‘ఉపాధి మార్గంగా ఇంటిపంటల సాగు’పై రెండు రోజుల ఉచిత శిక్షణా శిబిరం!
మేడలపై ఖాళీ స్థలాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు కేవలం ఒక వ్యాపకం కాదు. ప్రపంచవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న సేంద్రియ ఆహారోత్పత్తి ఉద్యమం కూడా. అయితే, ఇంటిపంటల ఆవశ్యకతను గుర్తించిన వారందరూ వాటిని నిపుణుల సహాయం లేకుండా తమకు తామే ఏర్పాటు చేసుకోలేరు. అందువల్ల పట్టణాలు, నగరాల్లో మేడలపై ఇంటిపంటల మడుల నిర్మాణం, కుండీల ఏర్పాటు అనేది ఒకానొక చక్కని ఉపాధిమార్గంగా మారింది. ఈ ఉపాధి మార్గాన్ని అనుసరించదలచిన వారికి సీనియర్ ఇంటిపంటల సాగుదారు, ప్రముఖ రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి రెండు రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.
గత ఆరేళ్లుగా తమ కుటుంబానికి అవసరమైనంత మేరకు ఆకుకూరలు, కూరగాయలు, కొన్ని రకాల పండ్లను ఆయన మేడపైనే పండించుకుంటున్న సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం నారపల్లిలోని తమ మేడపైనే ఈ నెల 24, 25 తేదీల్లో ఆయన శిక్షణ ఇవ్వనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి (16 కి.మీ.) సిటీబస్‌లో 45 నిమిషాల్లో నారపల్లి చేరుకోవచ్చు. అభ్యర్థులు వసతి, భోజన సదుపాయాలను ఎవరికి వారే చూసుకోవాలి. శిక్షణ పొందదలచిన వారు ముందే విధిగా పేర్లు నమోదు చేయించుకోవాలి. రఘోత్తమరెడ్డిని 90001 84107 నంబరులో సంప్రదించవచ్చు.
వరిలో ఎద పద్ధతి.. దిగుబడిలో మేటి..
కాలవకింది మాగాణి భూములకు నీరు ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితుల్లో దమ్ము చేసి నాట్లు వేయటం రైతుకు నష్టదాయకంగా మారింది. నీటి కోసం ఎదురు చూసి ఆలస్యంగా వరి సాగు మొదలుపెట్టటం వల్ల రెండో పంట సాగు కష్టమవుతోంది. ఎద పద్ధతిలో వరిసాగు ద్వారా ఈ పరిస్థితులను అధిగమించవచ్చు.
వరిలో నాట్లువేసే పద్ధతి, విత్తనాలు ఎదజల్లే పద్ధతుల్లో రెండింటి మధ్యా దిగుబడుల్లో తే డా లేదని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ అధ్యయనంలో తేలింది. పైగా నాట్లు వేయటం కన్నా.. ఎద పద్ధతిలో సాగు చేస్తే ఎకరాకు రూ. 4-5 వేలు ఖర్చు తగ్గుతుంది. 40 బస్తాల దిగుబడి వస్తుంది. రెండో పంటగా సాగు చేసే పెసర, మినుము, మొక్కజొన్న వంటి పంటలను సకాలంలో విత్తుకోవచ్చు. ఎదబెట్టి వరి సాగు చేసే విధానం కేవలం కోస్తా జిల్లాల రైతులకే కాక, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోను అనుసరణీయమైన విధానమేనని ఫలితాలు రుజువు చేస్తున్నాయి. అకాల వర్షాలు లేదా తొలకరి వర్షాల్లో పొడి దుక్కి చేసుకోవాలి. నాలుగు సాళ్లు దున్నిన తర్వాత విత్తనం వేయాలి. విత్తుకొనేందుకు విత్తన గొర్రును ఉపయోగించాలి. ఈ పద్ధతిలో ఎకరాకు 10-15 కిలోల విత్తనం సరిపోతుంది.
రైతుకు శ్రమ.. ఖర్చు తగ్గుతుంది..
కాలవ నీరు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో వరి విత్తనాలను ఎదజల్లే పద్ధతిని అనుసరించాలని సూచిస్తున్నాం. ఎదజల్లే పద్ధతిని గుంటూరు జిల్లాలో తొలుత నాలుగు వేల ఎకరాల్లో అనుసరించారు. అధికారుల కృషితో అనేక జిల్లాల్లో లక్షల ఎకరాలకు విస్తరించింది. నాట్లు ఆలస్యమై దిగుబడి తగ్గుంతుందనే భయం లేదు. రైతుకు శ్రమ, ఖర్చు తగ్గుతుంది.
- డాక్టర్ కోటపాటి గురవారెడ్డి (98494 84398), ‘ క్లైమా అడాప్ట్’ పథకం, సమన్వయకర్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాంఫాం, గుంటూరు