organic farms
-
టీచరమ్మ స్కూలు సేద్యం.. ‘థ్యాంక్స్ టు కోవిడ్’
పిల్లలకు పాఠాలు చెప్తే వాళ్లు భవిష్యత్ ఫలాలు ఇస్తారు. కాని ఖాళీగా ఉన్న స్థలంలో పంటలు వేస్తే ఇప్పుడే వారు ఆరోగ్యంగా తిని ఎదుగుతారు. బెంగళూరులోని ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌కి ఆ ఆలోచనే వచ్చింది. వెంటనే ఆ బడి ఆవరణంతా సేంద్రియ సేద్యం మొదలెట్టింది. ఇంకేముంది... రోజుకు కిలోల కొద్ది పండ్లో, కాయలో, కూరలో దిగుబడికి వస్తున్నాయి. నేలకు పాఠం చెప్తే అది తెచ్చుకున్న ఆకుపచ్చటి మార్కులు ఇవి. స్కూల్లో తోట పెంచితే రెండు రకాల సీతాకోక చిలుకలు కనిపిస్తాయి. ఒక రకం యూనిఫామ్ వేసుకున్నవి. ఒక రకం రంగు రంగుల రెక్కలల్లారుస్తూ మొక్కలపై వాలేవి. పిల్లలకు ఏ మంచి చూపినా ఇష్టమే. వారు ఆడమంటే ఆడతారు. పాడమంటే పాడతారు. మొక్కలు పెంచమంటే పెంచుతారు. క్లాసుల్లో వేసి సిలబస్‌లు రుబ్బడమే చదువుగా మారాక పిల్లలకు బెండకాయ చెట్టు, వంకాయ మొలకా కూడా తెలియకుండా పోతున్నాయి. ‘థ్యాంక్స్ టు కోవిడ్’ అంటారు సుశీలా సంతోష్. ఆమె బెంగళూరులోని ఎలహంకలో ఉన్న విశ్వ విద్యాపీఠ్ స్కూల్‌కు డైరెక్టర్. ఆ స్కూల్‌కు మరో రెండు క్యాంపస్‌లు ఉన్నా ఎలహంక బాధ్యతలు చూస్తున్న సుశీలా సంతోష్ చేసిన పని ఇప్పుడు తీగలు, పాదులుగా మారి స్కూల్‌ను కళకళలాడిస్తూ ఉంది. ‘2021 మార్చి ఏప్రిల్ నుంచి లాక్డౌన్ మొదలయ్యింది. 1400 మంది పిల్లలు చదివే క్యాంపస్ మాది. మధ్యాహ్నం భోజనాలు మా స్కూల్లోనే చేస్తారు. కనుక స్టాఫ్ ఎక్కువ. కాని లాక్డౌన్ వల్ల బస్ డ్రైవర్లు, ఆయాలు, వంట మాస్టర్లు, అడెండర్లు అందరూ పనిలేని వారయ్యారు. వారంత చుట్టుపక్కల పల్లెల వారు. పని పోతుందేమోనని భయపడ్డారు. కాని వారిని మేము తీసేయ దలుచుకోలేదు. అలాగని ఖాళీగా పెడితే వారికి కూడా తోచదు. అలా వచ్చిన ఆలోచనే ఆర్గానిక్ ఫార్మింగ్. స్కూలు తోట. పదండి... ఏదైనా పండిద్దాం అన్నాను వారితో. అప్పుడు చూడాలి వారి ముఖం’ అంటుంది సుశీలా సంతోష్. స్కూలులో ప్రెయర్ గ్రౌండ్ తప్ప మిగిలిన ఏ ప్రదేశమైనా పంట యోగ్యం చేయాలని వారు నిశ్చయించుకున్నారు. ‘ఇంతకు ముందు వీరిలో కొందరికి సేద్యం తెలుసు కనుక మా పని సులువయ్యింది’ అంటారు సుశీల. ఆమె సారధ్యంలో స్కూల్ పెరడు, బిల్డింగుల మధ్య ఉన్న ఖాళీ స్థలం, కాంపౌండ్ వాల్స్‌కు ఆనుకుని ఉండే నేల... ఇంకా ఎక్కడెక్కడ ఏ స్థలం ఉన్నా అదంతా కాయగూరలు, పండ్ల మొక్కలు, ఇవి కాకుండా 40 రకాల హెర్బల్ ప్లాంట్లు వేసి వాటి బాగోగులు చూడటం మొదలెట్టారు. ‘మాకు చాలా పెద్ద కిచెన్ ఉంది. దాని టెర్రస్‌ను కూడా తోటగా మార్చాం’ అన్నారు సుశీల. స్కూలులోపల ఉన్న నీటి వ్యవస్థనే కాక వంట గదిలో వాడగా పారేసే నీటిని కూడా సద్వినియోగం చేసుకుంటూ (ఆ నీరు అరటికి చాలా ఉపయోగం) 200 అరటి చెట్లు పెంచడం మొదలెట్టారు. ఇవి కాకుండా ఆకు కూరలు, కాయగూరలు, క్యారెట్, క్యాబేజీ వంటివి కూడా పండించ సాగారు. ‘మూడు నెలల్లోనే ఏదో ఒక కాయగూర కనిపించడం మొదలెట్టింది. స్టాఫ్ మధ్యాహ్న భోజనానికి వాడగా మిగిలినవి చుట్టుపక్కల వారికి పంచడం మొదలెట్టాం. మరి కొన్నాళ్లకు మేమే వాటితో వండిన భోజనాన్ని కోవిడ్ పేషెంట్స్‌కు సాధారణ రేట్లకు అమ్మాం. ఆరోగ్యకరమైన భోజనం తక్కువ ధరకు కాబట్టి సంతోషంగా తీసుకున్నారు. మా స్టాఫ్‌కు ఇదంతా మంచి యాక్టివిటీని ఇచ్చింది’ అంటారు సుశీల. ఈ సంవత్సర కాలంలో స్కూలు ఆవరణలో సీజనల్ పండ్లు, కాయగూరలు స్కూల్ స్టాఫ్ తమ అనుభవం కొద్దీ పండిస్తూ స్కూలు ఆవరణను ఒక పంట పొలంలా మార్చారు. ‘ఇప్పుడు స్కూల్‌కు వచ్చిన పిల్లలు ఇదంతా చూసి సంబరపడుతున్నారు. వారిని మేము ఈ సేద్యంలో ఇన్వాల్వ్ చేయదలిచాం. స్కూల్ కొరికులం కూడా ఆ మేరకు మార్చాం. పిల్లలకు పంటల గురించి తెలియాలి. తమ తిండిని తాము పండించుకోవడమే కాదు నలుగురి కోసం పండించడం కూడా వారికి రావాలి. మార్కెట్లోని తట్టలో కాకుండా కళ్లెదురుగా ఉంటే మొక్కకి టొమాటోనో, తీగకి కాకరో వేళ్లాడుతూ కనిపిస్తే వాళ్లు పొందే ఆనందం వేరు’ అంటారు సుశీల. మన దగ్గర కూడా చాలా స్కూళ్లల్లో ఎంతో ఖాళీ స్థలం ఉంటుంది. ‘స్కూలు సేద్యం’ కొంత మంది టీచర్లు ప్రోత్సహిస్తుంటారు. కాని ప్రతి స్కూల్లో సుశీల లాంటి మోటివేటర్లు ఉంటే సిబ్బంది పూనుకుంటే ప్రతి స్కూలు ఒక సేంద్రియ పంటపొలం అవుతుంది. మధ్యాహ్న భోజనం మరింత రుచికరం అవుతుంది. ఇలాంటి స్కూళ్లను గ్రీన్ స్కూల్స్ అనొచ్చేమో. -
చలికాలంలో ఇంటిపంటల రక్షణ ఇలా..!
శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసుకోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి. ► జీవామృతంను 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10–15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ► ఆచ్ఛాదన (మల్చింగ్): కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది. ► ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులు: టమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి. పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్‌ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్‌ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నే మసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే. పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండిపోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామర ‡పురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు. బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రసంపీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలు రసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయంను (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7–10 రోజులకోసారి పిచికారీ చేయాలి. వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు). వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి. వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బుపొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి. నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ప్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు. రసంపీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే? రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్‌నెట్‌ను మొక్కలపై గ్రీన్హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్‌నెట్ చుట్టేస్తే సరి.? సేంద్రియ ఇంటిపంటల సాగుపై సికింద్రాబాద్ తార్నాక (రోడ్డు నంబర్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర)లోని సుస్థిర వ్యవసాయ కేంద్రం కార్యాలయంలో కనీసం 10 మంది కోరితే వారాంతంలో శిక్షణ ఇస్తున్నారు. పుస్తకాలు, విత్తనాలు, వర్మీకంపోస్టు లభిస్తాయి. వివరాలకు.. డా. గడ్డం రాజశేఖర్ – 83329 45368 ∙సిఎస్ఎ కార్యాలయంపై టెర్రస్ గార్డెన్లో డా. రాజశేఖర్ ∙ఎల్లో స్టిక్కీ ట్రాప్ -
విద్యుత్‌తో నడిచే గానుగలపై 15 రోజుల శిక్షణ
ఆరోగ్య స్పృహతో పాటు గానుగ నూనెలకు గిరాకీ పెరుగుతున్నది. నూనె గింజల నుంచి ఆరోగ్యదాయక పద్ధతిలో వంట నూనెలను గ్రామస్థాయిలోనే ఉత్పత్తి చేయడానికి విద్యుత్‌తో నడిచే గానుగ(పవర్ ఘని)లు మంచి సాధనాలు. వీటి నిర్వహణలో మెలకువలపై ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ 16 ఏళ్లు నిండి, కనీసం 8వ తరగతి చదివిన రైతులు, యువతీ యువకులకు శిక్షణ ఇవ్వనుంది. గతంలో నెల రోజులు శిక్షణ ఇచ్చేవారు. తాజాగా 15 రోజుల స్వల్పకాలిక శిక్షణా కోర్సును రూపొందించారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో గల డా. బీఆర్ అంబేడ్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సంస్థలో శిక్షణ ఇస్తారు. ఫీజు రూ. 4,070. ప్రయాణ చార్జీలు అదనం. విద్యుత్‌తో నడిచే గానుగ గంటకు 15 కిలోల గింజల నుంచి నూనెను తీయవచ్చు. 40–45% వరకు నూనె వస్తుంది. శిక్షణ పొందిన వారు సబ్సిడీపై స్వయం ఉపాధి రుణాలు పొందొచ్చు. హైదరాబాద్‌లోని ఖాదీ కమిషన్‌లో ఎగ్జిక్యూటివ్ ఎం. హరిని సంప్రదించవచ్చు.. 95335 94597, 040–29704463. -
చిరునామా
ఆరోగ్యదాయకమైన చిరుధాన్యాలను 16 ఏళ్ల కిత్రం నుంచే సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడమే కాకుండా ప్రధాన ఆహారంగా తింటున్న విలక్షణ రైతు మౌలాలి. ఎడారీకరణ బారిన పడుతున్న అనంతపురం జిల్లా ముదిగుబ్బ పట్టణంలో రైతు కుటుంబంలో పుట్టారు. ఎమ్మే సోషియాలజీ చదివినప్పటికీ.. బతుకును పండించే చిరుధాన్య పంటల విశిష్టతను గుర్తెరిగారు. అరికలు, సామలు, ఊదలు, వరిగలు, కొర్రలు, అండు కొర్రల సాగులో ప్రయోగాలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో సామాన్య శాస్త్రంలో ఎమ్మే చదివిన మౌలాలి(53) స్వచ్ఛంద సంస్థల్లో కొంతకాలం పనిచేసి.. చివరకు చిరుధాన్యాల సాగుపైనే మనసును కేంద్రీకరించారు. అరికలు, సామలు, ఊదలు, వరిగలు, కొర్రలు, అండు కొర్రలు వంటి చిరుధాన్యాలను తన ఆరెకరాల పొలంలో సాగు చేయడంతో పాటు.. పొడులు, బిస్కెట్లు, బన్ను, కేక్, మిక్చర్, మురుకులు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ పనుల వల్ల అదనపు ఆదాయం సమకూరుతున్నప్పటికీ.. ప్రకృతిలో మమేకమై వ్యవసాయం చేస్తున్నప్పుడు లభించే ఆనందం, ఆత్మసంతృప్తి మరెందులోనూ లేదంటారు మౌలాలి. ‘2002లో మొదటి పంటగాఎకరాకు 3 కిలోల కొర్రలు విత్తాను. ఆ ఏడాది విపరీతమైన కరువు, వర్షపు చుక్క లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎకరాకు 10 క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. రూ. 12 వేల ఖర్చులు పోను రూ.12 వేల నికరాదాయం వచ్చింది. ఆదాయానికి తోడు, చిరుధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అవగతమయ్యే కొద్దీ.. వాటిని పండించడంపై మక్కువ అధికమవుతూ వచ్చింటారు మౌలాలి. పర్యావరణహిత వ్యవసాయం చిరుధాన్యాలు పండించే ముందు అనేక రాష్ట్రాల్లో పర్యటించి వివిధ వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేశారు. ‘అనేక ప్రాంతాలు పర్యటించి ఒక అవగాహన వచ్చినకు తరువాత, చిరుధాన్య పంటలు పండించాలని నిర్ణయించుకున్నాను. కుటుంబానికి చెందిన 6 ఎకరాల మెట్ట భూమిని సాగుకు అనువుగా మార్చడం మొదలు పెట్టాను. బరువైన యంత్రాలు ఉపయోగించి చేసే యాంత్రిక వ్యవసాయం కాకుండా పశువుల సాయంతో పర్యావహణహితంగా వ్యవసాయం చేసి భూమి పైభాగంలో ఉండే సూక్ష్మ జీవులకు హాని కలుగకుండా చూసుకున్నాను. ఫలితం స్పష్టంగా కనిపించింది. భూసారం పెంచే రకరకాల క్రిములు, సూక్ష్మజీవులు వృద్ధి చెందాయి. కొన్ని సందర్భాల్లో కందిని అంతర్ పంటగా వేసి భూసారాన్ని పెంచుకున్నాను. జీవవైవిధ్యం పట్ల అవగాహనతో పర్యావరణహిత వ్యవసాయం చేస్తున్నప్పటికీ, కూలీల కొరత వల్ల ఈ పద్ధతులను పూర్తి స్థాయిలో పాటించలేకపోతున్నాను అన్నారాయన. ఈ ఏడాది జూలైలో అండుకొర్ర పంట వేశారు. అప్పటి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ వర్షం లేదు. అయినా పంట బాగానే ఉంది. కొన్నిరోజుల క్రితం కురిసిన కొద్దిపాటి వర్షానికే పంట పూర్తి స్థాయిలో పుంజుకుంది. ఇంత కరువు లోనూ 8–10 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. కట్టెల బూడిద.. భూమికి బలిమి తొలిసారిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్లయితే కట్టెలు కాల్చి, బూడిదను భూమిలో చల్లితే 15 సంవత్సరాల వరకూ భూమికి సరిపడే కర్బన అవసరాల పోషకాలు లభిస్తాయి. మల్లి జాతి కలుపు ప్రతి చిరుధాన్యపు పంటకు ప్రమాదకారి. పంట వేసిన 30 రోజుల్లోగా ఈ కలుపు కనిపిస్తే వెంటనే నివారించకపోతే పూర్తి పంటను నష్టపోవాల్సి వస్తుంది. ఈ కలుపు బారిన పడకుండా ఉండేందుకు ఎకరాకు అర కిలో వాము రాత్రంతా నానబెట్టి, ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక గంట పాటు గాలికి ఆరబెట్టి చిరుధాన్యాల విత్తనాలతో కలిపి భూమిలో చల్లాలి. చిరుధాన్యాలకు ప్రధానంగా రెండు రకాలైన పురుగులు ఆశిస్తాయి. వర్షాభావం వల్ల ఆకు పీల్చే రసం పురుగు పంటను ఆశిస్తుంది. వెన్ను ఏర్పడే సమయంలో సుడి దోమ ఆశిస్తుంది. 1 లీటరు వేప నూనెను 10 లీటర్ల నీటిలో కిరోసిన్‌తో కలిపి చల్లుకొని నివారించుకోవచ్చు. అంగుళం నీటితో 4 ఎకరాల్లో పంట రసాయనిక ఎరువులు అవసరం లేకుండా వీటిని పండించే వీలున్నందున రైతు పెట్టుబడి చాలా తక్కువని చెప్పారు. కేవలం వర్షాధారంగా లేదా తక్కువ నీటితో చిరుధాన్య పంటలు పండించవచ్చంటారు మౌలాలి. ఒక అంగుళం నీరున్న బోరు ద్వారా 4 ఎకరాల్లో పంట పడించవచ్చని తెలిపారు. పరిమితమైన నీటి వనరులున్న ప్రాంతాలకు చిరుధాన్య పంటలు ఎంతో అనుకూలమని చెప్పారు. అంతర్ పంటగానూ.. పండ్ల తోటల్లో కూడా చిరుధాన్యాలను అంతర పంటగా వేసుకుని అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చని, ఈ పంటల అవశేషాల ద్వారా భూమికి కావలసిన పోషకాలు అందుతాయన్నారు. తద్వారా బహుళప్రయోజనాలు పొందవచ్చన్నారు. చిరుధాన్యాల విత్తనాలు రకాన్ని బట్టి గరిష్టంగా ఏడు సంవత్సరాలు నిల్వ ఉంటాయన్నారు. పక్షులు, అడవిపందుల నుంచి రక్షణ అలాగే ఈ పంటలకు ప్రధాన శత్రువైన పక్షుల బెడద తప్పించుకోవడానికి స్థానికంగా లభించే వస్తువులతో తానే స్వయంగా తక్కువ ఖర్చుతో గాలిమర తయారు చేసి, అది చేసే చప్పుడు వల్ల పక్షులను తరిమి పంటను కాపాడుకుంటున్నారు. ఈ గాలిమర ఉపయోగించడం వల్ల 20 నుంచి 30 అడుగుల దూరం వరకూ పక్షులు వాలవని, రాత్రి వేళల్లో పంటను ఆశించే అడవి పందులను కూడా వీటివల్ల దూరం ఉంచవచ్చు అంటారు మౌలాలి. ఎకరాకు 8 గాలిమరలు అమరిస్తే ఫలితం బాగా ఉంటుందని చెప్పారు. ఆయుర్దాయాన్ని పెంచిన చిరుధాన్యాలు మధుమేహం, పక్షవాతంతోపాటు ఇతర వ్యాధుల వల్ల మౌలాలి∙భార్య కొన్ని సంవత్సరాల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమె బతకడం కష్టమని చెప్పిన వైద్యులు డిశ్చార్జి చేశారు. ఇంటికి తీసుకువచ్చిన తరువాత.. చిరుధాన్యాలు ఆహారంగా ఇవ్వడం మొదలు పెట్టడంతో కొద్దిరోజుల్లోనే ఆమె కోలుకోవడంతోపాటు ఏడేళ్లు బతికారని మౌలాలి తెలిపారు. ‘అప్పటి నుంచి ఇంటిల్లిపాదీ ఆహారపు అలవాట్లు, జీవన శైలి మార్చుకుంటూ వచ్చాం. ప్రస్తుతం నేను వారానికి ఒకసారి మాత్రమే వరి అన్నం తింటాను. మిగిలిన రోజుల్లో చిరుధాన్యంతో చేసిన ఆహారం తీసుకుంటాను’ అన్నారు మౌలాలి. చిరుధాన్య పంటల్లో ఎర్ర నేలల్లో ఎకరాకు 8–10 క్వింటాళ్ళు, నల్ల రేగడి నేలల్లో 15–20 క్వింటాళ్ళ దిగుబడి తీయవచ్చని ఆయన అన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో తాను చేసిన ప్రయోగాల ఫలితాలను రైతులు తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి ప్రత్యక్షంగా చూడవచ్చని మౌలాలి(94905 62614) చెప్పారు. – ప్రసన్న కుమార్, బెంగళూరు -
మట్టి లేని సేంద్రియ ఇంటిపంట!
ఆసక్తి ఉంటే ఇంటిల్లిపాదికీ కావలసినన్ని సేంద్రియ ఆకుకూరలు, తీగ జాతి – చెట్టు జాతి కూరగాయలను మేడపైన పెద్దగా ప్రయాస లేకుండానే పండించుకోవచ్చని అంటున్నారు పొట్లూరి రాజశేఖర్. మట్టి వాడకుండా.. కొబ్బరిపొట్టు, వర్మీ కంపోస్టు, జీవన ఎరువులతో భేషుగ్గా ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. టెలికం సేవల కంపెనీని నిర్వహిస్తున్న రాజశేఖర్.. రైతు కుటుంబంలో పుట్టి వ్యాపార రీత్యా హైదరాబాద్ బంజారాహిల్స్ 3వ నంబరు రోడ్డులోని శ్రీనికేతన్ కాలనీలో స్థిరపడ్డారు. బయట మార్కెట్లో లభించే సేంద్రియ ఉత్పత్తులు ఎంత వరకు సేంద్రియంగా పండించినవో తెలియని అనుమానాస్పద స్థితిలో సొంతంగా ఇంటిపైనే ఆకుకూరలు, కూరగాయలు పండించుకుందామని భావించారు. సేంద్రియ ఇంటి పంటల సేవలు అందించే స్టార్టప్ కంపెనీ హోమ్క్రాప్ను సంప్రదించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (నార్మ్) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన ఉన్నత విద్యావంతులు మన్వితారెడ్డి, షర్మిలారెడ్డి ఈ స్టార్టప్ కంపెనీని గత ఏడాది స్థాపించారు. 7 బెడ్స్.. అనేక పంటలు రాజశేఖర్ ఏడు బెడ్స్(మొత్తం 125 చదరపు అడుగులు)ను 9 నెలల క్రితం ఏర్పాటు చేసుకొని సమృద్ధిగా సేంద్రియ ఇంటిపంటలను సాగు చేసుకుంటున్నారు. చిక్కుడు, దొండ, కాకర, బీర, సొర తీగజాతి కూరగాయలు.. గోంగూర, తోటకూర, పాలకూర, లెట్యూస్ వంటి ఆకుకూరలు.. క్యాబేజి, కాలీఫ్లవర్, వంగ, బెండ, టమాటా వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. మేడపైన గుప్పెడు ఎత్తున ఫైబర్ ఫ్రేమ్ మీద ఫైబర్ షీట్లో (మట్టి అసలు వాడటం లేదు) కొబ్బరి పొట్టు, సేంద్రియ ఎరువులతో కూడిన మిశ్రమాన్ని నింపి.. ప్రతి బెడ్లోనూ చెట్టు జాతి కూరగాయలు లేదా ఆకుకూరలతోపాటు కనీసం ఒక తీగజాతి కూరగాయలను పెంచుతూ చక్కని ఉత్పాదకత సాధిస్తున్నారు. నెలకోసారి చదరపు అడుగుకు అర కిలో చొప్పున (బెడ్‌కు 10 కిలోల వరకు) మాగిన పశువుల ఎరువు లేదా కంపోస్టును వేయడం ద్వారా పంటలకు పోషకాల లోపం లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. నెలకు రెండు సార్లు వేప నూనెను పిచికారీ చేస్తున్నామని, చీడపీడల సమస్య అంతగా లేదని రాజశేఖర్ వివరించారు. పురుగులు టమాటాలను ఆశిస్తున్నప్పుడు వాట్సాప్‌లో ఫొటో పంపి సలహా తీసుకొని, జీవన క్రిమిసంహారిణిని వాడామన్నారు. ఎర్ర చీమల సమస్య వచ్చినప్పుడు వీరి సలహా మేరకు 50 ఎం.ఎల్. నాన్ ఫ్రూట్ వెనిగర్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేశామని రాజశేఖర్ తెలిపారు. ఒక పూటే తగుమాత్రంగా నీరు చల్లుతున్నామన్నారు. మట్టి లేకుండా సాగు చేసినప్పటికీ ఆయన ఇంటిపంటలు చక్కని దిగుబడులనిస్తున్నాయి. బయటి కూరలు తిన్నప్పుడు రసాయనాల వాసన ఇట్టే తెలిసిపోతుంది! ఇంటిపంటల సాగును ప్రారంభించడానికి తొలుత ఖర్చయినప్పటికీ తదనంతరం పెద్దగా ఖర్చులేమీ లేవు. రుచికరమైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు తింటూ ఉంటే చాలా సంతృప్తిగా ఉంది. ఎప్పుడైనా బయటి కూరలు తిన్నప్పుడు వాటిలో రసాయనాల వాసన ఇట్టే తెలిసిపోతుంది. బయట మార్కెట్లో సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు లభిస్తున్నప్పటికీ.. అవి ఎంత వరకు సేంద్రియంగా పండించినవో తెలియని స్థితి నెలకొంది. నగరవాసులు ఎవరికి వారు ఇంటిపంటలు పండించుకోవడమే ఉత్తమం. – పొట్లూరి రాజశేఖర్ (98490 94575), శ్రీనికేతన్ కాలనీ, రోడ్డు నంబర్ 3, బంజారాహిల్స్, హైదరాబాద్ కొబ్బరి పొట్టు, వర్మీ కంపోస్టు.. 40% కొబ్బరి పొట్టు + 40% వర్మీ కంపోస్టు+ 10% జీవన ఎరువులను కలిపిన మిశ్రమంలో ఇంటిపంటలను సాగు చేయిస్తున్నాం. దీని వల్ల మేడపైన బరువుతోపాటు నీటి ఖర్చు కూడా తగ్గుతుంది. బెడ్స్, వర్టికల్ ప్లాంటర్స్, గ్రోబాగ్స్‌ను ఇంటిపంటల సాగుదారులకు అందుబాటులోకి తెచ్చాం. నలుగురున్న కుటుంబానికి 100 నుంచి 125 చదరపు అడుగుల్లో ఇంటిపంటలు సాగు చేసుకుంటే సరిపోతాయి. ఏయే మొక్కల పక్కన ఏయే మొక్కలు వేయాలి? మొక్కల బాగోగులు ఎలా చూసుకోవాలి? వంటి విషయాలను ఇంటిపంటలను కొత్తగా చేపట్టే వారికి తొలి దశలో మా సిబ్బంది నేర్పిస్తారు. మేలైన విత్తనాలూ ఇస్తాం. ఆ తర్వాత కూడా వాట్సాప్, ఫోన్ ద్వారా తోడ్పాటునందిస్తున్నాం. రెండు, మూడు వారాలకోసారి అవసరాలకు తగినట్లు విత్తనాలు వేసుకుంటే ఏడాదంతా ఇంటిపంటలకు కొరత ఉండదు. – ఎల్లు షర్మిలా రెడ్డి (81799 82232),హోమ్‌క్రాప్ డైరెక్టర్ – ఆపరేషన్స్ (homecrop.in) – ఫొటోలు: తూనుగుంట్ల దయాకర్, సాక్షి, ఫొటో జర్నలిస్టు -
సాగు.. సాఫ్ట్వేర్... చెట్టపట్టాల్..!
పట్టణాల్లో కొద్ది పాటి స్థలం ఉన్నా కాంక్రీట్ కట్టడం వెలవాల్సిందే. కానీ బెంగళూరులోని మాన్యతా బిజినెస్ పార్క్ మాత్రం దానికి భిన్నం. నోకియా, కాగ్నిజెంట్, ఐబీఎం వంటి పలు ఐటీ బహుళ జాతి కంపెనీలు ఉన్న ఈ ఆవరణలో 15 ఎకరాల్లో సేంద్రియ పంటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. 70 మంది ఉద్యోగులు సేంద్రియ మొక్కజొన్న, టమాటా, మిరప, బచ్చలికూర, కొత్తిమీర వంటి పంటలను పండిస్తున్నారు. బిందుసేద్య పరికరాలను అమర్చినా ఉద్యోగులు మాత్రం మొక్కలకు తమ చేతులతో నీటిని పోసి ముచ్చటపడుతున్నారు. వేరు వేరు కంపెనీల్లో.. విభిన్న హోదాల్లో పనిచేసే ఉద్యోగులంతా ఒకరి కొకరు పంటల సాగులో సహాయం చేసుకుంటున్నారు. పనిఒత్తిడితో అలసిపోయే ఉద్యోగులకు ఆటవిడుపుగా ఈ పంటల సాగు ఉపయోగపడుతోంది. ఇక్కడ పండించిన çకూరగాయలనే తమ ఇంటి అవసరాలకు వాడుతున్నారు. రుచికరమైన ఆహారాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుంటున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయల రుచి చూసిన రైతులు అచ్చెరువొందుతున్నారు.