
గుత్తి రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి మృతి
మృతుని స్వగ్రామం గొర్విమానుపల్లె
ఆర్థిక సమస్యలే కారణమని సమాచారం
నంద్యాల జిల్లా: అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ బుధవారం మధ్యాహ్నం ప్రయాణికులతో రద్దీగా ఉంది.. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు పట్టాలపైకి చేరుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హఠాత్తు సంఘటనతో అక్కడి ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లెకు చెందిన రామదాసు శ్రీరాములు, మునెమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం కాగా కూతురుకు వివాహమైంది.
కుమారుడు మహేంద్ర (25) గతంలో గ్రామంలో వలంటీర్‌గా పని చేశాడు. ప్రస్తుతం అనంతపురం జిల్లా యాడికి సమీపంలోని ఓ సిమెంట్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే మార్గం లేక ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలు చోట్ల గాలిస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం గుత్తి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న యువకుడు రైలు వేగంగా వస్తుండగా ప్రయాణికులు చూస్తుండగానే ప్లాట్‌ఫామ్ పైనుంచి దూకి పట్టాలపై తల పెట్టి పడుకోవడంతో రైలు అతనిపై వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీయగా గొర్విమానుపల్లెకు చెందిన మహేంద్రగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment