స్వదేశీ నేలలో విదేశీ పంట
స్వదేశీ నేలలో విదేశీ పంట
Published Thu, Aug 10 2017 12:10 AM | Last Updated on Sun, Sep 17 2017 5:21 PM
డ్రాగన్‌ప్రూట్ సాగుపై రైతుల ఆసక్తి
పంటలో ఔషధ గుణాలు
విదేశాల్లో మంచి డిమాండ్
జంగారెడ్డిగూడెంలో ప్రయోగాత్మకంగా సాగు
ఏడాది తరువాత తొలికాపు
25 సంవత్సరాలపాటు దిగుబడి
జంగారెడ్డిగూడెం:
దేశీయ వ్యవసాయంలో విదేశీ పంటల సాగు అందరినీ ఆకర్షిస్తోంది. వ్యవసాయంలో కొత్తదనంతో పాటు, లాభాలు కురిపిస్తున్న ఈ పంటలపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో ఏదైనా కొత్త పంటల సాగు అరుదుగా ఉండేది. నేడు ప్రపంచం కుగ్రామంగా మారిన నేపథ్యంలో ఎక్కడెక్కడో పండే పంటలు మనదగ్గర కూడా దర్శనమిస్తున్నాయి. ఆరోగ్యానికి మేలు చేసి, తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలు కురిపించే పంటలపై రైతులు మక్కువ చూపుతున్నారు. ఈ కోవలోనే మన ముందరకు వచ్చింది డ్రాగన్ ప్రూట్. పేరుకు తగ్గట్టుగానే కనిపించే ఈ ప్రూట్ ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది. అందుకే దీనికి విదేశాల్లో విపరీతమైన డిమాండ్. అటువంటి ప్రూట్ నేడు మన ప్రాంతంలో సాగుకావడం విశేషం.
జంగారెడ్డిగూడెంకు చెందిన బూరుగుపల్లి రవీంద్ర డ్రాగన్ ప్రూట్‌ను సాగు చేస్తున్నారు. విదేశీ స్నేహితుల ద్వారా డ్రాగన్ ప్రూట్ రుచి చూసిన రవీంద్ర ఆ పంటను సాగుచేయాలని నిశ్చయించుకుని వివరాలు సేకరించారు. సాగు వివరాలు ఆసక్తిని పెంచడంతో తనకే చెందిన భద్రాద్రి క్లోన్స్‌లో సాగును ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
డ్రాగన్ ప్రూట్:
డ్రాగన్ ప్రూట్ పేరు ఏదో చైనీస్‌కు చెందినదిగా అనిస్తోంది కదూ. అయితే ఇది మొదటిగా దక్షిణ అమెరికాలో సాగు చేసేవారు. నాగజెముడు, బ్రహ్మజెముడు రూపంలో ముళ్లతో ఉండే ఈ మొక్క డ్రాగన్‌ను పోలి ఉంటుంది. అందుకే దీనికి పండే పండును డ్రాగన్‌ప్రూట్ అంటారు. ప్రస్తుతం ఈ పంటను అత్యధికంగా చైనా, థాయిలాండ్, ఇజ్రాయిల్, శ్రీలంక దేశాల్లో సాగుచేస్తున్నారు. ఈ పండుకు ఉన్న ఔషధ గుణాలే అంతర్జాతీయంగా డిమాండ్ కలిగి ఉండటానికి కారణం. రాష్ట్రంలో తొలిసారిగా దీనిని విశాఖ జిల్లా చింతపల్లి మండలం జల్లిగట్టులో సాగు చేయగా, ప్రస్తుతం ఈ పంట జంగారెడ్డిగూడెంలో కూడా పండుతోంది. బూరుగుపల్లి రవీంద్ర పంటను సాగుచేసి మంచి ఫలితాలు సాధించారు. పంట ఒకసారి వేస్తే సంవత్సరానికి తొలికాపు కాస్తుంది. 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా దిగుబడిని ఇస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్‌లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. రక్తంలోని అనవసర కొవ్వును తొలగించడంతో పాటు, చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. మలబద్దకం సమస్యకు ఇది మంచి మందు. పండులో ఉండే కాల్షియం, పాస్పరస్, ఐరన్, నియాసిన్‌లు రోగనిరోధక శక్తి పెంపునకు దోహదపడతాయి. క్యాన్సర్ నిరోధక శక్తిని కలిగి ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.
సాగు:
డ్రాగన్‌ప్రూట్ సీజనల్ ప్రూట్. ఇది జూన్, జూలై, ఆగస్టు నెలలో కాపును ఇస్తుంది. ఒకసారి ఈ పంటను వేస్తే సంవత్సరం తరువాత నుంచి 25 సంవత్సరాల వరకు పంటను అందిస్తుంది. తీగలాగ ఎదిగే ఈమొక్కను సాగు చేయాలంటే సిమెంట్ స్తంభాలను ఆసరాగా వేయాల్సి ఉంటుంది. ఒక ఎకరంలో సుమారు 250 మొక్కలు వరకు నాటుకోవచ్చు. మొక్కను నాటేటప్పుడు తగినంత పొడవు వెడల్పులు ఉండేలా చూసుకుని,. స్తంభాలను 12 అడుగులకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. ఎకరానికి సుమారు రూ. 80 నుంచి రూ. లక్ష వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కాపు ప్రారంభమైన తరువాత మూడు సంవత్సరాలకు సుమారుగా ఎకరానికి 6 టన్నులకు వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్‌లో ప్రస్తుతం డ్రాగన్‌ప్రూట్ కేజీ ధర రూ. 140 నుంచి రూ. 200 పలుకుతోంది. అయితే రైతుకు సరాసరిన రూ. 120 వరకు కేజీ ధర లభించవచ్చు. దీనిని బట్టి చూస్తే టన్నుకు సుమారు రూ. 1.20లక్షల వరకు రైతు ఆదాయం సంపాదించవచ్చు. పంట వేసిన తొలినాళ్లల్లో పెట్టుబడులు ఉంటాయి. తరువాత క్రమంగా తగ్గిపోతాయి. ముఖ్యంగా సిమెంట్ స్తంభాల ఏర్పాటుకే ఎక్కువ ఖర్చు అవుతుంది.
ప్రయోగాత్మకంగా మొదలు పెట్టా:
డ్రాగన్‌ప్రూట్ ను స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను. ఆసక్తితో ఈ పంటను ప్రయోగాత్మంగా సాగు చేపట్టా. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల వాతావరణం అనుకూలంగా ఉంది. డ్రాగన్ ప్రూట్‌కు ఔషధ గుణాలు ఎక్కువ. దేశ, విదేశాల్లో ఈ పండుకు గిరాకీ బాగా ఉంది. ప్రస్తుతం తొలి కాపు వచ్చే స్థితికి పంట చేరుకుంది. పెట్టుబడి తక్కువగా ఉండి, అధికాదాయాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఇది రైతులకు మంచి ప్రత్యామ్నాయ పంట.
బూరుగుపల్లి రవీంద్ర, జంగారెడ్డిగూడెం
Advertisement