నెల రోజులు తాజాగా ఉంచే పౌడర్ ప్యాకెట్లను రూపొందించిన ఉగాండా స్టార్టప్
ఎఫ్‌ఎఓ ఇన్నోవేషన్ పురస్కార ప్రదానం
∙అద్భుత ఆవిష్కరణ:
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్న, సన్నకారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పండ్లు, కూరగాయలు వినియోగదారుల నోటికి చేరే లోగా దాదాపు 30–40 శాతం వరకు కుళ్లిపోతున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) అంచనా. దుంపలైతే ఏకంగా 40–50% పాడవుతున్నాయి. కోత అనంతర రవాణా వ్యవస్థ, శీతల సదుపాయాలు లేకపోవటం పెద్ద సమస్య. ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించడానికి ఉపయోగపడే గొప్ప ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఉగాండాకు చెందిన ఫ్రెజా నానోటెక్ లిమిటెడ్ అనే స్టార్టప్ సంస్థ సేంద్రియ పదార్థాలతో రూపొంచిన ఇన్‌స్టంట్ టీ బ్యాగ్ అంత సైజు ఉండే పౌడర్ ప్యాకెట్ కూరగాయలు, పండ్లను కుళ్లిపోకుండా నెల రోజుల వరకు రక్షించగలుగుతుంది. ఎటువంటి రిఫ్రిజిరేషన్ అవసరం లేకుండా, రసాయన రహితంగానే షెల్ఫ్ లైఫ్‌ను గణనీయంగా పెంచే ఈ ఆవిష్కరణ ‘ఎఫ్‌ఎఓ ఇన్నోవేషన్ అవార్డు–2024’ను ఇటీవల దక్కించుకుంది.
శీతల గదుల్లో పెట్టని పండ్లు, కూరగాయలు మగ్గిపోయి కొద్ది రోజుల్లోనే కుళ్లియే ప్రక్రియ ‘ఫాస్ఫోలిపేస్ డి’ అనే ఎంజైమ్ కారణంగానే జరుగుతుంటుంది. ఫ్రెజా నానోటెక్ సంస్థ రూపొదించిన పౌడర్ ఈ ప్రక్రియను నెమ్మదింపజేయటం ద్వారా కూరగాయలు, పండ్లను దీర్ఘకాలం పాటు తాజాగా ఉంచుతుంది.
టీ బ్యాగ్ అంతటి చిన్న ప్యాకెట్ (దీని ధర రూ. 20)ను 5 కిలోల పండ్లు, కూరగాయల మధ్య ఉంచితే చాలు.. నెల రోజులైనా అవి కుళ్లిపోకుండా ఉంటాయని ఎఫ్‌ఎఓ తెలిపింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి మెరుగవుతుంది, పోషకాలలభ్యత పెరుగుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, జీవనోపాధులు మెరుదలపై ఈ ఆవిష్కరణ సానుకూల ప్రభావం చూపుతుందంటూ ఎఫ్‌ఎఓ డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు ప్రశంసించారు. కోత అనంతర దశలో రైతులకు ఎదురయ్యే నష్టాలను ఇది తగ్గిస్తుంది. త్వరగా పాడుకావు కాబట్టి రిటైల్ వ్యవస్థలో జరిగే నష్టాల భారం తగ్గుతుంది. ఆవిధంగా వినియోగదారులపై కూడా భారం తగ్గుతుందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment