వహించిన బృందం వెళ్లడించింది. ఇదిలా ఉంటే మహిళ గర్భందాల్చిన తరువాత ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు ప్రతినెలా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఆ పరీక్షల్లో పౌష్టికాహారలోపం ఉంటే వెంటనే గుర్తించి వారికి తగిన సూచనలు సలహాలు చేయాలి. అదేవిధంగా డెలివరీ ఆసుపత్రిలోనే జరగాల్సి ఉంది. పల్లెలో అందుకు విరుద్ధంగా ఉంది. నెలలో సుమారు 2వేల ప్రసవాలు జరిగితే ఆసుపత్రుల్లో 900లోపు మాత్రమే జరుగుతున్నట్లు తెలిసింది.
     సర్కారు వైఫల్యమే...
     మాతా శిశు మరణాల నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపటం లేదని తెలుస్తోంది. మరణాల నివారణ కోసం గతంలో చేపట్టిన 'మార్పు' వల్ల ప్రయోజనం కనిపించటం లేదు. రాష్ట్రప్రభుత్వం గతంలో మాతా శిశు మరణాలను అరికట్టేందుకు 'మార్పు' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా గతంలో ప్రాథమిక వైద్యకేంద్రం నుంచి హెల్త్ అసిస్తెంట్, డ్వాక్రా గ్రూపు నుంచి ఒకరికి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో వారు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటుచేయాలి. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ టీచర్, ఆశావర్కర్ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటుచేసి పౌష్టికాహారం, వైద్యసేవల గురించి అవగాహన కల్పించాలి. అందులోభాగంగా 20 సూత్రాల గురించి గ్రామస్తులకు వివరించాల్సి ఉంది. అయితే శిక్షణ అనంతరం గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించటం లేదు. కేవలం హెల్త్ అసిస్టెంట్ మాత్రమే గ్రామాల్లోకి వెళ్లినప్పుడు సందర్భం వస్తే 'మార్పు'కార్యక్రమంలోని అంశాలను వివరిస్తున్నారు. వారికి ఉండే పని ఒత్తిడితో అనేక మంది హెల్త్ అసిస్టెంట్లు 'మార్పు'ను గురించి చెప్పటం లేదని పీహెచ్‌లో పనిచేసే సిబ్బంది చెబుతున్నారు. దీంతో జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, బరువు తక్కువ ఉన్న చిన్నారులే అధికంగా ఉన్నారని వెళ్లడించారు. దీంతో జిల్లాలో మాతా శిశు మరణాలు అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement