మల్టీ టాలెంట్
మంజు వారియర్....పేరులోనే కాదు ఆమె వేసే ప్రతి అడుగులో సాహసం ఉంటుంది.
కళకు సామాజిక స్పృహ జోడించి ముందుకు వెళుతోంది.
యాక్టర్, రైటర్, డ్యాన్సర్, బ్రాండ్ అంబాసిడర్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్‌గా
బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది...
కేరళలోని తిరువనంతపురం కల్పాక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని మహిళా సభ్యులు సొంతంగా కూరగాయలు పండించడం ప్రారంభించారు. అందరూ ఆశ్చర్యపోయేలా పెద్ద వెజిటెబుల్ గార్డెన్‌ను సృష్టించారు. ‘కల్పాక క్వీన్స్’గా పేరు గాంచారు. వెజిటెబుల్ గార్డెన్ సృష్టించడానికి కల్పాక క్వీన్స్‌కు ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ అనే సినిమా స్ఫూర్తి ఇచ్చింది.
సమాజాన్ని సినిమా ప్రభావితం చేస్తుందా? సినిమాను సమాజం ప్రభావితం చేస్తుందా?... అనే చర్చ మాట ఎలా ఉన్నా సమాజంపై సినిమా చూపే ప్రభావం తక్కువేమీ కాదు. మంచి లక్ష్యానికి మంచి సినిమా వెన్నుదన్నుగా నిలుస్తుంది. మంజు వారియర్ రీఎంట్రీ మూవీ ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ ఈ కోవకు చెందిన సినిమానే. మంజు వారియర్ ఈ సినిమాలో నిరూపమ రాజీవ్ అనే పాత్ర పోషించింది. నిరూపమ రాజీవ్ అనే వివాహిత టెర్రస్ ఫార్మింగ్‌కు సంబంధించిన ప్రయాణం సినిమా మూల కథ.
‘స్త్రీలు తమలో ఉన్న శక్తి సామర్థ్యాలపై దృష్టి సారించి వెలికి తీస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి’ అంటుంది వారియర్.
‘హౌ వోల్డ్ ఆర్ యూ’ సినిమా విడుదలైన తరువాత మంజు వారియర్ ఎక్కడికి వెళ్లినా మహిళలు దగ్గరికి వచ్చి ‘మీ సినిమా స్ఫూర్తితో టెర్రస్ ఫార్మింగ్ మొదలు పెట్టాం’ అని చెప్పేవాళ్లు.
ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ‘కుటుంబశ్రీ’కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంతో మంది మహిళలను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు నడిపిస్తోంది మంజు వారియర్.
పదిహేడు సంవత్సరాల వయసులో ‘సాక్ష్యం’ సినిమాతో మలయాళ చిత్రసీమలోకి అడుగు పెట్టిన వారియర్ ‘తూవల్’ ‘కొట్టరం’ ‘సల్లాపం’...మొదలైన సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. చిత్రసీమలోకి రావడానికి ముందు దూరదర్శన్ సీరియల్స్‌లో నటించింది.
జెండర్–ఈక్వాలిటీని దృష్టిలో పెట్టుకొని కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జెండర్ పార్క్’ ప్లాట్‌ఫామ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వారియర్ క్యాన్సర్ పేషెంట్‌ల కోసం హెయిర్ డొనేషన్ డ్రైవ్‌లను నిర్వహిస్తుంటుంది.
‘చతర్ముఖం’ అనే మలయాళం సినిమాతో నిర్మాతగా తొలి అడుగు వేసింది మంజు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘సినిమా నిర్మాణంలో రిస్క్‌లు, బాధ్యతలు ఉంటాయి. నా చుట్టుపక్కల వాళ్ల సహకారంతో నిర్మాతగా ఎలాంటి సవాళ్లు, ఒత్తిడి ఎదుర్కోలేదు. ‘కాయట్టం’ సినిమాకు సహనిర్మాతగా ఉన్నప్పుడు చిత్ర నిర్మాణం గురించి సీరియస్‌గా ఆలోచించడం మొదలు పెట్టాను. నా జీవితంలో ఏది ప్లాన్ చేసుకోలేదు. ఆ సమయానికి ఏది ఆసక్తిగా ఉంటే అది చేస్తూ పోయాను. సినిమా నిర్మాణాన్ని నా జీవితంలో కొత్త ప్రయోగంగా భావిస్తాను’ అంటుంది మంజు వారియర్.
క్లాసికల్ డ్యాన్సర్‌గా మంజు వారియర్ తెచ్చుకున్న పేరు తక్కువేమీ కాదు.
స్కూల్లో చదువుకుంటున్న రోజుల నుంచి వారియర్ నాట్యప్రతిభ గురించి ప్రముఖ నాట్యకారుడు ఎన్వీ క్రిష్ణన్‌కు తెలుసు. ‘మంజు గిఫ్టెడ్ డ్యాన్సర్. మన దేశంలోని అద్భుతమైన భరతనాట్య కళాకారులలో ఆమె ఒకరు’ అంటాడు క్రిష్ణన్.
భరతనాట్యంలో పేరు తెచ్చుకున్న మంజు వారియర్ తన కూతురు మీనాక్షి డ్యాన్స్ టీచర్ గీతా పద్మకుమారన్ నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకుంది. ‘వారియర్‌కు కూచిపూడి నేర్పడం ఒక అద్భుత అనుభవం. తక్కువ సమయంలోనే డ్యాన్స్ నేర్చుకుంది. అద్భుతమై ఎక్స్‌ప్రెషన్స్ ఆమె సొంతం’ అంటుంది గీత.
‘సల్లాపం’ అనే పుస్తకంతో రైటర్‌గా కూడా తన ప్రతిభ చాటుకుంది వారియర్. ‘సల్లాపం’ తన జ్ఞాపకాల సమాహారం. వీణ వాయించడం నేర్చుకున్న వారియర్ ఎన్నో వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మంజు వారియర్ బహుముఖ ప్రతిభకు మరోసారి ఫిదా అయ్యారు అభిమానులు.
సంతోషమే నా బలం
ప్రాజెక్ట్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా... ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తాను. సంతోషమే నా బలం. నా జీవితంలో ఎప్పుడూ ఏది ప్లాన్ చేసుకోలేదు. అయితే మంచి విషయాలు నా దారిలో ముందుకు వచ్చి కనిపిస్తాయి. వాటితో కలిసి ప్రయాణిస్తాను. సాహిత్య కార్యక్రమాల్లో మాట్లాడడానికి ముందు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చెప్పబోతున్నానో, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో... ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటాను.
– మంజు వారియర్
Comments
Please login to add a commentAdd a comment