ప్లాస్టిక్ డ్రమ్ముల్లో ఇనుప చువ్వల ఊతంతో డ్రాగన్ మొక్కల పెంపకం
విశ్రాంత ఉపాధ్యాయిని సంపాదన నెలకు రూ. లక్ష!
మేడపైనే మట్టి లేని డ్రాగన్ తోట!
ఉపాయం ఉండాలే గాని ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఉత్సాహంగా మరో వృత్తిని చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చనటానికి కేరళకు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయిని కృషే నిదర్శనం. కొల్లం పట్టణానికి చెందిన రెమాభాయ్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సాయిల్ లెస్ పద్ధతిలో తమ ఇంటిపైనే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయటం ప్రారంభించారు. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో హైడ్రోపోనిక్ పద్ధతిలో డ్రాగన్ పండ్లను సాగు చేస్తున్నారు. నెలకు 500 కిలోల డ్రాగన్ ఫ్రూట్స్ దిగుబడి వస్తోంది. కిలో రూ. 200కు విక్రయిస్తూ నెలకు రూ. లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి 3 నెలలే డ్రాగన్ ఫ్రూట్ సీజన్ ఉంటుంది.
రిటైరైన కొద్ది రోజులకే ఆమె తల్లి వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆ వేదనలో నుంచి బయటపడటం కోసం ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలనుకున్నారు. విదేశీ పండైన డ్రాగన్ సాగును ఇంటిపైనే ప్రారంభించారామె. నేలపైన పెంచడానికి ఇంటి దగ్గర ఖాళీ స్థలం లేదు. అందుకే మేడపై రెండొందల లీటర్ల బ్యారళ్లు 50 పెట్టి, వాటిల్లో వంద డ్రాగన్ మొక్కల్ని పెంచుతున్నారు. మట్టి మోసుకెళ్లి ఇంటిపైన పెట్టటం నాకు కష్టం అనిపించి సాయిల్ లెస్ పద్ధతిని ఎంచుకున్నానని రమాభాయ్ అంటున్నారు. కొన్ని రెడ్, కొన్ని ఎల్లో రకం డ్రాగన్ రకాలను నాటారు.
ఎక్కువైన నీరు బయటకు పోవటానికి బ్యారెల్‌కు అడుగున బెజ్జం పెట్టి.. అందులో ఆకులు, రంపపు పొడి, వరి గడ్డి ముక్కలు, బ్యారెల్‌కు 3 కిలోల చొప్పున కం΄ోస్టు ఎరువును దొంతర్లుగా వేశారు. వంద గ్రాముల బోన్ మీల్ కూడా కలిపి, మొక్కలు నాటారు. ఎండాకులు, కూరగాయ వ్యర్థాలు, చేపలు, రొయ్యల వ్యర్థాలు, ఆల్చిప్పలతో సొంతంగా తయారు చేసుకునే ద్రవరూప ఎరువులను మొక్కలకు ఆమె అప్పుడప్పుడూ ఇస్తున్నారు. దీంతో మొక్కలు పోషకలోపాల్లేకుండా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తున్నాయని రమాభాయ్ సంతృప్తిని వ్యక్తం చేశారు.
‘ఏదైనా కంటెయినర్‌లో కిలో చేపలు, రొయ్యలు, పీతల డొప్పలకు కిలో బెల్లంతో పాటు బొప్పాయి పండ్ల తొక్కలు కలపాలి. ఎండ తగలకుండా నీడన ఉంచి అప్పుడప్పుడూ కలియదిప్పుతూ ఉంటే.. 90 రోజులకు సేంద్రియ ద్రావణం సిద్ధమవుతుంది. ఇది కాల్షియం, ఫాస్ఫరస్‌ను పుష్కలంగా అందిస్తుంది. ఆ బలంతో డ్రాగన్ మొక్కలు చక్కగా కాస్తున్నాయి’ అన్నారు రమాభాయ్. జెసిస్ వరల్డ్ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను కూడా ఆమె ప్రారంభించారు. సీజన్‌లో మా ఇంటిపైన 200–300 డ్రాగన్ పూలు కనువిందు చేస్తుంటే నా వయసు 60 నుంచి 20కి తగ్గిపోతుంది. బాధలన్నీ మర్చిపోతున్నా అంటున్నారామె సంతోషంగా!
Comments
Please login to add a commentAdd a comment