Fertilizer production
-
గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!
కూరగాయల వ్యర్థాలను మురగ బెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది. భూసార వర్థినిగా, పురుగుల మందుగా ఉపయోగపడుతుంది. థాయ్‌లాండ్‌కు చెందిన డాక్టర్ రోసుకాన్ పూమ్ పాన్వాంగ్ ఈ ఎంజైమ్‌ను తొలుత తయారు చేశారు. కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు.. మార్కెట్లలో చెత్తకుప్పలో పోసిన మిగలపండిన పండ్లు, కూరగాయలు వంటివి ఎందుకూ పనికిరాని వ్యర్థాలే కదా అని అనుకోనక్కర్లేదు. వీటికి కొంచెం నల్లబెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ పంచదార కలిపితే 90 రోజుల్లో గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.గార్బేజ్ ఎంజైమ్ తయారీ ఇలా.. మూత బిగుతుగా పెట్టడానికి వీలుండే గాజు లేదా పలాస్టిక్/ఫైబర్ డ్రమ్ముల్లో దీన్ని తయారు చేయవచ్చు. కావాల్సిన పదార్థాలు : కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, ముక్కలు, కుళ్లినవి) 3 పాళ్లు + నల్ల బెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ (బ్రౌన్) పంచదార 1పాలు + నీరు 10 పాళ్ల చొప్పున కలపాలి.మార్కెట్లు, దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి వాడుకోవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. అయితే, జారుగా ఉండే గ్రేవీ కలపకూడదు. మాంసం, మందంగా ఉండే పనస పండ్ల తొక్కలు కలపకూడదు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసి గాలి చొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగలకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. మొదటి 30 రోజుల పాటు.. రోజుకోసారి మూత తీసి వాయువులు బయటకు వెళ్లాక, మళ్లీ గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడకట్టి, నిల్వ చేసుకొని అక్కడి నుంచి 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చే వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు లేదా మళ్లీ గేర్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడుకోవచ్చు. (ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ)పలు ప్రయోజనాలుగార్బేజ్ ఎంజైమ్ లో ఉన్న సూక్ష్మజీవరాశి, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ భూసార వర్థినిగా, కీటకనాశనిగా పనిచేస్తుంది. తెగుళ్లు బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు. దీన్ని వాడితే పంట మొక్కల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. గార్బేజ్ ఎంజైమ్‌ను నీటిలో తగినపాళ్లలో కలిపి వాడుకోవాలి. ఎరువుగా.. 1:1000 పాళ్లలో(అంటే.. 1 మిల్లీలీటరు ఎంజైమ్‌కు 100 మిల్లీలీటర్ల నీరు) కలిపి నేలలో పోయవచ్చు లేదా పిచికారీ చేయవచ్చు. పురుగులు/ తెగుళ్ల నాశినిగా.. 1:100 మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. దిగుబడి పెంపుదలకు.. 1:500 పాళ్లలో కలిపి పిచికారీ చేయాలి. -
కోరమాండల్ రూ.800 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ రూ.800 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో రెండు నూతన ప్లాంట్ల ఏర్పాటుకు రూ.677 కోట్లు వెచ్చించాలని గురువారం సమావేశమైన బోర్డు నిర్ణయం తీసుకుంది. మిగిలిన మొత్తాన్ని మూలధన అవసరాలకు వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్లాంటును రూ.513 కోట్లతో విస్తరిస్తోంది. ఇందులో భాగంగా 7,50,000 టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రాన్యులేషన్ ట్రైన్‌ను 24 నెలల్లో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కాకినాడ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 22,50,000 టన్నులు ఉంది. వినియోగం 93 శాతానికి చేరిందని కంపెనీ తెలిపింది. ‘ఈ విస్తరణతో కాకినాడ ప్లాంట్‌ను భారత్‌లో అతిపెద్ద ఎరువుల తయారీ కేంద్రాల్లో ఒకటిగా మారుస్తుంది. ఎరువుల రంగంలో సంస్థ నాయకత్వాన్ని సుస్థిరం చేస్తుంది’ అని కోరమాండల్ తెలిపింది. ఫంగిసైడ్స్ మల్టీ ప్రొడక్ట్.. అలాగే గుజరాత్‌లోని అంకలేశ్వర్ వద్ద 600 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫంగిసైడ్స్ మల్టీ ప్రొడక్ట్ ప్లాంట్‌ను రూ.164 కోట్లతో నెలకొల్పాలని నిర్ణయించింది. 18 నెలల్లో ఇది కార్యరూపంలోకి రానుంది. క్రాప్ ప్రొటెక్షన్ టెక్నికల్స్‌ను ఇక్కడ తయారు చేస్తారు. కోరమాండల్ క్రాప్ ప్రొటెక్షన్ ఫిలిప్పైన్స్‌లో (సీసీపీపీ) అదనంగా 6.67 శాతం వాటాను రూ.76 లక్షలతో కొనుగోలు చేయాలని బోర్డు నిర్ణయించింది. తద్వారా సీసీపీపీ పూర్తి అనుబంధ కంపెనీగా మారుతుందని వివరించింది. తగ్గిన నికర లాభం.. సెప్టెంబర్ త్రైమాసికంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13 శాతం క్షీణించి రూ.659 కోట్లకు చేరింది. ఎబిటా 8 శాతం తగ్గి రూ.975 కోట్లు నమోదైంది. టర్నోవర్ 6.4 శాతం ఎగసి రూ.7,433 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోరమాండల్ షేరు ధర 2.46 శాతం లాభపడి రూ.1,640 వద్ద స్థిరపడింది. -
కోరమాండల్ కాకినాడ ప్లాంట్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ కాకినాడ యూనిట్లో ఫాస్ఫరిక్, సల్ఫరిక్ యాసిడ్ ప్లాంట్ల ఏర్పాటుకు బోర్డు ఆమోదం పొందింది. రోజుకు ఫాస్ఫరిక్ యాసిడ్ 750 టన్నులు, సల్ఫరిక్ యాసిడ్ 1,800 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నూతన కేంద్రాలను జోడించనున్నారు. ఇందుకోసం రూ.1,029 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. 24 నెలల్లో ఈ విస్తరణ పూర్తి కానున్నట్టు వెల్లడించింది. కాకినాడ యూనిట్ సామర్థ్యం రోజుకు ఫాస్ఫరిక్ యాసిడ్ 1,550 టన్నులు, సల్ఫరిక్ యాసిడ్ 4,200 టన్నులు ఉంది. ప్రస్తుతం పూర్తి సామర్థ్యాన్ని కంపెనీ వినియోగించుకుంటోంది. ఎరువుల తయారీలో ఈ యాసిడ్స్‌ను ఉపయోగిస్తారు. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, తయారీ సామర్థ్యం పెంపొందించుకునేందుకు విస్తరణ చేపడుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. పూర్తి స్థాయి ప్లాంటుగా.. పాస్ఫేటిక్ ఎరువుల తయారీ, విక్రయంలో భారత్‌లో కోరమాండల్ రెండవ స్థానంలో నిలిచింది. ముడిసరుకు, ఎరువుల తయారీలో పూర్తి స్థాయి ప్లాంటుగా కాకినాడ కేంద్రాన్ని తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని కోరమాండల్ ఇంటర్నేషనల్ తెలిపింది. ప్రతిపాదిత విస్తరణతో కంపెనీ వ్యయ సామర్థ్యాలను, ముడిసరుకు భద్రతను మరింత మెరుగుపరుస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ వివరించారు. డ్రోన్స్ తయారీలో ఉన్న తమ అనుబంధ కంపెనీ ధక్ష బలమైన ఆర్డర్ బుక్ నమోదు చేసిందని చెప్పారు. రక్షణ రంగం, వ్యవసాయంతోపాటు వివిధ కంపెనీల నుంచి ఆర్డర్లు పొందామన్నారు. గ్రోమోర్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని కంపెనీ ప్రోత్సహిస్తోంది. -
కోరమాండల్ నానోటెక్నాలజీ సెంటర్
చెన్నై: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ తాజాగా నానోటెక్నాలజీ సెంటర్‌ను కోయంబత్తూరులో ఏర్పాటు చేసింది. ఇది మొక్కల పోషణ, పంటల రక్షణ కోసం నానో ఆధారిత ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడుతుందని కంపెనీ శుక్రవారం తెలిపింది. ఐఐటీ ముంబైలో సైతం కంపెనీకి నానోటెక్నాలజీ కేంద్రం ఉంది. కోయంబత్తూరు సెంటర్ కోరమాండల్‌కు ఆరవ పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా నిలిచింది. -
ద్రవరూప డీఏపీ, యూరియా వాడండి
న్యూఢిల్లీ: రైతులు సాగులో ద్రవరూప నానో డీఏపీ, యూరియాను వినియోగించాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌షా సూచించారు. ఈ ఉత్పత్తులను విరివిగా ఉపయోగించడం ద్వారా ఎరువుల తయారీలో దేశాన్ని స్వావలంబన భారత్‌గా మార్చాలని రైతులకు పిలుపునిచ్చారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. ఇఫ్కో నానో (ద్రవరూప) డీఏపీ వాణిజ్య విక్రయాలను మంత్రి బుధవారం ఢిల్లీలో ప్రారంభించి, మాట్లాడారు. ఇఫ్కో ద్రవరూప నానో డీఏపీ 500 ఎంఎల్ బాటిల్‌ను రూ.600కు విక్రయించనున్నారు. అదే సంప్రదాయ 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,350గా ఉంది. సాగులో ద్రవరూప ఉత్పత్తులను వినియోగించడం వల్ల నాణ్యతతోపాటు దిగుబడి కూడా పెరుగుతుందని మంత్రి అమిత్‌షా అన్నారు. భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. ద్రవరూప డీఏపీతో సాగు ఖర్చులు 6 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గుతాయని చెప్పారు. అలాగే ద్రవరూప ఎరువుల రవాణా, నిల్వ కూడా సులభం. ద్రవరూప ఎరువులు భారత్‌ను స్వావలంబన దిశగా నడిపిస్తాయన్నారు. 2021–22లో 91.36 లక్షల టన్నుల యూరియా, 54.62 లక్షల టన్నుల డీఏపీ, 24.60 లక్షల టన్నుల ఎంవోపీ, 11.70 లక్షల టన్నుల ఎన్పీకే ఎరువులను దిగుమతి చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇఫ్కో తయారు చేసిన నానో డీఏపీకి 20 ఏళ్ల కాలానికి పేటెంట్ వచ్చినట్టు మంత్రి అమిత్‌షా తెలిపారు. -
చెత్త నుండి సంపద సృష్టిస్తున్న కోవెలకుంట్ల గ్రామపంచాయతీ
-
సిద్దిపేట ‘సేంద్రియ ఎరువు’.. పేరేంటో తెలుసా?
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీలో సేకరించిన తడి చెత్త ద్వారా తయారైన నాణ్యమైన సేంద్రియ ఎరువు త్వరలో మార్కెట్లోకి రానుంది. మున్సిపాలిటీలో సేకరించిన తడి చెత్తను సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ తడి చెత్తతో ఇప్పటికే సీఎన్జీని తయారు చేసి విక్రయిస్తుండగా.. తాజాగా ఎరువును కూడా తయారు చేసి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సేంద్రియ ఎరువును సిద్దిపేట కార్బన్ లైట్స్ బ్రాండ్ పేరుతో ఈ నెల 21న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ప్రతి ఇంటినుంచి చెత్త సేకరణ.. సిద్దిపేట పట్టణంలోని 43 వార్డుల్లో 41,322 కుటుంబాలు ఉండగా 1,57,026 మంది నివసిస్తున్నారు. ఇక్కడ తడి, పొడి, హానికర చెత్తను ఇంటింటి నుంచి సేకరించడాన్ని డిసెంబర్ 2020లో ప్రారంభించారు. ఈ చెత్తను సేకరించేందుకు 52 వాహనాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో రోజుకు 60 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా ఇందులో 70 శాతం తడి, 30 శాతం పొడి చెత్త ఉంటోంది. ఈ లెక్కన 42 మెట్రిక్ టన్నుల తడి చెత్త, 18 మెట్రిక్ టన్నుల పొడి చెత్తను సేకరిస్తున్నారు. తడి చెత్తతో ఎరువు తయారీ బుస్సాపూర్ డంపింగ్ యార్డులో రూ.6 కోట్ల వ్యయంతో బయో – సీఎన్జీ ప్లాంట్, సేంద్రియ ఎరువుల కేంద్రం నిర్మించారు. ఈ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను కార్బన్ లైట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. రాష్ట్రంలోనే మొదటిదైన ఈ ప్లాంట్‌ను 2021 డిసెంబర్ 20న బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో కలసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఇళ్ల నుంచి సేకరించిన 42 మెట్రిక్ టన్నుల తడి చెత్త నుంచి ఆహార వ్యర్థాలు, కురగాయలు, ఇతర వ్యర్థాలను వేరు చేస్తున్నారు. ఇలా వేరుచేసిన తర్వాత 10 మెట్రిక్ టన్నుల తడి చెత్తను బయో–సీఎన్జీ తయారు చేయడానికి మిగతా 32 మెట్రిక్ టన్నుల చెత్తను సేంద్రియ ఎరువులను తయారు చేయడానికి వినియోగిస్తున్నారు. సిద్ధం చేసిన సేంద్రియ ఎరువును 40 కేజీల చొప్పున బ్యాగుల్లో ప్యాక్ చేసి విక్రయించేందుకు సిద్ధం చేశారు. ఒక్కో బ్యాగు అసలు ధర రూ.600 కాగా సిద్దిపేట రైతులకు రూ.300కే విక్రయించనున్నారు. 21న రైతులకు అవగాహన సదస్సు సేంద్రియ ఎరువుల ఆవశ్యకతపై రైతులకు ఈ నెల 21న సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో అవగాహన కల్పించనున్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేయనున్నారు. సిద్దిపేట బ్రాండ్‌తో సేంద్రియ ఎరువు: మంత్రి హరీశ్‌రావు మంత్రి హరీశ్‌రావు ఆదివారం సాయంత్రం సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సిద్దిపేట బ్రాండ్‌తో చెత్త ద్వారా తయారు చేసిన ఎరువును రైతులకు అందించబోతున్నామన్నారు. సిద్దిపేట ప్రజలు రోజు వేసే చెత్తతో ఒక గొప్ప సంపదను తయారు చేసి రైతులకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సేంద్రియ ఎరువుతో అన్నీ పంటల నుంచి అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తులు పొందే అవకాశం ఉందని చెప్పారు. -
ఆహార వ్యర్థాల్ని ఎరువుగా మార్చే హైటెక్ డస్ట్ బిన్!
ఇది చూడటానికి కాస్త ఆకర్షణీయమైన డస్ట్‌బిన్‌లా కనిపిస్తుంది గాని, నిజానికిది అధునాతనమైన ఎరువు తయారీ పరికరం. వంటింట్లో మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను ఇందులో వేసి, స్విచాన్ చేసుకుంటే చాలు, కొద్దిసేపట్లోనే ఆ వ్యర్థాలన్నీ ఎరువుగా మారిపోతాయి. ‘మిల్’ అనే అమెరికన్ కంపెనీ ఈ హైటెక్ ఫుడ్ స్క్రాప్ కంపోస్టర్ బిన్ను ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. వృథా అయిన ఆహారాన్ని చెత్తకుప్పల్లో పడవేయకుండా, ఇలా ఈ ఫుడ్ కంపోస్టర్లో పడేస్తే, ఇంచక్కా ఎరువుగా మారిపోతుంది. ఈ ఎరువును పెరటి తోటలకు, ఇళ్లల్లో ఏర్పాటు చేసుకునే పూలమొక్కల కుండీల్లోకి భేషుగ్గా వాడుకోవచ్చు. ఇంట్లో ఆహార వ్యర్థాల వల్ల తయారయ్యే ఎరువు పరిమాణం ఎక్కువగా ఉంటే, ఇతరులకు ఆ ఎరువును అమ్ముకోవచ్చు కూడా! ‘మిల్’ ఫుడ్ స్క్రాప్ కంపోస్టర్ ధర 396 డాలర్లు (రూ.32,415) మాత్రమే! -
పంటపొలం.. ఎరువులమయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంటపొలం ఎరువులమయంగా మారింది. మితిమీరిన ఎరువుల వాడకం వల్ల నేల భూసారం కోల్పోతోంది. పంటలకు పనికి రాకుండాపోయే ప్రమాదకరస్థితి ఏర్పడుతోంది. పంటపొలంలో సాధారణంగా ఉండాల్సిన గాఢత గాడితప్పింది. చీడపీడల నివారణ, పంట దిగుబడులను పెంచే క్రమంలో ప్రారంభమైన ఎరువుల వినియోగం ఇప్పుడు ప్రతిపంట సాగులోనూ తప్పనిసరైపోయింది. దీనికితోడు రసాయన మందులు సైతం వినియోగిస్తుండటంతో ఒకవైపు రైతుకు సాగుభారం తడిసి మోపెడవుతుండగా, మరోవైపు పోషకవిలువలతో ఉండాల్సిన దిగుబడులు రసాయనాలతో కలుషితమవుతున్నాయి. ఫలితంగా మానవాళి ఆరోగ్యంపై అనేక రకాల దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయి. 2021–22 వార్షిక వ్యవసాయ నివేదిక ప్రకారం దేశంలో సగటున హెక్టారు పంటకు 127.87 కిలోగ్రాముల ఎరువులను వినియోగిస్తున్నారు. ఇందులో 83.42 కిలోల నత్రజని, 33.6 కిలోల ఫాస్ఫరస్, 10.85 కిలోల పొటాషియాన్ని వినియోగిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే పలు రాష్ట్రాలు జాతీయ సగటును మించి ఎరువులను వినియోగిస్తున్నాయి. అత్యధికంగా ఎరువులు వాడుతున్న రాష్ట్రాల జాబితాలో వరుసగా పుదుచ్చేరి, పంజాబ్, హరియాణా, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. తెలంగాణలో ఒక హెక్టారుకు సగటున 206.69 కిలోల చొప్పున వినియోగిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో హెక్టారుకు 199.67 కిలోల ఎరువులను వాడుతున్నారు. సారమంతా ఎరువులమయం... ఎరువుల వినియోగం పెరగడంతో భూసారం ఆందోళనకరంగా మారుతోంది. పంటమార్పిడి విధానంతో సహజసిద్ధమైన సాగువిధానాలను అనుసరించాల్సిన రైతులు ఎరువులు, పురుగుమందులపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో దిగుబడుల సంగతి అటుంచితే నేల సహజస్థితిని కోల్పోయి చివరకు ఉప్పు నేలగా మారిపోతోందంటూ పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలవారీగా ఎరువుల వినియోగాన్ని ఉటంకిస్తూ వినియోగాన్ని తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలంటూ పలు సూచనలు చేశారు. అధిక వినియోగంతో అనర్థాలే... సాధారణంగా ఎరువుల వినియోగం 4:2:1 నిష్పత్రితలో ఉంటే పరవాలేదు. దేశంలో ఎరువుల వినియోగం 7:2.3:1.5 నిష్పత్తికి చేరింది. రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే ఈ నిష్పత్తిలో వత్యాసాలు కనిపిస్తున్నాయి. మితిమీరిన ఎరువుల వినియోగంతో భవిష్యత్తులో సాగువిధానం తీవ్ర సంకటస్థితిని ఎదుర్కొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఎరువుల వినియోగం మితిమీరితే భూసారం దెబ్బతింటుంది. భూమిలోని వాస్తవ పోషకాలు గల్లంతై ఉప్పునేలగా మారుతుంది. దీంతో సేంద్రియ పదార్థం, హ్యూమస్, ప్రయోజనకరమైన జాతులు, మొక్కల పెరుగుదల కుంటుపడతాయి. తెగుళ్ల పెరుగుదలతోపాటు గ్రీన్హౌస్ వాయువుల విడుదలకు దారితీస్తుంది. ఫలితంగా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. -
ఎరువుల కొనుగోళ్లకు సమాయత్తం
ఖమ్మం వ్యవసాయం: ప్రస్తుత వ్యవసాయ సీజన్లో ఎరువుల కొనుగోళ్లకు రూ.700 కోట్లు రుణం తీసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి తెలిపారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ 23వ పాలకవర్గ సమావేశం సోమవారం ఖమ్మంలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో చైర్మన్ గంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022–23 ఏడాది వానాకాలంలో 4.57 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రస్తుత యాసంగికి 95 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరముంటుందని వెల్లడించారు. దీంతో పలు కంపెనీల నుంచి కొనుగోలుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. అలాగే కనీస మద్దతు ధరతో పెసలు కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 3,397 మెట్రిక్ టన్నుల పెసలు, 4 వేల మెట్రిక్ టన్నుల మినుముల కొనుగోళ్లకు అనుమతించిందని, ఈ పంట కొనుగోళ్లపై జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశామని గంగారెడ్డి పేర్కొన్నారు. కనీస మద్దతు ధరతో 72,387 మెట్రిక్ టన్నుల సోయాబీన్ కొనుగోలుకు అనుమతి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించామని తెలిపారు. సమావేశంలో మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మేనేజింగ్ డైరెక్టర్ యాదిరెడ్డి, డైరెక్టర్లు రంగారావు, విజయ్, గంగాచరణ్, జగన్మోహన్రెడ్డి, మర్రి రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
చెరువు మట్టి.. భూమికి బలం
ఎల్.ఎన్.పేట: పంట దిగుబడి కోసం రైతులు విచక్షణా రహితంగా ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తుంటారు. దీని వలన భూసారం క్షీణిస్తోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూసారం పెంచాలంటే కొత్తమట్టిని వేయడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. చెరువుల్లోని పూడిక మట్టి వేస్తే పొలం సారవంతంగా మారుతుందని సూచిస్తున్నారు. ఈ మట్టి వేయడం ద్వారా భూసారంతో పాటు పోషక విలువలు పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. పురుగు మందులు, ఎరువులు ఎక్కువగా వాడటం వలన భూమి పొరల్లో ఉండే మిత్ర పురుగులు నశించడం వలన రైతుకు నష్టం ఉంటుందంటున్నారు. పూడిక మట్టిలో పోషకాలు చెరువులో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆకులు, గడ్డి వంటి వ్యర్థాలు కుళ్లి మట్టిలో చేరుతాయి. వేసవలి సమయంలో చెరువులు అడుగంటుతాయి. ఈ సమయంలో చెరువు పూడిక మట్టిలో తగినంత పాళ్లలో నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, బోరాన్, సేంద్రియకార్భన్ పదార్థాలు, మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే సూక్ష జీవులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు వృద్ధి చెందుతాయి. భూమి పొరల్లో తేమను ఎక్కువ రోజుల పాటు ఉండేలా చేసే గుణం ఈ మట్టికి ఉంది. కిలో పూడిక మట్టిలో నత్రజని 720 మి.గ్రా, భాస్వరం 320 మి.గ్రా, పోటాషియం 810 మి.గ్రా, సేంద్రియకార్భనం 308 మి.గ్రాలతో పాటు మైక్రోబియల్ బయోమాన్ కార్బన్లు ఉంటాయి. ఎరువుల ఖర్చు తక్కువ ఎకరా పొలంలో వరి పండించాలంటే తక్కువగా అనుకున్నా ఒక బస్తా డీఏపీ, రెండు బస్తాల యూరియా, బస్తా పోటాష్, బస్తా జింక్ తప్పనిసరి అవుతుంది. వీటితో పాటు పంటను ఆశించే తెగుళ్లను నివారించేందుకు పురుగు మందుల పిచికారీ తప్పటం లేదు. ఎరువులు, పురుగు మందుల కోసం సుమారు రూ. 6 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చెరువు మట్టి వేసుకోవటం వలన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. రైతులకు పెట్టుబడి తగ్గటంతో పాటు భూమి సారవంతం అవుతుంది. ఎరువులు, పురుగుల మందుల్లేని పంటను సాధించవచ్చు. చెరువు మట్టి వేసే వాళ్లం గతంలో చెరువుల్లో లభ్యమయ్యే పూడిక మట్టిని పొలాలకు వేసేవాళ్లం. దీంతో భూసారం పెరిగి పంటదిగుబడి బాగా వచ్చేది. వేసవిలో చెరువు మట్టిని నాటుబళ్ల పెరిగి పొలంలో వేసేవాళ్లం. వర్షాల తరువాత పొలంలో వేసిన మట్టి నేలలో కలిసేలా దుక్కి దున్నేవాళ్లం. ఎరువులు వేయకుండానే పంట ఏపుగా పెరిగేది. ఇప్పుడు రైతులెవ్వరూ చెరువు మట్టి వేయటం లేదు. ఎరువుల వినియోగంతో పెట్టుబడి పెరిగిపోతుంది. భూసారం తగ్గిపోతుంది. లావేటి నర్సింహులు, రైతు, కృష్ణాపురం భూసారం పెరుగుతుంది చెరువు మట్టి వేసుకోవటం వలన భూమి సారవంతంగా మారుతుంది. చౌడు భూముల్లో కూడా పచ్చని పంటలు పండించవచ్చు. చెరువు మట్టిలో తేమ ఎక్కువగా ఉండటం వలన పంటకు నీటినిల్వలు బాగా ఉంటాయి. సేంద్రియ శాతం ఎక్కువగా ఉండటంతో ఎరువులా ఉపయోగపడుతుంది. ఒక సంవత్సరం చెరువు మట్టి వేయటం వలన మూడేళ్ల వరకు భూమి సారవంతంగా ఉంటుంది. పంటకు మేలు చేస్తుంది. పైడి లతశ్రీ, ఏఓ, ఎల్.ఎన్.పేట -
మీ గార్డెన్లో గులాబీలు విరగ బూయాలంటే?
ఉదయం లేవగానే బాల్కనీలోని మొక్కల పచ్చదనం చూస్తే భలే హాయిగా ఉంటుంది కదా. మరి అరవిచ్చిన మందారమో, విచ్చీవిచ్చని రోజా పువ్వు మొగ్గలు పలకరిస్తేనో.. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. పువ్వుల్లో రాణి స్థానం గులాబీదే. రెడ్, వైట్, ఎల్లో, పింక్, ఆరెంజ్, బ్లూ , గ్రీన్, బ్లాక్ రంగుల్లో గులాబీలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. గ్లాడియేటర్, సర్పంచ్, డబుల్ డిలైట్ కలర్, హైబ్రీడ్, మార్నింగ్ గ్లోరీ, సన్‌సెట్, కశ్మీర్, కాకినాడ, రేఖ, ముద్ద, తీగజాతి ఇలా పలు రకాల గులాబీలున్నాయి. అయితే నర్సరీనుంచి తెచ్చినపుడు మొగ్గలతో కళకళలాడుతూండే గులాబీ మొక్క మన గార్డెన్లో నాటిన తరువాత మొగ్గలు వేయడం మానేస్తుంది. ఆరోగ్యంగా ఎదగదు. ఒకవేళ మొక్క బాగా విస్తరించినా, పెద్దగా పూలు పూయదు. దీనికి కారణంగా మొక్కకు అవసరమైన పోషకాలు అందకపోవడమే. మరి ఏం చేయాలి. చక్కగా గుత్తులుగా గుత్తులుగా పూలతో మన బాల్కనీలోని గులాబీ మొక్క కళ కళలాడాలంటే ఏం చేయాలి. సేంద్రీయంగా ఎలాంటి ఎరువులివ్వాలి లాంటి వివరాలు తెలుసుకోవడం అవసరం. (Almonds Benefits: బాదాం ఎలా తింటే మంచిది? పోషకాలు పుష్కలంగా లభించాలంటే?) పెరటి తోటల్లో చిన్న చిన్న కుండీలలో పెంచే మొక్కలు ఏపుగా ఎదగాలన్నా, పువ్వులు విరగ బూయాలన్నా కిచెన్ కంపోస్ట్ ఎరువు, వర్మీ కంపోస్ట్ ఎక్కువగా ఉపయోగ పడతాయి. వీటితోపాటు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఫలితాలనిస్తాయి. ఫెర్మింటెడ్ ఫ్రూట్స్, బెల్లంతో కలిపి పులియ బెట్టిన పళ్లు, లేదా తొక్కలు ద్వారా తయారు చేసుకున్న లిక్విడ్ ఫెర్టలైజర్స్ వాడటం వల్ల వచ్చే ఫలితాలను గమనిస్తే ఆశ్చర్య పోక తప్పదు. మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాషియం మూడు పోషకాలలో చాలా. అవసరం. వీటన్నింటిలోకి రాణి లాంటిది ముఖ్యంగా గులాబీ మొక్కలకు బాగా ఉపయోగపడేది అరటి పళ్ల తొక్కలతో చేసే ఎరువు. ఈ లిక్విడ్‌ను మొక్కలకిచ్చిన వారంరోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. నైట్రోజన్ ఇతర రూపాల్లో లభించినప్పటికీ ముఖ్యమైన పొటాషియం అరటి తొక్కల ఫెర్టిలైజర్ ద్వారా లభిస్తుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. బనానా పీల్ ఫెర్టిలైజర్ బాగా మగ్గిన అరటి పళ్ల తొక్కలను తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని, గిన్నెలోకి తీసుకొని ముక్కలు మునిగేలా నీళ్లు పోసుకోవాలి. దీన్ని రెండు మూడు పొంగులు వచ్చే దాకా మరిగించుకోవాలి. బాగా చల్లారిన తరువాత ఆ మిశ్రమాన్ని వడపోసుకుని కుండీకి ఒక కప్పు చొప్పున గులాబీ మొక్క మొదట్లో పోసుకోవాలి. పెద్ద కుండీ అయితే కొంచెం ఎక్కువ పోసుకున్నా ప్రమాదమేమీలేదు. కానీ మొక్కకిచ్చిన ఫెర్టిలైజర్ బయటికి పోకుండా చూసుకోవాలి. అంటే మనం అందించిన పోషకం మొత్తం వృధాకా కుండా మొక్క కందేలా చూసుకోవాలన్నమాట. వారం రోజుల్లో కొత్త చిగుర్లు, చిగుర్లతోపాటు కొత్తబడ్స్ మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. మరొక విధానంలో ముక్కలుగా కట్ చేసిన అరటి పళ్ల తొక్కల్ని 24 గంటలపాటు నీళ్లలో నానబెట్టి, ఆ తరువాత ఆ నీరును మొక్కలకు వాడవచ్చు. ఏ మొక్కకైనా పూత పిందె దశలో ఈ ఫెర్టిలైజర్‌ను అందిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే అరటి తొక్కలను మొక్క మొదట్లో పాతిపెట్టినా ఉపయోగమే.సేంద్రీయంగా పండించిన అరటి పళ్ల తొక్కలను ఉపయోగిస్తే మరీ మంచిది. పొటాషియం మొక్కలు కాండాన్ని బలంగా చేయడమే కాదు, వ్యాధుల నుండి రక్షిస్తుంది. పుష్పించే ప్రక్రియ వేగవంతం చేస్తుంది. పండ్ల మొక్కల్లో పండ్ల నాణ్యతను మెరుగు పరుస్తుంది. కాల్షియం, పొటాషియం, మాంగనీసు లాంటివాటికి అద్భుతమైన మూలం అరటి తొక్కలు. ఇవి మొక్కలు ఎక్కువ నత్రజనిని తీసుకోవడానికి, కిరణజన్య సంయోగ క్రియకు సహాయపడతాయి. -
గ్రామస్థాయిలో ఎరువుల గోదాములు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో ఎరువుల పంపిణీని మరింత పగడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో సాగువేళ రైతులు పడిన ఇబ్బందులకు చెక్‌పెడుతూ వారి ముంగిటకే కావాల్సిన ఎరువులను అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఎరువుల నిల్వకోసం గ్రామస్థాయిలో గోదాములు నిర్మించాలని సంకల్పించింది. ఆర్బీకేల ద్వారా ఎరువుల పంపిణీకి శ్రీకారం చుట్టిన తర్వాత రైతుల ఇబ్బందులకు తెరపడింది. గతంలో ఎరువుల కోసం గంటల తరబడి సహకార సంఘాలు, వ్యాపారుల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చేది. కానీ నేడు ఎరువులు రైతులు కోరిన వెంటనే లభిస్తున్నాయి. 10,778 ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన ఎరువుల పంపిణీతో రైతులకు భరోసా లభించింది. గత రెండేళ్లలో ఆర్బీకేల ద్వారా 6.9 లక్షలమంది రైతులకు 3.25 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేశారు. నకిలీ ఎరువులకు చెక్ పేరున్న కంపెనీల ఎరువులన్నింటిని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచడమేకాదు.. సీజన్లో రాష్ట్రానికి కేటాయించిన ప్రతి ఎరువును ముందుగా సమగ్ర పరీక్ష కేంద్రంలో పరీక్షించిన తర్వాతే రైతులకు సరఫరా చేస్తుండడంతో నకిలీలకు చెక్ పడింది. శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదు మేరకు ఎంపిక చేసుకున్న ఎరువులను ఎమ్మార్పీకి పొందే వెసులుబాటు లభించింది. గతంలో మాదిరిగా అవసరంలేని ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన ఇబ్బందులు పోయాయి. దూరాభారం తగ్గింది. సమయం ఆదా అవుతోంది. రవాణా, ఇతర ఖర్చుల భారం లేకుండా తమ ముంగిటే కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. కృత్రిమ కొరత, అక్రమ నిల్వలతో రైతులను దోచుకునే ప్రైవేటు డీలర్ల ఆగడాలకు అడ్డుకట్టపడింది. ఆర్బీకేల ద్వారా ఎరువుల లభ్యత, ఎమ్మార్పీ పట్టిక అమలుతో మార్కెట్లో ఎరువుల ధరల స్థిరీకరణ సాధ్యమవుతోంది. ఆర్బీకేలకే లైసెన్సు ఎరువుల లభ్యతను మరింత సులభతరం చేసేందుకు ఆర్బీకేల పేరిట ఎరువుల లైసెన్సు జారీచేస్తున్నారు. వివిధ పంటలు సాగవుతున్న 10,698 ఆర్బీకేల పరిధిలో ఎరువులు అవసరమని గుర్తించారు. ఇప్పటివరకు రిటైల్ ఫెర్టిలైజర్ లైసెన్సుల కోసం 10,592 ఆర్బీకేలు దరఖాస్తు చేశాయి. వీటిలో 10,454 ఆర్బీకేలకు లైసెన్సు జారీచేశారు. 138 ఆర్బీకేలకు లైసెన్సు ఇవ్వాల్సి ఉంది. మరో 106 ఆర్బీకేలు ఇంకా దరఖాస్తు చేయాల్సి ఉంది. జాప్యం నివారణ కోసం హబ్‌ల నుంచి ఆర్బీకేలకు ఎరువుల సరఫరాలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఆర్బీకేలకు అనుబంధంగా ప్రత్యేకంగా గోదాములు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం 20 మెట్రిక్ టన్నుల (ఎంటీల) ఎరువులు నిల్వచేసేందుకు వీలుగా 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మించనున్నారు. ఈ ప్రతిపాదనలకు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదముద్ర వేశారు.ఉపాధిహామీ పథకం కింద వీటిని నిరి్మంచేందుకు అంచనాలు రూపొందించాలని గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు. కరువు తీరా ఎరువులు గత రబీ సీజన్లో 23.47లక్షల ఎంటీల ఎరువులు వినియోగం కాగా ఈ ఏడాది 23,44,780 టన్నులు అవసరమని అంచనా వేశారు. ఖరీఫ్‌లో వాడగా మిగిలిన 6,96,938 ఎంటీల నిల్వలుండగా, కేంద్రం నుంచి గత మూడు నెలల్లో 7,51,706 ఎంటీల ఎరువులు రాష్ట్రానికి కేటాయించారు. ఇప్పటివరకు 8,32,011 ఎంటీల విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం 6,16,632 ఎంటీల ఎరువులు (యూరియా 2,53,953 ఎంటీలు, డీఏపీ 27,420, ఎంఒపీ 21,581, ఎస్ఎస్పీ 50,681, కాంప్లెక్స్ 2,58,521, ఇతర ఎరువులు 4,476 ఎంటీలు) అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ నెలకు మరో 3,59,774 ఎంటీల ఎరువులను కేంద్రం కేటాయించింది. ఎరువులకు బెంగలేదు 4 ఎకరాల్లో వరి, 3 ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేస్తున్నా. గతంలో ఎరువులు కావాలంటే ఉయ్యూరు వెళ్లి ప్రైవేట్ డీలర్ వద్ద కొని ఆటోలో తెచ్చుకునేవాడిని. పైగా అడిగిన ఎరువులుండేవి కావు. వారు ఇచ్చినవి తెచ్చుకోవాల్సి వచ్చేది. నాణ్యత తెలిసేది కాదు. కానీ నేడు మా గ్రామంలో ఆర్బీకే పెట్టిన తర్వాత ఎరువుల విషయంలో బెంగలేదు. మాకు కావాల్సిన ఎరువులు ముందుగానే టెస్ట్ చేసినవి ఎమ్మార్పీకే దొరుకుతున్నాయి. ఆటో ఖర్చులు మిగిలుతున్నాయి. – బసివిరెడ్డి, చిన్న ఓగిరాల, కృష్ణా జిల్లా బస్తాకు రూ.30 ఖర్చయ్యేది నేను నంబూరులో 3 ఎకరాల్లో వరి, పెసర సాగుచేస్తున్నా. సీజన్లో ఎరువులు కావాలంటే గతంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్లే వాళ్లం. రవాణా కోసం బస్తాకు రూ.30 ఖర్చయ్యేది. మా నంబూరులో ఏర్పాటు చేసిన ఆర్బీకే ద్వారా నాణ్యమైన ఎరువులు తక్కువ ధరకే సరఫరా చేస్తున్నారు. రవాణా ఖర్చులు తగ్గడమే కాదు.. సమయం కూడా ఆదా అవుతోంది. ఎరువుల దొరకవనే ఆందోళన లేదు. – నంబూరి రాంబాబు, నంబూరు, గుంటూరు జిల్లా -
కోరమాండల్ గ్రోశక్తి ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ తాజాగా గ్రోశక్తి ప్లస్ అనే ఉత్పాదనను బుధవారం ప్రవేశపెట్టింది. జింక్‌తోపాటు నత్రజని, భాస్వరం, పొటాషియంతో ఈ ఎరువు తయారైంది. సంక్లిష్ట ఎరువుల్లో అత్యధిక పోషకాలు, ఎన్పీకే ఎరువుల్లో అధిక భాస్వరం గ్రోశక్తి ప్లస్ కలిగి ఉందని కంపెనీ తెలిపింది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయల వంటి పంటలకు ఇది అనుకూలం అని వివరించింది. ఎన్‌ఫోస్ టెక్నాలజీతో రూపొందిన ఈ ఉత్పాదన ద్వారా పంటలకు సమతుల పోషకాలు అందుతాయని కోరమాండల్ మాతృ సంస్థ మురుగప్ప గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. -
తీరనున్న ఎరువుల కొరత
సాక్షి పెద్దపల్లి: వ్యవసాయరంగంలో దూసుకుపోతున్న రాష్ట్రానికి ఎరువుల కొరత తీరనుంది. తెలంగాణ సిగలో మరో కలికితురాయిగా నిలవనున్న రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)తో ఎరువుల లభ్యత పెరగనుంది. ఈనెల 9న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ కర్మాగారాన్ని అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దేశీయంగా ఎరువుల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని మూతపడిన ఐదు ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించి మళ్లీ ఉత్పత్తి ప్రారంభించడానికి 2015లో పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రామగుండంలో మూతపడిన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) పేరుతో పునరుద్ధరించాలని నిర్ణయించింది. 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ప్లాంట్ నిర్మాణాన్ని తొలుత రూ.5,254 కోట్ల అంచనాలతో చేపట్టినా.. అది పూర్తయ్యేనాటికి రూ.6,120.55 కోట్లకు చేరుకుంది. ఈ కర్మాగారంలో నేషనల్ ఫెర్టిలైజర్స్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ భాగస్వామ్యులుగా ఉన్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక ప్లాంట్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన లాంఛనంగా ఉత్పత్తి ప్రారంభించారు. అనంతరం మార్చి 22 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించారు. ఇందులో ఉత్పత్తి చేసిన యూరియా, అమ్మోనియాను ‘కిసాన్ బ్రాండ్’పేరుతో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ చేస్తోంది. తొలి ఉత్పత్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి చేసే 45 కిలోల యూరియా బస్తా ధరను రూ.266.50గా నిర్ణయించి వాణిజ్య అవసరాల నిమిత్తం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కర్మాగారం పునరుద్ధరణతో రాష్ట్రంలో యూరియా, అమ్మోనియా కొరత పూర్తిగా తీరిపోనుంది. తగ్గనున్న దిగుమతి భారం దేశవ్యాప్తంగా ఏటా 300 నుంచి 350 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరంకాగా.. 250 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగతా దాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎఫ్సీల్ ఉత్పత్తి ప్రారంభించడంతో ఈ కొరత చాలావరకు తీరనుంది. విదేశాలనుంచి దిగుమతి భారాన్ని తగ్గించడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూతపడిన ఐదు కర్మాగారాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆర్ఎఫ్సీఎల్ (అప్పటి ఎఫ్‌సీఐ), గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), సింద్రీ (జార్ఖండ్), తాల్చేర్ (ఒడిశా), బరౌనీ(బిహార్) ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ చేపట్టింది. వీటిలో మొదట రాష్ట్రంలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్‌కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక గోరఖ్‌పూర్, సింద్రీ యూనిట్లలో 2022 మార్చి నాటికి, తాల్చేర్ ప్లాంట్‌లో 2023లో యూరియా ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్‌సీఐ ఏర్పడింది ఇలా.. ►1970 అక్టోబర్ 2న నాటి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి త్రిగున్సేన్ రామగుండంలో ఎఫ్‌సీఐ ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ►గడువు కంటే ఆరేళ్లు ఆలస్యంగా ప్రారంభమైన ఎఫ్‌సీఐ.. 1980 నవంబర్ ఒకటి నుంచి స్వస్తిక్ బ్రాండ్ పేరుతో యూరియాను మార్కెట్లోకి విడుదల చేసింది. ►అనంతర కాలంలో పలు కారణాలతో 1999 మార్చి 31న కంపెనీ మూతపడింది. నాడు బొగ్గు.. నేడు సహజవాయువు రామగుండంలో మూతపడిన ఎఫ్‌సీఐ కర్మాగారం అప్పట్లో బొగ్గు, విద్యుత్తు ఆధారంగా నడిచేది. ప్రస్తుతం కర్మాగారాన్ని పునరుద్ధరించాక సహజవాయువును ఇంధనంగా వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా మల్లవరం నుంచి రాజస్తాన్‌కు వెళ్లే గ్యాస్ పైప్‌లైన్ నుంచి రామగుండం వరకు 363 కిలోమీటర్ల మేర ప్రత్యేక గ్యాస్ పైప్లైన్లను నిర్మించారు. ఈ కర్మాగారంలో కిసాన్ బ్రాండ్ పేరిట యూరియా, అమ్మోనియా ఎరువులను ఉత్పత్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రానికి 50 శాతం యూరియూ ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారంలో వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడంతో రాష్ట్రానికి 50 శాతం, మిగిలిన ఎరువులను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కేటాయించనున్నారు. ఐదు నెలలుగా ఇక్కడ ఉత్పత్తి అయిన యూరియాను తెలంగాణకే సరఫరా చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశీ సాంకేతికతతో ఉత్పత్తి ఆర్ఎఫ్సీఎల్లో అమ్మోనియాను డెన్మార్క్ దేశానికి చెందిన హల్డోర్ కంపెనీ, యూరియాను ఇటలీ దేశానికి చెందిన సాయ్‌పేమ్ కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేస్తున్నారు. గ్యాస్‌ను ఇంధనంగా మార్చి నీటి నుంచి ఆవిరి ఉత్పత్తి చేయడం, ఆ నీటి ఆవిరినే యూరియా, అమ్మోనియా ఉత్పత్తి కోసం వినియోగించడం ఆర్ఎఫ్సీఎల్ ప్రత్యేకతల్లో ఒకటి. ప్లాంటుకు కావాల్సిన ఒక టీఎంసీ నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కేటాయించారు. -
కరువుతీరేలా ఎరువులు
సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో ఎరువుల కొరత తలెత్తకుండా మార్క్‌ఫెడ్ ముందస్తు వ్యూహంతో అడుగులు వేస్తోంది. సాగు విస్తీర్ణం, పంటల సాగు వివరాల ఆధారంగా ఎరువులు కొనుగోలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మునుపెన్నడూ లేని«విధంగా ఆర్బీకేలు, సొసైటీలు ఎరువుల విక్రయాలను చేపడుతున్నాయి. సీజను ప్రారంభానికి ముందే రైతులు ఎక్కువగా వినియోగించే యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులోకి తెస్తున్నారు. లక్ష్యానికి మించి నిల్వలు.. ఖరీఫ్‌లో దాదాపు 20 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా మార్క్‌ఫెడ్ ప్రతి నెలా కంపెనీల నుంచి ఎరువులను కొనుగోలు చేసి ఆర్బీకేలు, సొసైటీలకు సరఫరా చేస్తోంది. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ఆర్బీకేలు, సహకార సంఘాల్లో కనీసం 1.50 లక్షల టన్నులను నిల్వ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మార్క్‌ఫెడ్ ప్రభుత్వ లక్ష్యానికి మించి 1.77 లక్షల టన్నులను నిల్వ చేసింది. ఎరువుల రవాణాలో జాప్యం జరిగినా, కొరత ఏర్పడినా ఈ బఫర్ స్టాక్‌ను వినియోగించనున్నారు. రైతు భరోసా కేంద్రాలు, మార్క్‌ఫెడ్ గోదాముల్లో 1,52,449 టన్నులు నిల్వ ఉండగా సహæకార సంఘాల గోదాముల్లో 25 వేల టన్నులు నిల్వ ఉన్నాయి. గత సర్కారు హయాంలో ధర్నాలు గత ప్రభుత్వ హయాంలో ఎరువుల కోసం రైతులు పలుదఫాలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అధిక ధరలు, ఎరువుల కొరత సమస్యలతో సతమతమయ్యారు. ఈ బాధల నుంచి రైతన్నలకు విముక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న సహకార సంఘాల్లోనూ ఎరువుల విక్రయాలను కొనసాగిస్తోంది. ఇప్పటికే పది వేల టన్నులు కొనుగోలు ఇప్పటి వరకు ఆర్థికంగా పటిష్టంగా ఉన్న 577 సహకార సంఘాల్లో 25 వేల టన్నులు, 4,166 రైతు భరోసా కేంద్రాల్లో 68 వేల టన్నులు, మార్క్‌ఫెడ్ గోదాముల్లో 84 వేల టన్నుల ఎరువులను నిల్వ చేశారు. ప్రైవేట్ మార్కెట్ కంటే ఆర్బీకేలు, సంఘాల్లో ఎరువుల ధరలు తక్కువగా ఉండటంతో రైతులు ఇప్పటికే 10 వేల టన్నులను కొనుగోలు చేశారు. ఎరువుల కొరత రానివ్వం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఖరీఫ్‌లో ఎరువుల కొరత రాకుండా ముందస్తు వ్యూహంతో చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఎప్పుడు కోరినా ఎరువులు విక్రయించేందుకు వీలుగా ఆర్బీకేలు, సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు అధికంగా సిద్ధం చేస్తున్నాం. కనీసం 1.50 లక్షల బఫర్ స్టాక్ ఉండాలని ప్రభుత్వం ఆదేశిస్తే అంతకు మించి నిల్వలున్నాయి. రాష్ట్రంలో దాదాపు 1,950 సహకార సంఘాలకుగానూ ఆర్ధికంగా, క్రియాశీలకంగా ఉన్న 577 సంఘాలను తొలి విడత ఎంపిక చేసి ఎరువులు సరఫరా చేశాం. మిగిలిన సంఘాల పరిస్థితిని సమీక్షించి విక్రయాలను చేపడతాం. – ఎం.ఎస్. ప్రద్యుమ్న, మార్క్‌ఫెడ్ ఎండీ తప్పిన ఇబ్బందులు గ్రామస్థాయిలోనే ఎరువులు అందుబాటులోకి రావడంతో రైతులకు వ్యయ ప్రయాసలు తొలగాయి. గతంలో వ్యవసాయ పనులు మానుకుని మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లి ఎరువులను కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలోనే కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు రైతుకు సమయం ఆదా అవుతోంది. -
పంటకు పులకింత.. రైతుకు నిశ్చింత
సాక్షి, అమరావతి: గతంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఎరువులు దొరక్క రైతులు పడరాని పాట్లు పడేవారు. బ్లాక్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయడమే కాదు.. పంటకాలంలో విలువైన సమయాన్నీ వృథా చేసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఎరువుల కొరత అనే మాట ఎక్కడా వినిపించడం లేదు. ఎరువుల అందుబాటు విషయంలో రైతాంగం నిశి్చంతగా ఉంటోంది. సీజన్ ప్రారంభానికి ముందే అవసరమైన నిల్వలను సిద్ధం చేస్తుండడంతో ఏ దశలోనూ ఇబ్బందులు తలెత్తడం లేదు. ప్రస్తుత రబీ సీజనే ఇందుకు నిదర్శనం. ఈ రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో ఎరువుల నిల్వలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీంతో రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరమే రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలే ఇందుకు కారణమంటూ రైతులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రబీ కోసం ఎరువుల నిల్వలు ఇలా.. ఏటా రాష్ట్రంలో 35 లక్షల టన్నుల ఎరువుల వాడకం జరుగుతుంది. నిజానికి ఖరీఫ్ కంటే రబీ సీజన్లోనే ఎరువుల వాడకం ఎక్కువ. రబీ సీజన్‌కు సంబంధించి 22.60 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఎరువులు అవసరమవుతాయని అంచనా. అయితే ఈసారి రబీ సీజన్ ప్రారంభానికి ముందు 7,50,260 మెట్రిక్ టన్నుల మేరకు ఎరువుల నిల్వలున్నాయి. ఈ సీజన్ కోసం రాష్ట్రానికి మార్చి 15వ తేదీ వరకు 20,94,044 మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం కేటాయించింది. ఆ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 బఫర్ గిడ్డంగులు, 154 హబ్‌లలో 28,44,304 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు సిద్ధం చేయగా.. గడిచిన ఐదు నెలల్లో 21,81,737 మెట్రిక్ టన్నుల మేరకు ఎరువుల అమ్మకాలు జరిగాయి. మిగిలిన 6,62,567 మెట్రిక్ టన్నులకు అదనంగా కంపెనీల నుంచి మరో 30,004 మెట్రిక్ టన్నుల మేరకు సేకరించారు. దీంతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 6,92,572 మెట్రిక్ టన్నుల మేరకు ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా 3,11,375 ఎం.టీ.ల యూరియా, 30,865 ఎం.టీ.ల డీఏపీ, 63,971 ఎం.టీ.ల ఎంఓపీ, 59,469 ఎం.టీ.ల ఎస్ఎస్పీ, 2,22,037 ఎం.టీ.ల కాంప్లెక్స్, 195 ఎం.టీ.ల అమ్మోనియా సల్ఫేట్, 4,659 ఎం.టీ.ల సిటీ కాంపోస్ట్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రబీ సీజన్‌కు సంబంధించి మార్క్‌ఫెడ్ వద్ద 6,16,324 ఎం.టీ.ల నిల్వలుండగా, ఇప్పటివరకు 5,46,536 మెట్రిక్ టన్నుల మేరకు అమ్మకాలు జరిపారు. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వద్ద డీఎపీ 6,245 ఎం.టీ.లు, ఏపీకే 2,366 టన్నులు, యూరియా 61,161 టన్నులు కలపి 69,772 ఎం.టీ.ల నిల్వలున్నాయి. వీటిని పాత ధరలకే విక్రయిస్తున్నారు. అదే సమయంలో రబీ సీజన్లో ఆర్బీకేల్లో 1,00,125 మెట్రిక్ టన్నుల ఎరువులను నిల్వ చేయగా, ఇప్పటివరకు 19,900 మెట్రిక్ టన్నులను రైతులు కొనుగోలు చేశారు. రికార్డు స్థాయిలో రబీ సాగు ప్రస్తుత రబీ సీజన్లో ఎరువుల కొరత లేకపోవడంతోపాటు అన్ని విధాలా అనుకూల పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు సాగయ్యాయి. సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 56.19 లక్షల హెక్టార్లు కాగా, ఈ ఏడాది 58.92 లక్షల హెక్టార్లలో రబీ సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 59.06 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. 21.75 లక్షల హెక్టార్లలో వరి, 23.74 లక్షల హెక్టార్లలో అపరాలు, 3.55 లక్షల హెక్టార్లలో ఆయిల్‌సీడ్స్, 2.67 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు సాగయ్యాయి. ఇంత ఈజీగా ఎరువులు దొరుకుతాయనుకోలేదు.. నేను 15 ఎకరాలు కౌలుకు తీసుకుని రబీలో వరిసాగు చేశా. గతంలో ఎరువుల కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లం. మండల కేంద్రానికి, కొన్ని సందర్భాల్లో విజయవాడకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం. మొట్టమొదటిసారి మా ఊళ్లోనే కావాల్సినన్ని ఎరువులుంచారు. గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రంలో 15 బస్తాల యూరియా, 5 బస్తాల డీఏపీ తీసుకున్నా. ఇంత ఈజీగా ఎరువులు దొరుకుతాయని కలలో కూడా ఊహించలేదు. సకాలంలో ఎరువులు వేయడంతో పంట ఏపుగా పెరిగింది. – కలపాల ఇసాక్, కాటూరు, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా రాష్ట్ర ప్రభుత్వ కృషితో ఎరువుల కొరత లేదు.. రబీ సీజన్లో ఏ దశలోనూ ఎరువుల కొరత తలెత్తలేదు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా సీజన్ ముందుగానే కేంద్రం మన రాష్ట్రానికి అవసరమైన ఎరువులను కేటాయించింది. ఆర్బీకేల్లోనూ అందుబాటులో ఉంచడంతో ఎక్కడా ఎరువులకోసం రైతులు ఇబ్బంది పడలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వలను పాత ధరలకే విక్రయిస్తున్నారు. –హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
విచ్చలవిడి ‘బయో’కు బ్రేక్
సాక్షి, అమరావతి: అడ్డగోలుగా మార్కెట్లోకి వస్తున్న బయో ఉత్పత్తులకు బ్రేక్ పడనుంది. వీటి తయారీ, అమ్మకాలను నియంత్రిస్తూ కేంద్రం ఎరువుల నియంత్రణ చట్టం–1985 షెడ్యూల్–6ను సవరించింది. బయో ఉత్పత్తులను ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా గెజిట్ విడుదల చేసింది. బయో ఉత్పత్తుల పేరు చెప్పి దేశ వ్యాప్తంగా ఏటా వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. జీవ ఉత్ప్రేరకాలు (బయోస్టిమ్యులెంట్) తయారీ విషయంలో ప్రత్యేకంగా ఎలాంటి ప్రొటోకాల్ లేకపోవడంతో కంపెనీలు ఏ మిశ్రమాలతో తయారు చేస్తున్నారో? ల్యాబొరేటరీ, ఫీల్డ్ ట్రయిల్స్ ఫలితాలేమిటో? తెలిసేది కాదు. పైగా ప్యాకింగ్స్పై లేబుల్స్ ఉండేవి కావు. పురుగులు, ఎరువుల మందుల నియంత్రణ చట్టాల పరిధిలో లేకపోవడంతో కంపెనీలను ప్రభుత్వాలు నియంత్రించలేకపోయేవి. ఎలాంటి పన్నులు కూడా చెల్లించే వారు కాదు. ఏపీలో ఏటా రూ. 200 కోట్ల వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో 1,200కు పైగా ఉన్న ఈ కంపెనీల ద్వారా లెక్కకు మించి బయో ఉత్పత్తులు ఏటా మార్కెట్లోకి వచ్చేవి. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడంతో 264 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఈ కంపెనీలు తరచూ కోర్టులను ఆశ్రయించడం, చట్టపరిధిలో లేనందున నియంత్రించే అధికారం లేదంటూ కోర్టులు ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేకు లేయడంతో వీటిని నియంత్రించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ కంపెనీల ద్వారా మన రాష్ట్రంలోనే రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకూ వ్యాపారం జరిగేదని అంచనా. పభుత్వ ఒత్తిడితోనే గెజిట్ విడుదల రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు కేంద్రం వీటిని ఎరువుల నియంత్రణ చట్టం పరిధిలోకి తీసుకురావడమే కాకుండా.. ఆ మేరకు ప్రత్యేకంగా గెజిట్‌ను విడుదల చేసి ఉత్పత్తుల రకాలను వర్గీకరించింది. సముద్రపు కలుపు మొక్కలతో సహా వివిధ రకాల మొక్కల నుంచి సంగ్రహించిన జీవసంబం«ధ పదార్థాలు, జీవ రసాయనాలు (బయో కెమికల్స్), ప్రొటీన్ హైడ్రోలైసేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, కణరహిత సూక్ష్మ జీవుల ఉత్పత్తులు, యాంటీ ఆక్సిడెంట్లు, బాష్పోచ్చేక నియంత్రణలు (యాంటీ ట్రాన్స్పిరెంట్స్) హ్యూమిక్, ఫల్విక్ ఆమ్లం వాటి ఉత్పన్నాలను ఈ షెడ్యూల్లో చేర్చారు. ఫారం జీ–3 తప్పనిసరి ► ఎరువుల చట్టం పరిధిలోకి తీసుకురావడంతో తయారీదారులు, దిగుమతిదారులు ఫారం–జీ ద్వారా రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎరువుల నియంత్రణాధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ► ఎక్కడైతే తయారు చేస్తున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ శాఖ నుంచి ఫారమ్–జీ–2ను పొందాలి. ► దీని ద్వారా ఎరువుల కంట్రోలర్ నుంచి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఫారం జీ–3)ను తీసుకోవాలి. ఈ సర్టిఫికెట్ ఆధారంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ నోటిఫైడ్ అథారిటీ నుంచి పొందే ధ్రువీకరణపత్రం ద్వారా రెండేళ్ల కాలపరిమితితో తయారీ, అమ్మకాలను కొనసాగించుకోవచ్చు. ► ఈ కొత్త చట్టం ప్రకారం ప్రతి బయో ఉత్పత్తికి నాణ్యతా నిర్ధారణ పరీక్ష తప్పనిసరి. ► ఇందుకోసం ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేక ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయబోతున్నారు. ► ఈ చట్టం ద్వారా ఇక నుంచి నాణ్యమైన, నమ్మకమైన బయో ఉత్పత్తులు రైతులకు అందుబాటులోకి రావడమే కాదు జీఎస్టీ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు బయోస్టిమ్యులెంట్ తయారీ, పంపిణీ దారులే కాదు అమ్మకాలు చేపట్టే వ్యక్తులు కూడా ఇక నుంచి సవరించిన ఎరువుల నియంత్రణ చట్టం–2021లో నియమాలకు లోబడే నడుచుకోవాలి. అతిక్రమిస్తే చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. – అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
నవంబర్ నుంచి ఎరువుల ఉత్పత్తి
సాక్షి, పెద్దపల్లి: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) నిర్మాణం చివరి దశ పనులు త్వరగా పూర్తి చేస్తామని, నవంబర్ నుంచి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించాలని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి మాన్సుఖ్ మాండవ్య అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న ఆర్ఎఫ్సీఎల్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలసి శనివారం సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.6,120.5 కోట్లతో చేపట్టిన ఎరువుల కర్మాగార పునరుద్ధరణ పనులు 99 శాతం పూర్తయ్యాయన్నారు. కరోనా కారణంగా ప్లాంట్ పనులు మూడు నెలలు ఆలస్యం అయ్యాయని చెప్పారు. ప్లాంట్‌లో ఏటా 12.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుందని, అందులో 6.25 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణకే కేటాయిస్తామని తెలిపారు. కర్మాగారం పూర్తయ్యాక ఎరువుల కొరత సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు దాదాపు 4 కోట్ల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగిస్తారని, 2.5 కోట్ల యూరియా దిగుమతి చేసుకుంటామని వివరించారు. దేశవ్యాప్తంగా ఐదు ఎరువుల కర్మాగారాలు నిర్మిస్తున్నామని తెలిపారు. రైతులు వినియోగించే ఎరువుల బస్తాపై కేంద్ర ప్రభుత్వం రూ.600 నుంచి రూ.700 సబ్సిడీ అందిస్తుందన్నారు. ఈ కర్మాగారం ద్వారా స్థానికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి ధర్మాపిల్, కలెక్టర్ భారతి హోళికేరి, ఆర్ఎఫ్సీఎల్ ఈడీ రాజన్ థాపర్ పాల్గొన్నారు. తమాషా చూస్తున్నారా? పోలీసులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం రాష్ట్రంలో ఎక్కడ ప్రతిపక్షాలు ధర్నాలు చేసినా ముందే హౌస్ అరెస్ట్ చేసే పోలీసులు, అధికార పార్టీ నాయకుల విషయంలో పక్షపాతంగా వ్యవహరించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సీఎల్ గేటు ఎదుట టీఆర్ఎస్ నాయకులు గంటసేపు ధర్నా చేసినా పట్టించుకోకుండా తమాషా చూస్తున్నారా అని పోలీసులను నిలదీశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్న క్రమంలో జనాల వద్దకు మంత్రులు వెళ్లొద్దని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా.. తాము వాహనాలను దిగివచ్చి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేతో మాట్లాడామన్నారు. అక్క డ పెద్దసంఖ్యలో గుమికూడిన ప్రజలను నియంత్రించడంలో పోలీసులు విఫలమ య్యారని విమర్శించారు. రాజకీయం కావా లా? ఫ్యాక్టరీ కావాలా? తెలంగాణ రైతులకు ఉపయోగపడే యూరియా కావాలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ నెలాఖరుకు ప్లాంట్‌లో ట్రయల్‌రన్ నిర్వహిస్తామని, నవంబర్‌లో ప్రధాని మోదీ చేతులు మీదుగా ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్ఎఫ్సీఎల్లో ‘లోకల్ ఫైట్’ కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా రామగుండం ఎరువుల కర్మాగారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీని సందర్శించేందుకు వచ్చిన కేంద్ర మంత్రులు మాండవ్య, కిషన్‌రెడ్డిని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఆర్ఎఫ్సీఎల్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించడంతో కేంద్ర మంత్రులు వాహనాలు దిగి వారి వద్దకు వెళ్లారు. ఈ సమయంలో మంత్రులకు, ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే చందర్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఆర్ఎఫ్సీఎల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, ఫ్యాక్టరీని ఆనుకుని ఉన్న వీర్నపల్లి గ్రామాన్ని తరలించాలంటూ టీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఇదే క్రమంలో అక్కడకు చేరుకొన్న బీజేపీ నాయకులు కూడా ప్రతిగా నినాదాలు చేశారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఒకదశలో అసహనానికి గురైన కేంద్రమంత్రులు వెనక్కివెళ్లి వాహనాల్లో కూర్చున్నారు. ఈ సమయంలో ఎంపీ వెంకటేశ్ వారివద్దకు వెళ్లి కేంద్రమంత్రులతో మాట్లాడారు. తర్వాత మంత్రులు ఫ్యాక్టరీ లోపలికి వెళ్లారు. ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
సిద్ధమవుతున్న రామగుండం ప్లాంటు
న్యూఢిల్లీ: రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంటు తిరిగి ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇక్కడ 99.58 శాతం పనులు పూర్తి అయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గోరఖ్‌పూర్ (యూపీ), సింద్రి (జార్ఖండ్), తాల్చేర్ (ఒడిషా) వద్ద ఉన్న ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇతర ఖాయిలా పడ్డ యూనిట్లలో పనులు జరుగుతున్నాయని వివరించింది. గోరఖ్‌పూర్, సింద్రి యూనిట్లలో 2021లో, తాల్చేర్ ప్లాంటులో 2023లో యూరియా ఉత్పత్తి కార్యకలాపాలు తిరిగి మొదలు కానున్నాయి. బిహార్‌లోని బరౌనిలో హిందుస్తాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్‌కు చెందిన యూనిట్‌ను సైతం పునరుద్ధరిస్తున్నారు. 77.60 శాతం పనులు పూర్తి అయిన ఈ ప్లాంటు వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఒక్కో ప్లాంటు వార్షిక సామర్థ్యం 1.27 మిలియన్ టన్నులు ఉండనుంది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా యూరియా తయారీ చేపట్టాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో మూతపడ్డ ఈ అయిదు ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. -
ఫెర్టిలైజర్ స్టాక్స్‌కు భారీ డిమాండ్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి లాక్‌డవున్ అమలులో ఉన్నప్పటికీ ఎరువుల అమ్మకాలు భారీగా పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో పీవోఎస్ ద్వారా రైతులకు 111.61 లక్షల మెట్రిక్ టన్నుల(ఎంటీ) ఎరువులను విక్రయించినట్లు ఎరువులు, రసాయనాల శాఖ పేర్కొంది. ఇదే కాలంలో గతేడాది(2018-19) విక్రయించిన 61.05 లక్షల ఎంటీతో పోలిస్తే ఇవి 83 శాతం అధికమని వెల్లడించింది. తాజా క్వార్టర్లో 64.82 లక్షల ఎంటీ యూరియా(67 శాతం అధికం), 22.46 లక్షల ఎంటీ(100 శాతం) డీఏపీ, 24.32 లక్షల ఎంటీ కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ (120 శాతం అప్) ఎరువులను విక్రయించినట్లు వివరించింది. లాక్‌డవున్ నేపథ్యంలోనూ ఎరువుల తయారీ, పంపిణీ సవ్యంగా జరిగినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఫెర్టిలైజర్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇదీ తీరు ఎరువుల అమ్మకాలు ఊపందుకున్న వార్తలతో సుమారు 16 ఎరువుల కంపెనీల షేర్లు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్) 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 37 సమీపంలో ఫ్రీజయ్యింది. ఈ బాటలో చంబల్ ఫెర్టిలైజర్స్ 5 శాతం జంప్‌చేసి రూ. 154ను తాకింది. తొలుత రూ. 157కు చేరింది. ఇక రాష్ట్రీయ కెమికల్స్(ఆర్సీఎఫ్) 5.3 శాతం పెరిగి రూ. 49 వద్ద కదులుతుంటే.. ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్(ఫ్యాక్ట్)5.5 శాతం ఎగసి రూ. 50.6ను తాకింది. ఇతర కౌంటర్లలో గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్(జీఎస్ఎఫ్సీ)3.5 శాతం పెరిగి రూ. 56.5 వద్ద, దీపక్ ఫెర్టిలైజర్స్ 3.5 శాతం పుంజుకుని రూ. 116.5 వద్ద, జువారీ గ్లోబల్ 4 శాతం లాభపడి రూ. 56 వద్ద ట్రేడవుతున్నాయి. టాటా కెమికల్స్ 1 శాతం బలపడి రూ. 311 వద్ద కదులుతోంది. తొలుత రూ. 314 వరకూ ఎగసింది. -
సెప్టెంబర్ నుంచి రామగుండం ఎరువుల ఉత్పత్తి!
సాక్షి, న్యూఢిల్లీ: రామగుండం ఎరువులు, రసాయనాల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్) సెప్టెంబరు నెలాఖరు నుంచి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి మన్ సుఖ్ మాండవీయకు సంబంధిత అధికారులు నివేదించారు. దేశంలోని ఐదు ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ ప్రక్రియపై మంత్రి ఆ శాఖ అధికారులతో కలసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గోరఖ్ పూర్, బరౌనీ, సింధ్రీలోని హిందూస్తాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ ప్లాంట్లు, రామగుండం ఎరువులు రసాయనాల సంస్థ, తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ప్లాంట్లపై సమీక్ష జరిగింది. కర్మాగారాల ఆర్థిక ప్రగతి, ఇతర అభివృద్ధి అంశాలపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కర్మాగారాల పునరుద్ధరణ పనులను సత్వరం పూర్తి చేసేందుకు సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రామగుండం ఎరువుల రసాయనాల కర్మాగారం అభివృద్ధి పనులు ఇప్పటికే 99.53% పూర్తయ్యాయని, కరోనా వైరస్ సంక్షోభం తలెత్తిన కారణంగా కొన్ని చిన్న పనుల్లో కాస్త జాప్యం జరిగిందని ఈ సమావేశంలో అధికారులు మంత్రికి తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరుకల్లా రామగుండం ప్లాంట్‌లో ఎరువుల ఉత్పాదన మొదలవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. అలాగే గోరఖ్‌పూర్ ఎరువుల కర్మాగారం పనులు 77%, సింధ్రీ ప్లాంట్ పనులు 70%, బరౌనీ కర్మాగారం పనులు 69% పూర్తయ్యాయని అధికారులు వివరించారు. గోరఖ్ పూర్, సింధ్రీ, బరౌనీ ప్లాంట్లు వచ్చే ఏడాది మే నెలలోగానే పూర్తవుతాయన్నారు. ఒడిశాలోని తాల్చేర్ ఎరువుల కర్మాగారంలో ప్రస్తుతం ప్రాజెక్టు అవకాశాలపై అంచనా, డిజైన్ల రూపకల్పన పని కొనసాగుతోందని చెప్పారు. -
ప్రతీ పైసా లబ్ధిదారుడికే
తాల్చేర్/ఝార్సుగూడ/జాంజగీర్–చంపా: కాంగ్రెస్ హయాంలో పథకాల అమల్లో అవినీతి చోటుచేసుకుందని, ఇప్పుడు ప్రతీ పైసా పేదలకు అందుతోందని ప్రధాని మోదీ అన్నారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ సర్కారు నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో శనివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని దాదాపుగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ లక్ష్యంతో ముందుకు.. ‘నక్సలైట్లు, పేలుళ్లు, రక్తపాతానికి పేరుపడ్డ ఛత్తీస్‌గఢ్.. బీజేపీ హయాంలో అన్ని సవాళ్లను అధిగమించింది. అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రాల నడుమ స్థానాన్ని సంపాదించుకుంది’ అని మోదీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాలకు అందే నిధులు సక్రమంగా ఖర్చయ్యేవి కాదని, ఇప్పుడు ప్రతీ పైసా లబ్ధిదారుడికి చేరుతోందని అన్నారు. ‘ఎన్నికల్లో గెలుపు కోసమో లేదా ఓటు బ్యాంకు కోసమో పథకాల రూపకల్పనపై ఎన్డీఏ ప్రభుత్వానికి నమ్మకం లేదు. ఓటు బ్యాంకు కోసం కాకుండా అందరి లబ్ధికే మా ప్రభుత్వం పథకాలు రూపొందిస్తోంది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ. 1607 కోట్లతో నిర్మించనున్న బిలాస్పూర్–పత్రపాలి రహదారికి, రూ. 1,697 కోట్లతో బిలాస్పూర్–అనుప్పుర్ మూడో రైల్వే లైన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. నవీన్ పట్నాయక్‌కు విజ్ఞప్తి ఒడిశాలోని తాల్చేర్‌లో రూ.13 వేల కోట్ల ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ.. ‘ఆయుష్మాన్ భారత్‌తో ఒడిశా ప్రజల్ని అనుసంధానం చేయాలని సీఎం నవీన్ పట్నాయక్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద ప్రజలు పథకం లబ్ధిని కోల్పోతారు’ అని ఆందోళన వెలిబుచ్చారు. తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న బిజూ స్వాస్థ్య కల్యాణ్ యోజన పథకమే మెరుగైనదిగా పేర్కొంటూ ఆయుష్మాన్ భారత్‌లో ఒడిశా చేరలేదు. వచ్చే ఏడాది ఒడిశాలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో పర్సంటేజ్, కమిషన్ల రాజ్యమేలుతున్నాయని ఆయన విమర్శించారు. ఝార్సుగూడలో వీర్ సురేంద్ర సాయ్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. డబ్బులివ్వకపోతే మరుగుదొడ్ల నిర్మాణం వంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకే చేరడం లేదని విమర్శించారు. తాల్చేర్ ఎరువుల కర్మాగారంలో బొగ్గు నుంచి ఉత్పత్తి చేసిన గ్యాస్ ద్వారా వేపపూతతో కూడిన యూరియాను తయారుచేస్తారు. మోదీకి అరటి శాలువా జాంజగీర్ సభలో ప్రధాని మోదీకి స్వయం సహాయక గ్రూపులకు చెందిన మహిళలు అరటి, అవిసె చెట్ల ఉత్పత్తుల నుంచి తయారు చేసిన జాకెట్, శాలువాను బహూకరించారు. ఆ జాకెట్ ధరించే సభలో మోదీ ప్రసంగించారు. -
రాష్ట్రంలో యూరియా సంక్షోభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. రాష్ట్రానికి యూరియా సరఫరా చేసే ప్రముఖ ఎరువుల కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో దాదాపు 6 లక్షల టన్నుల కొరత ఏర్పడింది. ఎరువుల కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో మార్క్‌ఫెడ్ అధికారులు సమావేశమై చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించి మార్క్‌ఫెడ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమవుతోంది. యూరియా సంక్షోభం ఉందని తెలిస్తే రైతులు కంగారు పడతారని భావించిన అధికారులు అంతా బాగుందనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. మార్క్‌ఫెడ్ వద్ద బఫర్‌స్టాక్ 2 లక్షల టన్నుల వరకు సిద్ధంగా ఉండాలి. కానీ ఈ నెల మూడో తేదీ నాటికి నీమ్ కోటెడ్ యూరియా 91,367 టన్నులే ఉండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకీ పరిస్థితి?: రాష్ట్రానికి యూరియాను సరఫరా చేసే కంపెనీల్లో నాగార్జున ఫెర్టిలైజర్స్ ప్రధానమైంది. దేశవ్యాప్తంగా యూరియా తయారీ కంపెనీలు ఎదుర్కొంటున్నట్టే ఈ సంస్థ కూడా తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ సంస్థ నుంచి 15 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంది. ఇందులో 6 లక్షల టన్నులు రాష్ట్రానికి సరఫరా అవుతుంది. ఇప్పుడు ఆ యూరియా నిల్వలు నిలిచిపోయే ప్రమాదం నెలకొంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ అత్యంత కీలక దశలో ఉంది. తెలంగాణలో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. అందుకోసం రాష్ట్రానికి 8 లక్షల టన్నుల యూరియా అవసరం. నాగార్జునలో ఉత్పత్తి నిలిచి పోవడంతో రాష్ట్రంలో 6 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడనుంది. పరిస్థితిని పసిగట్టిన అధికారులు కోరమాండల్, ఇఫ్కో, క్రిబ్కో, జువారీ, స్పిక్ గ్రూపు సంస్థల ప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నారు. యూరియా కొరతను నివారించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. దేశంలో 32 యూరియా తయారీ కంపెనీలు ఉంటే వాటిల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.70 వేల కోట్ల వరకు సబ్సిడీ బకాయిలు ఉన్నాయి. -
సీఎస్సీ విలేజ్ లెవల్ సెంటర్ ప్రారంభం
సాక్షి, అల్గునూర్(మానకొండూర్) : ప్రభుత్వ, ప్రైవేటు సేవలను పౌరులకు అందించేందుకు ప్రభుత్వ అనుబంధంగా ఏర్పాటు చేసిన సిటిజన్ సర్వీస్ సెంట్ విలేజ్ లెవల్ కార్యాలయం తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌లో ఏర్పాటయింది. రైతులకు అవసరమైన ఎరువులను ఈ సర్వీస్ సెంటర్ ద్వారా అందించేందుకు ఏర్పాటు చేసిన గోదామును కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటురంగ సేవలు ఈ సిటిజన్ సర్వీస్ సెంటర్ ద్వారా అందుబాటులోకి వస్తాయన్నారు. దేశంలో ఇప్పటివరకు సీఎస్సీ ఆధ్వర్యంలో ఒకేఒక్క ఫర్టిలైజర్ గోదాముందని, రెండోది, రాష్ట్రంలో మొట్టమొదటి గోదాం అల్గునూర్‌లో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. సీఎస్సీ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సేవలన్నీ ఈ సెంటర్లో అందుబాటులో ఉంటాయని, హైదరాబాద్‌లో ఉన్న డాక్టర్ సేవలను కూడా ఇక్కడి నుంచి పొందొచ్చని తెలిపారు. రైతులకు కావాల్సిన ఎరువులన్నీ సీఎస్సీ కేంద్రంలో అందుబాటులో ఉంటాయ ని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా త్వరలో మరిన్ని సేవలు పౌరులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సీఎస్సీ హైదరాబాద్ ఇన్చార్జి మంజుల వీఎల్ఈ శానిటరీ నాప్కిన్ యూనిట్‌ను ప్రారంభించారు. సీఎస్సీ జిల్లా మేనేజర్ శ్రీరాం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర బ్యాధుడు శివకుమార్, సొసైటీ అధ్యక్షుడు రాజు, అల్గునూర్ సర్పంచ్ చిందం కిష్టయ్య, ఎంపీటీసీ స్వామిరెడ్డి, తహసీల్దార్ జగత్సింగ్, కంది రాంచంద్రారెడ్డి, చల్ల మహేందర్‌రెడ్డి, జాప శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.