
సోషల్ మీడియా సమాచారంతో తామర తంపరగా విస్తరిస్తున్న సేంద్రియ ఇంటిపంటలు / మిద్దెతోటల సాగు
411కి పైగా యూట్యూబ్ ఛానళ్లు.. లెక్కకు మిక్కిలిగా వాట్సప్ గ్రూపులు.. ఫేస్‌బుక్‌లో డైలీ సీరియళ్లుగా అనుభవాలు
సేంద్రియ ఇంటిపంటలు / మిద్దె తోటల సాగు ద్వారా పట్టణాలు, నగరాల్లోని గృహస్తులు తమకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలతో పాటు కొంత వరకు పండ్లను కూడా మేడలపైనే సాగు చేసుకుంటున్నారు. వీరి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో ఉంటుంది. గత కొద్ది సంవత్సరాల్లో ఇంటిపంటల సాగు సంస్కృతి ఇబ్బడి ముబ్బడిగా విస్తరించింది.
ఇంటిపంటలు / మిద్దె తోట సాగులో ముఖ్య భూమిక మహిళలదే అని చెప్పొచ్చు. అవగాహన పెంచుకొని సంతృప్తికరంగా వంటింటి వ్యర్థాలతో కంపోస్టు ఎరువు తయారు చేసుకొని, ఇంటిపంటల సాగుకు ఆ కంపోస్టును ఉపయోగిస్తున్నారు. తమ కుటుంబం ఆరోగ్యం కోసం సేంద్రియ పంటలను పెంచుతున్న సాగుదారులు వాట్సప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు.
మిద్దె తోటల నిపుణులు, ప్రచారకర్త తుమ్మేటి రఘోత్తమ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ మిద్దెతోట అనుభవాలను పంచుకోవటానికి, సందేహాలను నివృత్తి చేసుకోవటానికి ఉపయోగపడే ఫేస్‌బుక్ పేజీలు, యూట్యూబ్ ఛానళ్లు, వాట్సప్ గ్రూపులు ఏర్పాటయ్యాయి. ఆయన తన మిద్దె తోట అనుభవాలను ఫేస్‌బుక్ వాల్‌పై సంవత్సరాల తరబడి సీరియల్‌గా రాశారు.
అంతేకాదు, తోటి మిద్దెతోట సాగుదారులతో కూడా అనుభవాలను రాయించారు. వంద మంది రాసిన అనుభవాలతో రైతునేస్తం ఫౌండేషన్ ద్వారా సంకలనం ప్రచురించటం విశేషం. సుమారు 60కి పైగా వాట్సప్ గ్రూపులను తుమ్మేటి నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా అర్బన్ టెర్రస్ ఫార్మర్స్ చాలా మంది ఎక్కడికక్కడ తమ బంధుమిత్రులతో వాట్సప్ గ్రూప్‌లు లెక్కకు మిక్కిలిగాప్రారంభించారు.
మిద్దె తోటల సాగుదారులు యూట్యూబ్ వీడియోలను చూసి ఇతర కిచెన్ గార్డెనర్ల అనుభవాలను తెలుసుకుంటూ తమ కిచెన్ గార్డెనింగ్ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకుంటున్నారు. కొందరు ఇంటిపంటల సాగుదారులు మరో ఒకడుగు మందుకు వేసి తామే సొంతంగా యూట్యూబ్ ఛానళ్లనుప్రారంభించారు.
సీనియర్ మిద్దె తోట సాగుదారు, వాట్సప్ గ్రూప్‌ల నిర్వాహకురాలు లతా కృష్ణమూర్తి అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 411 పైగా యూట్యూబ్ ఛానళ్లు సేంద్రియ మిద్దె తోటలకు సంబంధించిన విషయాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాయి. మిద్దె తోట సాగుదారులు యూట్యూబర్లుగా మారి విస్తృతంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. వీరిలో కొందరు తమ యూట్యూబ్ ఛానళ్లను మానిటైజ్ చేయటం ద్వారా మంచి ఆదాయాన్ని సైతం పొందుతుండటం విశేషం.
ఆర్థిక సాధికారతతో శక్తి వంతంగా ఎదుగుతున్నారు
మిద్దెతోటల పెంపకం ద్వారా మహిళలు, ముఖ్యంగా గృహిణులు, ఇంటికే పరిమితం కాకుండా పది మందిలోకి ధైర్యంగా రాగలుగుతున్నారు. కుటుంబ బాధ్యతలు కొంత తీరిన తర్వాత వారికంటూ కొంత సమయం కేటాయించుకుంటున్నారు. అది కుడా మిద్దెతోటల సాగు ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలిని ఎంచుకుంటున్నారు. రసాయన రహిత ఆహారప్రాముఖ్యతను గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా అందరికీ తెలియజేస్తూ, ఇంటిపంట సాగుదారుల సంఖ్యను పెంచటంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఎంతో కొంత ఆదాయాన్ని కూడా పొందుతున్నారు.
మరొకరిపై ఆధాపడకుండా ఆర్థిక సాధికారతతో శక్తి వంతంగా ఎదగగలుగుతున్నారు. కొందరు మిద్దెతోటలకు కావలసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇంకొంత మంది మిద్దెతోటలను నిర్మాణంతో పాటు మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. మిద్దెతోట సాగుదారులుగా, యూట్యూబర్లుగా సాధారణ మహిళలు సాధికారత సాధించడం ఎంతో అభినందించాల్సిన విషయం. మిద్దెతోటల గురించి అవగాహన కల్పించడానికి 411కి పైగా తెలుగు యూట్యూబ్ ఛానెల్స్ రావడం మంచి విషయం. ఇంకా చాలా మంది మిద్దె తోటలు పెంచడానికి ముందుకు రావాలని మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను.
– లతా కృష్ణమూర్తి (94418 03407), సీనియర్ మిద్దెతోట సాగుదారు, హైదరాబాద్
– పంతంగి రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment