కూరగాయల వ్యర్థాలను మురగ బెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది. భూసార వర్థినిగా, పురుగుల మందుగా ఉపయోగపడుతుంది. థాయ్‌లాండ్‌కు చెందిన డాక్టర్ రోసుకాన్ పూమ్ పాన్‌వాంగ్ ఈ ఎంజైమ్‌ను తొలుత తయారు చేశారు.
కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు.. మార్కెట్లలో చెత్తకుప్పలో పోసిన మిగలపండిన పండ్లు, కూరగాయలు వంటివి ఎందుకూ పనికిరాని వ్యర్థాలే కదా అని అనుకోనక్కర్లేదు. వీటికి కొంచెం నల్లబెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ పంచదార కలిపితే 90 రోజుల్లో గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.
గార్బేజ్ ఎంజైమ్ తయారీ ఇలా..
మూత బిగుతుగా పెట్టడానికి వీలుండే గాజు లేదా పలాస్టిక్/ఫైబర్ డ్రమ్ముల్లో దీన్ని తయారు చేయవచ్చు.
కావాల్సిన పదార్థాలు : కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, ముక్కలు, కుళ్లినవి) 3 పాళ్లు + నల్ల బెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ (బ్రౌన్) పంచదార 1పాలు + నీరు 10 పాళ్ల చొప్పున కలపాలి.
మార్కెట్లు, దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి వాడుకోవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. అయితే, జారుగా ఉండే గ్రేవీ కలపకూడదు. మాంసం, మందంగా ఉండే పనస పండ్ల తొక్కలు కలపకూడదు.
ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసి గాలి చొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగలకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. మొదటి 30 రోజుల పాటు.. రోజుకోసారి మూత తీసి వాయువులు బయటకు వెళ్లాక, మళ్లీ గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడకట్టి, నిల్వ చేసుకొని అక్కడి నుంచి 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చే వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు లేదా మళ్లీ గేర్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడుకోవచ్చు. (ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ)
పలు ప్రయోజనాలు
గార్బేజ్ ఎంజైమ్ లో ఉన్న సూక్ష్మజీవరాశి, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ భూసార వర్థినిగా, కీటకనాశనిగా పనిచేస్తుంది. తెగుళ్లు బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు. దీన్ని వాడితే పంట మొక్కల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. గార్బేజ్ ఎంజైమ్‌ను నీటిలో తగినపాళ్లలో కలిపి వాడుకోవాలి.
ఎరువుగా.. 1:1000 పాళ్లలో(అంటే.. 1 మిల్లీలీటరు ఎంజైమ్‌కు 100 మిల్లీలీటర్ల నీరు) కలిపి నేలలో పోయవచ్చు లేదా పిచికారీ చేయవచ్చు.
పురుగులు/ తెగుళ్ల నాశినిగా..
1:100 మోతాదులో కలిపి పిచికారీ చేయాలి.
దిగుబడి పెంపుదలకు.. 1:500 పాళ్లలో కలిపి పిచికారీ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment