Terrace Garden
-
మిద్దె తోట : షేడ్‌నెట్ అవసరమా? కాదా?
మేడపైన ఖాళీ ఉంచకుండా పచ్చని పంటలతో కళకళలాడేలా చూసుకుంటే ఏడాది పొడవునా ఆ కుటుంబం అంతటికీ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కొంతవరకైనా అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు మేడపైన, పెరట్లో ఖాళీ లేకుండా ఇంటిపంటలు సాగు చేసుకోవటం అర్బన్ ప్రాంతాల్లో సొంతి ఇంటి యజమానులకు చాలా వరకు అలవాటైపోయింది. అయితే, వేసవిలో తమ పంటలను రక్షించుకోవటానికి సేంద్రియ మిద్దెతోట / ఇంటిపంటల సాగుదారులు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. షేడ్నెట్లు కట్టడం, గాలిదుమ్ములకు అవి చిరిగి΄ోవటం, ఎగిరి΄ోవటం పరి΄ాటి. అయితే, మండు వేసవిలోనూ షేడ్‌నెట్ అవసరం లేకుండానే పంటల ప్రణాళిక ద్వారా మిద్దె తోటలను సంరక్షించుకోవచ్చు అంటున్నారు సీనియర్ మిద్దెతోట నిపుణులు ‘లతా కృష్ణమూర్తి’.. ‘సాక్షి సాగుబడి’కి ఆమె తెలిపిన వివరాలు.. వచ్చేది ఎండాకాలం. షేడ్‌నెట్‌కు బదులుగా సంవత్సరం పొడవునా దిగుబడి వచ్చే పండ్ల మొక్కలను మిద్దెతోటలో పది అడుగులకు ఒకటి చొప్పున పెద్ద కుండీల్లో పెంచుకుంటే.. వాటి పక్కన చిన్న మొక్కలకు ఎండ నుంచి రక్షణ ఉంటుంది. మిద్దెతోట ఏర్పాటు చేసుకునేటప్పుడే కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలతోపాటు పండ్ల మొక్కలు కూడా పెట్టుకోవాలి.పండ్ల మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు (మొదటి సంవత్సరం) ఎండాకాలం ఉష్ణోగ్రతలకు మొక్కలు తట్టుకోలేకపోయినా రెండో సంవత్సరం నుంచి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మా మిద్దెతోటలో నిర్మించిన ఎత్తుమడుల్లో ప్రతి పది అడుగులకు ఒక పండ్ల చెట్లు పెంచుతున్నాం. మిద్దెతోట వల్ల ఇంటి లోపల చల్లగా ఉంటుంది. బయటి ఉష్ణోగ్రతల కంటే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. మండువేసవిలోనూ ఇంట్లో ఏ.సి. అవసరం ఉండదు. అందువల్ల కరెంట్ వాడకం తగ్గుతుంది. ఖర్చు కలిసి వస్తుంది. అలాగే, ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్ అందటంతోపాటు తేమ కూడా రిలీజ్ అయి, గదిలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇవీ చదవండి: పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే... రోజుకు నాలుగు కోట్లు.. ట్విస్ట్ ఏంటంటే!గర్భసంచి తీసివేత ఆపరేషన్లు, షాకింగ్ సర్వే: మహిళలూ ఇది విన్నారా? -
చలికాలంలో పిండినల్లి, చీడపీడలు : ఇవి చల్లుకుంటే చాలు
శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసు కోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి. జీవామృతంను 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10–15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది.ఘా చ్ఛాదన: కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది. ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులుటమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి. పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్‌ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్‌ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నేమసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే. పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండి΄ోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామరపురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు. బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రసంపీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలురసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయంను (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7–10 రోజులకోసారి పిచికారీ చేయాలి. వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు). వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి.వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బు పొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి. నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ΄్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు.రసంపీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే?రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్‌నెట్‌ను మొక్కలపై గ్రీన్హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్‌నెట్ చుట్టేస్తే సరి. – డా. గడ్డం రాజశేఖర్ సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ -
డ్రాగన్ తోట : ఉపాయం ఉండాలేగానీ, నెలకు రూ.లక్ష ఈజీగా
ఉపాయం ఉండాలే గాని ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఉత్సాహంగా మరో వృత్తిని చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చనటానికి కేరళకు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయిని కృషే నిదర్శనం. కొల్లం పట్టణానికి చెందిన రెమాభాయ్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సాయిల్ లెస్ పద్ధతిలో తమ ఇంటిపైనే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయటం ప్రారంభించారు. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో హైడ్రోపోనిక్ పద్ధతిలో డ్రాగన్ పండ్లను సాగు చేస్తున్నారు. నెలకు 500 కిలోల డ్రాగన్ ఫ్రూట్స్ దిగుబడి వస్తోంది. కిలో రూ. 200కు విక్రయిస్తూ నెలకు రూ. లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి 3 నెలలే డ్రాగన్ ఫ్రూట్ సీజన్ ఉంటుంది. రిటైరైన కొద్ది రోజులకే ఆమె తల్లి వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆ వేదనలో నుంచి బయటపడటం కోసం ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలనుకున్నారు. విదేశీ పండైన డ్రాగన్ సాగును ఇంటిపైనే ప్రారంభించారామె. నేలపైన పెంచడానికి ఇంటి దగ్గర ఖాళీ స్థలం లేదు. అందుకే మేడపై రెండొందల లీటర్ల బ్యారళ్లు 50 పెట్టి, వాటిల్లో వంద డ్రాగన్ మొక్కల్ని పెంచుతున్నారు. మట్టి మోసుకెళ్లి ఇంటిపైన పెట్టటం నాకు కష్టం అనిపించి సాయిల్ లెస్ పద్ధతిని ఎంచుకున్నానని రమాభాయ్ అంటున్నారు. కొన్ని రెడ్, కొన్ని ఎల్లో రకం డ్రాగన్ రకాలను నాటారు. ఎక్కువైన నీరు బయటకు పోవటానికి బ్యారెల్‌కు అడుగున బెజ్జం పెట్టి.. అందులో ఆకులు, రంపపు పొడి, వరి గడ్డి ముక్కలు, బ్యారెల్‌కు 3 కిలోల చొప్పున కం΄ోస్టు ఎరువును దొంతర్లుగా వేశారు. వంద గ్రాముల బోన్ మీల్ కూడా కలిపి, మొక్కలు నాటారు. ఎండాకులు, కూరగాయ వ్యర్థాలు, చేపలు, రొయ్యల వ్యర్థాలు, ఆల్చిప్పలతో సొంతంగా తయారు చేసుకునే ద్రవరూప ఎరువులను మొక్కలకు ఆమె అప్పుడప్పుడూ ఇస్తున్నారు. దీంతో మొక్కలు పోషకలోపాల్లేకుండా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తున్నాయని రమాభాయ్ సంతృప్తిని వ్యక్తం చేశారు.‘ఏదైనా కంటెయినర్లో కిలో చేపలు, రొయ్యలు, పీతల డొప్పలకు కిలో బెల్లంతో పాటు బొప్పాయి పండ్ల తొక్కలు కలపాలి. ఎండ తగలకుండా నీడన ఉంచి అప్పుడప్పుడూ కలియదిప్పుతూ ఉంటే.. 90 రోజులకు సేంద్రియ ద్రావణం సిద్ధమవుతుంది. ఇది కాల్షియం, ఫాస్ఫరస్‌ను పుష్కలంగా అందిస్తుంది. ఆ బలంతో డ్రాగన్ మొక్కలు చక్కగా కాస్తున్నాయి’ అన్నారు రమాభాయ్. జెసిస్ వరల్డ్ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను కూడా ఆమె ప్రారంభించారు. సీజన్లో మా ఇంటిపైన 200–300 డ్రాగన్ పూలు కనువిందు చేస్తుంటే నా వయసు 60 నుంచి 20కి తగ్గిపోతుంది. బాధలన్నీ మర్చిపోతున్నా అంటున్నారామె సంతోషంగా! -
ఇంటి రూఫ్.. మొక్కలు సేఫ్..!
సాక్షి, సిటీబ్యూరో: టెర్రస్‌గార్డెన్.. హైదరాబాద్ నగరంలోని నివాసాల నుంచి పల్లెల వరకూ ఇప్పుడు ఇదే ట్రెండింగ్. పెరుగుతున్న కాలుష్యం ప్రజలను ప్రకృతి ఒడికి చేరువయ్యేలా చేస్తోంది. ఓ వైపు ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం.. మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ తమ నివాసాల్లో మొక్కలు పెంచుతున్నారు. నగరంలో స్థలాభావం కారణంగా మిద్దెలపై మొక్కలు పెంచడం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికితోడు గ్రీన్ సిటీస్, గ్రీన్ హౌస్ అనే కాన్సెప్‌్టతో ఇప్పటికే అత్యాధునిక సౌకర్యాలతో బిల్డింగ్ డిజైన్లు వెలుస్తున్నాయి. దీంతో నగర వాసుల, ప్రకృతి ప్రేమికుల నివాసాలు పచ్చదనానికి ఆవాసాలుగా మారుతున్నాయి. అపార్ట్మెంట్, కాంప్లెక్స్‌ల నిర్వాహకుల నుంచి ఇండివీడ్యువల్ ఇళ్ల వరకూ గ్రీనరీకి ప్రధాన్యతనిస్తున్నారు.ఆరోగ్యం వెంట.. ఇంటి పంట..ఇటీవలి కాలంలో నగరంలో అధిక శాతం మంది భవనాలపై, టెర్రస్‌లో తమ సొంత కూరగాయలను ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది వారికి ఆరోగ్యకరమైన తాజా ఉత్పత్తులను అందించడమే కాదు.. సొంతంగా పండించుకుంటున్నామనే గొప్ప సంతృప్తిని కూడా అందిస్తుంది. టెర్రస్ గార్డెన్ కేవలం పచ్చదనాన్ని పంచడం మాత్రమే కాకుండా ఆయా కమ్యూనిటీలు నిర్వహించుకునే ఈవెంట్లకు అద్భుతమైన అనువైన ప్రదేశంగా మారాయి. పండుగల నుంచీ బార్బెక్యూల దాకా వేడుకలుగా జరుపుకోడానికి ఇవి వేదికలవుతున్నాయి. నగర జీవితంలో హడావిడి నుంచి తప్పించుకోడానికి నివాసితులకు వీలు కల్పిస్తోంది. మిద్దెతోట.. పచ్చని బాట..నగరంలో స్థల పరిమితులు ఉండటంతో, స్థలాభావం ఉన్నప్పటికీ పచ్చదనానికి పట్టం కట్టాలని ఆరాటపడుతున్న వారికి.. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలోని టెర్రస్ గార్డెన్లు పరిష్కారాన్ని అందిస్తున్నాయి. నగరంలో అపార్ట్మెంట్, కాంప్లెక్సుల్లో టెర్రస్ గార్డెన్లు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఒకప్పుడు భవనాల పైకప్పులపై ఖాళీగా ఉన్న స్థలాలు ఇప్పుడు పచ్చని ప్రదేశాలుగా మారి నగరవాసుల అభిరుచుల వైవిధ్యానికి నిదర్శనాలుగా మారుతున్నాయి.పచ్చని వాతావరణాన్ని అందించడమే కాకుండా కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి గాలిలోకి ఆక్సీజన్‌ను విడుదల చేయడం ద్వారా మిద్దె తోటలు గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. అంతేకాదు కూరగాయలు, మూలికలు, పండ్లను సైతం పెంచడానికి అనేక మార్గాలను అన్వేíÙస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ఇలా పర్యావరణానికి రక్షణగా నిలవడం.. తద్వారా ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి అలవాటుపడుతున్నారు నగరవాసులు.రసాయనాల నుంచి విముక్తికి..‘పురుగుమందులు లేని సేంద్రీయ కూరగాయలకు పెరుగుతున్న డిమాండ్‌తో, తమ సొంత పెరట్లలో లేదా టెర్రస్లలో కూరగాయలు, పండ్లను పండించడం వైపు చాలా మంది ఆకర్షితులవుతున్నారు. అలాగే ఇంటి ఖర్చులో పొదుపు మార్గాలను అందిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం 45,000 మంది టెర్రస్‌పై తోటలను పెంచేందుకు మా ప్రచారం తోడ్పడింది’ అని శ్రీనివాస్ చెప్పారు. హరిత ఉద్యాన వనాలను మెరుగుపరచడానికి కావాల్సిన విత్తనాలు, మాధ్యమాలు విడిభాగాలను కొనుగోలు చేయడానికి నిపుణుల సలహాలను పొందడంతో పాటు అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్పారాయన.సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్..ఆన్లైన్ వేదికగా మిద్దె తోటల పెంపకంపై చర్చోపచర్చలు, గ్రూపులు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది ఉద్యానవన ప్రియుడు శ్రీనివాస్ హర్కరా ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్’ స్థాపించారు. ఇప్పుడు ఇది అత్యధిక సంఖ్యలో నిపుణులు, సభ్యులను కలిగిన గ్రూప్స్‌లో ఒకటి. అటువంటి 16 గ్రూప్స్‌తో దాదాపు 25 వేల మంది సభ్యులతో టెర్రస్ గార్డెన్ హవా నడుస్తోంది. రూఫ్ గార్డెనింగ్, ఆర్గానిక్ కూరగాయలు, పండ్లను పండించడానికి సంబంధించిన అన్ని పరిష్కారాల కోసం వన్ స్టాప్ ప్లాట్‌ఫారమ్‌గా మారింది.గోడల నుంచి.. ఎలివేషన్స్ వరకూ..పచ్చదనం కోసం నగరవాసుల్లో పెరుగుతున్న ఆరాటం గోడల నుంచి ఎలివేషన్స్ వరకూ గతంలో ఉపయోగించని ప్రదేశాలను సైతం మొక్కలతో నింపేలా చేస్తోంది. ఈ క్రమంలోనే రూఫ్ గార్డెనింగ్, టెర్రస్, రూఫ్‌టాప్, పాటియో, బాల్కనీ, పోర్చ్, వరండా, సన్డెక్ వంటి ప్రదేశాల్లో మొక్కలు పెంచేస్తున్నారు. దీంతోపాటు హ్యాంగింగ్ గార్డెనింగ్ కూడా ప్రాచుర్యం పొందుతోంది.. బాల్కనీల్లో వైర్లు, బుట్టలు, కుండీలు వంటివి వేలాడదీస్తూ తీగ మొక్కలను పెంచుతున్నారు. తద్వారా ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కూడా లభిస్తోంది.గ్రాండ్.. గార్డెన్ ట్రీట్స్..ఇంటి మిద్దెలు, టెర్రస్ గార్డెన్స్ ఇటీవలి కాలంలో గ్రాండ్ ట్రీట్స్కి వేదికలు అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కమ్యూనిటీ మిత్రులు, ఆఫీస్ కొలీగ్స్‌తో కలిసి వీకెండ్స్, ఇతర ప్రత్యేక ఈవెంట్స్‌లో ట్రీట్స్ ఇచ్చుకోడానికి వీలుగా రూపుదిద్దుకుంటున్నాయి. అవుట్డోర్ సీటింగ్‌కు అనుగుణంగా బెంచ్‌లు, కురీ్చలు, ఊయల వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. రట్టన్, వెదురు, కలప, లోహాలు మొదలైన వాటి నుండి ఆల్–వెదర్ ఫరి్నచర్ శ్రేణిలో రూఫ్ గార్డెన్స్ నిర్మాణమవుతున్నాయి.70 వేలకు పైగా సభ్యులు..నగరంలో టెర్రస్ గార్డెన్స్ ట్రెండ్ బాగా పెరుగుతోంది. ప్రస్తుతం మా సంస్థ ఆధ్వర్యంలో 26 గ్రూప్స్ ఉండగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు 70వేల మందికిపైగా సభ్యులున్నారు. పర్యావరణ హితంగా, నగర వాతావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడేందుకు ఈ ట్రెండ్‌ని మరింతగా ప్రోత్సహించాలి. నగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మా సంస్థ కృషికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు వచి్చంది. – శ్రీనివాస్, వ్యవస్థాపకులు, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్.. (సీటీజీ)ఇవి చదవండి: ఆయిల్, గ్యాస్ బ్లాకుల కోసం పోటాపోటీ -
అర్బన్ అగ్రికల్చర్ అదుర్స్
నానాటికీ కాంక్రీటు అరణ్యంగా మారిపోతున్న హైదరాబాద్ నగరంలో అనేకమంది, ఎక్కువగా సొంత ఇంటి యజమానులు తమ ఇంటి మిద్దె (టెర్రస్)ల పైనే వివిధ రకాల సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండిస్తున్నారు. సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెరుగుతున్న కొద్దీ ఈ విధంగా సేంద్రియ ఇంటి పంటలు లేదా మిద్దె తోటల (టెర్రస్ కిచెన్ గార్డెనింగ్) సాగు వైపు మొగ్గు చూపేవారి సంఖ్య పెరిగిపోతుంది.నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే విరివిగా ఇలా పంటలు పండిస్తుండగా ఇటీవలి కాలంలో వరంగల్, కరీంనగర్ వంటి నగర పాలక సంస్థల పరిధిలోనూ ప్రారంభమై విస్తరిస్తోంది. వాస్తవానికి టెర్రస్‌లపై సేంద్రియ కూరగాయలు, పండ్ల సాగుపై పుష్కర కాలం క్రితమే ‘సాక్షి’ దినపత్రిక ‘ఇంటిపంట’ శీర్షిక ద్వారా ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. వీటి ప్రాధాన్యత విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవగాహన కల్పించింది.నిపుణులతో ఉచిత శిక్షణా తరగతుల నిర్వహణతో హైదరాబాద్ నగరంలో వేలాది మంది సేంద్రియ మిద్దె తోటల సాగులో నైపుణ్యం పొందేలా చేసింది. అయితే ప్రస్తుతం సేంద్రియ ఇంటిపంటలు లేదా మిద్దె తోటలు సాగు చేస్తున్న నగరవాసుల్లో అర్బన్ అగ్రికల్చర్ (పట్టణ వ్యవసాయం) నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఏయే రకాల పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు? వంటింటి వ్యర్థాలను చెత్తలో పారేయ కుండా కంపోస్టు ఎరువుగా మార్చుకుంటున్న వారి శాతం ఎంత? ఎన్నో ఏళ్లుగా అర్బన్ ఫార్మర్ (పట్టణ రైతు) గా ఉన్నప్పటికీ వీరిలో లోపిస్తున్న నైపుణ్యాలేమిటి? వంటి పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ)లోని విస్తరణ విద్యా విభాగానికి చెందిన అగ్రికల్చర్ ఎమ్మెస్సీ విద్యార్ధి జి.చరణ్ తేజ సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.3 నగరాల్లో అధ్యయనంచరణ్ తేజ మిద్దె తోటలు విస్తారంగా సాగవుతున్న హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్ నగరాల్లో మొత్తం 120 మంది టెర్రస్ కిచెన్ గార్డెనర్లపై అధ్యయనం చేశారు. ఇందులో అనేక అంశాల్లో సేంద్రియ ఆకుకూరలు సాగుపై ఎక్కువ మంది గార్డెనర్లు ఆసక్తి చూపుతున్నారనేది ఒకటి. కాగా ఈ అధ్యయనానికి సంబంధించి ప్రొఫెసర్లు పి.విజయలక్ష్మి, డా.బి.సవిత, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.మీనాతో కలసి చరణ్ తేజ రాసిన మూడు పరిశోధనా వ్యాసాలు జర్నల్స్‌లో ప్రచురితం అయ్యాయి. అధ్యయనంలోని ముఖ్యాంశాలు..మిద్దె సేద్యంలో 51% నడి వయస్కులే⇒ సేంద్రియ ఇంటిపంటలు సాగు చేపట్టిన వారిలో 61% మంది మహిళలు కాగా, మిద్దె తోటలు సాగు చేస్తున్న వారిలో 51% నడి (35–50 ఏళ్ల) వయస్కులు ఉన్నారు. 50 ఏళ్లు దాటిన వారి (20%) కంటే యువజనులే ఎక్కువ (29%).⇒ సేంద్రియ ఇంటిపంటల సాగుకు సంబంధించిన 20 అంశాల్లో 52% మంది టెర్రస్ గార్డెనర్లకు అధిక పరిజ్ఞానం ఉండగా, 36% మందిలో ఒక మోస్తరుగా, 11% మందిలో మరీ తక్కువగా ఉంది. ⇒ సేంద్రియ ఆహారం ఆవశ్యకతను గుర్తించి మిద్దె తోటల సాగు చేపట్టిన వారిలో 62% డిగ్రీ/ఆపైన చదువుకున్న వారే. చదువు లేని వారు 2%, నిరక్షరాస్యులు 3% మిద్దె తోటలు సాగు చేస్తున్నారు. ⇒ మిద్దె తోట సాగుదారుల్లో 37% మంది ప్రభుత్వ ఉద్యోగులు, 23% గృహస్తులు, 18% వ్యాపారులు, 16% విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. ప్రైవేటు ఉద్యోగులు చాలా తక్కువగానే ఉన్నారు. కేవలం 6% మందే టెర్రస్ సాగు చేస్తున్నారు. ఈ సాగుదారుల్లో మధ్యస్థ స్థాయి వార్షికాదాయం ఉన్నవారు 56%, అల్పాదాయ వర్గాల వారు 26%, అధికాదాయ వర్గాలు 18% ఉన్నారు.ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం పట్టణాల్లో మిద్దె తోటల సాగును పూర్తిస్థాయిలో ప్రోత్సహించడానికి ప్రభుత్వం విధానపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోతులు, చీడపీడలు, పక్షుల బెడద నుంచి పరిరక్షించుకోవడానికి నెట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పించాలి. చీడపీడలను గుర్తించి, వాటిని అధిగమించే నైపుణ్యాలను పెంపొందించటం కోసం అనుభవజ్ఞులైన ఉద్యాన అధికారులతో అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజలకు శిక్షణ ఇప్పించాలి. వర్టికల్ గార్డెనింగ్ నైపుణ్యాలపై మిద్దె తోటల సాగుదారులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పిస్తే టెర్రస్ స్థలాన్ని మరింత ఉత్పాదకంగా వినియోగించుకోవటానికి అవకాశం కలుగుతుంది. – గువ్వల చరణ్ తేజ76 శాతం అనుభవజ్ఞులే⇒ 3 నుంచి 9 ఏళ్ల క్రితం నుంచి ఇంటిపంటల సాగు చేపట్టిన నగరవాసులు ఏకంగా 76% ఉన్నారు. 15 ఏళ్ల అనుభవం ఉన్నవారు 16%, 20–21 ఏళ్ల అనుభవం కలిగిన వారు 7% ఉన్నారు. ⇒ కుటుంబం అంతా కలసి తోట పనులు చేసుకుంటున్నవారు 53% ఉండగా, ఇంట్లో ఎవరో ఒక్కరు ఆసక్తితో చేస్తుంటే.. వారికి అడపా దడపా సాయం చేసే కుటుంబాలు 29%, అరుదుగా సాయం చేసే కుటుంబాలు 17% ఉన్నాయి. ⇒ మధ్యస్థ విస్తీర్ణంలో ఏర్పాటైన తోటలు 64% కాగా పెద్దవి 26%, చిన్నవి 10% ఉన్నాయి. ⇒ 65% కుటుంబాలు ఆకు కూరలకు అధిక ప్రాధాన్యత (ఎక్కువ విస్తీర్ణంలో) ఇస్తున్నాయి. కూరగాయలే ముఖ్యం అనుకునే వారు 22%, తీగజాతులు ముఖ్యం అనుకుంటున్న వారు 6%, ఔషధ మొక్కలు ముఖ్యం అనుకుంటున్న వారు 4%.. పండ్లను సాగు చేస్తున్న వారు 3% ఉన్నారు. ⇒ కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, తీగజాతి కూరగాయలు, పువ్వుజాతి కూరగాయలు (క్యాబేజీ వంటివి), పండ్లు, ఔషధ మొక్కలు.. లాంటివన్నీ సాగు చేస్తున్న కుటుంబాలు 53% ఉండగా, మరో 29% కుటుంబాలు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, దుంపకూరలకు పరిమితం అవుతున్నారు.సొంత కంపోస్టు వాడుతున్న 84% మంది⇒ మిద్దె తోటల సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే స్లాబ్ ద్వారా నీరు లీకయ్యే ప్రమాదం ఉందన్న గ్రహింపు 89% మందికి ఉంది. సారవంతమైన మట్టి మిశ్రమం వాడటంలో, వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసుకొని వినియోగించడంలో, చీడపీడలను నియంత్రించుకోవటంలో 85–86 శాతం మందికి పూర్తి అవగాహన ఉండటం విశేషం. ⇒ ప్రభుత్వ శిక్షణ పొందామని 45% మంది చెప్పారు. మిద్దె తోటల సమాచారం కోసం వాట్సాప్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నా మన్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఉన్నాయి. రోజుకు రెండు, మూడు గంటలు మిద్దె తోట పనులు చేసుకుంటున్నామని ఎక్కువ మంది చెప్పారు.ఇవీ లోపాలు⇒ టెర్రస్ గార్డెనింగ్ లేఅవుట్ గురించి 54% మందికి తెలియదు. కుండీలు, మడుల్లో పంట మార్పిడి చేయాలన్న గ్రహింపు 47 శాతం మందిలోనే ఉంది.⇒ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మిద్దె తోటను రక్షించుకునే నైపుణ్యం 47% మందికి లోపించింది.⇒ అదనపు నీరు బయటకు వెళ్లిపోవటానికి కుండీలు, మడులకు అడుగున బెజ్జాలు ఉండాలన్న విషయం తెలియని గార్డెనర్లు 51% ఉన్నారంటే ఆశ్చర్యం కలగకపోదు.⇒ కోతుల నుంచి పంటలను రక్షించుకోవటం పెద్ద సవాలుగా మారింది. -
కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు
డాక్టర్ ప్రిస్కిప్షన్ రాస్తూ... ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీ, టీ లతో రోజును మొదలు పెట్టకండి’ అని చెబితే ఆ కఠోరమైన సూచనను జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. డాక్టర్ ముందు బుద్ధిగా తలూపుతాం. పాటిస్తామని గొంతులో నిజాయితీని ధ్వనింపచేస్తూ బదులిస్తాం. మరునాడు తెల్లవారి కాఫీ–టీలు తాగిన తర్వాతగానీ ముందురోజు డాక్టర్‌కు ఇచ్చిన మాట గుర్తు రాదు. ఇదంతా మన బ్రెయిన్ మనతో ఆడుకునే ఆటలో భాగం. అయితే ఈ డాక్టర్ మాత్రం టీ వద్దనే వద్దని చెప్పనే చెప్పరు. ‘హాయిగా టీ తాగండి. దేహానికి హాయినిచ్చే తాజా ఔషధ ఆకులతో చేసిన టీని తాగండి’ అంటూ ఒక పెద్ద జాబితానే సూచిస్తారు. అవన్నీ ఇంట్లో సాధ్యమే అంటూ తన ఇంటి టెర్రస్‌ను చూపిస్తారీ ఉత్తరాఖండ్ డాక్టర్ అన్షు రాఠీ. ఆమె టెర్రస్ మీద 1500 అడుగుల విస్తీర్ణం కలిగిన టెర్రస్ మీద మిరియాలు, యాలకుల చెట్లతో సహా 400 మొక్కలను పెంచుతున్నారు. అందులో పండ్లు, కూరగాయలతో పాటు అశ్వగంధ, తులసి, ఆరెగానో, పసుపు, మిరియాలు, కుంకుమ పువ్వు, లవంగాలు, జాజికాయ, సోంఫు, మెంతులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇంగువ, మిర్చి, కొత్తిమీర, కలోంజి (నల్ల జీలకర్ర) వంటి 15 రకాల ఔషధ మూలికల మొక్కలున్నాయి. ఏడాదంతా సీజనల్‌గా వచ్చే అనేక అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే... ఆయా కాలాల్లో ప్రకృతి ఇచ్చిన ఔషధాలను ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు 36 ఏళ్ల అన్షురాఠీ. నేర్చుకోండి... పచ్చగా పెంచుకోండి! ‘‘మనదేశంలో వాతావరణం వైవిధ్యంగా ఉంటుంది. ప్రదేశాలు, కాలాలను బట్టి ఆయా నేలల్లో కొన్ని ప్రత్యేకమైన జాతులు విస్తరిస్తుంటాయి. వాటికి అనువైన పరిస్థితులను అంచనా వేయగలిగితే వాటన్నింటినీ ఒకే చోట పెంచవచ్చు. కొత్తిమీర, మిరియాలు, జీలకర్రలను పెంచాలంటే అక్టోబర్-నవంబర్ నెలల్లో నారు పోయాలి. పసుపును మే-జూన్ నెలల్లో నాటాలి. నాటడం నుంచి ప్రతి దశనూ ఆస్వాదించాలంటే అలా చేయవచ్చు. గార్డెనింగ్‌లో అనుభవం లేని వాళ్లు మాత్రం నారుమడిలో గింజలు చల్లడం నుంచి మొదలు పెట్టకుండా నర్సరీ నుంచి నారు మొలకలను కొనుక్కోవడం మంచిది. మిరియాలు, యాలకుల వంటి వాటిని నాటేముందు రాత్రంతా నానబెట్టాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలను నానబెట్టాల్సిన అవసరం లేదు. అలాగే నాటే పంటల కాల వ్యవధిని కూడా గమనించుకోవాలి. కొత్తిమీర రెండు వారాల్లో చేతికొస్తుంది, మెంతికి నాలుగు రోజులు చాలు. జీలకర్ర నారు 45 రోజులు తీసుకుంటుంది. ముందుగా ఒక కప్పులో నారు పోసి మొలకలు వచ్చిన తర్వాత ఆ నారు తీసి పెద్ద కుండీలు లేదా ట్రేలలో నాటాలి. ఈ ట్రేలను ఓ వారం రోజుల పోటు నీరెండలో ఉంచి ఆ తర్వాత ఎండలోకి మార్చాలి. View this post on Instagram A post shared by 🦋Dr. Rathi Anshu / Sustainability/Plant care tips , DIY, Decor (@myplantsmygarden) జీలకర్ర, కొత్తిమీర (ధనియాలు రావడానికి) పంట రావడానికి ఐదు నెలలు పడుతుంది. మిరియాలు మూడేళ్లు, యాలకులు ఐదేళ్ల సమయం తీసుకుంటాయి. మొక్కలు పెంచడంలో మట్టిని పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. మనం ఉన్న ప్రదేశంలో లభించే మట్టి స్వభావాన్ని గమనించుకోవాలి. మట్టిని పట్టుకుని ముద్ద చేసినప్పుడు సులభంగా బంతి ఆకారం వస్తే ఆ మట్టి జిగురుగా ఉన్నట్లు. అందులో 20 శాతం ఇసుక, 30 శాతం ఆవుపేడ, వేప పిప్పి కల΄ాలి. ఇలా తయారు చేసుకున్న మట్టిలో నాటిన మొక్కలకు తరచు ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. పంటకోతకు రావడానికి రెండువారాల ముందు వర్మీ–కంపోస్టు వేస్తే సరిపోతుంది. నేనున్నది గంగా నది–యమునా నదికి మధ్య విస్తరించిన నేల. ఇక్కడ మట్టి... మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలేవీ అవసరం లేదు. వంటగది వ్యర్థాలనే ఎరువుగా వేస్తున్నాను. వీటన్నింటినీ సొంతంగా పెంచుకోవడం అసాధ్యమేమీ కాదు. కొంత సమయం, మరికొంత శ్రద్ధ ఉంటే చాలు. ఉదయాన్నే అరలీటరు నీటిలో తులసి, మెంతితోపాటు నచ్చిన తాజాఆకులను వేసుకుని పావు లీటరు అయ్యే వరకు మరిగించి రుచి కోసం తేనె కలుపుకుని తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం కోసం ప్రయాస పడాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లోనే ఫార్మసీ, మీరే వైద్యులు’’ అని ఆరోగ్యం కోసం ఔషధాలను కప్పులో పోసి ఇస్తున్నారు డాక్టర్ అన్షు రాఠీ. -
నారి వారియర్
మంజు వారియర్....పేరులోనే కాదు ఆమె వేసే ప్రతి అడుగులో సాహసం ఉంటుంది. కళకు సామాజిక స్పృహ జోడించి ముందుకు వెళుతోంది. యాక్టర్, రైటర్, డ్యాన్సర్, బ్రాండ్ అంబాసిడర్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది... కేరళలోని తిరువనంతపురం కల్పాక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని మహిళా సభ్యులు సొంతంగా కూరగాయలు పండించడం ప్రారంభించారు. అందరూ ఆశ్చర్యపోయేలా పెద్ద వెజిటెబుల్ గార్డెన్‌ను సృష్టించారు. ‘కల్పాక క్వీన్స్’గా పేరు గాంచారు. వెజిటెబుల్ గార్డెన్ సృష్టించడానికి కల్పాక క్వీన్స్‌కు ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ అనే సినిమా స్ఫూర్తి ఇచ్చింది. సమాజాన్ని సినిమా ప్రభావితం చేస్తుందా? సినిమాను సమాజం ప్రభావితం చేస్తుందా?... అనే చర్చ మాట ఎలా ఉన్నా సమాజంపై సినిమా చూపే ప్రభావం తక్కువేమీ కాదు. మంచి లక్ష్యానికి మంచి సినిమా వెన్నుదన్నుగా నిలుస్తుంది. మంజు వారియర్ రీఎంట్రీ మూవీ ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ ఈ కోవకు చెందిన సినిమానే. మంజు వారియర్ ఈ సినిమాలో నిరూపమ రాజీవ్ అనే పాత్ర పోషించింది. నిరూపమ రాజీవ్ అనే వివాహిత టెర్రస్ ఫార్మింగ్‌కు సంబంధించిన ప్రయాణం సినిమా మూల కథ. ‘స్త్రీలు తమలో ఉన్న శక్తి సామర్థ్యాలపై దృష్టి సారించి వెలికి తీస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి’ అంటుంది వారియర్. ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ సినిమా విడుదలైన తరువాత మంజు వారియర్ ఎక్కడికి వెళ్లినా మహిళలు దగ్గరికి వచ్చి ‘మీ సినిమా స్ఫూర్తితో టెర్రస్ ఫార్మింగ్ మొదలు పెట్టాం’ అని చెప్పేవాళ్లు. ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ‘కుటుంబశ్రీ’కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంతో మంది మహిళలను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు నడిపిస్తోంది మంజు వారియర్. పదిహేడు సంవత్సరాల వయసులో ‘సాక్ష్యం’ సినిమాతో మలయాళ చిత్రసీమలోకి అడుగు పెట్టిన వారియర్ ‘తూవల్’ ‘కొట్టరం’ ‘సల్లాపం’...మొదలైన సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. చిత్రసీమలోకి రావడానికి ముందు దూరదర్శన్ సీరియల్స్‌లో నటించింది. జెండర్–ఈక్వాలిటీని దృష్టిలో పెట్టుకొని కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జెండర్ పార్క్’ ప్లాట్‌ఫామ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వారియర్ క్యాన్సర్ పేషెంట్ల కోసం హెయిర్ డొనేషన్ డ్రైవ్‌లను నిర్వహిస్తుంటుంది. ‘చతర్ముఖం’ అనే మలయాళం సినిమాతో నిర్మాతగా తొలి అడుగు వేసింది మంజు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘సినిమా నిర్మాణంలో రిస్క్‌లు, బాధ్యతలు ఉంటాయి. నా చుట్టుపక్కల వాళ్ల సహకారంతో నిర్మాతగా ఎలాంటి సవాళ్లు, ఒత్తిడి ఎదుర్కోలేదు. ‘కాయట్టం’ సినిమాకు సహనిర్మాతగా ఉన్నప్పుడు చిత్ర నిర్మాణం గురించి సీరియస్‌గా ఆలోచించడం మొదలు పెట్టాను. నా జీవితంలో ఏది ప్లాన్ చేసుకోలేదు. ఆ సమయానికి ఏది ఆసక్తిగా ఉంటే అది చేస్తూ పోయాను. సినిమా నిర్మాణాన్ని నా జీవితంలో కొత్త ప్రయోగంగా భావిస్తాను’ అంటుంది మంజు వారియర్. క్లాసికల్ డ్యాన్సర్‌గా మంజు వారియర్ తెచ్చుకున్న పేరు తక్కువేమీ కాదు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల నుంచి వారియర్ నాట్యప్రతిభ గురించి ప్రముఖ నాట్యకారుడు ఎన్వీ క్రిష్ణన్‌కు తెలుసు. ‘మంజు గిఫ్టెడ్ డ్యాన్సర్. మన దేశంలోని అద్భుతమైన భరతనాట్య కళాకారులలో ఆమె ఒకరు’ అంటాడు క్రిష్ణన్. భరతనాట్యంలో పేరు తెచ్చుకున్న మంజు వారియర్ తన కూతురు మీనాక్షి డ్యాన్స్ టీచర్ గీతా పద్మకుమారన్ నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకుంది. ‘వారియర్‌కు కూచిపూడి నేర్పడం ఒక అద్భుత అనుభవం. తక్కువ సమయంలోనే డ్యాన్స్ నేర్చుకుంది. అద్భుతమై ఎక్స్ప్రెషన్స్ ఆమె సొంతం’ అంటుంది గీత. ‘సల్లాపం’ అనే పుస్తకంతో రైటర్‌గా కూడా తన ప్రతిభ చాటుకుంది వారియర్. ‘సల్లాపం’ తన జ్ఞాపకాల సమాహారం. వీణ వాయించడం నేర్చుకున్న వారియర్ ఎన్నో వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మంజు వారియర్ బహుముఖ ప్రతిభకు మరోసారి ఫిదా అయ్యారు అభిమానులు. సంతోషమే నా బలం ప్రాజెక్ట్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా... ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తాను. సంతోషమే నా బలం. నా జీవితంలో ఎప్పుడూ ఏది ప్లాన్ చేసుకోలేదు. అయితే మంచి విషయాలు నా దారిలో ముందుకు వచ్చి కనిపిస్తాయి. వాటితో కలిసి ప్రయాణిస్తాను. సాహిత్య కార్యక్రమాల్లో మాట్లాడడానికి ముందు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చెప్పబోతున్నానో, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో... ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటాను. – మంజు వారియర్ -
ఇల్లే నందనవనం.. టెర్రస్ గార్డెనింగ్‌తో ఎన్నో ఉపయోగాలు
గేటు తీయగానే ఇంట్లో యజమాని కంటే ముందు మొక్కలు పలుకరిస్తాయి. ఎటుచూసినా సుగంధాలు వెదజల్లే వివిధ రకాల పూల మొక్కలు..కనువిందు చేసే రంగురంగుల పుష్పాలు.. సంపూర్ణ ఆరోగ్యానిచ్చే సేంద్రియ ఎరువులతో పండించిన కాయగూరలు, పండ్ల మొక్కలు దర్శనమిస్తాయి. రెండంతస్తుల భవనం..ఎటుచూసినా పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఒంగోలు సంతపేటలోని డి.విజయలక్ష్మి ఇంటి వద్ద కనిపించే దృశ్యాలు ఇవి. తొలి నాళ్లలో పూలమొక్కలు పెంచడం అలవాటు చేసుకున్న ఆమె సేంద్రియ ఎరువులతో సహజసిద్ధంగా రకరకాల కాయగూరలు,ఆకుకూరలు,పందిరి కాయగూరలు..వివిధ రకాల పండ్లను పండిస్తున్నారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలం మొదలు భవనానికిరువైపులా ఉన్న స్థలంలో..మొదటి, రెండో అంతస్తుకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న మెట్ల పైన.. రెండో అంతస్తులో 1000 చదరపు అడుగుల స్థలంలో మొక్కలు పెంచుతూ నందన వనంగా మార్చేశారు. ఆమె భర్త చెంచురామిరెడ్డి. వృత్తి రీత్యా డాక్టర్. ఇంట్లో నిత్యం వండుకునే ఆకుకూరలు..కాయగూరలు అన్నీ మేము పండించేవే.. రోజూ పూసే పూలతో దేవుడి గది అంతా నిండిపోతుందని మురిసిపోతూ చెబుతున్నారు. ఇలా ఒక్క విజయలక్ష్మే కాదు నగరంలో వందలాది మంది ఇంటి పంటలపై ఆసక్తి చూపిస్తూ తమ పెరట్లో రకరకాల మొక్కలు పెంచుతున్నారు. సాక్షిప్రతినిధి, ఒంగోలు: ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉంటున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో చాలా ఇళ్లలో పెరటి సాగు కనిపిస్తుంది. కూరగాయల సాగు ఏర్పాటు చేసుకుని స్వయంగా కూరగాయలు పండించుకుంటున్నారు. ఈ ఒక్క ఆలోచన వారి కుటుంబానికి సరిపడా పౌష్టికాహారం అందిస్తోంది. ఇంటి పైనే కూరగాయలు, పూలు, పండ్లు పండిస్తూ వాటినే వినియోగిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర, తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీల నుంచి రకరకాల పూలు..పండ్ల మొక్కలను తెచ్చుకుంటున్నారు. అలాగే రకరకాల కాయగూరలకు సంబంధించిన విత్తనాలను వివిధ పట్టణాల నుంచి తెచ్చుకుంటున్నారు. ఇంటి పంటలపై ఆసక్తి ఉన్న హైదరాబాద్‌కు చెందిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి నగరంలోని చాలా మందికి ఉచితంగా విత్తనాలను అందజేస్తున్నారు. అంతేకాకుండా మొక్కల పెంపకంపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇంటిపంటలో పెంచుతున్న మొక్కలు ఇవి.. నగరంలో చాలా మంది ఇళ్లలో ఎక్కువగా పూలు, ఆకు కూరలు, కూరగాయలు, రకరకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. వివిధ రకాల క్రోటన్స్, మందారం, బంతి, మల్లి, సన్నజాజి, గులాబి, తులసి, పత్తి మందారం, సంపంగిలతో పాటు బొప్పాయి, జామ, అరటి, మామిడి, సపోట, దానిమ్మ, ఆపిల్‌ను పండిస్తున్నారు. అలాగే బెండ, అరటి, దొండ, బీర, కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, టమోట, పచ్చిమిర్చి, గోరు చిక్కుడు, పందిరి చిక్కుడు, మునక్కాయలు తదితర కాయగూరలతో పాటు తోటకూర, మెంతికూరలను సైతం సాగుచేస్తున్నారు. ప్రతి రోజూ గంట నుంచి రెండు గంటల శ్రమ.. ఇంట్లో మొక్కలు పెంచడం కోసం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం లేవగానే మొక్కలకు నీళ్లు పడతారు. మొక్కలకు ఏవైనా చీడ, పీడలు ఆశిస్తే వాటిని తొలగించి అవసరమైన చోట సహజసిద్ధ వనరులతో తయారు చేసిన మందులను స్ప్రే చేస్తారు. చాలా మంది సొంతంగా జీవామృతాన్ని, వేపనూనె, పిట్టు, పిడకలను తయారు చేసుకుంటున్నారు.మరికొందరు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు. అలాగే నగరంలోని గోశాల నుంచి ఆవు ఎరువు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గేదె ఎరువులను సేకరిస్తున్నారు. రెండు, మూడు నెలలకొకసారి మొక్కలన్నింటినీ అవసరమైన మందులు జల్లుతారు. ఈ ప్రక్రియ ఒకరోజు పడుతుంది. ఇలా చెట్లను సంరక్షిస్తూ తన ఇంటి పరిసరాలను ఆహ్లాదంగా ఉంచుతూ.. ఇంట్లోకి ఆరోగ్యకరమైన పండ్లను, కూరగాయలను పండించుకుంటున్నారు. సంతపేట విజయలక్ష్మి ఇంట్లో వివిధ రకాల మందారం మొక్కలు ఉన్నాయి. అందులో పత్తి మందారం వెరీ స్పెషల్. ఇది తెలుపు రంగులో పూస్తుంది. మధ్యాహ్నానికి లేత పింక్ కలర్లోకి మారుతుంది. సాయంత్రానికి ముదరు పింక్ కలర్లోకి మారుతుంది. ఇలాంటి ఆసక్తి కలిగించే పూల మొక్కలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఆపిల్.. ఆపిల్ మొక్కను పెంచేందుకు సుకన్య ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముందుగా ఆపిల్ విత్తనాలను 15 రోజుల పాటు ఫ్రిజ్డ్‌లో ఉంచారు. మొలక వచ్చాక వాటిని కోకోపిట్లో ఉంచి తర్వాత కుండీలో పెట్టారు. మూడు సంవత్సరాల నుంచి దీనిని పెంచుతున్నారు. దీనిని తొట్టెలోంచి తీసి భూమిలో పాతాలి. ఐదు నుంచి ఏడేళ్లు వచ్చాక కాయలు కాస్తుందని చెబుతున్నారు సుకన్య. ప్రకాశం మిద్దెతోటల పెంపకం గ్రూప్.. ఇంటి పంటలు పండించే వారి కోసం నగరంలో ‘ప్రకాశం మిద్దెతోటల పెంపకం’ అనే ప్రత్యేకమైన గ్రూపును ఏర్పాటు చేశారు. నగరంలోని మారుతీనగర్‌కు చెందిన ఆలపాటి సుకన్య అడ్మిన్‌గా ఉన్నారు. ఆమెతో పాటు సంతపేటకు చెందిన డి.విజయలక్ష్మి ప్రధానంగా ఉంటూ ఇంటి పంటలు పండించే వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ గ్రూప్‌లో ఇప్పటి వరకూ 130 మందికి పైగా సభ్యులు ఉన్నారు. వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. హైదరాబాద్ నుంచి రఘోత్తమరెడ్డి, రిటైర్డ్ బ్యాంకు ఆఫీసర్ అప్పారావు తదితరులను తీసుకువచ్చి సలహాలు సూచనలు ఇప్పిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ఈ గ్రూపు నడుస్తోంది. ఇంటి పంటలపై ఆసక్తిని పెంచేందుకు నిరంతరం సమావేశాలు నిర్వహిస్తామని అడ్మిన్ సుకన్య చెబుతున్నారు. ఐదేళ్ల నుంచి.. మొదట్లో పూల మొక్కలు పెంచా. ఆ తర్వాత సేంద్రియ ఎరువులతో ఇంట్లోనే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు పెంచుతున్న విధానాన్ని తెలుసుకున్నా. వాటి పెంపకంపై ఆసక్తి పెరిగింది. రకరకాల పూల మొక్కలతో పాటు కాయగూరలు, పండ్లను పెంచుతున్నా. రెండో అంతస్తులో వీటిని పెంచుతున్నా. తొలినాళ్లలో వీటిని సంరక్షించేదాన్ని. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంట్లో పనిచేస్తున్నా భార్య, భర్తలు ఇద్దరూ నాలుగు నెలలుగా మొక్కలు సంరక్షిస్తున్నారు. సహజసిద్ధమైన ఎరువులతో పండిస్తున్న కూరగాయలు తినడంతో సంతృప్తినిస్తోంది. – డి.విజయలక్ష్మి, సంతపేట, ఒంగోలు సొంతంగా ఎరువుల తయారీ.. మామగారు ఆలపాటి సత్యనారాయణ పొగాకు వ్యాపారి. ఆయన బెంగళూరు నుంచి రకరకాల పూల మొక్కలను తీసుకొచ్చేవారు. అలా ఇంట్లో మొక్కలు పెంచడం అలవాటైంది. క్రమంగా కాయగూరలు, పండ్ల మొక్కలు పెంచడం అలవాటు చేసుకున్నా. కిచెన్ వేస్ట్‌తో ఎరువులు తయారు చేస్తున్నా. జీవామృతాన్ని కూడా సొంతంగా తయారు చేసుకుంటున్నా. సేంద్రియ ఎరువులను సైతం తయారు చేస్తున్నా. అమెరికాలో ఉంటున్న కుమారుడు సైతం రకరకాల కాయగూరలను పెంచుతున్నారు. పెరటి మొక్కల పెంపకంపై నగరవాసులకు ఆసక్తిని పెంచేందుకు మూడేళ్ల కిందట ప్రత్యేక గూప్ను ఏర్పాటు చేశాం. ప్రసుతం 130 మంది సభ్యులు ఉన్నారు. రానున్న రోజుల్లో గ్రూప్‌ను మరింత విస్తరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నాం. – ఆలపాటి సుకన్య, మారుతీనగర్, ఒంగోలు ఎన్నో ఉపయోగాలు.. పూల మొక్కలతో పాటు సుందరీకరణ మొక్కలు పెంచడం ఆహ్లాదాన్ని ఇస్తుంది. కూరగాయల సాగు చేయడం ద్వారా రసాయనాలతో పండే కూరగాయలకు దూరంగా ఉంటూ మన చెట్లకు పండే కూరగాయలు తింటూ ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. పండ్ల మొక్కలు పెంచడం ద్వారా రసాయనాలు లేని పండ్లను తినొచ్చు. మార్కెట్లో దొరికే పండ్లలో రసాయనాలతోనే పెంచి రసాయనాలతోనే వారిని పండేలా చేస్తారు. దీంతో అందులో పోషకాలు అన్ని పోతాయి. ఇలా మన ఇంట్లో పండిన పండ్లను తినడం ద్వారా అందులో ఉండే పోషకాలన్నీ లభిస్తాయి. -
పచ్చదనంపై ప్రేమ, ఏకంగా డబుల్ డెక్కర్ గార్డెన్‌నే పెంచేస్తోంది
పచ్చదనంతో కళకళలాడే పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు. చాలామందికి చిన్నతనమంతా పల్లెల్లోనే గడుస్తుంది. ఇప్పటి పిల్లలకు ఆ అవకాశం లేదు. పల్లెటూళ్లంటే పండగలు, పబ్బాలు, సెలవలు గడపడానికి వెళ్లే పర్యాటక స్థలాలుగా భావిస్తున్నారు. అరవైపదుల వయసు వారు మాత్రం పల్లెల మట్టివాసనలు, పచ్చదనం పరిమళాలను ఇప్పటికీ కోరుకుంటూనే ఉన్నారు. ఈ కోవకు చెందిన నీలిమా దింగ్రా... తన చిన్ననాటి పచ్చదనాన్ని ఆస్వాదించేందుకు ఏకంగా డబుల్ డెక్కర్ గార్డెన్‌నే పెంచేస్తోంది. తనలాగా పచ్చదనాన్ని ఆస్వాదించాలనుకునేవారికీ సలహాలు సూచనలు ఇస్తూ వారితో మొక్కలు నాటిస్తోంది. అరవై ఏళ్ల వయసులో ఇవన్నీ చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది నీలిమా దింగ్రా. ఢిల్లీకి చెందిన నీలిమా దింగ్రా స్టాండర్డ్ సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటర్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్. దీని విలువ కోట్లలోనే ఉంటుంది. వ్యాపార భాగస్వామితో కలిసి, రూ.75 లక్షల పెట్టుబడితో నీలిమ దీనిని ప్రారంభించింది. కొద్దిసంవత్సరాల్లోనే కంపెనీని లాభాల బాట పట్టించింది. డిల్లీలో ప్రధాన కార్యాలయంతో పాటు, ముంబైలో మరో రెండు కార్యాలయాలు నిర్వహిస్తూ సక్సెస్‌పుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది. ఇంతపెద్ద వ్యాపారం చూసుకునేవారికి ఏమాత్రం తీరిక దొరికినా.. వయసు రీత్యా కాస్త విశ్రాంతి తీసుకుంటారు. కానీ నీలిమ మాత్రం ఇంట్లో డబుల్ డెక్కర్ గార్డెన్‌ను పెంచుతూ అబ్బురపరుస్తోంది. చిన్నప్పటిలా ఉండాలని... నీలిమ చిన్నప్పుడు హర్యాణాలోని రోహ్తక్లో పెరిగింది. అక్కడ ఎటుచూసిన పచ్చదనమే కనిపించేది. స్కూలు నుంచి రాగానే జామ చెట్టు కింద కూర్చుని అన్నం, స్నాక్స్ వంటివి తినేది. ఆకుపచ్చని పరిసరాల్లో పెరగడం వల్ల మొక్కలపైన ఎనలేని మక్కువ ఏర్పడింది. పెద్దయ్యి చదువులు, పెళ్లితో పెద్దపట్టణంలో స్థిరపడింది. అభివృద్ధి పేరుతో ఎక్కడ చూసిన కాంక్రీట్ నిర్మాణాలే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ షో కోసం పెంచుతున్న ఒకటి రెండు మొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. అందరికీ ప్రాణవాయువు ఇచ్చేంత పచ్చదనం మచ్చుకైనా కనిపించడంలేదు. పచ్చదనాన్ని ఇష్టపడే నీలిమ ఏ మాత్రం సమయం దొరికినా దగ్గర్లోని పార్క్‌కు వెళ్లేది. చల్లని సాయంత్రాల్లో పార్క్‌లో నడుస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉండేది తనకు. అయితే కొద్దిరోజులకు మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. దీంతో 2015 నుంచి పార్క్‌కు వెళ్లడం మానేసింది. పార్క్‌లో నడిచే సమయాన్నీ ఇంట్లో మొక్కలు నాటడానికి కేటాయించింది. ఇంట్లో ఒక మూలన కొద్దిపాటి స్థలంలో విత్తనాలు వేసింది. అవి చక్కగా మొలకెత్తడంతో ఆమె గార్డెన్‌ను విస్తరించడం మొదలు పెట్టింది. ఇలా విస్తరిస్తూ రెండు అంతస్తుల్లో పచ్చటి గార్డెన్‌ను అభివృద్ది చేసింది. ఈ డబుల్ డెక్కర్ టెర్రస్ గార్డెన్‌ను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో నిర్వహించడం విశేషం. ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ సమయం కేటాయిస్తూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అందమైన టెర్రస్ గార్డెన్‌ను నిర్వహిస్తోంది. పెంచుతూ పంచుతోంది.. తన డబుల్ డెక్కర్ గార్డెన్ పచ్చదనంతో కళకళలాడుతుండడం నీలిమకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సంతోషంతో మొక్కలను ఇతరులకు ఉచితంగా అందించేది. తన గార్డెన్లో పెరిగిన మొక్కల పిలకలు, అంటుకట్టడం ద్వారా వచ్చిన కొత్త మొక్కలను తెలిసినవారికి, గుళ్లకు ఇస్తోంది. ఇలా ఇప్పటి దాకా వెయ్యికి పైగా మొక్కలను పంచింది. నీలిమ గార్డెన్ చూసిన వారంతా మొక్కలు చక్కగా పెరగాలంటే ఏంచేయాలంటూ అని అడిగి మరీ నీలిమ దగ్గర సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఆసక్తితో శాంతి... ఇతరులు చిట్కాలు, సూచనలు తీసుకోవడం గమనించిన నీలిమ గార్డెనింగ్ జ్ఞానాన్నీ మరింతమందికి పంచాలన్న ఉద్దేశంతో ‘శాంతి క్రియేషన్స్’ పేరిట యూ ట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి గార్డెనింగ్ చిట్కాలు చెబుతోంది. నెటిజన్లు అడిగే సందేహాలను నివృత్తి చేస్తోంది. ఎక్కువ స్థలం లేనివారు వర్టికల్ గార్డెన్‌ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, చీడపీడల నుంచి మొక్కలను ఎలా కాపాడుకోవాలి. తక్కువ ఖర్చులో అందమైన గార్డెన్‌ను ఎలా పెంచుకోవాలి, వంటి సందేహాలకు చక్కని సలహాలు ఇస్తోంది. ఆరుపదుల వయసులో పచ్చదనంతో బిజీగా ఉంటూ నేటియువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది. -
టెర్రస్ గార్డెన్ అందరికి మేలు బాట..!
-
పెరటి తోటల పెంపకంలో మెళకువలు
-
ఆహార సార్వభౌమత్వమే ఔషధం!
ఓక్లాండ్.. యూఎస్‌లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ పెద్ద నగరం. అర్బన్ అగ్రికల్చర్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న స్ఫూర్తి కథనాల్లో ఓ విలక్షణమైన కథ ఓక్లాండ్లో ఉంది. స్థానిక నల్లజాతీయులు, పేదల ఆహార, ఆరోగ్య, జీవన స్థితిగతులు.. వాటి లోతైన వలసవాద అణచివేత మూలాల గురించి సంవేదన, సహానుభూతి కలిగిన వైద్యులు, రైతులు, పెద్దలు, పర్యావరణవేత్తలు, విద్యావేత్తలు, కథకులు, యువకళాకారులు సమష్టిగా దీన్ని నడిపిస్తున్నారు. ఓక్లాండ్లోని టెమెస్కల్లో విశాలమైన ‘హోల్ ఫుడ్స్’ షాపింగ్ మాల్ ఉంది. దీని ఐదో అంతస్థు పైన (దాదాపు ఎకరం విస్తీర్ణం)లో అర్బన్ టెర్రస్ గార్డెన్ ఏర్పాటైంది. యువ వైద్యురాలు, సామాజిక కార్యకర్త డా. రూపా మర్య ‘డీప్ మెడిసిన్ సర్కిల్’ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థే ‘రూఫ్‌టాప్ మెడిసిన్ ఫామ్’ను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసింది. 25 వేల చదరపు అడుగుల ఈ రూఫ్‌టాప్ మెడిసిన్ ఫామ్ వ్యవసాయ పనుల డైరెక్టర్‌గా అలైనా రీడ్, పర్యావరణ విషయాల డైరెక్టర్‌గా బెంజమిన్ ఫాహ్రేర్ పనిచేస్తూ మంచి దిగుబడి తీస్తున్నారు. లెట్యూస్, పాలకూర, ఆకుకూరలు, ఔషధ మొక్కలు, పూల మొక్కలు, టొమాటో, క్యారట్ సాగు చేస్తున్నారు. గార్డెన్ చుట్టూతా పొద్దుతిరుగుడు మొక్కలున్నాయి. మందులతో పాటు అమృతాహారం రూఫ్‌టాప్ మెడిసిన్ ఫామ్‌లో రసాయనాల్లేకుండా సేంద్రియంగా పండించిన ఆహారాన్ని అనేక మార్గాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ ఫామ్ పక్కనే ఉన్న పిల్లల వైద్యశాలకు వచ్చే తల్లులకు మందులతో పాటు సేంద్రియ ఆకుకూరలను పంచుతుండటం విశేషం. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారం తినగా వచ్చిన జబ్బులను తగ్గించడానికి మందులు మాత్రమే చాలవు. అమృతాహారం కూడా తినాలి. అందుకే ఈ ఆహారాన్ని చిల్డ్రన్స్ క్లినిక్ ఫుడ్ ఫార్మసీ ద్వారా పిల్లల తల్లులకు ఉచితంగా ఇస్తున్నాం అంటున్నారు డా. రూప. ఫామ్‌లో పండించే ఆహారాన్ని పూర్ మ్యాగజైన్, మామ్స్ 4 హౌసింగ్ , అమెరికన్ ఇండియన్ కల్చరల్ డిస్ట్రిక్ట్, టెండర్లాయిన్ నైబర్‌హుడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, యుసిఎస్ఎఫ్ వంటి సామాజిక సేవా సంస్థల ద్వారా ఈస్ట్ ఓక్లాండ్లోని పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ అర్బన్ ఫామ్ ద్వారా పాత విత్తనాలతో మనదైన ఆహారాన్ని ఎలా పండించుకోవాలో నేర్పిస్తున్నారు. స్థానిక వ్యవసాయ సంస్కృతి మూలాలు, పర్యావరణం, భూమితో ఉన్న విడదీయరాని అనుబంధాన్ని చెప్పి యువతను, మహిళలను, పిల్లలను ఇంటిపంటల సాగుకు ఉపక్రమింపజేస్తోంది ఈ ఫామ్. అర్బన్ అగ్రికల్చర్లో విశేష కృషి చేస్తున్న 25 సంస్థలకు అమెరికా వ్యవసాయ శాఖ ఇటీవల 70 లక్షల డాలర్లను గ్రాంటుగా ఇచ్చింది. ఆ జాబితాలో రూఫ్‌టాప్ మెడిసిన్ ఫామ్ కూడా ఉంది. క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ పౌష్టిక విలువలతో కూడిన ఆహారం మానవులందరి హక్కు.. ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఆహారం సంపన్నులకు మాత్రమే అందుతోంది.. పేదవారికి దక్కుతున్నది విషరసాయన అవశేషాలతో కూడిన ‘ఆహారం’ మాత్రమే. ఇది వారి పొట్టలోని సూక్ష్మజీవులను నశింపజేసి క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్‌ని కలిగిస్తోందన్నారు డా. రూపా మర్య. మన ఆహార వ్యవస్థ విషతుల్యమైపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా రసాయనాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని నల్లజాతీయులకు అందించటం ద్వారా తరతరాల వివక్షను దేహంలో నుంచి, మనసు అంతరాల్లో నుంచి కూడా నయం చేయొచ్చు. ఆహార సార్వభౌమత్వం, సంఘీభాలకు ఆ ఔషధ శక్తి ఉంది. – డా. రూపా మర్య, రూఫ్‌టాప్ మెడిసిన్ ఫామ్ వ్యవస్థాపకురాలు,ఓక్లాండ్, యు.ఎస్.ఎ. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ prambabu.35@gmail.com -
హై సొసైటీ సాగుగా మారిన మిద్దె తోటలు
-
తక్కువ బడ్జెట్ తో మిద్దె తోట సాగు
-
ఖర్చు లేకుండా.. మిద్దె తోటతో ఆరోగ్యం
ప్రజల అవసరాల దృష్ట రోజు రోజుకు కాంక్రీట్ మయంగా మారుతున్నాయి పట్టణాలు. పట్టణ ప్రజలకు సరిపడా కూరగాయలు లభించడం లేదు అని చెప్పవచ్చు. దింతో ఇప్పుడిప్పుడే పట్టణ ప్రజలు తమ బిల్డింగ్ ల మీద మిద్దె తోటల పెంపకం చేపట్టడంపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం... సిద్దిపేట జిల్లా ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా సిద్దిపేటలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దింతో పట్టణంలో బహుళ అంతస్తుల బిల్డింగుల నిర్మాణం కావడంతో, పట్టణం కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది. ఇప్పుడిప్పుడే ప్రజలు పచ్చదనం వైపు అడుగులు వేస్తూ, తమ బిల్డింగ్ ల మీద మిద్దె తోటల పెంపకం చేపట్టారు. సిద్దిపేట పట్టణంలో రోజురోజుకు మిద్దె తోటల పెంపకం కల్చర్ పెరిగిపోతుంది. కరోనా మానవుని జీవితంలో పెను మార్పులకు కారణమయ్యింది. పట్టణ ప్రజలలో తమ ఆరోగ్యాల పై శ్రద్ధ పెరగటంతో, ఫ్రెష్ గా దొరికే కూరగాయలను తినడానికి ఇష్టపడుతున్నారు. సిద్దిపేట పట్టణంలో కాముని అశోక్, రాజేశ్వరి అనే ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు , మిద్దె తోటను పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అశోక్ ఇల్లు పచ్చని చెట్లతో ఒక పొదరిల్లుగా దర్శనమిస్తుంది. కరోనా సమయంలో యూట్యూబ్ లో చూసి మిద్దె తోటను పెంచడం జరిగిందని కాముని అశోక్ తెలిపారు. ఇండ్లలో పాడైన, పనికిరాని వస్తువుల తో తక్కువ ఖర్చులోనే మిద్దే తోటను ఏర్పాటు చేయడం జరిగిందని అశోక్ తెలిపారు. ప్లాస్టిక్ బాటిల్స్, నూనె క్యాన్లు,పాడైన వస్తువులలో మట్టిని నింపి కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు పెంచడం జరుగుతుందని అశోక్ తెలిపారు. మిద్దె తోటలో పాలకూర, కొత్తిమీర, మెంతం, పుదీనా, చుక్కకూర, తోటకూర, ఎర్ర బచ్చలి, టమాట, వంకాయ, బెండకాయ, మిర్చి, క్యాబేజీ, క్వాలి ఫ్లవర్, వంటి అన్ని రకాల కూరగాయలు పండించడం తో పాటు మునిగే చెట్టు, కరివేపాకు చెట్టు, నిమ్మచెట్టు పెంచడం జరుగుతుందని అశోక్ దంపతులు తెలిపారు. శ్రీనివాస్ అనే మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మిద్దె తోటను పెంచుతున్నారు. తమ మిద్దే తోటలో అన్ని రకాల కూరగాయలు పండించడంతో, తమ ఇంటి అవసరాలకు సరిపోవుగా, ఇరుగుపొరుగు వారి కూడా కూరగాయలు ఇవ్వడం జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు. మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో ఏర్పాటుచేసిన స్వచ్ఛ బడి పట్టణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్వచ్చ్ బడిలో తయారైన, వర్మి కంపోస్టు ఎరువును కూరగాయల మొక్కలకు వేయడం జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు. వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, మిద్దె తోటల పెంపకం పై కూడా స్వచ్ఛ బడిలో అవగాహన కల్పించడం జరుగుతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. మేమంతా ప్రభుత్వ ఉపాధ్యాయులం కావడంతో, సాయంకాలం వేళ మిద్దె తోటలో ఒక గంటసేపు గడపడంతో స్వచ్ఛమైన గాలితో పాటు ప్రకృతి వనంలో ఉన్నట్టు అనిపిస్తుందని ఉపాధ్యాయురాలు రాజేశ్వరి తెలిపారు. వర్మి కంపోస్ట్ తో పండించిన కూరగాయలు ఫ్రెష్‌గా, ఎంతో రుచికరంగా ఉంటాయని ఆమె అన్నారు. స్వచ్ఛమైన కూరగాయలు తినడంతో తాను 6 నెలలకు ఒక్కసారి కూడా టాబ్లెట్ వాడడం చాలా తక్కువ అని రాజేశ్వరి తెలిపారు. మనసుంటే మార్గం ఉన్నట్లు,పట్టణ ప్రజలు తమ ఇంటి వద్ద ఖాళీ ప్రదేశాలలో కూరగాయ మొక్కలు పెంచుకోవాలని రాజేశ్వరి సూచించారు. -
గ్రీన్ లైఫ్: అవును... మిద్దెలపై డబ్బులు కాస్తాయి!!
ఆరోజు మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొని ఇంటికి తీసుకువచ్చింది కేరళలోని కొట్టాయంకు చెందిన రెమాదేవి. కూరగాయలను కడుగుతున్నప్పుడు ఒకరకమైన రసాయనాల వాసన వచ్చింది. ఆ సమయంలో పిల్లలు, వారి భవిష్యత్ గుర్తుకు వచ్చింది. అదే సమయంలో తాను ఒక నిర్ణయం తీసుకుంది... ‘ఇంటికి అవసరమైన కూరగాయలు ఇంటిదగ్గరే పండించుకుంటాను’ అలా మిద్దెతోటకు శ్రీకారం చుట్టింది రెమాదేవి. అమ్మమ్మ రంగంలోకి దిగింది. సేంద్రియ వ్యవసాయంలో అమ్మమ్మది అందెవేసిన చేయి. ఆమె సలహాలు, సూచనలతో మిద్దెతోట పచ్చగా ఊపిరిపోసుకుంది. కొంత కాలానికి... ఇంటి అవసరాలకు పోగా మిగిలిన కూరగాయలను అమ్మడం మొదలుపెట్టారు. తమకు ఉన్న మరో రెండు ఇండ్లలోనూ మిద్దెతోట మొదలుపెట్టింది రెమాదేవి. అలా ఆదాయం పెరుగుతూ పోయింది. మిద్దెతోటపై ఆసక్తి ఉన్న వాళ్లు రెమాను రకరకాల సలహాలు అడిగేవారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ‘రెమాస్ టెర్రస్ గార్డెన్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. ‘మిద్దెతోటకు పెద్దగా ఖర్చు అక్కర్లేదు’ అని చెబుతూ ఆ తోటపెంపకానికి సంబంధించిన ఎన్నో విషయాలను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చెబుతుంది. వంటగది వ్యర్థాలతో మనకు కావల్సిన ఎరువులు ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోల ద్వారా చూపుతుంది. దీంతోపాటు సోషల్ మీడియా ఫార్మింగ్ గ్రూప్స్ ద్వారా విత్తనాలు అమ్ముతుంది రెమాదేవి. కేవలం విత్తనాల అమ్మకం ద్వారానే నెలకు 60,000 రూపాయల ఆదాయం అర్జిస్తుంది. రెమాదేవిని అనుసరించి ఎంతోమంది మిద్దెతోటలను మొదలుపెట్టి రసాయన–రహిత కూరగాయలను పండించడమే కాదు, తగిన ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు. మంచి విషయమే కదా! -
ఆరోగ్యం మన మిద్దె తోటలోనే ఉంది! క్యాన్సర్‌ను జయించి..
ఆరోగ్యం ఆసుపత్రిలో లేదు. మన మిద్దె తోటలోనే ఉంది. మన తినే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను రసాయనాల్లేకుండా మనమే ఇంటిపైన పండించుకుందాం. నలుగురం చేయీ చేయీ కలిపి మిద్దె తోటలు సాగు చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిద్దాం.. అని చెప్పటమే కాదు.. మనసా వాచా కర్మణా ఆచరిస్తున్నారు కొల్లి కృష్ణకుమారి. గుంటూరు ఎన్జీవో కాలనీకి చెందిన బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగిని అయిన ఆమె 2020 జనవరి నుంచి 1400 చ.అ.ల మిద్దె తోట సాగు చేస్తున్నారు. ఉల్లి, వెల్లుల్లి, క్యారెట్ తప్ప మిగతావన్నీ దాదాపు రోజూ తమ ఇంటిపైన పండించుకున్నవే తింటున్నారు. క్యాన్సర్‌ను జయించిన ఆమె ఉద్యోగవిరమణ తర్వాత ఉద్యమ స్ఫూర్తితో సేంద్రియ మిద్దెతోటలను విస్తరింపజేస్తున్నారు. సంఘ బలం.. ఉత్సాహం.. రిటైరైన ఉద్యోగులు, పెద్దవాళ్లు (సెకండ్ యూత్) కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచడం హాబీగా మార్చుకుంటున్నారు. సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సంస్కృతిని వ్యాప్తిలోకి తెచ్చే లక్ష్యంతో సంఘాలు కూడా ఏర్పాటవుతున్నాయి. మిద్దెతోటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు సహా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ మిద్దెతోటల పెంపకందారుల సంఘాలు ఏర్పాటయ్యాయి. ‘గుంటూరు మిద్దెతోటలు’ పేరుతో ఏర్పాటు చేసిన రెండు వాట్సప్ గ్రూప్‌లలో 659 మందికి పైగా ఉన్నారు. 2021 నుంచి గుంటూరులో మిద్దె తోటల కార్యకలాపాలను కృష్ణకుమారి నేతృత్వంలో వలంటీర్ల బృందం అత్యంత క్రియాశీలంగా నిర్వహిస్తుండటం విశేషం. ఉద్యానవన శాఖ అధికారుల సహకారంతో ప్రతి నెలా అవగాహన కల్పిస్తున్నారు. గుంటూరు మిద్దెతోటలు పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. ‘గుంటూరు మిద్దె తోటల పెంపకందారుల సంక్షేమ సంఘం(జి.ఎం.ఎస్.ఎస్.)’ లాభాపేక్షలేని సంస్థగా రిజిస్టర్ అయ్యింది. కృష్ణకుమారి ఆమె అధ్యక్షురాలిగా, మరికొందరు ఉత్సాహవంతులైన విశ్రాంత బ్యాంకు అధికారులు, వైద్యులతో కూడిన కార్యవర్గం ఏర్పాటైంది. సంఘ వార్షిక సభ్యత్వ రుసుము రూ. 500. నెలవారీగా సమావేశమవుతూ వారికి కావాల్సిన మొక్కలను కడియం, కుప్పం నర్సరీల నుంచి తెప్పించి సభ్యులకు అందిస్తున్నారు. సంఘం జమాఖర్చులపై ఆడిటింగ్ నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తుండటం ప్రశంసనీయం. ఉత్సాహంగా వాలంటీర్ల సేవలు సాధారణ మొక్కలతో పోల్చితే ఎన్నో రెట్లు ఎక్కువ దిగుబడినిచ్చే గ్రాఫ్టెడ్ మొక్కల అవసరం మేడపైన కుండీలు, మడుల్లో తక్కువ స్థలాల్లో కూరగాయలు పెంచుకునే వారికి ఎంతో ఉందంటారు కృష్ణకుమారి. అడవి వంగతో అంటుకట్టిన(గ్రాఫ్ట్ చేసిన) వంగ, టమాటో, మిరప, సొర మొక్కలతో పాటు పర్పుల్ క్యాబేజి, ఎర్రబెండ, ఎల్లో/పర్పుల్ కాలిఫ్లవర్ వంటి అరుదైన, నాణ్యమైన మొక్కలను నర్సరీల నుంచి తెప్పించి మిద్దెతోట పెంపకందారులకు మూడింట ఒక వంతు ధరకే అందిస్తున్నారు. కృష్ణకుమారి, వలంటీర్ల బృందం సఫలీకృతమయ్యారు. గూగుల్ ఫామ్స్, ఎక్సెల్ షీట్ ద్వారా సభ్యులకు కావాల్సిన మొక్కల ఆర్డర్ తీసుకొని మొక్కలను తెప్పిస్తున్నారు. సభ్యులందరికీ ముద్రిత ఫొటో గుర్తింపు కార్డులు ఇచ్చారు. 50 మంది వాలంటీర్లు ఉత్సాహంగా సేవలందిస్తుండటం వల్ల సంఘాన్ని చురుగ్గా నిర్వహించ గలుగుతూ ఉన్నామని కృష్ణకుమారి చెప్పారు. గత రెండేళ్లలో మిరప రైతులు పురుగుమందులను చాలా ఎక్కువగా వాడాల్సి వస్తోందని అంటూ.. రైతులను తప్పుపట్టలేమని, వినియోగదారులుగా మన జాగ్రత్తలో మనం ఉండాలని, వీలైనన్ని కూరగాయలను మనమే పండించుకోవాలని కృష్ణకుమారి(94906 02366) అంటున్నారు. – దాళా రమేష్‌బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు ఫోటోలు: గజ్జల రామగోపాలరెడ్డి నిర్వహణ: పంతంగి రాంబాబు చదవండి: ఎకరం భూమి ఉందా? మేకలు, కోళ్లు, ముత్యాలు, పుట్టగొడుగులు.. ఇలా చేస్తే రోజుకు రూ. 1500 ఆదాయం.. ఇంకా.. పెసర, మినుములేనా? బ్రహ్మీ, వస సాగు.. భలే బాగు! ఏడాదికి నికరాదాయం ఎంతంటే..