ఆసక్తి ఉంటే ఇంటిల్లిపాదికీ కావలసినన్ని సేంద్రియ ఆకుకూరలు, తీగ జాతి – చెట్టు జాతి కూరగాయలను మేడపైన పెద్దగా ప్రయాస లేకుండానే పండించుకోవచ్చని అంటున్నారు పొట్లూరి రాజశేఖర్. మట్టి వాడకుండా.. కొబ్బరిపొట్టు, వర్మీ కంపోస్టు, జీవన ఎరువులతో భేషుగ్గా ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. టెలికం సేవల కంపెనీని నిర్వహిస్తున్న రాజశేఖర్.. రైతు కుటుంబంలో పుట్టి వ్యాపార రీత్యా హైదరాబాద్ బంజారాహిల్స్ 3వ నంబరు రోడ్డులోని శ్రీనికేతన్ కాలనీలో స్థిరపడ్డారు.
బయట మార్కెట్‌లో లభించే సేంద్రియ ఉత్పత్తులు ఎంత వరకు సేంద్రియంగా పండించినవో తెలియని అనుమానాస్పద స్థితిలో సొంతంగా ఇంటిపైనే ఆకుకూరలు, కూరగాయలు పండించుకుందామని భావించారు. సేంద్రియ ఇంటి పంటల సేవలు అందించే స్టార్టప్ కంపెనీ హోమ్‌క్రాప్‌ను సంప్రదించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (నార్మ్) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన ఉన్నత విద్యావంతులు మన్వితారెడ్డి, షర్మిలారెడ్డి ఈ స్టార్టప్ కంపెనీని గత ఏడాది స్థాపించారు.
7 బెడ్స్.. అనేక పంటలు
రాజశేఖర్ ఏడు బెడ్స్(మొత్తం 125 చదరపు అడుగులు)ను 9 నెలల క్రితం ఏర్పాటు చేసుకొని సమృద్ధిగా సేంద్రియ ఇంటిపంటలను సాగు చేసుకుంటున్నారు. చిక్కుడు, దొండ, కాకర, బీర, సొర తీగజాతి కూరగాయలు.. గోంగూర, తోటకూర, పాలకూర, లెట్యూస్ వంటి ఆకుకూరలు.. క్యాబేజి, కాలీఫ్లవర్, వంగ, బెండ, టమాటా వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. మేడపైన గుప్పెడు ఎత్తున ఫైబర్ ఫ్రేమ్ మీద ఫైబర్ షీట్‌లో (మట్టి అసలు వాడటం లేదు) కొబ్బరి పొట్టు, సేంద్రియ ఎరువులతో కూడిన మిశ్రమాన్ని నింపి.. ప్రతి బెడ్‌లోనూ చెట్టు జాతి కూరగాయలు లేదా ఆకుకూరలతోపాటు కనీసం ఒక తీగజాతి కూరగాయలను పెంచుతూ చక్కని ఉత్పాదకత సాధిస్తున్నారు.
నెలకోసారి చదరపు అడుగుకు అర కిలో చొప్పున (బెడ్‌కు 10 కిలోల వరకు) మాగిన పశువుల ఎరువు లేదా కంపోస్టును వేయడం ద్వారా పంటలకు పోషకాల లోపం లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. నెలకు రెండు సార్లు వేప నూనెను పిచికారీ చేస్తున్నామని, చీడపీడల సమస్య అంతగా లేదని రాజశేఖర్ వివరించారు. పురుగులు టమాటాలను ఆశిస్తున్నప్పుడు వాట్సాప్‌లో ఫొటో పంపి సలహా తీసుకొని, జీవన క్రిమిసంహారిణిని వాడామన్నారు. ఎర్ర చీమల సమస్య వచ్చినప్పుడు వీరి సలహా మేరకు 50 ఎం.ఎల్. నాన్ ఫ్రూట్ వెనిగర్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేశామని రాజశేఖర్ తెలిపారు. ఒక పూటే తగుమాత్రంగా నీరు చల్లుతున్నామన్నారు. మట్టి లేకుండా సాగు చేసినప్పటికీ ఆయన ఇంటిపంటలు చక్కని దిగుబడులనిస్తున్నాయి.
బయటి కూరలు తిన్నప్పుడు రసాయనాల వాసన ఇట్టే తెలిసిపోతుంది!
ఇంటిపంటల సాగును ప్రారంభించడానికి తొలుత ఖర్చయినప్పటికీ తదనంతరం పెద్దగా ఖర్చులేమీ లేవు. రుచికరమైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు తింటూ ఉంటే చాలా సంతృప్తిగా ఉంది. ఎప్పుడైనా బయటి కూరలు తిన్నప్పుడు వాటిలో రసాయనాల వాసన ఇట్టే తెలిసిపోతుంది. బయట మార్కెట్లో సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు లభిస్తున్నప్పటికీ.. అవి ఎంత వరకు సేంద్రియంగా పండించినవో తెలియని స్థితి నెలకొంది. నగరవాసులు ఎవరికి వారు ఇంటిపంటలు పండించుకోవడమే ఉత్తమం.
– పొట్లూరి రాజశేఖర్ (98490 94575), శ్రీనికేతన్ కాలనీ, రోడ్డు నంబర్ 3, బంజారాహిల్స్, హైదరాబాద్
కొబ్బరి పొట్టు, వర్మీ కంపోస్టు..
40% కొబ్బరి పొట్టు + 40% వర్మీ కంపోస్టు+ 10% జీవన ఎరువులను కలిపిన మిశ్రమంలో ఇంటిపంటలను సాగు చేయిస్తున్నాం. దీని వల్ల మేడపైన బరువుతోపాటు నీటి ఖర్చు కూడా తగ్గుతుంది. బెడ్స్, వర్టికల్ ప్లాంటర్స్, గ్రోబాగ్స్‌ను ఇంటిపంటల సాగుదారులకు అందుబాటులోకి తెచ్చాం. నలుగురున్న కుటుంబానికి 100 నుంచి 125 చదరపు అడుగుల్లో ఇంటిపంటలు సాగు చేసుకుంటే సరిపోతాయి. ఏయే మొక్కల పక్కన ఏయే మొక్కలు వేయాలి? మొక్కల బాగోగులు ఎలా చూసుకోవాలి? వంటి విషయాలను ఇంటిపంటలను కొత్తగా చేపట్టే వారికి తొలి దశలో మా సిబ్బంది నేర్పిస్తారు. మేలైన విత్తనాలూ ఇస్తాం. ఆ తర్వాత కూడా వాట్సాప్, ఫోన్ ద్వారా తోడ్పాటునందిస్తున్నాం. రెండు, మూడు వారాలకోసారి అవసరాలకు తగినట్లు విత్తనాలు వేసుకుంటే ఏడాదంతా ఇంటిపంటలకు కొరత ఉండదు.
– ఎల్లు షర్మిలా రెడ్డి (81799 82232),హోమ్‌క్రాప్ డైరెక్టర్ – ఆపరేషన్స్ (homecrop.in)
– ఫొటోలు: తూనుగుంట్ల దయాకర్, సాక్షి, ఫొటో జర్నలిస్టు
మట్టి లేని సేంద్రియ ఇంటిపంట!
Published Tue, Mar 27 2018 1:48 AM | Last Updated on Tue, Mar 27 2018 1:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment