ఉపాధ్యాయ వృత్తికి అవసరమైన అర్హతలు కలిగిన ఓ పట్టభద్రుడు వ్యవసాయంపై దృష్టి సారించాడు. పదిమంది రైతులు సాగు చేస్తున్న పద్ధతికి భిన్నంగా ఆలోచించి వాణిజ్యపంట సాగు చేపట్టాడు. ఇంతవరకు పార్వతీపురం మన్యం జిల్లాలో కనీవినీ ఎరుగని డ్రాగన్ పండ్ల తోట పెంపకం చేపట్టి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
సాక్షి, పార్వతీపురం: ఈ ఫొటోలోని డ్రాగన్ తోట వేరే ఏ ప్రాంతంలోనిదో కాదు. సంప్రదాయంగా పండిస్తున్న వరి, మొక్క జొన్న, అరటి, పామాయిల్ పంటపొలాల్లోనిదే. ఈ వాణిజ్య పంటను ఓ యువరైతు పండిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ మండలం లుంబూరు గ్రామానికి చెందిన యువరైతు లండ ఏసుబాబు రెండెకరాల్లో డ్రాగన్ పంటను సాగుచేస్తున్నారు.
ఈ తోట వేసి ఏడాది కావస్తోంది. ఇప్పుడిప్పుడే పూతదశకు రావడంతో, అక్కడక్కడ పిందెలు కాస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ రెండెకరాల పంటలో తొలిపూత వచ్చే అవకాశం ఉందని రైతు సాక్షికి వెల్లడించారు. ఈ పంట నుంచి తొలి పూతలో పెద్దగా దిగుబడి ఉండదని, రెండేళ్ల తరువాత ఎకరాకు 3 టన్నుల వరకూ డ్రాగన్ పండ్లు రానున్నాయని తెలిపాడు. నల్గొండలోని ప్రముఖ రైతు రాజారెడ్డి నర్సరీ నుంచి మొత్తం 3,000 మొక్కలు తీసుకొచ్చి సాగుచేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్‌లో డ్రాగన్ పండ్లకు టన్ను ధర రూ.2 లక్షలు పైబడి ఉందని చెబుతున్నాడు.
లీజు భూముల్లో సాగు
పాలకొండ మండలంలోని లుంబూరు గ్రామం పక్కనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని ఈ యువ రైతు 20 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నాడు. ముళ్లపొదలు కూడా మొలకెత్తని ఈ భూమిని ఏడాదికి ఎకరాకు లీజు రూ.14 వేలు చొప్పున ఒప్పందం కుదుర్చుకుని డ్రాగన్ సాగు ప్రారంభించాడు. బీఎస్సీ బీఈడీ చేసిన ఈ రైతు పలుచోట్ల డ్రాగన్ పండ్లకు ఉన్న డిమాండ్‌ను గుర్తించి ఈ పంట సాగుతో లాభాలు వస్తాయనే ఉద్దేశ్యంతో ఏడాది క్రితం సాగు మొదలుపెట్టాడు.
ఒక హెక్టార్‌లో డ్రాగన్ సాగుకు ప్రభుత్వం 30 శాతం మేర రాయితీతో విత్తన మొక్కలను అందిస్తున్న నేపథ్యంలో ఈయన కూడా ప్రభుత్వం నుంచి రూ. 30 వేల మేర రాయితీ పొందాడు. మొత్తం భూమిని సాగుకు అనుకూలంగా మార్చి బోర్లు తవ్వించి మోటార్లు ఏర్పాటు చేశాడు. సిమెంట్ స్తంభాలు, చక్రాలతో తోటకు అనుగుణంగా పందిళ్లు నిర్మించాడు. ఈ మొత్తం ఏర్పాట్లకు తోట పెంపకానికి ఇప్పటివరకూ ఎకరాకు రూ.5 లక్షల మేర ఖర్చయిందని రైతు ఏసుబాబు చెప్పాడు. ఒక స్తంభం నుంచి మరో స్తంభానికి మధ్య 8 నుంచి పది అడుగుల వ్యత్యాసంతో డ్రాగన్ మొక్కలు వేయగా ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది.
సేంద్రియ పద్ధతిలో సాగు
యువరైతు సాగును సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాడు. పేడగత్తెం, కుళ్లిన ఎండుగడ్డి, జీవా మృతాల ద్వారానే సాగు చేపట్టాడు. రసాయనిక ఎరువులను వినియోగించి, సాదారణ పంటలు సాగుచేసే రైతులకు ఏసుబాబు చేస్తున్న సాగు ఆదర్శంగా మారింది. బీడు భూమిలో రూ.10 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టి సాగులోకి తీసుకు రావడంతో పాటు అధునాతన సాగును ప్రారంభించడంతో పలువురు రైతు ఏసుబాబును అభినందిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంట కావడంతో ఈ పండ్లకు మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందని పాలకొండ ఉద్యానవనశాఖాధికారిణి టి.అమరేశ్వరి అన్నారు. ఈ వినూత్న సాగు చేసేందుకు పార్వతీపురం మన్యం జిల్లాలో యువరైతు ఏసుబాబు ముందుకు రావడం విశేషమని వెల్లడించారు.
బాగుంటుందనే ఉద్దేశంతో..
వాణిజ్యపంటల సాగు ఆసక్తితోనే చేపట్టాను. నా స్నేహితుడి సాయం కూడా ఉంది. నిరుపయోగంగా ఉన్న ఈ ప్రాంతంలో లీజుకు తీసుకుని డ్రాగన్ తోటలు వేశాను. ప్రస్తుతం పూతదశకు చేరుకున్నాయి. ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాది బాగా పూత వస్తుంది. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నాను.
ఎల్. ఏసుబాబు, యువరైతు, లుంబూరు.
Comments
Please login to add a commentAdd a comment