సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న అమూల్ సంస్థ తాజాగా రైతన్నలు పండించే ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు చేయూత అందించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి విధివిధానాల రూపకల్పనపై వ్యవసాయ, ఉద్యాన, రైతు సాధికారత సంస్థ అధికారులతో అమూల్ ప్రతినిధులు బుధవారం సమావేశం కానున్నారు.
విస్తృత మార్కెటింగ్
రాష్ట్రంలో ప్రస్తుతం 8.82 లక్షల ఎకరాల్లో 8 లక్షల మంది రైతులు ప్రకృతి సాగు చేస్తున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకోగలుగుతున్నారు. మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోతున్న రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్దఎత్తున మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తోంది. రైతుబజార్లలో ప్రత్యేకంగా స్టాల్స్ కేటాయించడంతోపాటు కలెక్టరేట్ ప్రాంగణాలు.. సచివాలయాలు, ఆర్బీకేలు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో వీక్లీ మార్కెట్లను ప్రోత్సహిస్తోంది.
తాజాగా మరో అడుగు ముందుకేసి విస్తృత స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చిన అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రకృతి, సేంద్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి అయ్యే పంట దిగుబడుల్లో 30 శాతం స్థానికంగా వినియోగిస్తుండగా మరో రూ.1,100 కోట్ల విలువైన 1.42 లక్షల టన్నుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సమస్యను అధిగమించేందుకు మంత్ర, సహజ ఆహారం, రిలయన్స్ రిటైల్, బిగ్ బాస్కెట్ ఇతర కంపెనీల భాగస్వామ్యంతో రైతు సాధికార సంస్థ ముందుకెళ్తోంది. మరోవైపు టీటీడీ దేవస్థానానికి 12 రకాల ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో కనీసం రూ.5 వేల కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
10 – 15 శాతం ప్రీమియం ధరకు సేకరణ
ఈ ఏడాది 1,29,169 ఎకరాల్లో వరి, వేరుశనగ, జీడిమామిడి, మొక్కజొన్న, బెల్లం, కాఫీ, పసుపు సహా 12 రకాల ఉత్పత్తులు సాగవుతుండగా 2,03,640 టన్నుల దిగుబడి రావచ్చని అంచనా. రైతు సాధికార సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు ఎమ్మెస్పీకి మించి మార్కెట్‌లో పలికిన ధరలకు అదనంగా 15 శాతం, ఒకవేళ మార్కెట్ ధరలు ఎమ్మెస్పీ కంటే తక్కువగా ఉంటే ఎమ్మెస్పీకి అదనంగా 10 శాతం ప్రీమియం ధరతో రైతుల నుంచి టీటీడీ సేకరిస్తోంది.
అదే రీతిలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందిన రైతులు ఉత్పత్తి చేసిన పంట ఉత్పత్తులను అమూల్ సంస్థ సేకరించి మార్కెటింగ్ చేయనుంది. తొలి దశలో ధాన్యం, శనగలు, కందులు, కందిపప్పు, రాజ్మా, శనగపిండి లాంటి వాటిని రైతుల నుంచి ప్రీమియం ధరలకు సేకరించి ప్రాసెస్ చేసి అమూల్ ఆర్గానిక్స్ పేరిట మార్కెట్‌లోకి తీసుకురానుంది.
క్షేత్ర స్థాయిలో పరిశీలన
క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు అమూల్ ఆర్గానిక్స్ అధ్యయనం చేస్తోంది. గుజరాత్ నుంచి వచ్చిన అమూల్ బిజినెస్ హెడ్ దోషి, బ్రాండ్ మేనేజర్ స్నేహ కమ్లాని నేతృత్వంలోని అమూల్ ఆర్గానిక్స్ ప్రతినిధి బృందం ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించింది. ప్రకృతి సాగు చేసే మహిళా రైతులతో సమావేశమైంది. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దాల్‌మిల్ కమ్ బల్క్ స్టోరేజ్ పాయింట్, ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించింది.
ప్రకృతి, సేంద్రీయ సాగుకు ఊతం
ప్రకృతి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ఇది చరిత్రాత్మక ముందడుగు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న అమూల్ అదే రీతిలో ప్రకృతి సాగు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ముందుకు రావడం శుభ పరిణామం. ఇది రాష్ట్రంలో ప్రకృతి, సేంద్రీయ సాగుకు మరింత ఊతమిస్తుంది.
– టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ
మార్కెటింగ్‌కు తోడ్పాటు అందిస్తాం
తెనాలి: పాడి పరిశ్రమ రంగంలో దేశంలో అగ్రగామిగా ఉన్న అమూల్ తాజాగా ఆర్గానిక్ రంగంలోకి ప్రవేశించిందని సంస్థ ఆర్గానిక్ హెడ్ నిమిత్ దోషి చెప్పారు. ఆర్గానిక్ విధానంలో వ్యవసాయం చేసే రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు తోడ్పాటునందిస్తామని తెలిపారు. అమూల్ సంస్థ మేనేజర్ స్నేహతో కలిసి మంగళవారం గుంటూరు జిల్లా కొల్లిపరలోని శ్రేష్ట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని నిమిత్ సందర్శించారు.
కంపెనీ ఆధ్వర్యంలో పండించిన పంటలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ను పరిశీలించారు. 100 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు శ్రేష్ట డైరెక్టర్ ఉయ్యూరు సాంబిరెడ్డి తెలిపారు. ఎన్జీవోలు, ఇతర సంస్థలతో కలసి భూమి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ పరిమిత వ్యయంతో సాగు చేస్తున్నట్టు చెప్పారు.
కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ మార్కెటింగ్ విభాగం ప్రతినిధి ప్రభాకర్, ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ రాజకుమారి, శ్రేష్ట డైరెక్టర్లు నెర్ల కుటుంబరెడ్డి, బొంతు గోపాలరెడ్డి, రైతు సాధికార సంస్థ రీజినల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ వెంకట్రావు, విజయ్, ప్రవల్లిక, భానుమతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment