Walmart India
-
సేంద్రియ ఉత్పత్తులే సోపానాలు
పక్క వీధి లక్ష్మి పచ్చళ్లు, మసాలాలు, కారం, పసువు.. ఇలా మనం రోజువారీ జీవితంలో ఉపయోగించే ప్రతి ఉత్పత్తినీ వంద శాతం సహజసిద్ధంగా అందిస్తుంది. రోజంతా ఊళ్లు తిరిగి ఆమె సంపాదించేది ఇంటి ఖర్చులకే సరిపోవు. కానీ ఆమె ఉత్పత్తులు కొనుగోలు చేసి ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటుంది. వేరే పని తెలియని లక్ష్మి మాత్రం తనకు నష్టం వస్తుందని తెలిసినా తప్పక ఇదే కొనసాగిస్తోంది. ఇలాంటి వారికి అండగా నిలుస్తూ వారి ఆదాయం పెంచేలా సాయం చేసే స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. అలాంటి కంపెనీల్లో టెండ్రిల్స్ నేచురల్స్ ఒకటి. సేంద్రియ ఉత్పత్తుల విభాగంలో మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన అజయ్ బాబు 2022లో దీన్ని ప్రారంభించారు. ఈ సంస్థ మహిళా పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్న సేవలేమిటి.. కంపెనీ విధానాల వల్ల రైతులకు ఎలా మేలు జరుగుతుంది.. సంస్థ పురోగతికి ‘వాల్‌మార్ట్ వృద్ధి’ కార్యక్రమంలో ఎలా ఉపయోగపడింది..వంటి అంశాలపై సంస్థ వ్యవస్థాపకులు అజయ్‌బాబుతో సాక్షి.కామ్ బిజినెస్ ముఖాముఖి నిర్వహించింది.సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించి మహిళా పారిశ్రామికవేత్తలు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? వాటి పరిష్కారానికి మీరు ఎలాంటి విధానాలు పాటిస్తున్నారు?మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ఉత్పత్తుల మార్కెటింగ్ పెద్ద సవాలుగా మారుతుంది. వినియోగదారులకు ఎలాంటి ఉత్పత్తులు అవసరమో తెలుసుకుని వాటిని సరఫరా చేయాలి. వారికి అందిస్తున్న ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించాలి. దాంతో కస్టమర్లకు మెరుగైన సేవలందుతాయి. ఈ సవాళ్లను పరిష్కరిస్తున్న కంపెనీల్లో టెండ్రిల్స్ ఒకటి. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులు అమ్ముకునేలా రూ.8 లక్షలతో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్(ఎస్ఐఎస్ఎఫ్ఎస్)ను ఏర్పాటు చేశాం. దీని ద్వారా ప్రత్యేక టెస్టింగ్ విధానాన్ని రూపొందించాం. దాంతో వినియోగదారులకు నాణ్యమైన ఆర్గానిక్ ఉత్పత్తులను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. చిన్న, సన్నకారు రైతులకు ఎలాంటి పంటలు పండించాలో అవగాహన ఏర్పాటు చేస్తున్నాం. దానివల్ల రైతుల పంటకు సరైన ధర వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు సరైన రక్షణ చర్యలు పాటించకుండా, అవగాహన లేమితో సాగుచేసి నష్టపోతుంటారు. అలాంటి వారికోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎలాంటి పంటలు పండించాలో తెలియజేస్తున్నాం. దాంతో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయవచ్చు.తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఔషధ, సుగంధ మొక్కలను పండించే రైతులతో కలిసి పనిచేశాం. సరైన విధానాలతో పండించే పంటలను మంచి ధర ఇచ్చి కొనుగోలు చేశాం. అలా సేకరించిన ఔషధ, సుగంధ మొక్కల నుంచి ఉత్పత్తి చేసిన నూనె, సౌందర్య సాధనాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దాంతో మహిళా పారిశ్రామికవేత్తల సాయంతో ఆ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాం. ఫలితంగా రైతులు, పారిశ్రామికవేత్తలు, వినియోగదారులకు మేలు జరుగుతోంది. అరకు, పాడేరు జిల్లాల్లోని అడవి తేనె, పసుపుతో 5% కర్కుమిన్ కంటెంట్ (పసుపుకు రంగును ఇచ్చే పదార్థం)ను, పతారి అడవిలోని గిరిజన ప్రాంతాల నుంచి మిరియాలను ప్రాసెస్ చేస్తున్నాం.బిజినెస్ పరంగా మీకు ఎదురవుతున్న సమస్యలేమిటి?వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను గుర్తించడం ఈ రంగంలో పెద్ద సవాలు. అన్ని ఉత్పత్తులను పూర్తిగా పరీక్షించాకే మార్కెట్లోకి విడుదల చేయాలి. సంస్థ విక్రయించే ప్రతి వస్తువుకు పరీక్ష నివేదికలు అవసరం. టెండ్రిల్స్లో ప్రత్యేకంగా ప్రతి ఉత్పత్తికి ‘ఫూల్ప్రూఫ్ టెస్టింగ్ సిస్టమ్’ను అమలు చేస్తున్నాం. సౌందర్య సాధనాల సేకరణకు తగిన లేబులింగ్, ప్యాకేజింగ్ వంటివి సవాళ్లుగా ఉన్నాయి. వాటిని సమర్థంగా నిర్వహించాలి. ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించడం వల్ల ఖర్చులు, ఆన్లైన్ కార్యకలాపాల నిర్వహణ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మార్కెట్ పరిధిని విస్తరించడానికి ఈ సవాళ్లను అధిగమించడం చాలా కీలకం. అందుకోసం విభిన్న మార్గాలు అనుసరిస్తున్నాం. ఆర్గానిక్ ఉత్పత్తులు బయట మార్కెట్లో లభించే సాధారణ ఉత్పత్తుల కంటే 10-20 శాతం ధర ఎక్కువగా ఉంటాయి. కొత్త కస్టమర్లు వీటిని భారంగా భావిస్తున్నారు. ఇప్పటికే వినియోగిస్తున్నావారికి వాటి విలువ తెలుసు కాబట్టి ధర గురించి ఆలోచించడం లేదు.ఆన్లైన్లో పోటీ అధికంగా ఉంది కదా. ధరల సమస్యను ఎలా అధిగమిస్తున్నారు?ఆన్లైన్లో నిత్యం కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. వివిధ సంస్థలు విభిన్న ధరలతో తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ‘వాల్‌మార్ట్ వృద్ధి ప్రోగ్రామ్’లో చేరడం వల్ల ధరలకు సంబంధించిన సమస్యలను అధిగమించేలా సహాయపడింది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తులను ఎలా విక్రయించాలో ఇందులో నేర్పించారు. వ్యాపారానికి అవసరమైన ఫైనాన్స్ సదుపాయం ఎలా పొందాలో వివరించారు. ప్రధానంగా నేను ఎంచుకున్న రంగంలో ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేయాలో ఈ ప్రోగ్రామ్ ద్వారా అవగాహన ఏర్పడింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ఎలా వాటి ఉత్పత్తులను ఆన్లైన్లో మరింత సమర్థవంతంగా విక్రయించుకోవచ్చో ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేస్తారు. ఫ్లిప్‌కార్ట్ వంటి విస్తారమైన మార్కెట్ అవకాశం ఉన్న ప్లాట్ఫామ్లో ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఎలాంటి అవకాశాలున్నాయో వివరిస్తారు. ఈ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను అమలు చేయడం వల్ల అమ్మకాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ) లాజిస్టిక్స్ విభాగంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాం. ఆఫ్‌లైన్ లాజిస్టిక్స్ ఖర్చులను 50% తగ్గించడంలో ఈ ఒప్పందం సాయపడుతుంది.భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?విభిన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో సంస్థ ఉత్పత్తుల విక్రయాలను పెంచాలి. కేవలం ఫ్లిప్‌కార్ట్‌లోనే దాదాపు 200 కంటే ఎక్కువగా కంపెనీ ఉత్పత్తులను అమ్మాలని జాబితా ఏర్పాటు చేశాం. ఆ దిశగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ఏపీ, తెలంగాణలో వరుసగా 50, 60 ఆవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్చివరగా..స్థిరంగా ఉత్పత్తుల నాణ్యతను పాటిస్తే వ్యాపారంలో తప్పకుండా విజయం సాధించవచ్చు. కొత్తగా వచ్చే కంపెనీలు కూడా ఈ నియమాన్ని పాటించాలి. యువతకు వ్యాపార రంగంలో అపార అవకాశాలున్నాయి. నచ్చిన రంగంలో ముందుగా నైపుణ్యాలు పెంచుకుని వ్యాపారంలో ప్రవేశిస్తే భవిష్యత్తులో మంచి విజయాలు పొందవచ్చు. -
ప్చ్.. వాల్‌మార్ట్ ఇండియాకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: బెస్ట్‌ప్రైస్ ఫ్లిప్‌కార్ట్ స్టోర్ల నిర్వాహక దిగ్గజం వాల్‌మార్ట్ ఇండియా మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ. 299 కోట్ల నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2020-21)లో రూ. 201 కోట్ల నష్టం ప్రకటించింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం 6 శాతంపైగా పుంజుకుని రూ. 5,362 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 8 శాతం పెరిగి రూ. 5,660 కోట్లను తాకాయి. వాల్‌మార్ట్ ఇండియాలో 100 శాతం వాటాను ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 2020 జులైలో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాల్‌మార్ట్ ఇండియా దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో 29 బెస్ట్‌ప్రైస్ ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ స్టోర్లు, 2 ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలను నిర్వహిస్తోంది. కాగా ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌ను యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ 2018 మే నెలలో 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం విదితమే. -
భారత్‌కు మారిన ఫోన్‌పే ప్రధాన కార్యాలయం
న్యూఢిల్లీ: త్వరలో పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానున్న నేపథ్యంలో ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తమ కార్యాలయ చిరునామాను సింగపూర్ నుంచి భారత్‌కు మార్చుకుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు సంస్థ తెలిపింది. గత ఏడాది కాలంగా ఫోన్‌పే సింగపూర్‌కు చెందిన ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసులు, వెల్త్ బ్రోకింగ్ మొదలైన వ్యాపారాలు, అనుబంధ సంస్థలు అన్నింటిని ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్–ఇండియాకు బదలాయించినట్లు వివరించింది. మరోవైపు, 3,000 మంది ఉద్యోగులకు ఫోన్‌పే ఇండియా కొత్త ప్లాన్ కింద కొత్త ఎసాప్ (ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్)లను జారీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు సమీర్ నిగమ్, రాహుల్ చారి, బుర్జిన్ ఇంజినీర్ కలిసి ఫోన్‌పేను ప్రారంభించారు. దీన్ని ఫ్లిప్‌కార్ట్ 2016లో కొనుగోలు చేసింది. అటుపైన 2018లో ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేయడంతో ఫోన్‌పే కూడా వాల్‌మార్ట్‌లో భాగంగా మారింది. ప్రస్తుతం 8–10 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. -
పోటీ కన్నా కస్టమర్లకే ప్రాధాన్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్‌లో ఇతర సంస్థలతో పోటీ కన్నా మెరుగైన సేవలందిస్తూ కస్టమర్లకు మరింత చేరువ కావడానికే ప్రాధాన్యమిస్తామని ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్, వాల్‌మార్ట్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆదర్శ్ మీనన్ తెలిపారు. కిరాణా, చిన్న.. మధ్య తరహా సంస్థలు, రైతులకు తోడ్పాటు అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. గురువారం తిరుపతిలో బెస్ట్‌ప్రైస్ స్టోర్ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా ఇది 29వ బెస్ట్‌ప్రైస్ స్టోర్ కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఆరోదని మీనన్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 10 బెస్ట్‌ప్రైస్ స్టోర్స్ ఉన్నాయని తెలిపారు. స్థానికంగా కొనుగోళ్లు జరపడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా స్థానిక ఎకానమీ వృద్ధికి తమ స్టోర్స్ ఇతోధికంగా తోడ్పడగలవని వివరించారు. తిరుపతిలో కొత్త స్టోర్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని మీనన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ స్టోర్‌ను ప్రారంభించారు. సుమారు 56,000 చ.అ.ల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. ‘సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటోంది. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌తో రాష్ట్రానికి దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయి. కొత్త స్టోర్‌తో తిరుపతిలో కొత్తగా ఉద్యోగాల కల్పన, ఇతరత్రా అవకాశాలు రాగలవు‘ అని రామచంద్రా రెడ్డి తెలిపారు. మరోవైపు, ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ విభాగం సర్వీసులు 16 నగరాల్లో అందుబాటులో ఉన్నాయని మీనన్ చెప్పారు. -
ఫ్లిప్‌కార్ట్.. ఇక హోల్‌సేల్
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా హోల్‌సేల్ వ్యాపార విభాగంలోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా వాల్‌మార్ట్ ఇండియాను కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్ విలువ ఎంతన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ పేరిట వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సంస్థ గురువారం తెలిపింది. ప్రధానంగా బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) విభాగంలో కార్యకలాపాల కోసం ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ ఏర్పాటైనట్లు వివరించింది. వాల్‌మార్ట్ సారథ్యంలోని ఇన్వెస్టర్ గ్రూప్ నుంచి 1.2 బిలియన్ డాలర్లు సమీకరించిన వారానికే ఫ్లిప్‌కార్ట్ తాజా ప్రకటన చేయడం గమనార్హం. ‘ఒకవైపు విక్రేతలు, తయారీదారులను మరోవైపు కిరాణా దుకాణదారులు, చిన్న మధ్యతరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) అనుసంధానం చేసేలా ఈ మార్కెట్‌ప్లేస్ ఉంటుంది‘ అని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆదర్శ్ మీనన్ చెప్పారు. కిరాణా దుకాణదారులు, ఎంఎస్ఎంఈల అవసరాలను తీర్చే సామర్థ్యాలను పెంచుకునేందుకు వాల్‌మార్ట్ ఇండియా కొనుగోలు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఫినిష్డ్ ఉత్పత్తులకు సంబంధించి బీ2బీ మార్కెట్ విలువ సుమారు 650 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఇందులో ముందుగా ఫ్యాషన్, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి కేటగిరీలు ఉన్న సుమారు 140 బిలియన్ డాలర్ల మార్కెట్‌పై మేం దృష్టి సారిస్తున్నాం‘ అని మీనన్ చెప్పారు. భారత్‌లో వాల్‌మార్ట్ ఇలా.. ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ సంస్థ అయిన అమెరికన్ కంపెనీ వాల్‌మార్ట్ గతంలో భారతీ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యంతో భారత్‌లో హోల్‌సేల్ కార్యకలాపాలు ప్రారంభించింది. 2013లో రెండు సంస్థలు విడిపోయినప్పటికీ వాల్‌మార్ట్ మాత్రం సొంతంగా బెస్ట్ ప్రైస్ పేరిట క్యాష్–అండ్–క్యారీ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఇందులో సుమారు 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. బెస్ట్ ప్రైస్‌కు తొమ్మిది రాష్ట్రాల్లో 28 స్టోర్స్, 15 లక్షల పైచిలుకు సభ్యులు ఉన్నారు. త్వరలోనే తిరుపతిలో కొత్తగా క్యాష్–అండ్–క్యారీ స్టోర్ ఏర్పాటు చేస్తోంది. వాల్‌మార్ట్‌కి పూర్తి అనుబంధ సంస్థగా వాల్‌మార్ట్ ఇండియా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2018లో సుమారు 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ 77 శాతం వాటాలు కొనుగోలు చేసింది. కొత్త సంస్థ స్వరూపం..: ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ వ్యాపార విభాగానికి మీనన్ సారథ్యం వహిస్తారు. ప్రస్తుతం వాల్‌మార్ట్ ఇండియా సీఈవోగా వ్యవహరిస్తున్న సమీర్ అగర్వాల్.. బాధ్యతల బదలాయింపు సజావుగా పూర్తయ్యే దాకా ఉంటారు. ఆ తర్వాత వాల్మార్ట్లోనే మరో హోదాకు మారతారు. వాల్‌మార్ట్ ఇండియాలోని ఉద్యోగులు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లోకి మారతారు. వాల్‌మార్ట్ టెక్నాలజీ విభాగం తమ వాల్‌మార్ట్ ల్యాబ్స్ ఇండియాను విడిగా నిర్వహించడం కొనసాగిస్తుంది. కిరాణా షాపులు కీలకం.. కరోనా వైరస్ పరిణామాల నేపథ్యంలో కిరాణా దుకాణదారులు గతంలో కన్నా మరిన్ని మార్గాల్లో కొనుగోళ్లు జరుపుతున్నారని, బెస్ట్ ప్రైస్ విషయానికొస్తే తమ ఈ–కామర్స్ వ్యాపార విభాగం లావాదేవీలు నాలుగు రెట్లు పెరిగాయని సమీర్ అగర్వాల్ తెలిపారు. కిరాణా దుకాణదారులు ఇటు ఆన్లైన్, అటు ఆఫ్‌లైన్ మార్గంలో కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న సంగతి దీని ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. రిటైల్ వ్యాపారంలో కిరాణాలు, సంఘటిత బీ2బీ సంస్థలు కీలకమని తెలిపారు. ఇందులో ఆన్లైన్ వ్యా పార విభాగం వృద్ధి గణనీయంగా ఉంటుందన్నారు. ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం ద్వారా కిరాణా దుకాణదారులు, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) సులభ రుణ సదుపాయాలు, వ్యాపారం.. ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు మరిన్ని లభించగలవని అగర్వాల్ చెప్పారు. -
వాల్‌మార్ట్‌తో కలిసి... హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెచ్డీఎఫ్సీ భాగస్వామ్యంతో వాల్మార్డ్ ఇండియా తన కస్టమర్ల కోసం కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను విడుదల చేసింది. వాల్‌మార్ట్ తాలూకు బెస్ట్‌ప్రైస్ హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ స్టోర్ల సభ్యుల కోసం ఈ కార్డులను విడుదల చేస్తున్నట్లు వాల్‌మార్ట్ ఇండియా సీఈఓ క్రిష్ అయ్యర్ చెప్పారు. వీటితో కస్టమర్లకు 18– 50 రోజుల ఫ్రీ క్రెడిట్ లభిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా బెస్ట్‌ప్రైస్‌లో రిజిస్టరైన సభ్యులు ఈ కార్డులకు అర్హులని తెలియజేశారు. రెండు రకాల క్రెడిట్ కార్డులు (బెస్ట్‌ప్రైస్ సేవ్స్మార్ట్, బెస్ట్‌ప్రైస్ సేవ్ మాక్స్) అందుబాటులో ఉంటాయని, బీ2బీ కస్టమర్లు తమ కొనుగోళ్లకు అనుగుణమైన కార్డును ఎంచుకోవచ్చునని చెప్పారాయన. ఈ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితే క్యాష్‌బ్యాక్, రివార్డు పాయింట్ల లాంటి పలు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలుంటాయన్నారు. త్వరలో కర్నూలు, తిరుపతిల్లో బెస్ట్‌ప్రైస్ దుకాణాలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా క్రిష్ అయ్యర్ చెప్పారు. ఎకానమీలో మందగమనం త్వరలో సమసిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని బెస్ట్‌ప్రైస్ స్టోర్లలో ఈ కార్డులను అందుబాటులోకి తెస్తామన్నారు. సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా బెస్ట్‌ప్రైస్‌లో కస్టమర్లు జరిపిన లావాదేవీలను మదింపు చేసి కార్డులు జారీ చేస్తామని కార్యక్రమంలో పాల్గొన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేమెంట్స్ బిజినెస్ విభాగం కంట్రీ హెడ్ పరాగ్ రావ్ చెప్పారు. ఈ కార్డుల వార్షిక ఫీజు రూ. 500– 1000 మధ్యలో ఉంటుందన్నారు. ‘‘సేవ్స్మార్ట్ కార్డుతో దాదాపు ఏటా రూ.14,250 మేర, మాక్స్ కార్డుతో ఏటా దాదాపు రూ.40,247 మేర సభ్యులు ఆదా చేసుకోవచ్చు. ఎస్ఎంఈ విభాగం దేశీయ ఎకానమీకి వెన్నెముక. ఈ విభాగానికి చేయూతనిచ్చే దిశగా ఈ కార్డులను తీసుకొచ్చాం’’ అని వివరించారు. ఎకానమీలో మందగమనం పూర్తిగా పోతుందనే సంకేతాలున్నాయని, ఇకపై రికవరీ చూడవచ్చని అంచనా వేశారు. కార్యక్రమంలో డైనర్స్ క్లబ్ ప్రతినిధి యానీ జాంగ్ తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్‌లో వాల్‌మార్ట్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ రిటైల్ బ్రాండ్ వాల్‌మార్ట్ ఇండియా తెలంగాణలో శరవేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో మూడవ క్యాష్ అండ్ క్యారీ స్టోర్‌ను నిజామాబాద్‌లో ప్రారంభించింది. ఇప్పటికే వాల్‌మార్ట్ ఇండియాకు హైదరాబాద్, కరీంనగర్లో స్టోర్లున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ముగింపు నాటికి వరంగల్‌లో నాల్గవ స్టోర్‌ను ప్రారంభిస్తామని ఇండియా సీఈఓ అండ్ ప్రెసిడెంట్ క్రిష్ అయ్యర్ తెలిపారు. ఇప్పటివరకు వాల్‌మార్ట్ ఇండియాకు దేశంలో 26 స్టోర్లున్నాయి. నిజామాబాద్‌లో 50 వేల చ.అ.ల్లో విస్తరించి ఉన్న ఈ స్టోర్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. రిటైలర్లు, రైతులకు, సప్లయర్స్ వంటి బీ2బీ విభాగంలో ఈ స్టోర్ సేవలందిస్తుందని చెప్పారు. -
ఆ కంపెనీలో 30వేల కొలువులు..
లక్నో : రిటైల్ రంగంలో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే దిగ్గజాలు భారీ స్టోర్ల ఏర్పాటుకు పూనుకుంటున్నాయి. యూపీలో 15 స్టోర్లను ఏర్పాటు చేయడం ద్వారా స్ధానికులకు 30,000 ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువస్తామని వాల్‌మార్ట్ ఇండియా పేర్కొంది. యూపీలో వాల్‌మార్ట్ ఇప్పటికే నాలుగు క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను నిర్వహిస్తుండగా, ఇటీవల లక్నోలో ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లో 1500 మంది నైపుణ్యంతో కూడిన సిబ్బందికి ఉపాధి కల్పించింది. యూపీలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో భాగంగా రాష్ట్రంలో 15 హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ స్టోర్స్ ఏర్పాటుకు యూపీ సర్కార్‌తో ఒప్పందం చేసుకుంది. ప్రతిస్టోర్లో 2000 వరకూ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని,మొత్తం 30 వేల మంది స్ధానికులకు ఉపాధి కలుగుతుందని వాల్‌మార్ట్ ఇండియా ప్రతినిధి రజనీష్ కుమార్ చెప్పారు. కాగా, లక్నోలో ఆదివారం జరిగే శంకుస్ధాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యానాథ్ హాజరవనున్నారు. ఈ కార్యక్రమంలో వాల్‌మార్ట్ సహా పలు దిగ్గజ కంపెనీలు తమ యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నాయని యూపీ పరిశ్రమల మంత్రి సతీష్ మహన చెప్పారు. -
వాల్‌మార్ట్ ఇండియా విస్తరణ
వచ్చే 4-5 ఏళ్లలో 50 స్టోర్ల ఏర్పాటే లక్ష్యం జిరాక్పూర్ (పంజాబ్): అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ సంస్థ అనుబంధ కంపెనీ వాల్‌మార్ట్ ఇండియా మార్కెట్ విస్తరణపై దృష్టి కేంద్రీకరించింది. వచ్చే 4-5 ఏళ్లలో భారత్‌లో కొత్తగా 50కి పైగా స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సప్లై చైన్ మౌలిక వసతుల వృద్ధికి సంబంధించిన వాటిల్లో తమ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగుతాయని వాల్‌మార్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజ్నీశ్ కుమార్ తెలిపారు. బీ2బీ విభాగంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని పేర్కొన్నారు. ఈ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని (ఎఫ్‌డీఐ) 100 శాతానికి పెంచడం తమకెంతో ఉపకరిస్తుందని వివరించారు. ప్రస్తుతం వాల్‌మార్ట్‌కు భారత్‌లో 20 స్టోర్లు ఉన్నాయి. 9 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వాల్‌మార్ట్ ఇండియా తన తొలి స్టోర్‌ను 2009లో అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసింది.