19.87 లక్షల ఎకరాల్లో వరి, 11.17 లక్షల ఎకరాల్లో శనగ
8.44 లక్షల ఎకరాల్లో మినుము
5.23 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు
94.69 లక్షల టన్నుల దిగుబడులు లక్ష్యం
25 నుంచి వరి, ఇతర విత్తనాలు పంపిణీ
రూ.68 వేల కోట్లు పంట రుణాలివ్వాలని లక్ష్యం
సాక్షి, అమరావతి: ఖరీఫ్ కలిసి రాలేదు. వరుస వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఖరీఫ్‌లో రైతులు దెబ్బ తిన్నారు. అతి కష్టం మీద లక్ష్యానికంటే తక్కువగా 69.70 లక్షల ఎకరాల్లో సాగు చేసినా, పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ముందస్తుగా రబీ సాగుకు సన్నద్ధమయ్యారు. ఆ మేరకు రబీ 2024–25 ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రబీ సాధారణ విస్తీర్ణం 56.58 లక్షల ఎకరాలు.
ఈ ఏడాది సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలుగా నిర్దేశించారు. 19.87 లక్షల ఎకరాల్లో వరి, 11.17 లక్షల ఎకరాల్లో శనగ, 8.44 లక్షల ఎకరాల్లో మినుము, 5.23 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.74 లక్షల ఎకరాల్లో జొన్న, 2.51 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.46లక్షల ఎకరాల్లో పెసలు, 1.77లక్షల ఎకరాల్లో పొగాకు పంటలు సాగు చేయనున్నారు. కాగా ఈ ఏడాది 94.69 లక్షల టన్నుల దిగుబడులు లక్ష్యంగా వ్యవసాయ శాఖ నిర్దేశించింది.
రబీకి 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం
రబీ కోసం 8.88 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరం. రూ.94.96 కోట్ల సబ్సిడీతో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు.
సీజన్‌లో 2.64 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనం అవసరం కాగా, ఇప్పటివరకు 26 వేల క్వింటాళ్లను సిద్ధం చేశారు. వరి, ఇతర విత్తనాలను ఈ నెల 25వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 50,076 క్వింటాళ్ల వరి, 45,647 క్వింటాళ్ల వేరుశనగ, 16,249 క్వింటాళ్ల మినుము విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు.
ఎరువుల సరఫరాలో ఆర్బీకేలకు కోత
ఈ ఏడాది 20.05లక్షల టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 6.95 లక్షల టన్నుల ఎరువులు ఉండగా, కేంద్రం నుంచి ఈ నెలలో 1.47 లక్షల టన్నులు వచ్చాయి. ప్రస్తుతం 8.42 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. గత నాలుగేళ్లుగా సబ్సిడీ విత్తనం, ఎరువుల పంపిణీలో రైతు భరోసా కేంద్రాలకు (ఆర్బీకేలకు) అధిక ప్రాధాన్యతనిచ్చారు.
కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆర్బీకేలకు ప్రాధాన్యత లేకుండా చేసింది. గడిచిన ఖరీఫ్‌లో అతికష్టమ్మీద 1.50 లక్షల టన్నుల ఎరువులను మాత్రమే ఆర్బీకేల ద్వారా సరఫరా చేశారు. రబీలో కూడా ఆర్బీకేలకు సరఫరాలో భారీగా కోత పెడుతున్నారు.
రబీలో రూ.68వేల కోట్లు పంట రుణాలు
ప్రస్తుత రబీలో రైతులకు లక్ష కోట్ల రుణ పరపతి కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. దాంట్లో రూ.68,060 కోట్లు పంట రుణాలు, 32,390 కోట్లు టర్మ్ రుణాలు ఇవ్వనున్నారు. గతేడాది 3.60 లక్షల మంది కౌలుదారులకు రూ.4,100 కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది కనీసం 5 లక్షల మందికి రూ.5 వేల కోట్లు రుణాలివ్వాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment