రైతులకు మేలు చేసేందుకు విత్తన పరిశోధనకు ప్రాధాన్యత ఇచ్చిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
కృష్ణా జిల్లా గన్నవరంలో రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు
రూ.45.80 కోట్లతో పనులు ప్రారంభించి.. 70% పూర్తి
టీడీపీ అధికారంలోకి రాగానే నిధుల్లేక ఆగిపోయిన పనులు
సీడ్ ల్యాబ్ అందుబాటులోకి వస్తే నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట
అయినా పట్టించుకోని చంద్రబాబు సర్కార్
సాక్షి, మచిలీపట్నం: రైతులకు దిగుబడి బాగా రావాలంటే.. విత్తనం బాగుండాలి. కల్తీలేని విత్తనాలు అందిస్తేనే.. మొక్క బాగా పెరుగుతుంది. చీడపీడలు, వాతావరణ మార్పులను తట్టుకొని నిలుస్తుంది. అప్పుడే పంట దిగుబడి అధికంగా వస్తుంది. ఈ ఆలోచనతోనే రైతులకు మేలు చేసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
కృష్ణా జిల్లా గన్నవరంలో రూ.45.80 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టి.. 70 శాతం పనులు కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడం.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇది అందుబాటులోకి వస్తే.. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసే అవకాశమున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
వారణాసి తరహాలో..
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జాతీయ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం తరహాలో రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. రాష్ట్రంలో విత్తన పరిశోధన, శిక్షణ మరింత శాస్త్రీయంగా, పటిష్టంగా చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం పేరుతో నిర్మించేందుకు 2023 మార్చి 24న శంకుస్థాపన చేశారు.
రూ.45.80 కోట్లతో 8 ఎకరాల్లో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పరిపాలన, శిక్షణ కేంద్రంతో పాటు వసతి, సిబ్బంది నివాసాలు, టెస్ట్ ఫామ్, విత్తన పరీక్ష ప్రయోగశాల, గ్రీన్ హౌస్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, గోడౌన్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు తదితరాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. 70 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పనులు నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు.
పూర్తయితే ప్రయోజనాలెన్నో..
» రాష్ట్ర స్థాయిలో సంబంధించిన అన్ని విత్తన ఏజెన్సీలు, సంస్థలకు ఉమ్మడి వేదిక అవుతుంది.
» విత్తన ప్రయోగశాలలు, అగ్రి ల్యాబ్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి అధునాతన శిక్షణ లభిస్తుంది.
» వ్యవసాయ పట్టభద్రులు, డిప్లొమా చేసిన వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించేలా శిక్షణ ఇస్తారు.
» సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచంలోని అత్యున్నత సంస్థలతో సమన్వయం చేసుకోవచ్చు.
» జీన్ బ్యాంకు ఏర్పాటు వల్ల అన్ని పంటల సంరక్షణకు కృషి చేయొచ్చు. కొత్త, అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల విత్తన రకాల అభివృద్ధి సాధ్యపడుతుంది.
అలా వదిలేయడం సరికాదు..
వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనది. రైతులకు అన్ని విధాలా మేలు చేకూర్చే విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం ఏర్పాటు చాలా అవసరం. నకిలీ విత్తనాలను నివారించొచ్చు. కొత్తరకం వంగడాలు, వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలు సమకూరుతాయి. గత ప్రభుత్వం మొదలుపెట్టిందని.. ఈ ప్రభుత్వం వదిలేయడం సరికాదు. రాజకీయ పార్టీలకు అతీతంగా తగిన నిధులు సమకూర్చి రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన కేంద్రం నిర్మాణ పనులు పూర్తి చేయాలి. – కె.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
Comments
Please login to add a commentAdd a comment