డాక్టర్ అన్షు రాఠీ. ఇల్లు...ఔషధాల హరివిల్లు
డాక్టర్ ప్రిస్కిప్షన్ రాస్తూ... ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీ, టీ లతో రోజును మొదలు పెట్టకండి’ అని చెబితే ఆ కఠోరమైన సూచనను జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. డాక్టర్ ముందు బుద్ధిగా తలూపుతాం. పాటిస్తామని గొంతులో నిజాయితీని ధ్వనింపచేస్తూ బదులిస్తాం.
మరునాడు తెల్లవారి కాఫీ–టీలు తాగిన తర్వాతగానీ ముందురోజు డాక్టర్‌కు ఇచ్చిన మాట గుర్తు రాదు. ఇదంతా మన బ్రెయిన్ మనతో ఆడుకునే ఆటలో భాగం. అయితే ఈ డాక్టర్ మాత్రం టీ వద్దనే వద్దని చెప్పనే చెప్పరు. ‘హాయిగా టీ తాగండి. దేహానికి హాయినిచ్చే తాజా ఔషధ ఆకులతో చేసిన టీని తాగండి’ అంటూ ఒక పెద్ద జాబితానే సూచిస్తారు. అవన్నీ ఇంట్లో సాధ్యమే అంటూ తన ఇంటి టెర్రస్‌ను చూపిస్తారీ ఉత్తరాఖండ్ డాక్టర్ అన్షు రాఠీ.
ఆమె టెర్రస్ మీద 1500 అడుగుల విస్తీర్ణం కలిగిన టెర్రస్ మీద మిరియాలు, యాలకుల చెట్లతో సహా 400 మొక్కలను పెంచుతున్నారు. అందులో పండ్లు, కూరగాయలతో పాటు అశ్వగంధ, తులసి, ఆరెగానో, పసుపు, మిరియాలు, కుంకుమ పువ్వు, లవంగాలు, జాజికాయ, సోంఫు, మెంతులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇంగువ, మిర్చి, కొత్తిమీర, కలోంజి (నల్ల జీలకర్ర) వంటి 15 రకాల ఔషధ మూలికల మొక్కలున్నాయి. ఏడాదంతా సీజనల్‌గా వచ్చే అనేక అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే... ఆయా కాలాల్లో ప్రకృతి ఇచ్చిన ఔషధాలను ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు 36 ఏళ్ల అన్షురాఠీ.
నేర్చుకోండి... పచ్చగా పెంచుకోండి!
‘‘మనదేశంలో వాతావరణం వైవిధ్యంగా ఉంటుంది. ప్రదేశాలు, కాలాలను బట్టి ఆయా నేలల్లో కొన్ని ప్రత్యేకమైన జాతులు విస్తరిస్తుంటాయి. వాటికి అనువైన పరిస్థితులను అంచనా వేయగలిగితే వాటన్నింటినీ ఒకే చోట పెంచవచ్చు. కొత్తిమీర, మిరియాలు, జీలకర్రలను పెంచాలంటే అక్టోబర్-నవంబర్ నెలల్లో నారు పోయాలి. పసుపును మే-జూన్ నెలల్లో నాటాలి. నాటడం నుంచి ప్రతి దశనూ ఆస్వాదించాలంటే అలా చేయవచ్చు. గార్డెనింగ్‌లో అనుభవం లేని వాళ్లు మాత్రం నారుమడిలో గింజలు చల్లడం నుంచి మొదలు పెట్టకుండా నర్సరీ నుంచి నారు మొలకలను కొనుక్కోవడం మంచిది.
మిరియాలు, యాలకుల వంటి వాటిని నాటేముందు రాత్రంతా నానబెట్టాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలను నానబెట్టాల్సిన అవసరం లేదు. అలాగే నాటే పంటల కాల వ్యవధిని కూడా గమనించుకోవాలి. కొత్తిమీర రెండు వారాల్లో చేతికొస్తుంది, మెంతికి నాలుగు రోజులు చాలు. జీలకర్ర నారు 45 రోజులు తీసుకుంటుంది. ముందుగా ఒక కప్పులో నారు పోసి మొలకలు వచ్చిన తర్వాత ఆ నారు తీసి పెద్ద కుండీలు లేదా ట్రేలలో నాటాలి. ఈ ట్రేలను ఓ వారం రోజుల పోటు నీరెండలో ఉంచి ఆ తర్వాత ఎండలోకి మార్చాలి.
జీలకర్ర, కొత్తిమీర (ధనియాలు రావడానికి) పంట రావడానికి ఐదు నెలలు పడుతుంది. మిరియాలు మూడేళ్లు, యాలకులు ఐదేళ్ల సమయం తీసుకుంటాయి. మొక్కలు పెంచడంలో మట్టిని పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. మనం ఉన్న ప్రదేశంలో లభించే మట్టి స్వభావాన్ని గమనించుకోవాలి. మట్టిని పట్టుకుని ముద్ద చేసినప్పుడు సులభంగా బంతి ఆకారం వస్తే ఆ మట్టి జిగురుగా ఉన్నట్లు. అందులో 20 శాతం ఇసుక, 30 శాతం ఆవుపేడ, వేప పిప్పి కల΄ాలి. ఇలా తయారు చేసుకున్న మట్టిలో నాటిన మొక్కలకు తరచు ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. పంటకోతకు రావడానికి రెండువారాల ముందు వర్మీ–కంపోస్టు వేస్తే సరిపోతుంది.
నేనున్నది గంగా నది–యమునా నదికి మధ్య విస్తరించిన నేల. ఇక్కడ మట్టి... మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలేవీ అవసరం లేదు. వంటగది వ్యర్థాలనే ఎరువుగా వేస్తున్నాను. వీటన్నింటినీ సొంతంగా పెంచుకోవడం అసాధ్యమేమీ కాదు. కొంత సమయం, మరికొంత శ్రద్ధ ఉంటే చాలు. ఉదయాన్నే అరలీటరు నీటిలో తులసి, మెంతితోపాటు నచ్చిన తాజాఆకులను వేసుకుని పావు లీటరు అయ్యే వరకు మరిగించి రుచి కోసం తేనె కలుపుకుని తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం కోసం ప్రయాస పడాల్సిన అవసరమే ఉండదు. ఇంట్లోనే ఫార్మసీ, మీరే వైద్యులు’’ అని ఆరోగ్యం కోసం ఔషధాలను కప్పులో పోసి ఇస్తున్నారు డాక్టర్ అన్షు రాఠీ.
Comments
Please login to add a commentAdd a comment