వర్షాధారిత భూముల్లో పండ్ల తోటల సాగు ద్వారా జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా డ్రైల్యాండ్ హార్టికల్చర్ పథకం కింద ఏటా వివిధ రకాల పండ్ల మొక్కల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహిస్తోంది. ఉపాధి హామీ నిధులతో అమలు చేసే ఈ పథకంలోకి ఈసారి డ్రాగన్ ఫ్రూట్‌ను చేర్చింది.
అనంతపురం టౌన్/నార్పల: జిల్లాలో పండ్ల తోటలు విస్తారంగా సాగవుతున్నాయి. మామిడి, చీనీ, అరటి, బొప్పాయి, సపోటా, దానిమ్మ తదితర పండ్లతోటల విస్తీర్ణం ఏటా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 1,02,224 హెక్టార్లలో తోటలు విస్తరించి ఉన్నాయి. డ్రైల్యాండ్ హార్టికల్చర్ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో రైతులు ఉద్యాన తోటల సాగుకు ముందుకు వస్తున్నారు. సంప్రదాయ పండ్ల తోటలే కాకుండా డ్రాగన్‌ఫ్రూట్ వంటి అరుదైన రకాలూ సాగు చేస్తూ ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. రైతుల ఆలోచనలకు తగ్గట్టే అధికారులు కూడా నూతన పండ్లతోటల సాగును ప్రోత్సహిస్తున్నారు.
‘డ్రాగన్’ సాగుకు ప్రోత్సాహం
బహుళ పోషకాలు అందించే పండుగా డ్రాగన్ ఫ్రూట్ పేరుగాంచింది. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుండడంతో జిల్లాలోనూ డ్రాగన్‌ఫ్రూట్స్ వినియోగం పెరిగింది. ఈ క్రమంలో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 80 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ పంట సాగులో ఉంది. నార్పల, కనగానపల్లి, గార్లదిన్నె, పుట్టపర్తి తదితర మండలాల్లోని రైతులు సొంతంగా ఎకరా నుంచి రెండు ఎకరాల వరకు పంట వేశారు. రైతుల ఆసక్తిని గమనించిన అధికారులు ఈ పంటను కూడా డ్రైల్యాండ్ హార్టికల్చర్ పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) నుంచే ప్రోత్సాహకాలు అందించనున్నారు.
ఈసారి దాదాపు 15 వేల ఎకరాలలో డ్రైల్యాండ్ హార్టికల్చర్ అమలుచేయనున్నారు. ఇందులో అన్ని పండ్లతోటలతో పాటు డ్రాగన్‌ఫ్రూట్‌కూ అవకాశం కల్పించారు. జిల్లా వాతావరణ పరిస్థితులు దాదాపు అన్ని పండ్లతోటల సాగుకు అనువుగా ఉన్నాయి. దీంతో డ్రాగన్‌ఫ్రూట్ పంట ద్వారానూ లాభాలు గడించవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఈ పంటకు చీడపీడలు, తెగుళ్ల బెడద ఉండదు. ఒక్కసారి పెట్టుబడితో కొన్నేళ్ల పాటు ఆదాయం పొందవచ్చు. డ్రాగన్ ఫ్రూట్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కిలో పండ్లు దాదాపు రూ.300 పలుకుతున్నాయి. స్థానికంగా విక్రయించుకున్నా రైతులకు గిట్టుబాటు అవుతుంది. ఈ నేపథ్యంలో రైతులు పెద్దసంఖ్యలో పంట సాగుకు ముందుకొచ్చే అవకాశముంది.
అర ఎకరాకు రూ.2.50 లక్షల ప్రోత్సాహం
డ్రైల్యాండ్ హార్టికల్చర్ పథకం ద్వారా డ్రాగన్ ఫ్రూట్ పంట సాగుకు దరఖాస్తు చేసుకున్న రైతులకు అర ఎకరా వరకు అనుమతి ఇస్తారు. ఇందులో 400 మొక్కలు నాటవచ్చు. మొక్క ధర రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటుంది. మొక్కకు సపోర్ట్‌గా నిలువు స్తంభంతో పాటు దానిపై చక్రం ఏర్పాటు చేస్తారు. మొక్క నాటిన రోజు నుంచి మూడేళ్ల పాటు సంరక్షణ కోసం రైతులకు డబ్బు చెల్లిస్తారు. ఇలా ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల నిధులను ఉపాధి హామీ ద్వారా చెల్లించనున్నారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ఈ ఏడాది డ్రాగన్ ఫ్రూట్ పంటను డ్రైల్యాండ్ హార్టికల్చర్ పథకంలోకి చేర్చాం. ప్రతి రైతుకూ అర ఎకరా విస్తీర్ణంలో పంట సాగుకు అవకాశం కల్పిస్తున్నాం. ఆసక్తి ఉన్న రైతుల పొలాల్లో వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీటితోపాటు ఒక ఎకరా వరకు మునగ పంట సాగు చేసుకునేందుకూ అవకాశం కల్పిస్తున్నాం.
– వేణుగోపాల్‌రెడ్డి, పీడీ, జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా)
Comments
Please login to add a commentAdd a comment