Organic food production
-
Sridevi Ashala: స్వానుభవమే పెట్టుబడి
అమ్మ చేతి గోరుముద్దకు ఉన్న రుచి చిన్నారులకే తెలుసు. రుచితో పాటు పోషకాలు నిండుగా ఉంటేనే పిల్లలు బలంగా ఎదుగుతారని స్వయంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని తయారుచేస్తూ అందిస్తున్నారు తెలంగాణలోని భువనగిరి వాసి శ్రీదేవి ఆశల. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో చంటిపిల్లల కోసం టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్ తయారుచేస్తూ బిజినెస్ ఉమన్‌గా రాణిస్తున్నారు. సాప్ట్వేర్ ఉద్యోగినిగా ఉన్న శ్రీదేవి పిల్లల ఆహారం వైపుగా చేసిన ఆలోచనను ఇలా పంచుకున్నారు. ‘‘ఇంజినీరింగ్ పూర్తయ్యాక పెళ్లవడంతోనే ఉద్యోగరీత్యా బెంగళూరుకు వెళ్లిపోయాను. అక్కడి పనివేళలతో పాటు ఉరుకుల పరుగుల మీద ఉండేది జీవితం. వండుకొని తినడానికి టైమ్ ఉండేది కాదు. కెరియర్ను దృష్టిలో పెట్టుకొని ఇన్స్టంట్, ఫాస్ట్ఫుడ్స్ మీద బాగా ఆధారపడేవాళ్లం. కొన్నాళ్లకు నేను ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా సంతోషించాం. మాకు పుట్టబోయే బిడ్డ కోసం చాలా కలలు కన్నాం. కానీ, అబార్షన్ కావడంతో చాలా బాధ అనిపించింది. మా జీవనశైలి సరిగా లేదని డాక్టర్ చెప్పడంతో ఆలోచనల్లో పడ్డాం. పరిశోధన అంతా ఇంట్లోనే.. అప్పటి నుంచి సమతుల ఆహారం గురించి తెలుసుకోవడం, పుస్తకాలు చదవడం, ఇంట్లో ప్లాన్ చేసుకోవడం .. ఇది కూడా ఒక ప్రాజెక్ట్ వర్క్‌లా చేశాం. సేంద్రీయ ఉత్పత్తులకు పూర్తిగా మారిపోయాం. దీంతో పాటు గర్భవతులకు, చంటిపిల్లలకు కావాల్సిన పోషకాహారం ఇంట్లోనే తయారు చేయడం మొదలుపెట్టాం. బయట కొన్నవాటిలో కూడా ఏయే పదార్థాలలో ఎంత పోషకాహార సమాచారం ఉంటుందో చెక్ చేయడం అలవాటుగా చేసుకున్నాను. అడిగినవారికి తయారీ.. మా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత పాపకు ఇవ్వాల్సిన బేబీ ఫుడ్‌లో ఉండే రసాయనాల పరిమాణం చెక్ చేసినప్పుడు, చూసి ఆశ్చర్యమనిపించింది. నా పాపకు కెమికల్ ఫుడ్ ఎలా తినిపించాలా అని అనుకున్నాను. అందుకే, పాపకు అవసరమైనవన్నీ ఇంట్లోనే తయారుచేసుకునేదాన్ని. మెటర్నిటీ లీవ్ పూర్తయ్యాక ఆఫీసుకు వెళితే నేను ఫిట్‌గా ఉండటం చూసి, మా ఫ్రెండ్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు అని అడిగేవారు. నేను చెప్పే జాగ్రత్తలు విని, మాకూ అలాంటి ఫుడ్ తయారు చేసిమ్మని అడిగేవారు. చుట్టుపక్కల వాళ్లు అడిగినా చేసిచ్చేదాన్ని చిన్నపాప పుట్టిన తర్వాత పిల్లల పోషకాహారంపై దృష్టి పెట్టడం కొంత కష్టంగానే అనిపించింది. ఓ వైపు ఉద్యోగంలో ప్రయాణాలు కూడా ఉండేవి. పిల్లల పోషకాహారంపై ఆసక్తితో పాటు అనుభవం, న్యూట్రిషనిస్టులు, మెంటార్స్ అందరూ నా జాబితాలో ఉన్నారు. దీనినే బిజినెస్‌గా మార్చుకుంటే ఎలా వుంటుంది... అనే ఆలోచన వచ్చింది. వేరే రాష్ట్రం కావడంతో.. సాప్ట్వేర్ ఉద్యోగానికి రిజైన్ చేశాను. నేనూ, మా వారు చిదానందం ఇద్దరం చేసిన పొదుపు మొత్తాలను మేం అనుకున్న యూనిట్‌కు తీసుకున్నాం. అయితే, బెంగళూరులో ఉండేవాళ్లం కాబట్టి, అక్కడే అనుకున్న యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే లైసెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కష్టమయ్యేది. ఒక మహిళ బిజినెస్ పెట్టాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో స్వయంగా ఎదుర్కొన్నాను. షాప్స్‌లో ప్రొడక్ట్స్ ఇవ్వాలనుకుంటే ‘రెండు– మూడు నెలలు చేసి మానేస్తారా.. ఆ తర్వాత పరిస్థితి ఏంటి’ అనేవారు. ప్రొడక్ట్స్ అమ్మడం ఇంత కష్టమా అనిపించింది. కానీ, ఏడాదిన్నరపాటు అక్కడే బిజినెస్ కొనసాగించాను. నెలకు 20 లక్షల టర్నోవర్ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు యూనిట్ షిప్ట్ చేసి ఏడాది అవుతోంది. మొదట మేం అనుకున్న పెట్టుబడి కన్నా ఎక్కువే అయ్యింది. అయినా వదలకుండా నమ్మకంతో వ్యాపారాన్ని ముందంజలోకి తీసుకువచ్చాను. ‘కచ్చితంగా చేసి చూపిస్తాను అనే ఆత్మవిశ్వాసమే’ నా బిజినెస్‌కు పెట్టుబడి అని చెప్పగలను. నేను చూపాలనుకున్నది, చెప్పాలనుకున్నది కరెక్ట్ అయినప్పుడు ఎక్కడా ఆపకూడదు అనే పట్టుదలతో ఉన్నాను. అందుకే రెండున్నరేళ్లుగా ఈ బిజినెస్‌ను రన్ చేస్తున్నాను. ఇందులో మొత్తం 20 మందికి పైగా వర్క్ చేస్తుంటే, ప్రొడక్షన్ యూనిట్లో అంతా తల్లులు ఉండేలా నిర్ణయం తీసుకున్నాను. అమ్మలకు మాత్రమే బాగా తెలుసు పిల్లలకు ఎంత జాగ్రత్తగా, ఎలాంటి ఆహారం, ఎంత ప్రేమగా ఇవ్వాలనేది. ఆ ఆలోచనతోనే యూనిట్లో అమ్మలు ఉండేలా జాగ్రత్త తీసుకున్నాను. పిల్లల వయసును బట్టి రాగి జావ, మొలకెత్తిన గింజలు, మల్టీగ్రెయిన్స్, వెజిటబుల్స్‌తో తయారైన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారుచేస్తాం. నెలకు 20 లక్షలకు పైగా టర్నోవర్ చేస్తున్నాం. ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా విదేశాలకు కూడా మా ప్రొడక్ట్స్ వెళుతుంటాయి. ఒక మహిళ జాబ్ చేయడానికే ధైర్యం కావాలి. ఇక బిజినెస్ అయితే మరింత ధైర్యంతో పాటు ఇంటి నుంచి సహకారం కూడా ఉండాలి. అప్పుడే అనుకున్న వర్క్‌లో బాగా రాణిస్తాం’’ అని వివరించింది శ్రీదేవి. – నిర్మలారెడ్డి -
సుసంపన్నం దుంప పంటల వైవిధ్యం
ప్రజల ఆహారంలో ధాన్యాల తర్వాత అంత ప్రాధాన్యం కలిగినవి దుంపలు. దుంప పంటలు అనగానే మనకు చప్పున గుర్తొచ్చేవి బంగాళ దుంప, కంద, చేమదుంప, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్. ఇంకా చెప్పాలంటే కర్రపెండలం, తాటి తేగలు కూడా. అయితే, మనకు తెలియని దుంప పంట రకాలు మరెన్నో ఉన్నాయి. ఈ పంటల జీవవైవిధ్యం చాలా సుసంపన్నమైనది. గ్రామీణులు, ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలకు ఆహార భద్రతను కల్పిస్తున్నప్పటికీ దుంప పంటలు జీవవైవిధ్యం క్రమంగా అంతరించిపోతోంది. భూసార క్షీణత, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భూతాపోన్నతిని దీటుగా ఎదుర్కోవడంలో దుంప పంటలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఈ దృష్ట్యా దుంప పంటలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్న విషయాన్ని ఎలుగెత్తి చాటడం కోసం సహజ సమృద్ధ స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది. ఇటీవల మైసూరులో ఇటీవల జరిగిన ప్రత్యేక దుంప పంటల ప్రదర్శన దక్షిణాదిలో దుంప జాతుల జీవవైవిధ్యానికి అద్దం పట్టింది. వివిధ దుంప జాతులను తోటల్లో అంతర పంటలుగా పండించుకొని పరిరక్షించుకోవచ్చు. దుంప జాతుల జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోవడం, వీటితో రకరకాల వంటకాలు తయారు చేసుకునే పద్ధతులను ప్రచారంలోకి తేవడం కోసం సహజ సమృద్ధ సంస్థ నాబార్డు తోడ్పాటుతో ఇటీవల కేలండర్‌ను ప్రచురించడం విశేషం. గతంలో దేశీ వరి వంగడాలు, చిరుధాన్యాలపై కూడా కేలండర్లను ఈ సంస్థ ప్రచురించింది. దుంప పంటలు, వంటల కేలండర్ ధర రూ. 75. వివరాలకు.. బెంగళూరులోని సహజ మీడియా వారిని 70900 09922 నంబరులో సంప్రదించవచ్చు. -
‘ఉపాధి మార్గంగా ఇంటిపంటల సాగు’పై రెండు రోజుల ఉచిత శిక్షణా శిబిరం!
మేడలపై ఖాళీ స్థలాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు కేవలం ఒక వ్యాపకం కాదు. ప్రపంచవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న సేంద్రియ ఆహారోత్పత్తి ఉద్యమం కూడా. అయితే, ఇంటిపంటల ఆవశ్యకతను గుర్తించిన వారందరూ వాటిని నిపుణుల సహాయం లేకుండా తమకు తామే ఏర్పాటు చేసుకోలేరు. అందువల్ల పట్టణాలు, నగరాల్లో మేడలపై ఇంటిపంటల మడుల నిర్మాణం, కుండీల ఏర్పాటు అనేది ఒకానొక చక్కని ఉపాధిమార్గంగా మారింది. ఈ ఉపాధి మార్గాన్ని అనుసరించదలచిన వారికి సీనియర్ ఇంటిపంటల సాగుదారు, ప్రముఖ రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి రెండు రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. గత ఆరేళ్లుగా తమ కుటుంబానికి అవసరమైనంత మేరకు ఆకుకూరలు, కూరగాయలు, కొన్ని రకాల పండ్లను ఆయన మేడపైనే పండించుకుంటున్న సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం నారపల్లిలోని తమ మేడపైనే ఈ నెల 24, 25 తేదీల్లో ఆయన శిక్షణ ఇవ్వనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి (16 కి.మీ.) సిటీబస్‌లో 45 నిమిషాల్లో నారపల్లి చేరుకోవచ్చు. అభ్యర్థులు వసతి, భోజన సదుపాయాలను ఎవరికి వారే చూసుకోవాలి. శిక్షణ పొందదలచిన వారు ముందే విధిగా పేర్లు నమోదు చేయించుకోవాలి. రఘోత్తమరెడ్డిని 90001 84107 నంబరులో సంప్రదించవచ్చు. వరిలో ఎద పద్ధతి.. దిగుబడిలో మేటి.. కాలవకింది మాగాణి భూములకు నీరు ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితుల్లో దమ్ము చేసి నాట్లు వేయటం రైతుకు నష్టదాయకంగా మారింది. నీటి కోసం ఎదురు చూసి ఆలస్యంగా వరి సాగు మొదలుపెట్టటం వల్ల రెండో పంట సాగు కష్టమవుతోంది. ఎద పద్ధతిలో వరిసాగు ద్వారా ఈ పరిస్థితులను అధిగమించవచ్చు. వరిలో నాట్లువేసే పద్ధతి, విత్తనాలు ఎదజల్లే పద్ధతుల్లో రెండింటి మధ్యా దిగుబడుల్లో తే డా లేదని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ అధ్యయనంలో తేలింది. పైగా నాట్లు వేయటం కన్నా.. ఎద పద్ధతిలో సాగు చేస్తే ఎకరాకు రూ. 4-5 వేలు ఖర్చు తగ్గుతుంది. 40 బస్తాల దిగుబడి వస్తుంది. రెండో పంటగా సాగు చేసే పెసర, మినుము, మొక్కజొన్న వంటి పంటలను సకాలంలో విత్తుకోవచ్చు. ఎదబెట్టి వరి సాగు చేసే విధానం కేవలం కోస్తా జిల్లాల రైతులకే కాక, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోను అనుసరణీయమైన విధానమేనని ఫలితాలు రుజువు చేస్తున్నాయి. అకాల వర్షాలు లేదా తొలకరి వర్షాల్లో పొడి దుక్కి చేసుకోవాలి. నాలుగు సాళ్లు దున్నిన తర్వాత విత్తనం వేయాలి. విత్తుకొనేందుకు విత్తన గొర్రును ఉపయోగించాలి. ఈ పద్ధతిలో ఎకరాకు 10-15 కిలోల విత్తనం సరిపోతుంది. రైతుకు శ్రమ.. ఖర్చు తగ్గుతుంది.. కాలవ నీరు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో వరి విత్తనాలను ఎదజల్లే పద్ధతిని అనుసరించాలని సూచిస్తున్నాం. ఎదజల్లే పద్ధతిని గుంటూరు జిల్లాలో తొలుత నాలుగు వేల ఎకరాల్లో అనుసరించారు. అధికారుల కృషితో అనేక జిల్లాల్లో లక్షల ఎకరాలకు విస్తరించింది. నాట్లు ఆలస్యమై దిగుబడి తగ్గుంతుందనే భయం లేదు. రైతుకు శ్రమ, ఖర్చు తగ్గుతుంది. - డాక్టర్ కోటపాటి గురవారెడ్డి (98494 84398), ‘ క్లైమా అడాప్ట్’ పథకం, సమన్వయకర్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాంఫాం, గుంటూరు