కొత్త విత్తనాలు వేద్దాం | Phased transition to new seeds | Sakshi
Sakshi News home page

కొత్త విత్తనాలు వేద్దాం

Published Sat, Jun 1 2024 5:29 AM | Last Updated on Sat, Jun 1 2024 5:29 AM

Phased transition to new seeds

పెట్టుబడి  , ఉత్పత్తి నష్టాలను అధిగమిద్దాం.. 

ఖరీఫ్‌లో 37 లక్షల ఎకరాల్లో వరి సాగు 

20 లక్షల ఎకరాల్లో 20–30 ఏళ్ల పైబడిన వంగడాలే 

చీడపీడలు, తుపాన్ల బారిన పడుతున్న పాత రకాలు 

ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడి నష్టాన్ని చవిచూస్తున్న రైతన్నలు 

దశలవారీగా కొత్త వంగడాలకు మారేలా కార్యాచరణ 

నూతన విత్తనాల ప్రత్యేకతలపై ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం  

వరి సాగులో విత్తన మార్పిడిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం  కార్యాచరణ సిద్ధం చేసింది. దశాబ్దాలుగా అన్నదాతలు సాగు చేస్తున్న  పాత రకాల వరి వంగడాలకు బదులుగా శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు  నవీకరించిన రకాల సాగును ప్రోత్సహించాలని భావిస్తోంది. దశలవారీగా  వీటి సాగును విస్తరించేలా చర్యలు చేపట్టింది. ఆ దిశగా రైతులను  కార్యోన్ముఖులను చేసేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా  విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. 

సాక్షి, అమరావతి:  వరి సాగులో విత్తన మారి్పడిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు నూతన విత్తనాల సాగును  ప్రోత్సహించాలని భావిస్తోంది. ఈ మేరకు వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. 

రాష్ట్రంలో వరి ఖరీఫ్‌ సీజన్‌లో 37 లక్షల ఎకరాల్లో, రబీలో 20 లక్షల ఎకరాల్లో  సాగవుతోంది. ఖరీఫ్‌లో 20 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మూడు దశాబ్దాల క్రితం అభివృద్ధి చేసిన వంగడాలనే నేటికీ సాగు చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా బీపీటీ 5204తో పాటు ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 రకాలు  ఎక్కువగా పండిస్తున్నారు. 

దశాబ్దాలుగా సాగవుతుండడంతో చీడపీడలను తట్టుకోలేకపోతున్నాయి. తుఫాన్లతోపాటు కొద్దిపాటి వర్షాలను సైతం తట్టుకోలేక పంటచేలు నేలచూపులు చూస్తున్నాయి.భారీ వర్షాలొస్తే ముంపు బారిన పడుతున్నాయి. వీటికి సరైన ప్రత్యామ్నాయం లేక, కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలపై అవగాహన లేక రైతన్నలు వీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. 

అందుబాటులో ప్రత్యామ్నాయ రకాలు 
శాస్త్రవేత్తల సుదీర్ఘ పరిశోధనల అనంతరం ఎంటీయూ 7029, ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 రకాలకు ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1318 రకం వరి విత్తనాన్ని అందుబాటులోకి తెచ్చారు. గింజ రాలకపోవడంతోపాటు తెగుళ్లను సమర్థంగా తట్టుకుని మిల్లర్లకు నూక శాతం లేని రకంగా ఈ కొత్త వరి వంగడం ప్రాచుర్యం పొందింది. ఇక బీపీటీ 5204 రకానికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1271, ఎన్‌డీఎల్‌ఆర్‌ 7 రకాలు అందుబాటులోకి వచ్చాయి. 

తెగుళ్లు, పురుగులను తట్టుకునే సామర్థ్యంతో అభివృద్ధి చేసిన  ఈ వంగడాలు గింజ రాలకుండా అధిక దిగుబడులు ఇస్తున్నట్లు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఆర్‌జీఎల్‌ 2537 రకం వరికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1232 రకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇది సన్న గింజ రకం కావడంతోపాటు అధిక దిగుబడినిస్తుంది. 

వేరుశనగలో కే–6కు ప్రత్యామ్నాయం 
ఖరీఫ్‌లో సాగు చేసే నూనె గింజల్లో అత్యధిక విస్తీర్ణం (15 లక్షల ఎకరాలు)లో సాగయ్యే వేరుశనగలో కే–6 రకాన్నే దాదాపు మూడు దశాబ్దాలుగా పండిస్తున్నారు. తెగుళ్లు, చీడపీడలతో పాటు బెట్ట పరిస్థితులను తట్టుకోలేక, ఆశించిన దిగుబడులు రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. కే–6కు ప్రత్యామ్నాయంగా టీసీజీఎస్‌ 1694, కదిరి లేపాక్షి రకాలను అందుబాటులోకి తెచ్చారు. బెట్టనే కాకుండా తెగుళ్లను కూడాసమర్థంగా తట్టుకునే ఈ రకాలు అధిక దిగుబడినిస్తున్నాయని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. 

దశలవారీగా విస్తరణ.. 
వ్యవసాయ శాఖాధికారులు, డీఏఏటీఐ, కేవీకే శాస్త్రవేత్తలు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో జిల్లా స్థాయిలో నిర్వహించిన సదస్సులతో కొత్త విత్తనాల సాగుపై వ్యవసాయ శాఖ పక్కాగా కార్యాచరణ సిద్ధం చేసింది. దశలవారీగా కొత్త రకాల సాగును విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. 2024–25 సీజన్‌లో 10 శాతం, 2025–26 సీజన్‌లో 15 శాతం, 2026–27లో 25 శాతం విస్తీర్ణంలో విత్తన మార్పిడి చేయనున్నారు. 

తరువాత సంవత్సరాల్లో ఇదే విధానం కొనసాగుతుంది. బ్రీడర్‌ విత్తనాన్ని ఎన్జీ రం­గా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్పత్తి చేసింది. ప్రభుత్వ క్షేత్రాలు/ఏపీ సీడ్స్‌ ఎంపిక చేసిన రైతు­ల క్షేత్రాల్లో బ్రీడర్‌ సీడ్‌ నుంచి మూల విత్తనాన్ని పండిస్తారు. ఏపీ సీడ్స్‌ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో మూల విత్తనాన్ని నాటి సర్టిఫైడ్‌ సీడ్‌ను పండిస్తారు. 

వీటిని ఏపీ విత్తన ధ్రువీకరణ అథారిటీ ధ్రువీకరిస్తుం­ది. బ్రీడర్, ఫౌండేషన్‌ సీడ్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ముందుగా వీటి సాగుకు ప్రాధాన్యతనిస్తారు. పూర్తిస్థాయిలో విత్తనం అందుబాటులో­కి తెచి్చన తర్వాత సబ్సిడీపై రైతులకు సరఫరా చేసి దశల వారీగా సాగు విస్తీర్ణం పెరిగేలా ప్రోత్సహిస్తారు. 

ఆర్బీకేల ద్వారా అవగాహన 
రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంపిక చేసిన ప్రాంతాల్లో రైతుల వారీగా సమావేశాలు నిర్వహించి తొలుత అవగాహన కల్పించనున్నారు. కొత్త రకాల ప్రత్యేకతను అందరికీ అర్థమయ్యే రీతిలో వాల్‌ పోస్టర్లు, కరపత్రాల ద్వారా విç్తత ప్రచారం కల్పిస్తారు. ఆర్బీకే ఛానల్‌ ద్వారా శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతుల సందేశాలతో కూడిన వీడియోల ద్వారా వీటి సాగును ప్రోత్సహిస్తారు.చిన్న చిన్న వీడియో, ఆడియో సందేశాలను రూపొందించి పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సప్‌ గ్రూపుల ద్వారా రైతులకు చేరవేసి వాటిపై అవగాహన కల్పిస్తారు. 

ప్రత్యామ్నాయ రకాల విస్తరణే లక్ష్యం
రాష్ట్రంలో కొన్ని రకాల వంగడాలు దాదాపు 20–30 ఏళ్లకుపైగా సాగులో ఉన్నాయి. కనీసం 10–15 ఏళ్ల పాటు సాగు చేసిన వంగడాలను క్రమేపీ తగ్గించాలి. వాటి స్థానంలో ఇటీవల కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలను సాగులోకి తేవాల్సిన అవసరం ఉంది. వచ్చే మూడేళ్లలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో కనీసం 50 శాతం విస్తీర్ణంలో పాత వంగడాల స్థానంలో శాస్త్రవేత్తలు సిఫా­ర్సు చేసిన కొత్త రకాల సాగును ప్రో­త్సహించేలా కార్యాచరణ సిద్ధం చేశాం.  –చేవూరు హరికిరణ్, స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement