సేంద్రియ ఉత్పత్తులే సోపానాలు | organic products marketing through tendrils | Sakshi
Sakshi News home page

సేంద్రియ ఉత్పత్తులే సోపానాలు

Published Wed, Sep 18 2024 3:01 PM | Last Updated on Wed, Sep 18 2024 5:06 PM

organic products marketing through tendrils

సవాళ్లు అధిగమించేందుకు ‘వాల్‌మార్ట్‌ వృద్ధి’ సాయం

పక్క వీధి లక్ష్మి పచ్చళ్లు, మసాలాలు, కారం, పసువు.. ఇలా మనం రోజువారీ జీవితంలో ఉపయోగించే ప్రతి ఉత్పత్తినీ వంద శాతం సహజసిద్ధంగా అందిస్తుంది. రోజంతా ఊళ్లు తిరిగి ఆమె సంపాదించేది ఇంటి ఖర్చులకే సరిపోవు. కానీ ఆమె ఉత్పత్తులు కొనుగోలు చేసి ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటుంది. వేరే పని తెలియని లక్ష్మి మాత్రం తనకు నష్టం వస్తుందని తెలిసినా తప్పక ఇదే కొనసాగిస్తోంది. ఇలాంటి వారికి అండగా నిలుస్తూ వారి ఆదాయం పెంచేలా సాయం చేసే స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. అలాంటి కంపెనీల్లో టెండ్రిల్స్‌ నేచురల్స్‌ ఒకటి. సేంద్రియ ఉత్పత్తుల విభాగంలో మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన అజయ్‌ బాబు 2022లో దీన్ని ప్రారంభించారు. ఈ సంస్థ మహిళా పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్న సేవలేమిటి.. కంపెనీ విధానాల వల్ల రైతులకు ఎలా మేలు జరుగుతుంది.. సంస్థ పురోగతికి ‘వాల్‌మార్ట్‌ వృద్ధి’ కార్యక్రమంలో ఎలా ఉపయోగపడింది..వంటి అంశాలపై సంస్థ వ్యవస్థాపకులు అజయ్‌బాబుతో సాక్షి.కామ్‌ బిజినెస్‌ ముఖాముఖి నిర్వహించింది.

సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించి మహిళా పారిశ్రామికవేత్తలు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? వాటి పరిష్కారానికి మీరు ఎలాంటి విధానాలు పాటిస్తున్నారు?

మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ఉత్పత్తుల మార్కెటింగ్‌ పెద్ద సవాలుగా మారుతుంది. వినియోగదారులకు ఎలాంటి ఉత్పత్తులు అవసరమో తెలుసుకుని వాటిని సరఫరా చేయాలి.  వారికి అందిస్తున్న ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించాలి. దాంతో కస్టమర్లకు మెరుగైన సేవలందుతాయి. ఈ సవాళ్లను పరిష్కరిస్తున్న కంపెనీల్లో టెండ్రిల్స్‌ ఒకటి. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులు అమ్ముకునేలా రూ.8 లక్షలతో స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ స్కీమ్‌(ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్‌)ను ఏర్పాటు చేశాం. దీని ద్వారా ప్రత్యేక టెస్టింగ్‌ విధానాన్ని రూపొందించాం. దాంతో వినియోగదారులకు నాణ్యమైన ఆర్గానిక్‌ ఉత్పత్తులను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. చిన్న, సన్నకారు రైతులకు ఎలాంటి పంటలు పండించాలో అవగాహన ఏర్పాటు చేస్తున్నాం. దానివల్ల రైతుల పంటకు సరైన ధర వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు సరైన రక్షణ చర్యలు పాటించకుండా, అవగాహన లేమితో సాగుచేసి నష్టపోతుంటారు. అలాంటి వారికోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎలాంటి పంటలు పండించాలో తెలియజేస్తున్నాం. దాంతో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయవచ్చు.

తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఔషధ, సుగంధ మొక్కలను పండించే రైతులతో కలిసి పనిచేశాం. సరైన విధానాలతో పండించే పంటలను మంచి ధర ఇచ్చి కొనుగోలు చేశాం. అలా సేకరించిన ఔషధ, సుగంధ మొక్కల నుంచి ఉత్పత్తి చేసిన నూనె, సౌందర్య సాధనాలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. దాంతో మహిళా పారిశ్రామికవేత్తల సాయంతో ఆ ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నాం. ఫలితంగా రైతులు, పారిశ్రామికవేత్తలు, వినియోగదారులకు మేలు జరుగుతోంది. అరకు, పాడేరు జిల్లాల్లోని అడవి తేనె, పసుపుతో 5% కర్కుమిన్ కంటెంట్ (పసుపుకు రంగును ఇచ్చే పదార్థం)ను, పతారి అడవిలోని గిరిజన ప్రాంతాల నుంచి మిరియాలను ప్రాసెస్‌ చేస్తున్నాం.

బిజినెస్‌ పరంగా మీకు ఎదురవుతున్న సమస్యలేమిటి?

వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను గుర్తించడం ఈ రంగంలో పెద్ద సవాలు. అన్ని ఉత్పత్తులను పూర్తిగా పరీక్షించాకే మార్కెట్‌లోకి విడుదల చేయాలి. సంస్థ విక్రయించే ప్రతి వస్తువుకు పరీక్ష నివేదికలు అవసరం. టెండ్రిల్స్‌లో ప్రత్యేకంగా ప్రతి ఉత్పత్తికి ‘ఫూల్‌ప్రూఫ్‌ టెస్టింగ్ సిస్టమ్‌’ను అమలు చేస్తున్నాం. సౌందర్య సాధనాల సేకరణకు తగిన లేబులింగ్, ప్యాకేజింగ్ వంటివి సవాళ్లుగా ఉన్నాయి. వాటిని సమర్థంగా నిర్వహించాలి. ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించడం వల్ల ఖర్చులు, ఆన్‌లైన్ కార్యకలాపాల నిర్వహణ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మార్కెట్ పరిధిని విస్తరించడానికి ఈ సవాళ్లను అధిగమించడం చాలా కీలకం. అందుకోసం విభిన్న మార్గాలు అనుసరిస్తున్నాం. ఆర్గానిక్‌ ఉత్పత్తులు బయట మార్కెట్‌లో లభించే సాధారణ ఉత్పత్తుల కంటే 10-20 శాతం ధర ఎక్కువగా ఉంటాయి. కొత్త కస్టమర్లు వీటిని భారంగా భావిస్తున్నారు. ఇప్పటికే వినియోగిస్తున్నావారికి వాటి విలువ తెలుసు కాబట్టి ధర గురించి ఆలోచించడం లేదు.

ఆన్‌లైన్‌లో పోటీ అధికంగా ఉంది కదా. ధరల సమస్యను ఎలా అధిగమిస్తున్నారు?

ఆన్‌లైన్‌లో నిత్యం కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. వివిధ సంస్థలు విభిన్న ధరలతో తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ‘వాల్‌మార్ట్ వృద్ధి ప్రోగ్రామ్‌’లో చేరడం వల్ల ధరలకు సంబంధించిన సమస్యలను అధిగమించేలా సహాయపడింది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తులను ఎలా విక్రయించాలో ఇందులో నేర్పించారు. వ్యాపారానికి అవసరమైన ఫైనాన్స్‌ సదుపాయం ఎలా పొందాలో వివరించారు. ప్రధానంగా నేను ఎంచుకున్న రంగంలో ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేయాలో ఈ ప్రోగ్రామ్‌ ద్వారా అవగాహన ఏర్పడింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ఎలా వాటి ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో మరింత సమర్థవంతంగా విక్రయించుకోవచ్చో ఈ ప్రోగ్రామ్‌ ద్వారా తెలియజేస్తారు. ఫ్లిప్‌కార్ట్‌ వంటి విస్తారమైన మార్కెట్‌ అవకాశం ఉన్న ప్లాట్‌ఫామ్‌లో ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఎలాంటి అవకాశాలున్నాయో వివరిస్తారు. ఈ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను అమలు చేయడం వల్ల అమ్మకాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఆర్టీసీ) లాజిస్టిక్స్ విభాగంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాం. ఆఫ్‌లైన్ లాజిస్టిక్స్ ఖర్చులను 50% తగ్గించడంలో ఈ ఒప్పందం సాయపడుతుంది.

భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?

విభిన్న ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో సంస్థ ఉత్పత్తుల విక్రయాలను పెంచాలి. కేవలం ఫ్లిప్‌కార్ట్‌లోనే దాదాపు 200 కంటే ఎక్కువగా కంపెనీ ఉత్పత్తులను అమ్మాలని జాబితా ఏర్పాటు చేశాం. ఆ దిశగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ఏపీ, తెలంగాణలో వరుసగా 50, 60 ఆవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.

ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్‌షిప్‌

చివరగా..

స్థిరంగా ఉత్పత్తుల నాణ్యతను పాటిస్తే వ్యాపారంలో తప్పకుండా విజయం సాధించవచ్చు. కొత్తగా వచ్చే కంపెనీలు కూడా ఈ నియమాన్ని పాటించాలి. యువతకు వ్యాపార రంగంలో అపార అవకాశాలున్నాయి. నచ్చిన రంగంలో ముందుగా నైపుణ్యాలు పెంచుకుని వ్యాపారంలో ప్రవేశిస్తే భవిష్యత్తులో మంచి విజయాలు పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement