dragan fruit
-
డ్రాగన్ తోట : ఉపాయం ఉండాలేగానీ, నెలకు రూ.లక్ష ఈజీగా
ఉపాయం ఉండాలే గాని ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఉత్సాహంగా మరో వృత్తిని చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చనటానికి కేరళకు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయిని కృషే నిదర్శనం. కొల్లం పట్టణానికి చెందిన రెమాభాయ్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సాయిల్ లెస్ పద్ధతిలో తమ ఇంటిపైనే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయటం ప్రారంభించారు. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో హైడ్రోపోనిక్ పద్ధతిలో డ్రాగన్ పండ్లను సాగు చేస్తున్నారు. నెలకు 500 కిలోల డ్రాగన్ ఫ్రూట్స్ దిగుబడి వస్తోంది. కిలో రూ. 200కు విక్రయిస్తూ నెలకు రూ. లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి 3 నెలలే డ్రాగన్ ఫ్రూట్ సీజన్ ఉంటుంది. రిటైరైన కొద్ది రోజులకే ఆమె తల్లి వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆ వేదనలో నుంచి బయటపడటం కోసం ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలనుకున్నారు. విదేశీ పండైన డ్రాగన్ సాగును ఇంటిపైనే ప్రారంభించారామె. నేలపైన పెంచడానికి ఇంటి దగ్గర ఖాళీ స్థలం లేదు. అందుకే మేడపై రెండొందల లీటర్ల బ్యారళ్లు 50 పెట్టి, వాటిల్లో వంద డ్రాగన్ మొక్కల్ని పెంచుతున్నారు. మట్టి మోసుకెళ్లి ఇంటిపైన పెట్టటం నాకు కష్టం అనిపించి సాయిల్ లెస్ పద్ధతిని ఎంచుకున్నానని రమాభాయ్ అంటున్నారు. కొన్ని రెడ్, కొన్ని ఎల్లో రకం డ్రాగన్ రకాలను నాటారు. ఎక్కువైన నీరు బయటకు పోవటానికి బ్యారెల్‌కు అడుగున బెజ్జం పెట్టి.. అందులో ఆకులు, రంపపు పొడి, వరి గడ్డి ముక్కలు, బ్యారెల్‌కు 3 కిలోల చొప్పున కం΄ోస్టు ఎరువును దొంతర్లుగా వేశారు. వంద గ్రాముల బోన్ మీల్ కూడా కలిపి, మొక్కలు నాటారు. ఎండాకులు, కూరగాయ వ్యర్థాలు, చేపలు, రొయ్యల వ్యర్థాలు, ఆల్చిప్పలతో సొంతంగా తయారు చేసుకునే ద్రవరూప ఎరువులను మొక్కలకు ఆమె అప్పుడప్పుడూ ఇస్తున్నారు. దీంతో మొక్కలు పోషకలోపాల్లేకుండా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తున్నాయని రమాభాయ్ సంతృప్తిని వ్యక్తం చేశారు.‘ఏదైనా కంటెయినర్లో కిలో చేపలు, రొయ్యలు, పీతల డొప్పలకు కిలో బెల్లంతో పాటు బొప్పాయి పండ్ల తొక్కలు కలపాలి. ఎండ తగలకుండా నీడన ఉంచి అప్పుడప్పుడూ కలియదిప్పుతూ ఉంటే.. 90 రోజులకు సేంద్రియ ద్రావణం సిద్ధమవుతుంది. ఇది కాల్షియం, ఫాస్ఫరస్‌ను పుష్కలంగా అందిస్తుంది. ఆ బలంతో డ్రాగన్ మొక్కలు చక్కగా కాస్తున్నాయి’ అన్నారు రమాభాయ్. జెసిస్ వరల్డ్ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను కూడా ఆమె ప్రారంభించారు. సీజన్లో మా ఇంటిపైన 200–300 డ్రాగన్ పూలు కనువిందు చేస్తుంటే నా వయసు 60 నుంచి 20కి తగ్గిపోతుంది. బాధలన్నీ మర్చిపోతున్నా అంటున్నారామె సంతోషంగా! -
డ్రైల్యాండ్ హార్టికల్చర్‌లోకి ‘డ్రాగన్ ఫ్రూట్’ సాగు
వర్షాధారిత భూముల్లో పండ్ల తోటల సాగు ద్వారా జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా డ్రైల్యాండ్ హార్టికల్చర్ పథకం కింద ఏటా వివిధ రకాల పండ్ల మొక్కల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహిస్తోంది. ఉపాధి హామీ నిధులతో అమలు చేసే ఈ పథకంలోకి ఈసారి డ్రాగన్ ఫ్రూట్‌ను చేర్చింది. అనంతపురం టౌన్/నార్పల: జిల్లాలో పండ్ల తోటలు విస్తారంగా సాగవుతున్నాయి. మామిడి, చీనీ, అరటి, బొప్పాయి, సపోటా, దానిమ్మ తదితర పండ్లతోటల విస్తీర్ణం ఏటా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 1,02,224 హెక్టార్లలో తోటలు విస్తరించి ఉన్నాయి. డ్రైల్యాండ్ హార్టికల్చర్ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో రైతులు ఉద్యాన తోటల సాగుకు ముందుకు వస్తున్నారు. సంప్రదాయ పండ్ల తోటలే కాకుండా డ్రాగన్‌ఫ్రూట్ వంటి అరుదైన రకాలూ సాగు చేస్తూ ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. రైతుల ఆలోచనలకు తగ్గట్టే అధికారులు కూడా నూతన పండ్లతోటల సాగును ప్రోత్సహిస్తున్నారు. ‘డ్రాగన్’ సాగుకు ప్రోత్సాహం బహుళ పోషకాలు అందించే పండుగా డ్రాగన్ ఫ్రూట్ పేరుగాంచింది. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుండడంతో జిల్లాలోనూ డ్రాగన్‌ఫ్రూట్స్ వినియోగం పెరిగింది. ఈ క్రమంలో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 80 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ పంట సాగులో ఉంది. నార్పల, కనగానపల్లి, గార్లదిన్నె, పుట్టపర్తి తదితర మండలాల్లోని రైతులు సొంతంగా ఎకరా నుంచి రెండు ఎకరాల వరకు పంట వేశారు. రైతుల ఆసక్తిని గమనించిన అధికారులు ఈ పంటను కూడా డ్రైల్యాండ్ హార్టికల్చర్ పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) నుంచే ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఈసారి దాదాపు 15 వేల ఎకరాలలో డ్రైల్యాండ్ హార్టికల్చర్ అమలుచేయనున్నారు. ఇందులో అన్ని పండ్లతోటలతో పాటు డ్రాగన్‌ఫ్రూట్‌కూ అవకాశం కల్పించారు. జిల్లా వాతావరణ పరిస్థితులు దాదాపు అన్ని పండ్లతోటల సాగుకు అనువుగా ఉన్నాయి. దీంతో డ్రాగన్‌ఫ్రూట్ పంట ద్వారానూ లాభాలు గడించవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఈ పంటకు చీడపీడలు, తెగుళ్ల బెడద ఉండదు. ఒక్కసారి పెట్టుబడితో కొన్నేళ్ల పాటు ఆదాయం పొందవచ్చు. డ్రాగన్ ఫ్రూట్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కిలో పండ్లు దాదాపు రూ.300 పలుకుతున్నాయి. స్థానికంగా విక్రయించుకున్నా రైతులకు గిట్టుబాటు అవుతుంది. ఈ నేపథ్యంలో రైతులు పెద్దసంఖ్యలో పంట సాగుకు ముందుకొచ్చే అవకాశముంది. అర ఎకరాకు రూ.2.50 లక్షల ప్రోత్సాహం డ్రైల్యాండ్ హార్టికల్చర్ పథకం ద్వారా డ్రాగన్ ఫ్రూట్ పంట సాగుకు దరఖాస్తు చేసుకున్న రైతులకు అర ఎకరా వరకు అనుమతి ఇస్తారు. ఇందులో 400 మొక్కలు నాటవచ్చు. మొక్క ధర రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటుంది. మొక్కకు సపోర్ట్‌గా నిలువు స్తంభంతో పాటు దానిపై చక్రం ఏర్పాటు చేస్తారు. మొక్క నాటిన రోజు నుంచి మూడేళ్ల పాటు సంరక్షణ కోసం రైతులకు డబ్బు చెల్లిస్తారు. ఇలా ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల నిధులను ఉపాధి హామీ ద్వారా చెల్లించనున్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఈ ఏడాది డ్రాగన్ ఫ్రూట్ పంటను డ్రైల్యాండ్ హార్టికల్చర్ పథకంలోకి చేర్చాం. ప్రతి రైతుకూ అర ఎకరా విస్తీర్ణంలో పంట సాగుకు అవకాశం కల్పిస్తున్నాం. ఆసక్తి ఉన్న రైతుల పొలాల్లో వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీటితోపాటు ఒక ఎకరా వరకు మునగ పంట సాగు చేసుకునేందుకూ అవకాశం కల్పిస్తున్నాం. – వేణుగోపాల్‌రెడ్డి, పీడీ, జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) -
పంట భద్రుడై... ఆదర్శ రైతుగా నిలిచాడు
ఉపాధ్యాయ వృత్తికి అవసరమైన అర్హతలు కలిగిన ఓ పట్టభద్రుడు వ్యవసాయంపై దృష్టి సారించాడు. పదిమంది రైతులు సాగు చేస్తున్న పద్ధతికి భిన్నంగా ఆలోచించి వాణిజ్యపంట సాగు చేపట్టాడు. ఇంతవరకు పార్వతీపురం మన్యం జిల్లాలో కనీవినీ ఎరుగని డ్రాగన్ పండ్ల తోట పెంపకం చేపట్టి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. సాక్షి, పార్వతీపురం: ఈ ఫొటోలోని డ్రాగన్ తోట వేరే ఏ ప్రాంతంలోనిదో కాదు. సంప్రదాయంగా పండిస్తున్న వరి, మొక్క జొన్న, అరటి, పామాయిల్ పంటపొలాల్లోనిదే. ఈ వాణిజ్య పంటను ఓ యువరైతు పండిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ మండలం లుంబూరు గ్రామానికి చెందిన యువరైతు లండ ఏసుబాబు రెండెకరాల్లో డ్రాగన్ పంటను సాగుచేస్తున్నారు. ఈ తోట వేసి ఏడాది కావస్తోంది. ఇప్పుడిప్పుడే పూతదశకు రావడంతో, అక్కడక్కడ పిందెలు కాస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ రెండెకరాల పంటలో తొలిపూత వచ్చే అవకాశం ఉందని రైతు సాక్షికి వెల్లడించారు. ఈ పంట నుంచి తొలి పూతలో పెద్దగా దిగుబడి ఉండదని, రెండేళ్ల తరువాత ఎకరాకు 3 టన్నుల వరకూ డ్రాగన్ పండ్లు రానున్నాయని తెలిపాడు. నల్గొండలోని ప్రముఖ రైతు రాజారెడ్డి నర్సరీ నుంచి మొత్తం 3,000 మొక్కలు తీసుకొచ్చి సాగుచేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో డ్రాగన్ పండ్లకు టన్ను ధర రూ.2 లక్షలు పైబడి ఉందని చెబుతున్నాడు. లీజు భూముల్లో సాగు పాలకొండ మండలంలోని లుంబూరు గ్రామం పక్కనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని ఈ యువ రైతు 20 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నాడు. ముళ్లపొదలు కూడా మొలకెత్తని ఈ భూమిని ఏడాదికి ఎకరాకు లీజు రూ.14 వేలు చొప్పున ఒప్పందం కుదుర్చుకుని డ్రాగన్ సాగు ప్రారంభించాడు. బీఎస్సీ బీఈడీ చేసిన ఈ రైతు పలుచోట్ల డ్రాగన్ పండ్లకు ఉన్న డిమాండ్‌ను గుర్తించి ఈ పంట సాగుతో లాభాలు వస్తాయనే ఉద్దేశ్యంతో ఏడాది క్రితం సాగు మొదలుపెట్టాడు. ఒక హెక్టార్లో డ్రాగన్ సాగుకు ప్రభుత్వం 30 శాతం మేర రాయితీతో విత్తన మొక్కలను అందిస్తున్న నేపథ్యంలో ఈయన కూడా ప్రభుత్వం నుంచి రూ. 30 వేల మేర రాయితీ పొందాడు. మొత్తం భూమిని సాగుకు అనుకూలంగా మార్చి బోర్లు తవ్వించి మోటార్లు ఏర్పాటు చేశాడు. సిమెంట్ స్తంభాలు, చక్రాలతో తోటకు అనుగుణంగా పందిళ్లు నిర్మించాడు. ఈ మొత్తం ఏర్పాట్లకు తోట పెంపకానికి ఇప్పటివరకూ ఎకరాకు రూ.5 లక్షల మేర ఖర్చయిందని రైతు ఏసుబాబు చెప్పాడు. ఒక స్తంభం నుంచి మరో స్తంభానికి మధ్య 8 నుంచి పది అడుగుల వ్యత్యాసంతో డ్రాగన్ మొక్కలు వేయగా ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది. సేంద్రియ పద్ధతిలో సాగు యువరైతు సాగును సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాడు. పేడగత్తెం, కుళ్లిన ఎండుగడ్డి, జీవా మృతాల ద్వారానే సాగు చేపట్టాడు. రసాయనిక ఎరువులను వినియోగించి, సాదారణ పంటలు సాగుచేసే రైతులకు ఏసుబాబు చేస్తున్న సాగు ఆదర్శంగా మారింది. బీడు భూమిలో రూ.10 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టి సాగులోకి తీసుకు రావడంతో పాటు అధునాతన సాగును ప్రారంభించడంతో పలువురు రైతు ఏసుబాబును అభినందిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంట కావడంతో ఈ పండ్లకు మార్కెట్లో డిమాండ్ ఉంటుందని పాలకొండ ఉద్యానవనశాఖాధికారిణి టి.అమరేశ్వరి అన్నారు. ఈ వినూత్న సాగు చేసేందుకు పార్వతీపురం మన్యం జిల్లాలో యువరైతు ఏసుబాబు ముందుకు రావడం విశేషమని వెల్లడించారు. బాగుంటుందనే ఉద్దేశంతో.. వాణిజ్యపంటల సాగు ఆసక్తితోనే చేపట్టాను. నా స్నేహితుడి సాయం కూడా ఉంది. నిరుపయోగంగా ఉన్న ఈ ప్రాంతంలో లీజుకు తీసుకుని డ్రాగన్ తోటలు వేశాను. ప్రస్తుతం పూతదశకు చేరుకున్నాయి. ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది బాగా పూత వస్తుంది. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఎల్. ఏసుబాబు, యువరైతు, లుంబూరు. -
డ్రాగన్ ఫ్రూట్: ఎకరానికి 6.61 లక్షల రుణం..
సాక్షి, హైదరాబాద్: చాలా కొద్దిస్థాయిలో సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంటకు ఎక్కువ మొత్తంలో పంట రుణం ఇవ్వాలని రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 500 ఎకరాల్లోనే సాగు చేస్తున్న ఈ పంటను ప్రోత్సహించేందుకు ఎకరానికి ఏకంగా రూ.6.61 లక్షల రుణం ఇవ్వాలని తీర్మానించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ పంటకు రూ. 4.25 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి సీజన్లలో వివిధ పంటలకు ఖరారు చేసిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వివరాలపై టెస్కాబ్ ఉత్తర్వులు జారీ చేసింది. సాగుఖర్చు, ఉత్పాదకత, నీటివసతి ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. గతేడాదితో చూస్తే ఈసారి పెద్దగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెరగలేదని టెస్కాబ్ వర్గాలు తెలిపాయి. గతేడాది మాదిరిగానే వరికి సాగునీటి వనరులు ఉన్నచోట రూ.34 వేల నుంచి రూ.38 వేల వరకు ఫైనాన్స్ ఖరారు చేశారు. మొక్కజొన్న పంటకు రెండు సీజన్లకు కలిపి సాగునీటి వనరులు ఉన్నచోట రూ.25 వేల నుంచి రూ.28 వేల వరకు, సాగునీటి వనరులు లేనిచోట రూ.22 వేల నుంచి రూ.24 వేల వరకు ఇవ్వనున్నారు. కందులకు సాగునీటి వనరులు ఉన్నచోట రూ.17 వేల నుంచి రూ.20 వేలకు, సాగునీటి వసతి లేనిచోట రూ.15 వేల నుంచి రూ.18 వేలు ఖరారు చేశారు. కంది ఆర్గానిక్ పంటలకు రూ.17 వేల నుంచి రూ.20 వేలు నిర్ధారించారు. పత్తికి రూ.35 వేల నుంచి రూ.38 వేల వరకు, పత్తి విత్తనోత్పత్తికి రూ.1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షలు ఖరారు చేశారు. మిర్చికి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు, పందిరి కూరగాయల సాగుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఇవ్వనున్నారు. పసుపుకు రూ.70 వేల నుంచి రూ.75 వేల వరకు, ఖర్జూరం సాగుకు రూ.3.9 లక్షల నుంచి రూ.4 లక్షలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను నిర్ధారణ చేశారు. పూర్వ జిల్లాల ప్రకారం ఒక్కో జిల్లాలో ఒక్కరకంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఉంటుంది. ఆ ప్రకారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) రైతులకు పంట రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని టెస్కాబ్ తెలిపింది. పరిమితి పెంచకపోవడంపై విమర్శలు.. రాష్ట్రంలో ప్రధానంగా సాగయ్యే వరి, కంది, పత్తి వంటి పంటలకు రుణ పరిమితి ఈసారి పెంచకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏటా రైతులకు సాగు ఖర్చులు పెరుగుతుంటే, పంట రుణ పరిమితి పెంచట్లేదని పేర్కొంటున్నారు. నిర్ధారించిన మేరకు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆర్గానిక్ పద్ధతిలో పండించే కూరగాయలు సహా కంది, పెసర, మినుము సాగు చేసే రైతులకు ప్రత్యేకంగా రుణాలు ఇస్తారు. సేంద్రియ సాగు చేసే కంది, మినుములు, పెసర్లకు ఎకరానికి రూ.17 వేల నుంచి రూ.20 వేలు వంతున ఖరారు చేసింది. సేంద్రియ కూరగాయలు సాగు చేస్తే ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.40 వేలు ఇవ్వాలని తీర్మానించింది. దీంతో ఈసారి ఆర్గానిక్ పంటలు, కూరగాయల సాగు మరింత పెరుగుతాయని టెస్కాబ్ వర్గాలు చెబుతున్నాయి. టమాటకు ఊరట..! టమాటాకు ఈసారి రుణ పరిమితి పెంచారు. సాగునీటి కింద వేసే టమాటాకు రూ.45 వేల నుంచి రూ.48 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మిద్దె తోటలకు మొదటి దశలో రూ.9,500 నుంచి రూ.10,500, రెండో దశలో రూ.19 వేల నుంచి రూ.21 వేలు, మూడో దశలో రూ.28,500 నుంచి రూ.31,500 ఇస్తారు. గతేడాది కంటే కొంచెం పెంచారు. మెడికల్, అరోమాటిక్ ప్లాంట్స్‌కు రూ.37,500 నుంచి రూ.42,500 ఇస్తారు. ఉల్లిగడ్డకు రూ.35 వేల నుంచి రూ.40 వేలు, పుచ్చకాయకు రూ.27 వేల నుంచి రూ.30 వేలకు పెంచారు. ఇక పశుసంవర్థక, మత్స్య రంగంలో యూనిట్ల వారీగా రుణ పరిమితులు ఖరారు చేశారు. 20 గొర్రెలు ఒక పొట్టెలును కొనుగోలు చేసుకునేందుకు రూ.1.1 లక్షల నుంచి రూ.1.2 లక్షలు ఖరారు చేశారు. పందుల పెంపకానికి యూనిట్‌కు (3+1) రూ.43 వేలు నిర్ధారించారు. ఇక పౌల్ట్రీ ఫామ్ పెడితే బ్రాయిలర్‌కు ఒక బర్డ్‌కు రూ.150, లేయర్స్‌కు అయితే రూ.310 ఇస్తారు. డెయిరీకి ఒక పాడి ఆవు లేదా బర్రె తీసుకునేందుకు రూ.21 వేల నుంచి రూ.23 వేలు రుణం నిర్ణయించారు. రెండున్నర ఎకరాల్లో చేపల పెంపకానికి రూ.4 లక్షల రుణం ఖరారు చేశారు. -
ఆదర్శ సేద్యం.. ఆనం మార్గం
యాభై ఏళ్లు గృహిణిగా జీవితాన్ని గడిపిన అన్నే పద్మావతి నడి వయసులో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. 12 ఎకరాల్లో ఒకటికి పది ఉద్యాన పంటలను సునాయాసంగా పండిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ వంటి అరుదైన పంటలు సాగు చేయడంతోపాటు సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆరోగ్యదాయకంగా తాను పండించిన పండ్లు, కూరగాయలతోపాటు నూజివీడు ప్రాంతంలో ఇతర రైతుల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయోత్పత్తులను సేకరించి విజయవాడ తీసుకెళ్లి.. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘం ద్వారా.. వినియోగదారులకు అందిస్తూ ఆదర్శ మహిళా రైతుగా నిలుస్తున్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పద్మావతి ఈ నెల 23న హైదరాబాద్‌లో కర్షక సాధికార సంఘటన్ నుంచి ‘జీవన సాఫల్య పురస్కారం’ అందుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. సాక్షి: జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను సానుకూల దృక్పథంతో ఎదుర్కొని జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకోవడంతోపాటు అమృతాహారాన్ని సమాజానికిందించే ఆదర్శ ప్రకృతి వ్యవసాయదారుగా మారారు అన్నే పద్మావతి. డిగ్రీ చదువుకున్న పద్మావతి భర్త అకాల మరణం తర్వాత మొక్కవోని దీక్షతో పిల్లలు ఇద్దరినీ పెంచి పెద్దచేశారు. వారు స్థిరపడిన తర్వాత రెండేళ్ల క్రితం నడి వయసులో తనకు బొత్తిగా అనుభవం లేని వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. ఇజ్రాయిల్ దేశానికి విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడ డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ తదితర పండ్ల తోటలను ఆమె శ్రద్ధగా గమనించారు. అప్పుడే పండ్లతోటల సాగుపై ఆమెకు ఆసక్తి కలిగింది. ఆవిధంగా ఆమె వ్యవసాయంలోకి వచ్చారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం రమణక్కపేటలోని తమ 8 ఎకరాల భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో డ్రాగన్ ఫ్రూట్ తోట ఏడాదిగా సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా సీతాఫలం, జామ, బొప్పాయి, టమాట, పచ్చిమిర్చి, వంగ తదితర పంటలు సాగు చేస్తున్నారు. తోటపల్లి వద్ద మరో 4 ఎకరాల్లో కాకర, పొట్ల వంటి పందిరి కూరగాయలతోపాటు టమాటా, ఆకుకూరలు, పూలు, బీట్రూట్, క్యారట్, దోస తదితర కూరగాయలు సాగు చేస్తున్నారు. రమణక్కపేటలో పద్మావతి సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తోట నుభవం లేకపోయినా ప్రకృతి సేద్యం.. ప్రకృతి వ్యవసాయ మూలసూత్రాలను అర్థం చేసుకోగలిగితే వ్యవసాయంలో పూర్వానుభవం లేని వారు, ముఖ్యంగా మహిళలు కూడా సులభంగానే ప్రకృతి వ్యవసాయం చేపట్టవచ్చని పద్మావతి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యవసాయ శాఖలోని జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది ద్వారా ప్రకృతి వ్యవసాయం కాన్సెప్ట్ గురించి తెలుసుకొని.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా కూడా పంటలు పండించవచ్చు అని తెలుసుకొని ఆశ్చర్యపోయానని, ఈ కాన్సెప్ట్ నచ్చటంతో అనుసరిస్తున్నానన్నారు. మెట్ట భూముల్లో పెద్దగా కష్టపడకుండానే సాగు చేయడానికి వీలైన పంట కావడం, అత్యంత ఎక్కువ పోషక విలువలతోపాటు మార్కెట్ డిమాండ్ ఉన్నందు వల్లే డ్రాగన్ ఫ్రూట్ తోట సాగుకు శ్రీకారం చుట్టానంటారామె. పది నెలల క్రితం వియాత్నం నుంచి అమెరికన్ బ్యూటీ(పింక్ కలర్) రకం డ్రాగన్‌ఫ్రూట్ మొక్కలను ఒక్కొక్క మొక్క రూ.100కు 10 వేల మొక్కలు తెప్పించి 8 ఎకరాల్లో నాటారు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కల నడుమ బొప్పాయి మొక్కలు 4 వేలు, సీతాఫలం మొక్కలు 4 వేలు, 10 వేల జామ మొక్కలు, 3 వేల శ్రీగంధం మొక్కలు నాటారు. అలాగే తోట చుట్టూ కొబ్బరి మొక్కలు నాటించారు. మొక్కల చుట్టూ సజీవ ఆచ్ఛాదన మొక్కలను బీజామృతంతో శుద్ధి చేసి గుంతల్లో ఘనజీవామృతం వేసి నాటామన్నారు. మొక్కల చుట్టూ నవధాన్యాలను చల్లి సజీవ ఆచ్ఛాదన కల్పిస్తున్నామని, కోసిన గడ్డిని, మినప పొట్టును ఆచ్ఛాదనగా వేస్తున్నామని పద్మావతి తెలిపారు. వారానికి ఒకటి, రెండు సార్లు నీటితోపాటు జీవామృతం ఇస్తున్నారు. అప్పుడప్పుడూ పంచగవ్యను నీటితో డ్రిప్ ద్వారా ఇవ్వడంతోపాటు పిచికారీ కూడా చేస్తున్నారు. అవసరం మేరకు సప్త ధాన్యాంకుర, దశపత్ర కషాయాలను పిచికారీ చేస్తున్నామని ఆమె వివరించారు. డ్రాగన్ ఫ్రూట్ తోటలో మహిళా రైతు పద్మావతి పాతికేళ్లు దిగుల్లేని దిగుబడి నాటిన 8 నెలలకే డ్రాగన్ ఫ్రూట్ తొలి కాపు వచ్చింది. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేయడం వల్ల రుచి, తియ్యదనం, నిల్వ సామర్థ్యం బాగా ఉన్నాయన్నారు. వివిధ దేశాల డ్రాగన్ ఫ్రూట్స్ తిన్న వారికి తమ పండ్లు తినిపించి చూశానని, రుచి, తీపి చాలా బాగుందన్నారని తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్ మొక్క నాటిన ఐదేళ్లకు కనీసం 10 టన్నుల దిగుబడిని ఇస్తుందన్నారు. వ్యవసాయానుభవం లేని తమ పిల్లలు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పాతికేళ్ల పాటు నిశ్చింతగా దిగుబడి ఇచ్చే పంట కావడంతోనే డ్రాగన్ ఫ్రూట్‌ను ప్రధాన పంటగా వేశానని ఆమె తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్‌కు పెద్దగా నీరు అవసరం లేదని, అయితే అధిక వర్షాలను కూడా తట్టుకునే మొండి మొక్కన్నారు. ఎండ 40 సెల్షియస్‌కు మించితే కొంచెం ఇబ్బంది ఉంటుందని, అందుకనే అంతర పంటలుగా సీతాఫలం, శ్రీగంధం, మునగ నాటించామని పద్మావతి వివరించారు. ఇప్పటికే బొప్పాయి దిగుబడి ఒక పంట వచ్చిందని చెబుతూ, అధిక వర్షాలకు తమ ప్రాంతంలో చాలా బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయని, పంచగవ్య పిచికారీ వల్ల తమ తోట తిప్పుకొని ఇప్పుడు మళ్లీ పూతకు వచ్చిందన్నారు. సంఘటితమైతేనే అమ్ముకోగలం ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నప్పటికీ ప్రకృతి వ్యవసాయదారులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటేనే మార్కెటింగ్ సమస్యను అధిగమించగలుగుతారన్నది పద్మావతి విశ్వాసం. అందుకే విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల పరస్పర సహకార సంఘంలో ఆమె సభ్యురాలిగా చేరారు. తన 12 ఎకరాల్లో పండించిన పండ్లు, కూరగాయలతోపాటు తమ పరిసర ప్రాంతాల్లో శ్రద్ధగా, నిబద్ధతగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న చిన్న రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు పండించే నాణ్యమైన ఉత్పత్తులను కూడా సేకరించి, తన సొంతవాహనంలో ప్రతి రోజూ విజయవాడ తీసుకెళ్లి, సహకార సంఘం ద్వారా వినియోగదారులకు నమ్మకంగా విక్రయిస్తుండడం విశేషం. కూరగాయలను కిలో రూ. 30 రూపాయలకు సంఘానికి తాము ఇస్తున్నామని, మరో పది రూపాయలు వేసుకొని సంఘం వినియోగదారులకు విక్రయిస్తున్నదన్నారు. సంఘం తీసుకోగా మిగిలిన కూరగాయలను తమ పొలాల దగ్గరే కిలో రూ. 40కి అమ్ముతున్నామని పద్మావతి తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలలో సహకార సంఘం ద్వారా ప్రచార కార్యక్రమాలు, సభలు నిర్వహించడం ద్వారా తాము రసాయనాలు వాడకుండా నిబద్ధతతో పండిస్తున్న పంటల గురించి ప్రచారం చేస్తున్నారు. తమ తోటలను సందర్శించి తాము అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను స్వయంగా తెలుసుకొని మరీ ధైర్యంగా కొనుగోలు చేయవలసిందిగా ప్రజలను ఆహ్వానిస్తున్నామన్నారు పద్మావతి. నడి వయసులో వ్యవసాయం చేపట్టడమే కాకుండా ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌లో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్న పద్మావతి అభినందనీయురాలు. – ఉమ్మా రవీంద్రకుమార్ రెడ్డి, సాక్షి, నూజివీడు, కృష్ణా జిల్లా ప్రకృతి సేద్యంతో ఎంతో సంతృప్తి ప్రకృతి సేద్యం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. వ్యవసాయ అనుభవం లేని వారు కూడా మొదలు పెట్టి ఒక సంవత్సరంలో నేర్చుకోవచ్చు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ఆరోగ్యదాయకమైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను పండించి మేం తింటున్నాం. సహకార సంఘం ద్వారా అంతే నమ్మకంగా ప్రజలకూ అందిస్తున్నాం. మా తోటలకు వచ్చి చూసి నమ్మకం కలిగితేనే కొనమని సంఘం తరఫున కాలనీలకు వెళ్లి వినియోగదారులను ఆహ్వానిస్తున్నాం. చిన్న రైతులు పండించే ఆరోగ్యదాయకమైన కూరగాయలను కూడా నా వాహనంలో విజయవాడ తీసుకెళ్లి ప్రజలకు అందిస్తున్నందుకు ఎంతో సంతృప్తిగా ఉంది. – అన్నే పద్మావతి (89778 77477), రమణక్కపేట, కృష్ణా జిల్లా -
స్వదేశీ నేలలో విదేశీ పంట
డ్రాగన్‌ప్రూట్ సాగుపై రైతుల ఆసక్తి పంటలో ఔషధ గుణాలు విదేశాల్లో మంచి డిమాండ్ జంగారెడ్డిగూడెంలో ప్రయోగాత్మకంగా సాగు ఏడాది తరువాత తొలికాపు 25 సంవత్సరాలపాటు దిగుబడి జంగారెడ్డిగూడెం: దేశీయ వ్యవసాయంలో విదేశీ పంటల సాగు అందరినీ ఆకర్షిస్తోంది. వ్యవసాయంలో కొత్తదనంతో పాటు, లాభాలు కురిపిస్తున్న ఈ పంటలపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో ఏదైనా కొత్త పంటల సాగు అరుదుగా ఉండేది. నేడు ప్రపంచం కుగ్రామంగా మారిన నేపథ్యంలో ఎక్కడెక్కడో పండే పంటలు మనదగ్గర కూడా దర్శనమిస్తున్నాయి. ఆరోగ్యానికి మేలు చేసి, తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలు కురిపించే పంటలపై రైతులు మక్కువ చూపుతున్నారు. ఈ కోవలోనే మన ముందరకు వచ్చింది డ్రాగన్ ప్రూట్. పేరుకు తగ్గట్టుగానే కనిపించే ఈ ప్రూట్ ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది. అందుకే దీనికి విదేశాల్లో విపరీతమైన డిమాండ్. అటువంటి ప్రూట్ నేడు మన ప్రాంతంలో సాగుకావడం విశేషం. జంగారెడ్డిగూడెంకు చెందిన బూరుగుపల్లి రవీంద్ర డ్రాగన్ ప్రూట్‌ను సాగు చేస్తున్నారు. విదేశీ స్నేహితుల ద్వారా డ్రాగన్ ప్రూట్ రుచి చూసిన రవీంద్ర ఆ పంటను సాగుచేయాలని నిశ్చయించుకుని వివరాలు సేకరించారు. సాగు వివరాలు ఆసక్తిని పెంచడంతో తనకే చెందిన భద్రాద్రి క్లోన్స్లో సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. డ్రాగన్ ప్రూట్: డ్రాగన్ ప్రూట్ పేరు ఏదో చైనీస్‌కు చెందినదిగా అనిస్తోంది కదూ. అయితే ఇది మొదటిగా దక్షిణ అమెరికాలో సాగు చేసేవారు. నాగజెముడు, బ్రహ్మజెముడు రూపంలో ముళ్లతో ఉండే ఈ మొక్క డ్రాగన్‌ను పోలి ఉంటుంది. అందుకే దీనికి పండే పండును డ్రాగన్‌ప్రూట్ అంటారు. ప్రస్తుతం ఈ పంటను అత్యధికంగా చైనా, థాయిలాండ్, ఇజ్రాయిల్, శ్రీలంక దేశాల్లో సాగుచేస్తున్నారు. ఈ పండుకు ఉన్న ఔషధ గుణాలే అంతర్జాతీయంగా డిమాండ్ కలిగి ఉండటానికి కారణం. రాష్ట్రంలో తొలిసారిగా దీనిని విశాఖ జిల్లా చింతపల్లి మండలం జల్లిగట్టులో సాగు చేయగా, ప్రస్తుతం ఈ పంట జంగారెడ్డిగూడెంలో కూడా పండుతోంది. బూరుగుపల్లి రవీంద్ర పంటను సాగుచేసి మంచి ఫలితాలు సాధించారు. పంట ఒకసారి వేస్తే సంవత్సరానికి తొలికాపు కాస్తుంది. 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా దిగుబడిని ఇస్తుంది. డ్రాగన్ ఫ్రూట్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. రక్తంలోని అనవసర కొవ్వును తొలగించడంతో పాటు, చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. మలబద్దకం సమస్యకు ఇది మంచి మందు. పండులో ఉండే కాల్షియం, పాస్పరస్, ఐరన్, నియాసిన్‌లు రోగనిరోధక శక్తి పెంపునకు దోహదపడతాయి. క్యాన్సర్ నిరోధక శక్తిని కలిగి ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. సాగు: డ్రాగన్‌ప్రూట్ సీజనల్ ప్రూట్. ఇది జూన్, జూలై, ఆగస్టు నెలలో కాపును ఇస్తుంది. ఒకసారి ఈ పంటను వేస్తే సంవత్సరం తరువాత నుంచి 25 సంవత్సరాల వరకు పంటను అందిస్తుంది. తీగలాగ ఎదిగే ఈమొక్కను సాగు చేయాలంటే సిమెంట్ స్తంభాలను ఆసరాగా వేయాల్సి ఉంటుంది. ఒక ఎకరంలో సుమారు 250 మొక్కలు వరకు నాటుకోవచ్చు. మొక్కను నాటేటప్పుడు తగినంత పొడవు వెడల్పులు ఉండేలా చూసుకుని,. స్తంభాలను 12 అడుగులకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. ఎకరానికి సుమారు రూ. 80 నుంచి రూ. లక్ష వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కాపు ప్రారంభమైన తరువాత మూడు సంవత్సరాలకు సుమారుగా ఎకరానికి 6 టన్నులకు వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో ప్రస్తుతం డ్రాగన్‌ప్రూట్ కేజీ ధర రూ. 140 నుంచి రూ. 200 పలుకుతోంది. అయితే రైతుకు సరాసరిన రూ. 120 వరకు కేజీ ధర లభించవచ్చు. దీనిని బట్టి చూస్తే టన్నుకు సుమారు రూ. 1.20లక్షల వరకు రైతు ఆదాయం సంపాదించవచ్చు. పంట వేసిన తొలినాళ్లల్లో పెట్టుబడులు ఉంటాయి. తరువాత క్రమంగా తగ్గిపోతాయి. ముఖ్యంగా సిమెంట్ స్తంభాల ఏర్పాటుకే ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రయోగాత్మకంగా మొదలు పెట్టా: డ్రాగన్‌ప్రూట్ ను స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను. ఆసక్తితో ఈ పంటను ప్రయోగాత్మంగా సాగు చేపట్టా. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల వాతావరణం అనుకూలంగా ఉంది. డ్రాగన్ ప్రూట్‌కు ఔషధ గుణాలు ఎక్కువ. దేశ, విదేశాల్లో ఈ పండుకు గిరాకీ బాగా ఉంది. ప్రస్తుతం తొలి కాపు వచ్చే స్థితికి పంట చేరుకుంది. పెట్టుబడి తక్కువగా ఉండి, అధికాదాయాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఇది రైతులకు మంచి ప్రత్యామ్నాయ పంట. బూరుగుపల్లి రవీంద్ర, జంగారెడ్డిగూడెం