సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు అమూల్ సంస్థ సిద్ధంగా ఉందని అమూల్ ఆర్గానిక్స్ బిజినెస్ హెడ్ నిమిత్ దోషి వెల్లడించారు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ కలిగిన రైతుల నుంచి మార్కెట్ ధరపై నిర్దేశించిన ప్రీమియం ధరతో వ్యవసాయ ఉత్పత్తులను సేకరిస్తూ.. వారికి తగిన గిట్టుబాటు ధర లభించేలా కృషి చేస్తామని చెప్పారు. వ్యవసాయ అనుబంధశాఖల ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో అమూల్ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. అమూల్ ఆర్గానిక్స్ ద్వారా ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు ఉన్న అవకాశాలపై విస్తృత స్థాయిలో చర్చించారు.
నిమిత్ దోషి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కోసం ఐదేళ్ల ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. తొలి దశలో ధాన్యం, శనగలు, కందులు, కందిపప్పు, రాజ్మ, శనగపిండి తదితర ఉత్పత్తులను ప్రీమియం ధరలకు రైతుల నుంచి సేకరించి, ప్రాసెస్ చేసి అమూల్ ఆర్గానిక్స్ పేరిట మార్కెట్‌లోకి తీసుకొస్తామన్నారు. భవిష్యత్‌లో విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. నేషనల్ కో–ఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్లో చేరితే విస్తృతస్థాయి మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చు కోవచ్చునన్నారు.
రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 8.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని వీరు పండించిన ఉత్పత్తులకు సర్టిఫికేషన్ జారీ ప్రక్రియను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారిలో మహిళలే అత్యధికమని తెలిపారు. తొలి దశలో ఆర్గానిక్ సర్టిఫికెట్ కలిగిన గిరిజన ప్రాంతాలలోని రైతుల నుంచి రాజ్మ సేకరించాలని సూచించారు. మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే, రైతు బజార్ సీఈవో నందకిషోర్, నాబార్డు ఏజీఎం ఎం.చావ్‌సాల్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment