![TummyFriendly Foods: Engineer Quits Job to Make Organic Baby Food - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/2/sridevi-ashala.jpg.webp?itok=GZPQ59BS)
అమ్మ చేతి గోరుముద్దకు ఉన్న రుచి చిన్నారులకే తెలుసు. రుచితో పాటు పోషకాలు నిండుగా ఉంటేనే పిల్లలు బలంగా ఎదుగుతారని స్వయంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని తయారుచేస్తూ అందిస్తున్నారు తెలంగాణలోని భువనగిరి వాసి శ్రీదేవి ఆశల. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో చంటిపిల్లల కోసం టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్ తయారుచేస్తూ బిజినెస్ ఉమన్‌గా రాణిస్తున్నారు.
సాప్ట్‌వేర్ ఉద్యోగినిగా ఉన్న శ్రీదేవి పిల్లల ఆహారం వైపుగా చేసిన ఆలోచనను ఇలా పంచుకున్నారు.
‘‘ఇంజినీరింగ్ పూర్తయ్యాక పెళ్లవడంతోనే ఉద్యోగరీత్యా బెంగళూరుకు వెళ్లిపోయాను. అక్కడి పనివేళలతో పాటు ఉరుకుల పరుగుల మీద ఉండేది జీవితం. వండుకొని తినడానికి టైమ్ ఉండేది కాదు. కెరియర్‌ను దృష్టిలో పెట్టుకొని ఇన్‌స్టంట్, ఫాస్ట్‌ఫుడ్స్ మీద బాగా ఆధారపడేవాళ్లం. కొన్నాళ్లకు నేను ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా సంతోషించాం. మాకు పుట్టబోయే బిడ్డ కోసం చాలా కలలు కన్నాం. కానీ, అబార్షన్ కావడంతో చాలా బాధ అనిపించింది. మా జీవనశైలి సరిగా లేదని డాక్టర్ చెప్పడంతో ఆలోచనల్లో పడ్డాం.
పరిశోధన అంతా ఇంట్లోనే..
అప్పటి నుంచి సమతుల ఆహారం గురించి తెలుసుకోవడం, పుస్తకాలు చదవడం, ఇంట్లో ప్లాన్ చేసుకోవడం .. ఇది కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్‌లా చేశాం. సేంద్రీయ ఉత్పత్తులకు పూర్తిగా మారిపోయాం. దీంతో పాటు గర్భవతులకు, చంటిపిల్లలకు కావాల్సిన పోషకాహారం ఇంట్లోనే తయారు చేయడం మొదలుపెట్టాం. బయట కొన్నవాటిలో కూడా ఏయే పదార్థాలలో ఎంత పోషకాహార సమాచారం ఉంటుందో చెక్ చేయడం అలవాటుగా చేసుకున్నాను.
అడిగినవారికి తయారీ..
మా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత పాపకు ఇవ్వాల్సిన బేబీ ఫుడ్‌లో ఉండే రసాయనాల పరిమాణం చెక్ చేసినప్పుడు, చూసి ఆశ్చర్యమనిపించింది. నా పాపకు కెమికల్ ఫుడ్ ఎలా తినిపించాలా అని అనుకున్నాను. అందుకే, పాపకు అవసరమైనవన్నీ ఇంట్లోనే తయారుచేసుకునేదాన్ని. మెటర్నిటీ లీవ్ పూర్తయ్యాక ఆఫీసుకు వెళితే నేను ఫిట్‌గా ఉండటం చూసి, మా ఫ్రెండ్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు అని అడిగేవారు.
నేను చెప్పే జాగ్రత్తలు విని, మాకూ అలాంటి ఫుడ్ తయారు చేసిమ్మని అడిగేవారు. చుట్టుపక్కల వాళ్లు అడిగినా చేసిచ్చేదాన్ని చిన్నపాప పుట్టిన తర్వాత పిల్లల పోషకాహారంపై దృష్టి పెట్టడం కొంత కష్టంగానే అనిపించింది. ఓ వైపు ఉద్యోగంలో ప్రయాణాలు కూడా ఉండేవి. పిల్లల పోషకాహారంపై ఆసక్తితో పాటు అనుభవం, న్యూట్రిషనిస్టులు, మెంటార్స్ అందరూ నా జాబితాలో ఉన్నారు. దీనినే బిజినెస్‌గా మార్చుకుంటే ఎలా వుంటుంది... అనే ఆలోచన వచ్చింది.
వేరే రాష్ట్రం కావడంతో..
సాప్ట్‌వేర్ ఉద్యోగానికి రిజైన్ చేశాను. నేనూ, మా వారు చిదానందం ఇద్దరం చేసిన పొదుపు మొత్తాలను మేం అనుకున్న యూనిట్‌కు తీసుకున్నాం. అయితే, బెంగళూరులో ఉండేవాళ్లం కాబట్టి, అక్కడే అనుకున్న యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే లైసెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కష్టమయ్యేది. ఒక మహిళ బిజినెస్ పెట్టాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో స్వయంగా ఎదుర్కొన్నాను. షాప్స్‌లో ప్రొడక్ట్స్ ఇవ్వాలనుకుంటే ‘రెండు– మూడు నెలలు చేసి మానేస్తారా.. ఆ తర్వాత పరిస్థితి ఏంటి’ అనేవారు. ప్రొడక్ట్స్ అమ్మడం ఇంత కష్టమా అనిపించింది. కానీ, ఏడాదిన్నరపాటు అక్కడే బిజినెస్ కొనసాగించాను.
నెలకు 20 లక్షల టర్నోవర్
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు యూనిట్ షిప్ట్ చేసి ఏడాది అవుతోంది. మొదట మేం అనుకున్న పెట్టుబడి కన్నా ఎక్కువే అయ్యింది. అయినా వదలకుండా నమ్మకంతో వ్యాపారాన్ని ముందంజలోకి తీసుకువచ్చాను. ‘కచ్చితంగా చేసి చూపిస్తాను అనే ఆత్మవిశ్వాసమే’ నా బిజినెస్‌కు పెట్టుబడి అని చెప్పగలను. నేను చూపాలనుకున్నది, చెప్పాలనుకున్నది కరెక్ట్ అయినప్పుడు ఎక్కడా ఆపకూడదు అనే పట్టుదలతో ఉన్నాను. అందుకే రెండున్నరేళ్లుగా ఈ బిజినెస్‌ను రన్ చేస్తున్నాను.
ఇందులో మొత్తం 20 మందికి పైగా వర్క్ చేస్తుంటే, ప్రొడక్షన్ యూనిట్‌లో అంతా తల్లులు ఉండేలా నిర్ణయం తీసుకున్నాను. అమ్మలకు మాత్రమే బాగా తెలుసు పిల్లలకు ఎంత జాగ్రత్తగా, ఎలాంటి ఆహారం, ఎంత ప్రేమగా ఇవ్వాలనేది. ఆ ఆలోచనతోనే యూనిట్‌లో అమ్మలు ఉండేలా జాగ్రత్త తీసుకున్నాను. పిల్లల వయసును బట్టి రాగి జావ, మొలకెత్తిన గింజలు, మల్టీగ్రెయిన్స్, వెజిటబుల్స్‌తో తయారైన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారుచేస్తాం. నెలకు 20 లక్షలకు పైగా టర్నోవర్ చేస్తున్నాం.
ఆన్‌లైన్ ఆర్డర్స్ ద్వారా విదేశాలకు కూడా మా ప్రొడక్ట్స్ వెళుతుంటాయి. ఒక మహిళ జాబ్ చేయడానికే ధైర్యం కావాలి. ఇక బిజినెస్ అయితే మరింత ధైర్యంతో పాటు ఇంటి నుంచి సహకారం కూడా ఉండాలి. అప్పుడే అనుకున్న వర్క్‌లో బాగా రాణిస్తాం’’ అని వివరించింది శ్రీదేవి.
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment