హెల్దీ తిండి.. కొత్త ట్రెండీ | New trendy In healthy Food | Sakshi
Sakshi News home page

హెల్దీ తిండి.. కొత్త ట్రెండీ

Published Thu, Aug 29 2024 11:35 AM | Last Updated on Thu, Aug 29 2024 11:35 AM

New trendy In healthy Food

పోషకాలు, పదార్థాలపైనే దృష్టి 

ది హెల్దీ స్నాకింగ్‌ రిపోర్ట్‌లో ఆసక్తికర అంశాలు 

చిరుతిళ్లలోనూ ఆరోగ్యాన్ని చూస్తున్న  73 శాతం మంది వైజాగ్‌ వాసులు 

తృణధాన్యాలు, గింజలనే స్నాక్స్‌గా ఆరగిస్తున్న 60 శాతం మంది..

వీలైతే నాలుగు రకాల స్నాక్స్‌.. కుదిరితే కప్పు కాఫీ.. సాయంత్రమైతే చాలు. విశాఖ వాసి మదిలో మెదిలో మొదటి ఆలోచన ఇదే. చిరుతిండి.. మన జీవితాల్లో భాగమైపోయింది. టీ తాగుతూ స్నాక్స్‌.. సాయంత్రం సరదాగా స్నాక్స్‌.. ఇంటికి చుట్టాలొస్తే స్నాక్స్‌.. చినుకుపడినా.. సమయమేదైనా.. స్నాక్స్‌ తిందాం మిత్రమా అన్నట్లుగా చిరుతిళ్లపై మనసు మళ్లిస్తున్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో చిరుతిళ్లలోనూ ఆరోగ్యాన్ని వెదుకుతున్నారు. విశాఖ సహా 30 నగరాల్లో స్నాక్స్‌ విక్రయాలు, ప్రజల ఇష్టాయిష్టాలపై ప్రముఖ స్నాక్స్‌ తయారీ సంస్థ ఫార్మ్‌లే విడుదల చేసిన ది హెల్దీ స్నాకింగ్‌–2024 నివేదిక పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. చిరుతిళ్లలో పోషకాల స్నాక్స్‌ వేరయా.. అవే మాకు ఇష్టమయా అంటూ 73 శాతం మంది చూసి మరీ తింటున్నారంట. మార్కెట్‌లోకి బెస్ట్‌ స్నాక్స్‌ ఏమొచ్చాయో అని ప్రతి 10 మందిలో తొమ్మిది మంది వెతుకుతున్నారని నివేదిక చెబుతోంది.       

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చిరుతిళ్లకు గిరాకీ పెరుగుతోంది. టీ, కాఫీ తాగుతున్నప్పుడు వేడి వేడి సమోసా లేదంటే.. బిస్కెట్లు ఉండాల్సిందే. లంచ్, డిన్నర్‌కి మధ్య స్నాక్స్‌ టైమ్‌ ఫిక్సయిపోయింది. అందుకే భారతీయులకు చిరుతిండి ఇష్టంగా మారిపోయింది. అయితే ఇటీవల ఆహార పదార్థాల కల్తీపై ఆందోళనల నేపథ్యంలో.. స్నాక్స్‌ ఎంపికలోనూ జాగ్రత్త పడుతున్నారు. భారతీయులు ఎలాంటి స్నాక్స్‌ ఇష్టపడుతున్నారనే వివరాలను తెలుసుకునేందుకు ఫార్మ్‌లే దేశవ్యాప్తంగా 30 నగరాల్లో సర్వే చేసింది.

ఈ వివరాలతో ది హెల్దీ స్నాకింగ్‌–2024 అనే నివేదికను విడుదల చేసింది. నగరంలోనూ సర్వే నిర్వహించగా.. ఆకలేస్తే పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి రెండు బంగాళాదుంప చిప్స్‌ ప్యాకెట్లు లేదా బేకరీకి వెళ్లి సమోసా తినే రోజులు పోయాయని విశాఖ వాసులు చెప్పారంట.! కొనేది చిన్న ప్యాకెట్‌ అయినా.. అందులో ఏం ఇంగ్రిడియంట్స్‌ ఉన్నాయి? వాటిలో పోషకాల విలువెంత? అవి తింటే వచ్చే అనర్థాలేమైనా ఉన్నాయా? ఇలా ప్రతి విషయంలోనూ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌లమని తెగేసి చెబుతున్నారు. 

మార్కెట్‌ ట్రెండ్‌.. మారిపోయిందండోయ్‌.. 
ప్రస్తుతం ఫుడ్‌ ప్యాకేజీ మార్కెట్‌ని స్నాక్స్‌ సంస్థలే శాసిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రూ.3.75 ట్రిలియన్ల ఫుడ్‌ ప్యాకేజీ ఇండస్ట్రీ ఉండగా.. ఇందులో 33.4 శాతం వరకూ స్నాక్స్, స్వీట్స్‌ పరిశ్రమలు ఆక్రమించేసుకున్నాయి. ఆరోగ్యకరమైన స్నాక్స్‌ని ఇష్టపడుతున్నారని తెలిసి.. వాటి తయారీ పైనే ఆసక్తి చూపిస్తున్నాయి. శరీరంలో తక్కువ కొవ్వు ఉత్పత్తి చేసే పాపింగ్, బేకింగ్, ఎయిర్‌ఫ్రైయింగ్, వాక్యూమ్‌ ఫ్రైయింగ్‌ మొదలైన ప్రాసెస్‌ విధానంలో తయారు చేసే స్నాక్స్‌ ఎక్కువగా మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డీప్‌ ఫ్రై చేసిన స్నాక్స్‌తో పోలిస్తే 75 శాతం కేలరీలను తగ్గిస్తాయనే ఉద్దేశంతో ఎయిర్‌ ఫ్రయర్‌ స్నాక్స్‌కే మొగ్గు 
చూపుతున్నారు.

బ్రాండెడ్‌ స్నాక్స్‌ కావాలి 
ఒకప్పుడు స్నాక్స్‌ ప్యాకెట్‌ తీసుకుంటే కేవలం ఎక్స్‌పైరీ డేట్‌ మాత్రమే చూసేవారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. స్నాక్స్‌ కొనుగోలు చేసినప్పుడు ఫస్ట్‌ అవి బ్రాండెడ్‌ సంస్థలు తయారు చేస్తున్నాయా లేదా అని చూస్తున్నారు. అంతేకాదండోయ్‌.. ప్రతి 100 మందిలో 73 మంది మాత్రం అందులో పోషకాలు ఏం ఉన్నాయి.? సోడియం కంటెంట్‌ ఎంత ఉంది.? అవి తినడం వల్ల కొవ్వు శరీరంలో పెరుగుతుందా లేదా.? ఆరోగ్యానికి హానికరమైన ముడిపదార్థాలేమైనా ఉన్నాయా అనేది కచ్చితంగా చెక్‌ చేస్తున్నారు.

మిల్లెట్ల వైపు  దృష్టి..  
ఇప్పుడిప్పుడే స్నాక్స్‌ ప్లేస్‌లో మిల్లెట్స్‌ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సాయంత్రం సమయంలో బిస్కెట్, సమోసా, బజ్జీ, 
ఆలూ చిప్స్‌ మొదలైన వాటి స్థానాలను బాదం, పిస్తా, ఖర్జూరం, జీడిపప్పు, తృణధాన్యాలు, మొలకలు ఆక్రమించేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఈ మిల్లెట్స్‌ను ప్యాకేజింగ్‌ ఫుడ్‌గా మార్చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. 2025 నాటికి మిల్లెట్‌ స్నాక్స్‌ 20 శాతానికి చేరుతాయని కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.

స్నాక్స్‌ ప్లేస్‌ను పప్పుగింజలు ఆక్రమించుకుంటున్నాయి 
ఒకప్పుడు ఇంట్లో స్నాక్స్‌ తయారు చేసి.. వాటినే తినేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్యాకేజ్డ్‌ స్నాక్స్‌ రావడంతో వాటిపైనే మొగ్గు చూపుతున్నారు. ఇవి ఆరోగ్యానికి హానికరమని తెలుసుకున్నారు. దీంతో స్నాక్స్‌ స్థానాన్ని పప్పుగింజలు ఆక్రమించేసుకున్నాయి. ముఖ్యంగా బాదం, పిస్తా వంటివాటికే ఓటేస్తున్నారు. ప్రోటీన్, కాంప్లెక్స్, కార్బొహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తగినంతగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. యాంటీఆక్సిడెంట్, విటమిన్‌ ఈ వంటివి ఉండే బాదంను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తృణధాన్యాలు, పప్పుగింజలు పోషకాలు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. అందుకే చిరుతిళ్లలో పప్పుగింజలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. 
– షీలా కృష్ణస్వామి, పోషకాహార నిపుణురాలు  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement