అర్బన్‌ అగ్రికల్చర్‌ అదుర్స్‌ | Terrace Gardening in Hyderabad | Sakshi
Sakshi News home page

అర్బన్‌ అగ్రికల్చర్‌ అదుర్స్‌

Published Tue, Jun 25 2024 5:44 AM | Last Updated on Tue, Jun 25 2024 5:57 AM

Terrace Gardening in Hyderabad

హైదరాబాద్‌లో పెరుగుతున్న మిద్దె తోటల సాగు

ఇటీవలి కాలంలో వరంగల్, కరీంనగర్‌ లాంటి నగరాలకూ విస్తరణ

కూరగాయల కంటే సేంద్రియ ఆకుకూరల సాగుపై అత్యధికుల ఆసక్తి..

మిద్దె తోటల సాగుదారుల్లో మహిళలు 61%.. యువత 29%

83–89% మందిలో మెండుగా మిద్దె సాగు నైపుణ్యాలు

వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేస్తున్న 84% మంది 

పీజేటీఏయూ విద్యార్థి అధ్యయనంలో వెల్లడి

పుష్కర కాలం క్రితమే ‘ఇంటిపంట’ శీర్షిక ద్వారా ‘సాక్షి’ ప్రచారోద్యమం

నానాటికీ కాంక్రీటు అరణ్యంగా మారిపోతున్న హైదరాబాద్‌ నగరంలో అనేకమంది, ఎక్కువగా సొంత ఇంటి యజమానులు తమ ఇంటి మిద్దె (టెర్రస్‌)ల పైనే వివిధ రకాల సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండిస్తున్నారు. సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెరుగుతున్న కొద్దీ ఈ విధంగా సేంద్రియ ఇంటి పంటలు లేదా మిద్దె తోటల (టెర్రస్‌ కిచెన్‌ గార్డెనింగ్‌) సాగు వైపు మొగ్గు చూపే­వారి సంఖ్య పెరిగిపోతుంది.

నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే విరివిగా ఇలా పంటలు పండిస్తుండగా ఇటీవలి కాలంలో వరంగల్, కరీంనగర్‌ వంటి నగర పాలక సంస్థల పరిధిలోనూ ప్రారంభమై విస్తరిస్తోంది. వాస్తవానికి టెర్రస్‌లపై సేంద్రియ కూరగాయలు, పండ్ల సాగుపై పుష్కర కాలం క్రితమే ‘సాక్షి’ దినపత్రిక ‘ఇంటిపంట’ శీర్షిక ద్వారా ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. వీటి ప్రాధాన్యత విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవగాహన కల్పించింది.

నిపుణులతో ఉచిత శిక్షణా తరగతుల నిర్వహణతో హైదరాబాద్‌ నగరంలో వేలాది మంది సేంద్రియ మిద్దె తోటల సాగులో నైపుణ్యం పొందేలా చేసింది. అయితే ప్రస్తుతం సేంద్రియ ఇంటిపంటలు లేదా మిద్దె తోటలు సాగు చేస్తున్న నగరవాసుల్లో అర్బన్‌ అగ్రికల్చర్‌ (పట్టణ వ్యవసాయం) నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఏయే రకాల పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు? వంటింటి వ్యర్థాలను చెత్తలో పారేయ కుండా కంపోస్టు ఎరువుగా మార్చుకుంటున్న వారి శాతం ఎంత? ఎన్నో ఏళ్లుగా అర్బన్‌ ఫార్మర్‌ (పట్టణ రైతు) గా ఉన్నప్పటికీ వీరిలో లోపిస్తున్న నైపుణ్యాలేమిటి? వంటి పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు ప్రొ.జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ)లోని విస్తరణ విద్యా విభాగానికి చెందిన అగ్రికల్చర్‌ ఎమ్మెస్సీ విద్యార్ధి జి.చరణ్‌ తేజ సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.

3 నగరాల్లో అధ్యయనం
చరణ్‌ తేజ మిద్దె తోటలు విస్తారంగా సాగవుతున్న హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్‌ నగరాల్లో మొత్తం 120 మంది టెర్రస్‌ కిచెన్‌ గార్డెనర్లపై అధ్యయనం చేశారు. ఇందులో అనేక అంశాల్లో సేంద్రియ ఆకుకూరలు సాగుపై ఎక్కువ మంది గార్డెనర్లు ఆసక్తి చూపుతున్నారనేది ఒకటి. కాగా ఈ అధ్యయనానికి సంబంధించి ప్రొఫెసర్లు పి.విజయలక్ష్మి, డా.బి.సవిత, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎ.మీనాతో కలసి చరణ్‌ తేజ రాసిన మూడు పరిశోధనా వ్యాసాలు జర్నల్స్‌లో ప్రచురితం అయ్యాయి. అధ్యయనంలోని ముఖ్యాంశాలు..

మిద్దె సేద్యంలో 51% నడి వయస్కులే
సేంద్రియ ఇంటిపంటలు సాగు చేపట్టిన వారిలో 61% మంది మహిళలు కాగా, మిద్దె తోటలు సాగు చేస్తున్న వారిలో 51% నడి (35–50 ఏళ్ల) వయస్కులు ఉన్నారు. 50 ఏళ్లు దాటిన వారి (20%) కంటే యువజనులే ఎక్కువ (29%).
⇒ సేంద్రియ ఇంటిపంటల సాగుకు సంబంధించిన 20 అంశాల్లో 52% మంది టెర్రస్‌ గార్డెనర్లకు అధిక పరిజ్ఞానం ఉండగా, 36% మందిలో ఒక మోస్తరుగా, 11% మందిలో మరీ తక్కువగా ఉంది. 

⇒  సేంద్రియ ఆహారం ఆవశ్యకతను గుర్తించి మిద్దె తోటల సాగు చేపట్టిన వారిలో 62% డిగ్రీ/ఆపైన చదువుకున్న వారే. చదువు లేని వారు 2%, నిరక్షరాస్యులు 3% మిద్దె తోటలు సాగు చేస్తున్నారు. 
⇒  మిద్దె తోట సాగుదారుల్లో 37% మంది ప్రభుత్వ ఉద్యోగులు, 23% గృహస్తులు,  18% వ్యాపారులు, 16% విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. ప్రైవేటు ఉద్యోగులు చాలా తక్కువగానే ఉన్నారు. కేవలం 6% మందే టెర్రస్‌ సాగు చేస్తున్నారు. ఈ సాగుదారుల్లో మధ్యస్థ స్థాయి వార్షికాదా­యం ఉన్నవారు 56%, అల్పాదాయ వర్గాల వారు 26%, అధికాదాయ వర్గాలు 18% ఉన్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం 
పట్టణాల్లో మిద్దె తోటల సాగును పూర్తిస్థాయిలో ప్రోత్సహించడా­నికి ప్ర­భు­త్వం విధానప­రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోతులు, చీడపీడలు, పక్షు­ల బెడద నుంచి పరిరక్షించు­కో­వడానికి నెట్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పించాలి. చీడపీడలను గుర్తిం­చి, వాటిని అధిగమించే నైపు­ణ్యాలను పెంపొందించటం కోసం అనుభవ­జ్ఞులైన ఉద్యాన అధికారు­లతో అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజల­కు శిక్షణ ఇప్పించాలి. వర్టికల్‌ గార్డెనింగ్‌ నైపు­ణ్యా­­లపై మిద్దె తోటల సాగుదా­రు­లకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పిస్తే టెర్రస్‌ స్థలా­న్ని మరింత ఉత్పాదకంగా వినియోగించుకోవ­టానికి అవకా­శం కలుగుతుంది. – గువ్వల చరణ్‌ తేజ

76 శాతం అనుభవజ్ఞులే
⇒  3 నుంచి 9 ఏళ్ల క్రితం నుంచి ఇంటిపంటల సాగు చేపట్టిన నగరవాసులు ఏకంగా 76% ఉన్నారు. 15 ఏళ్ల అనుభవం ఉన్నవారు 16%, 20–21 ఏళ్ల అనుభవం కలిగిన వారు 7% ఉన్నారు. 
 ⇒ కుటుంబం అంతా కలసి తోట పనులు చేసుకుంటున్నవారు 53% ఉండగా, ఇంట్లో ఎవరో ఒక్కరు ఆసక్తితో చేస్తుంటే.. వారికి అడపా దడపా సాయం చేసే కుటుంబాలు 29%, అరుదుగా సాయం చేసే కుటుంబాలు 17% ఉన్నాయి. 
⇒  మధ్యస్థ విస్తీర్ణంలో ఏర్పాటైన తోటలు 64% కాగా పెద్దవి 26%, చిన్నవి 10% ఉన్నాయి. 

⇒  65% కుటుంబాలు ఆకు కూరలకు అధిక ప్రాధాన్యత (ఎక్కువ విస్తీర్ణంలో) ఇస్తున్నాయి. కూరగాయలే ముఖ్యం అనుకునే వారు 22%, తీగజాతులు ముఖ్యం అనుకుంటున్న వారు 6%, ఔషధ మొక్కలు ముఖ్యం అనుకుంటున్న వారు 4%.. పండ్లను సాగు చేస్తున్న వారు 3% ఉన్నారు. 
⇒ కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, తీగజాతి కూరగాయలు, పువ్వుజాతి కూరగాయలు (క్యాబేజీ వంటివి), పండ్లు, ఔషధ మొక్కలు.. లాంటివన్నీ సాగు చేస్తున్న కుటుంబాలు 53% ఉండగా, మరో 29% కుటుంబాలు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, దుంపకూరలకు పరిమితం అవుతున్నారు.

సొంత కంపోస్టు వాడుతున్న 84% మంది
⇒ మిద్దె తోటల సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే స్లాబ్‌ ద్వారా నీరు లీకయ్యే ప్రమాదం ఉందన్న గ్రహింపు 89% మందికి ఉంది. సారవంతమైన మట్టి మిశ్ర­మం వాడటంలో, వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసుకొని వినియోగించడంలో, చీడపీడలను నియంత్రించుకోవటంలో 85–86 శాతం మందికి పూర్తి అవగాహన ఉండటం విశేషం. 
⇒ ప్రభుత్వ శిక్షణ పొందామని 45% మంది చెప్పారు. మిద్దె తోటల సమాచారం కోసం వాట్సాప్‌పై ఎక్కువగా ఆధారప­డు­తున్నా మన్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ ఉన్నా­యి. రోజుకు రెండు, మూడు గంటలు మిద్దె తోట పనులు చేసుకుంటున్నామని ఎక్కువ మంది చెప్పారు.

ఇవీ లోపాలు
⇒  టెర్రస్‌ గార్డెనింగ్‌ లేఅవుట్‌ గురించి 54% మందికి తెలియదు. కుండీలు, మడుల్లో పంట మార్పిడి చేయాలన్న గ్రహింపు 47 శాతం మందిలోనే ఉంది.
⇒ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మిద్దె తోటను రక్షించుకునే నైపుణ్యం 47% మందికి లోపించింది.

⇒ అదనపు నీరు బయటకు వెళ్లిపోవటానికి కుండీలు, మడులకు అడుగున బెజ్జాలు ఉండాలన్న విషయం తెలియని గార్డెనర్లు 51% ఉన్నారంటే ఆశ్చర్యం కలగకపోదు.
⇒ కోతుల నుంచి పంటలను రక్షించుకోవటం పెద్ద సవాలుగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement