‘కుంభకోణం’లో కొత్త కోణం
ఎరువుల కుంభకోణంలో కొత్తకోణం వెలుగు చూసింది.
భాస్కర్ ఫర్టిలైజర్స్‌లో 1,300 టన్నుల యూరియా నిల్వలు ప్రత్యక్షం
డీలర్ల పేర్లతో రికార్డులు సృష్టించి గోదాములోకి తరలించిన వైనం
సహకరించిన ఇద్దరు వ్యవసాయాధికారులు
అనంతపురం : ఎరువుల కుంభకోణంలో కొత్తకోణం వెలుగు చూసింది. ఖరీఫ్‌లో రైతుల అవసరాల కోసం వచ్చిన ఎరువులను తప్పుడు రికార్డులు సృష్టించి భాస్కర్ ఫర్టిలైజర్స్ మిక్సింగ్ ప్లాంట్‌కు దారి మళ్లించారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు బినామీగా భావిస్తున్న ఈ మిక్సింగ్ ప్లాంటులో 1,300 నుంచి 1,600 టన్నుల మేర ‘క్రిబ్‌కో’ యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎరువులు దారి మళ్లడంపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో జిల్లా కలెక్టర్ శశిధర్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఈ నెల 4న ‘క్రిబ్‌కో’ కంపెనీకి సంబంధించిన 2,400 టన్నుల యూరియా రేక్ జిల్లాకు వచ్చింది. ఇందులో 50 శాతం మార్క్‌ఫెడ్‌కు, మరో 50 శాతాన్ని డీలర్లకు సరఫరా చేయాలి. ఇందులో మార్క్‌ఫెడ్ పేరు చూపుతూ 50శాతం ఎరువులను భాస్కర్ ఫర్టిలైజర్స్‌కు చేర్చినట్లు తెలుస్తోంది. ఇంతటితో ఆగకుండా తక్కిన 50శాతం ఎరువుల్లో 300 టన్నులు మాత్రమే డీలర్లకు చేరవేసి.. మిగిలిన స్టాకును గుట్టుచప్పుడు కాకుండా మిక్సింగ్ ప్లాంటుకు తరలించినట్లు సమాచారం. ఈ విషయం ఈ నెల 11నlవెలుగు చూసింది. దీనిపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశించడంతో జాయింట్æకలెక్టర్–2 ఖాజామొహిద్దీన్ బుధవారం ప్లాంటును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎరువుల నిల్వలు గుర్తించినట్లు తెలుస్తోంది.
వ్యవసాయాధికారులకు తెలిసే తతంగం
జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వాస్తవానికి జూలైలో ఎరువులను మిక్సింగ్‌ప్లాంట్లకు తరలించకూడదు. అయితే.. జిల్లాలో డిమాండ్ లేదంటూ ఉన్నతాధికారులకు జిల్లా వ్యవసాయాధికారులు తప్పుడు నివేదికలు అందజేసి ఎరువులను దారి మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా వ్యవసాయాధికారులు ఇదే తంతు కొనసాగిస్తునట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 4వ తేదీ జిల్లాకు చేరిన రేక్‌లోని ఎరువులను దారిమళ్లించారు. భాస్కర్ ఫర్టిలైజర్స్‌కు చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసుల సహకారం సంపూర్ణంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు మరింత ధైర్యంగా వ్యవహారాన్ని నడిపించినట్లు తెలిసింది.
మార్క్‌ఫెడ్‌కు వెళ్లాల్సిన 50 శాతం ఎరువులు ప్లాంటుకు తరలడంపై విచారణ అధికారులకు స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. తక్కిన ఎరువులు ఏయే డీలర్లకు వెళ్లాయి? అక్కడి నుంచి బీక్లాస్ డీలర్లకు ఎలా చేరాయి? రైతులకు విక్రయించినట్లు బిల్లులు ఉన్నాయా? విక్రయాలు లేకపోతే స్టాకు రిజిస్టర్‌లో వివరాలు ఎలా ఉన్నాయి? అనే దిశగా అధికారులు విచారణ చేస్తే గుట్టరట్టయ్యే అవకాశముంది. ఎరువుల కుంభకోణం వ్యవసాయశాఖలో ఇద్దరు అధికారులకు తెలిసే జరిగినట్లు తెలుస్తోంది. ఈ తంతుకు సహకరించినందుకు వీరు రూ.22 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కలెక్టర్ దీనిపై దృష్టి సారించడంతో వ్యవహారం నుంచి గట్టెక్కేందుకు ఆ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రికార్డుల తారుమారుకు ఉపక్రమిస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వెలుగుచూసిన కుంభకోణంతో పాటు రెండేళ్లుగా జిల్లాకు వచ్చిన ఎరువులు, కేటాయింపులపై కూడా విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముంది.
చోద్యం చూస్తున్న విజి ‘లెన్స్’
ఎరువుల కుంభకోణం వ్యవసాయశాఖలో కలకలం రేపుతున్నా.. వాస్తవాలు నిగ్గుతేల్చాల్సిన విజిలెన్స్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనపై విజిలెన్స్ ఎస్పీ అనిల్‌బాబును ‘సాక్షి’ వివరణ కోరగా.. పత్రికల్లో చూశానని, దానికి సంబంధించి ఎలాంటి విచారణ చేయలేదని చెప్పారు. త్వరలోనే విచారణ చేపడతామన్నారు.