ఓక్‌లాండ్.. యూఎస్‌లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ పెద్ద నగరం. అర్బన్ అగ్రికల్చర్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న స్ఫూర్తి కథనాల్లో ఓ విలక్షణమైన కథ ఓక్‌లాండ్‌లో ఉంది. స్థానిక నల్లజాతీయులు, పేదల ఆహార, ఆరోగ్య, జీవన స్థితిగతులు.. వాటి లోతైన వలసవాద అణచివేత మూలాల గురించి సంవేదన, సహానుభూతి కలిగిన వైద్యులు, రైతులు, పెద్దలు, పర్యావరణవేత్తలు, విద్యావేత్తలు, కథకులు, యువకళాకారులు సమష్టిగా దీన్ని నడిపిస్తున్నారు.
ఓక్‌లాండ్‌లోని టెమెస్‌కల్‌లో విశాలమైన ‘హోల్ ఫుడ్స్’ షాపింగ్ మాల్ ఉంది. దీని ఐదో అంతస్థు పైన (దాదాపు ఎకరం విస్తీర్ణం)లో అర్బన్ టెర్రస్ గార్డెన్ ఏర్పాటైంది. యువ వైద్యురాలు, సామాజిక కార్యకర్త డా. రూపా మర్య ‘డీప్ మెడిసిన్ సర్కిల్’ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థే ‘రూఫ్‌టాప్ మెడిసిన్ ఫామ్’ను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసింది. 25 వేల చదరపు అడుగుల ఈ రూఫ్‌టాప్ మెడిసిన్ ఫామ్ వ్యవసాయ పనుల డైరెక్టర్‌గా అలైనా రీడ్, పర్యావరణ విషయాల డైరెక్టర్‌గా బెంజమిన్ ఫాహ్రేర్ పనిచేస్తూ మంచి దిగుబడి తీస్తున్నారు. లెట్యూస్, పాలకూర, ఆకుకూరలు, ఔషధ మొక్కలు, పూల మొక్కలు, టొమాటో, క్యారట్ సాగు చేస్తున్నారు. గార్డెన్ చుట్టూతా పొద్దుతిరుగుడు మొక్కలున్నాయి.
మందులతో పాటు అమృతాహారం రూఫ్‌టాప్ మెడిసిన్ ఫామ్‌లో రసాయనాల్లేకుండా సేంద్రియంగా పండించిన ఆహారాన్ని అనేక మార్గాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ ఫామ్ పక్కనే ఉన్న పిల్లల వైద్యశాలకు వచ్చే తల్లులకు మందులతో పాటు సేంద్రియ ఆకుకూరలను పంచుతుండటం విశేషం. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారం తినగా వచ్చిన జబ్బులను తగ్గించడానికి మందులు మాత్రమే చాలవు. అమృతాహారం కూడా తినాలి. అందుకే ఈ ఆహారాన్ని చిల్డ్రన్స్ క్లినిక్ ఫుడ్ ఫార్మసీ ద్వారా పిల్లల తల్లులకు ఉచితంగా ఇస్తున్నాం అంటున్నారు డా. రూప.
ఫామ్‌లో పండించే ఆహారాన్ని పూర్ మ్యాగజైన్, మామ్స్ 4 హౌసింగ్ , అమెరికన్ ఇండియన్ కల్చరల్ డిస్ట్రిక్ట్, టెండర్‌లాయిన్ నైబర్‌హుడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, యుసిఎస్‌ఎఫ్ వంటి సామాజిక సేవా సంస్థల ద్వారా ఈస్ట్ ఓక్‌లాండ్‌లోని పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ అర్బన్ ఫామ్ ద్వారా పాత విత్తనాలతో మనదైన ఆహారాన్ని ఎలా పండించుకోవాలో నేర్పిస్తున్నారు. స్థానిక వ్యవసాయ సంస్కృతి మూలాలు, పర్యావరణం, భూమితో ఉన్న విడదీయరాని అనుబంధాన్ని చెప్పి యువతను, మహిళలను, పిల్లలను ఇంటిపంటల సాగుకు ఉపక్రమింపజేస్తోంది ఈ ఫామ్. అర్బన్ అగ్రికల్చర్‌లో విశేష కృషి చేస్తున్న 25 సంస్థలకు అమెరికా వ్యవసాయ శాఖ ఇటీవల 70 లక్షల డాలర్లను గ్రాంటుగా ఇచ్చింది. ఆ జాబితాలో రూఫ్‌టాప్ మెడిసిన్ ఫామ్ కూడా ఉంది.
క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్
పౌష్టిక విలువలతో కూడిన ఆహారం మానవులందరి హక్కు.. ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఆహారం సంపన్నులకు మాత్రమే అందుతోంది.. పేదవారికి దక్కుతున్నది విషరసాయన అవశేషాలతో కూడిన ‘ఆహారం’ మాత్రమే. ఇది వారి పొట్టలోని సూక్ష్మజీవులను నశింపజేసి క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌ని కలిగిస్తోందన్నారు డా. రూపా మర్య. మన ఆహార వ్యవస్థ విషతుల్యమైపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా రసాయనాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని నల్లజాతీయులకు అందించటం ద్వారా తరతరాల వివక్షను దేహంలో నుంచి, మనసు అంతరాల్లో నుంచి కూడా నయం చేయొచ్చు. ఆహార సార్వభౌమత్వం, సంఘీభాలకు ఆ ఔషధ శక్తి ఉంది.
– డా. రూపా మర్య, రూఫ్‌టాప్ మెడిసిన్ ఫామ్ వ్యవస్థాపకురాలు,ఓక్‌లాండ్, యు.ఎస్.ఎ.
– పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్,
సాక్షి సాగుబడి డెస్క్ prambabu.35@gmail.com
Comments
Please login to add a commentAdd a comment