ఆదర్శ సేద్యం.. ఆనం మార్గం | Woman Farmer Padmavathi Cultivate Dragon Fruit In Her farm | Sakshi
Sakshi News home page

ఆదర్శ సేద్యం.. ఆనం మార్గం

Published Tue, Dec 24 2019 3:42 PM | Last Updated on Tue, Dec 24 2019 3:42 PM

Woman Farmer Padmavathi Cultivate Dragon Fruit In Her farm - Sakshi

 ∙ సేంద్రియ ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌లో ఆం.ప్ర. గవర్నర్‌ హరిచందన్, మంత్రి కన్నబాబుతో పద్మావతి (ఫైల్‌)

యాభై ఏళ్లు గృహిణిగా జీవితాన్ని గడిపిన అన్నే పద్మావతి నడి వయసులో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. 12 ఎకరాల్లో ఒకటికి పది ఉద్యాన పంటలను సునాయాసంగా పండిస్తున్నారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ వంటి అరుదైన పంటలు సాగు చేయడంతోపాటు సహకార సంఘం ద్వారా మార్కెటింగ్‌ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆరోగ్యదాయకంగా తాను పండించిన పండ్లు, కూరగాయలతోపాటు నూజివీడు ప్రాంతంలో ఇతర రైతుల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయోత్పత్తులను సేకరించి విజయవాడ తీసుకెళ్లి.. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘం ద్వారా.. వినియోగదారులకు అందిస్తూ ఆదర్శ మహిళా రైతుగా నిలుస్తున్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పద్మావతి ఈ నెల 23న హైదరాబాద్‌లో కర్షక సాధికార సంఘటన్‌ నుంచి ‘జీవన సాఫల్య పురస్కారం’ అందుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం..

సాక్షి: జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను సానుకూల దృక్పథంతో ఎదుర్కొని జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకోవడంతోపాటు అమృతాహారాన్ని సమాజానికిందించే ఆదర్శ ప్రకృతి వ్యవసాయదారుగా మారారు అన్నే పద్మావతి. డిగ్రీ చదువుకున్న పద్మావతి భర్త అకాల మరణం తర్వాత మొక్కవోని దీక్షతో పిల్లలు ఇద్దరినీ పెంచి పెద్దచేశారు. వారు స్థిరపడిన తర్వాత రెండేళ్ల క్రితం నడి వయసులో తనకు బొత్తిగా అనుభవం లేని వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. ఇజ్రాయిల్‌ దేశానికి విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడ డ్రాగన్‌ ఫ్రూట్, దానిమ్మ తదితర పండ్ల తోటలను ఆమె శ్రద్ధగా గమనించారు. అప్పుడే పండ్లతోటల సాగుపై ఆమెకు ఆసక్తి కలిగింది. ఆవిధంగా ఆమె వ్యవసాయంలోకి వచ్చారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం రమణక్కపేటలోని తమ 8 ఎకరాల భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట ఏడాదిగా సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా సీతాఫలం, జామ, బొప్పాయి, టమాట, పచ్చిమిర్చి, వంగ తదితర పంటలు సాగు చేస్తున్నారు. తోటపల్లి వద్ద మరో 4 ఎకరాల్లో కాకర, పొట్ల వంటి పందిరి కూరగాయలతోపాటు టమాటా, ఆకుకూరలు, పూలు, బీట్‌రూట్, క్యారట్, దోస తదితర కూరగాయలు సాగు చేస్తున్నారు. 


రమణక్కపేటలో పద్మావతి సాగు చేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట 

నుభవం లేకపోయినా ప్రకృతి సేద్యం..
ప్రకృతి వ్యవసాయ మూలసూత్రాలను అర్థం చేసుకోగలిగితే వ్యవసాయంలో పూర్వానుభవం లేని వారు, ముఖ్యంగా మహిళలు కూడా సులభంగానే ప్రకృతి వ్యవసాయం చేపట్టవచ్చని పద్మావతి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యవసాయ శాఖలోని జీరో బడ్జెట్‌ ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది ద్వారా ప్రకృతి వ్యవసాయం కాన్సెప్ట్‌ గురించి తెలుసుకొని.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు లేకుండా కూడా పంటలు పండించవచ్చు అని తెలుసుకొని ఆశ్చర్యపోయానని, ఈ కాన్సెప్ట్‌ నచ్చటంతో అనుసరిస్తున్నానన్నారు. మెట్ట భూముల్లో పెద్దగా కష్టపడకుండానే సాగు చేయడానికి వీలైన పంట కావడం, అత్యంత ఎక్కువ పోషక విలువలతోపాటు మార్కెట్‌ డిమాండ్‌ ఉన్నందు వల్లే డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట సాగుకు శ్రీకారం చుట్టానంటారామె. పది నెలల క్రితం వియాత్నం నుంచి అమెరికన్‌ బ్యూటీ(పింక్‌ కలర్‌) రకం డ్రాగన్‌ఫ్రూట్‌ మొక్కలను ఒక్కొక్క మొక్క రూ.100కు 10 వేల మొక్కలు తెప్పించి 8 ఎకరాల్లో నాటారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కల నడుమ బొప్పాయి మొక్కలు 4 వేలు, సీతాఫలం మొక్కలు 4 వేలు, 10 వేల జామ మొక్కలు, 3 వేల శ్రీగంధం మొక్కలు నాటారు. అలాగే తోట చుట్టూ కొబ్బరి మొక్కలు నాటించారు. 

మొక్కల చుట్టూ సజీవ ఆచ్ఛాదన
మొక్కలను బీజామృతంతో శుద్ధి చేసి గుంతల్లో ఘనజీవామృతం వేసి నాటామన్నారు. మొక్కల చుట్టూ నవధాన్యాలను చల్లి సజీవ ఆచ్ఛాదన కల్పిస్తున్నామని, కోసిన గడ్డిని, మినప పొట్టును ఆచ్ఛాదనగా వేస్తున్నామని పద్మావతి తెలిపారు. వారానికి ఒకటి, రెండు సార్లు నీటితోపాటు జీవామృతం ఇస్తున్నారు. అప్పుడప్పుడూ పంచగవ్యను నీటితో డ్రిప్‌ ద్వారా ఇవ్వడంతోపాటు పిచికారీ కూడా చేస్తున్నారు. అవసరం మేరకు సప్త ధాన్యాంకుర, దశపత్ర కషాయాలను పిచికారీ చేస్తున్నామని ఆమె వివరించారు.


డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటలో మహిళా రైతు పద్మావతి

పాతికేళ్లు దిగుల్లేని దిగుబడి
నాటిన 8 నెలలకే డ్రాగన్‌ ఫ్రూట్‌ తొలి కాపు వచ్చింది. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేయడం వల్ల రుచి, తియ్యదనం, నిల్వ సామర్థ్యం బాగా ఉన్నాయన్నారు. వివిధ దేశాల డ్రాగన్‌ ఫ్రూట్స్‌ తిన్న వారికి తమ పండ్లు తినిపించి చూశానని, రుచి, తీపి చాలా బాగుందన్నారని తెలిపారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్క నాటిన ఐదేళ్లకు కనీసం 10 టన్నుల దిగుబడిని ఇస్తుందన్నారు. వ్యవసాయానుభవం లేని తమ పిల్లలు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పాతికేళ్ల పాటు నిశ్చింతగా దిగుబడి ఇచ్చే పంట కావడంతోనే డ్రాగన్‌ ఫ్రూట్‌ను ప్రధాన పంటగా వేశానని ఆమె తెలిపారు. డ్రాగన్‌ ఫ్రూట్‌కు పెద్దగా నీరు అవసరం లేదని, అయితే అధిక వర్షాలను కూడా తట్టుకునే మొండి మొక్కన్నారు. ఎండ 40 సెల్షియస్‌కు మించితే కొంచెం ఇబ్బంది ఉంటుందని, అందుకనే అంతర పంటలుగా సీతాఫలం, శ్రీగంధం, మునగ నాటించామని పద్మావతి వివరించారు.  ఇప్పటికే బొప్పాయి దిగుబడి ఒక పంట వచ్చిందని చెబుతూ, అధిక వర్షాలకు తమ ప్రాంతంలో చాలా బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయని, పంచగవ్య పిచికారీ వల్ల తమ తోట తిప్పుకొని ఇప్పుడు మళ్లీ పూతకు వచ్చిందన్నారు. 

సంఘటితమైతేనే అమ్ముకోగలం
ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నప్పటికీ ప్రకృతి వ్యవసాయదారులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటేనే మార్కెటింగ్‌ సమస్యను అధిగమించగలుగుతారన్నది పద్మావతి విశ్వాసం. అందుకే విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల పరస్పర సహకార సంఘంలో ఆమె సభ్యురాలిగా చేరారు. తన 12 ఎకరాల్లో పండించిన పండ్లు, కూరగాయలతోపాటు తమ పరిసర ప్రాంతాల్లో శ్రద్ధగా, నిబద్ధతగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న చిన్న రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు పండించే నాణ్యమైన ఉత్పత్తులను కూడా సేకరించి, తన సొంతవాహనంలో ప్రతి రోజూ విజయవాడ తీసుకెళ్లి, సహకార సంఘం ద్వారా వినియోగదారులకు నమ్మకంగా విక్రయిస్తుండడం విశేషం. 

కూరగాయలను కిలో రూ. 30 రూపాయలకు సంఘానికి తాము ఇస్తున్నామని, మరో పది రూపాయలు వేసుకొని సంఘం వినియోగదారులకు విక్రయిస్తున్నదన్నారు. సంఘం తీసుకోగా మిగిలిన కూరగాయలను తమ పొలాల దగ్గరే కిలో రూ. 40కి అమ్ముతున్నామని పద్మావతి తెలిపారు. గేటెడ్‌ కమ్యూనిటీలు, కాలనీలలో సహకార సంఘం ద్వారా ప్రచార కార్యక్రమాలు, సభలు నిర్వహించడం ద్వారా తాము రసాయనాలు వాడకుండా నిబద్ధతతో పండిస్తున్న పంటల గురించి ప్రచారం చేస్తున్నారు. తమ తోటలను సందర్శించి తాము అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను స్వయంగా తెలుసుకొని మరీ ధైర్యంగా కొనుగోలు చేయవలసిందిగా ప్రజలను ఆహ్వానిస్తున్నామన్నారు పద్మావతి. నడి వయసులో వ్యవసాయం చేపట్టడమే కాకుండా ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌లో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్న పద్మావతి అభినందనీయురాలు. 
– ఉమ్మా రవీంద్రకుమార్‌ రెడ్డి, సాక్షి, నూజివీడు, కృష్ణా జిల్లా

ప్రకృతి సేద్యంతో ఎంతో సంతృప్తి 
ప్రకృతి సేద్యం కాన్సెప్ట్‌ నాకు బాగా నచ్చింది. వ్యవసాయ అనుభవం లేని వారు కూడా మొదలు పెట్టి ఒక సంవత్సరంలో నేర్చుకోవచ్చు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ఆరోగ్యదాయకమైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను పండించి మేం తింటున్నాం. సహకార సంఘం ద్వారా అంతే నమ్మకంగా ప్రజలకూ అందిస్తున్నాం. మా తోటలకు వచ్చి చూసి నమ్మకం కలిగితేనే కొనమని సంఘం తరఫున కాలనీలకు వెళ్లి వినియోగదారులను ఆహ్వానిస్తున్నాం. చిన్న రైతులు పండించే ఆరోగ్యదాయకమైన కూరగాయలను కూడా నా వాహనంలో విజయవాడ తీసుకెళ్లి ప్రజలకు అందిస్తున్నందుకు ఎంతో సంతృప్తిగా ఉంది.
– అన్నే పద్మావతి (89778 77477), రమణక్కపేట, కృష్ణా జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement