![Walmart India Ties Up With HDFC Bank To Launch Co-Branded Credit Card - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/3/IMG_1578.jpg.webp?itok=Sd1kzL0j)
కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు ఆవిష్కరిస్తున్న పరాగ్ రావ్, క్రిష్ అయ్యర్, యానీ జాంగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెచ్‌డీఎఫ్‌సీ భాగస్వామ్యంతో వాల్‌మార్డ్ ఇండియా తన కస్టమర్ల కోసం కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను విడుదల చేసింది. వాల్‌మార్ట్ తాలూకు బెస్ట్‌ప్రైస్ హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ స్టోర్ల సభ్యుల కోసం ఈ కార్డులను విడుదల చేస్తున్నట్లు వాల్‌మార్ట్ ఇండియా సీఈఓ క్రిష్ అయ్యర్ చెప్పారు. వీటితో కస్టమర్లకు 18– 50 రోజుల ఫ్రీ క్రెడిట్ లభిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా బెస్ట్‌ప్రైస్‌లో రిజిస్టరైన సభ్యులు ఈ కార్డులకు అర్హులని తెలియజేశారు.
రెండు రకాల క్రెడిట్ కార్డులు (బెస్ట్‌ప్రైస్ సేవ్‌స్మార్ట్, బెస్ట్‌ప్రైస్ సేవ్ మాక్స్) అందుబాటులో ఉంటాయని, బీ2బీ కస్టమర్లు తమ కొనుగోళ్లకు అనుగుణమైన కార్డును ఎంచుకోవచ్చునని చెప్పారాయన. ఈ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితే క్యాష్‌బ్యాక్, రివార్డు పాయింట్ల లాంటి పలు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలుంటాయన్నారు. త్వరలో కర్నూలు, తిరుపతిల్లో బెస్ట్‌ప్రైస్ దుకాణాలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా క్రిష్ అయ్యర్ చెప్పారు. ఎకానమీలో మందగమనం త్వరలో సమసిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని బెస్ట్‌ప్రైస్ స్టోర్లలో ఈ కార్డులను అందుబాటులోకి తెస్తామన్నారు.
సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా బెస్ట్‌ప్రైస్‌లో కస్టమర్లు జరిపిన లావాదేవీలను మదింపు చేసి కార్డులు జారీ చేస్తామని కార్యక్రమంలో పాల్గొన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేమెంట్స్ బిజినెస్ విభాగం కంట్రీ హెడ్ పరాగ్ రావ్ చెప్పారు. ఈ కార్డుల వార్షిక ఫీజు రూ. 500– 1000 మధ్యలో ఉంటుందన్నారు. ‘‘సేవ్‌స్మార్ట్ కార్డుతో దాదాపు ఏటా రూ.14,250 మేర, మాక్స్ కార్డుతో ఏటా దాదాపు రూ.40,247 మేర సభ్యులు ఆదా చేసుకోవచ్చు. ఎస్‌ఎంఈ విభాగం దేశీయ ఎకానమీకి వెన్నెముక. ఈ విభాగానికి చేయూతనిచ్చే దిశగా ఈ కార్డులను తీసుకొచ్చాం’’ అని వివరించారు. ఎకానమీలో మందగమనం పూర్తిగా పోతుందనే సంకేతాలున్నాయని, ఇకపై రికవరీ చూడవచ్చని అంచనా వేశారు. కార్యక్రమంలో డైనర్స్ క్లబ్ ప్రతినిధి యానీ జాంగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment