బిగుస్తున్న ఉచ్చు
► ఎరువుల కుంభకోణంపై వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి సీరియస్
► కలెక్టర్, విజిలెన్స్ రిపోర్ట్‌తో పాటు శాఖాపరమైన విచారణకు నిర్ణయం
► మరో ఇద్దరు కీలక అధికారులపై చర్యలకు రంగం సిద్ధం
సాక్షిప్రతినిధి, అనంతపురం : ఎరువుల కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ‘అనంత’లో జరిగిన వ్యవహారంపై కలెక్టర్ కోన శశిధర్ పంపిన నివేదిక వ్యవసాయ శాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డికి చేరింది. విజిలెన్స్ నివేదిక నేడో, రేపో అందనుంది. ఈ రెండు నివేదికలతో పాటు శాఖాపరంగా ఉన్నతస్థాయి విచారణ చేపట్టేందుకు డైరెక్టర్ సిద్ధమైనట్లు తెలిసింది. వ్యవహారంలో ఏడీఏ పీపీ మల్లికార్జున, అనంతపురం ఏడీఏ రవికుమార్‌ను బాధ్యులను చేస్తూ వారిద్దరినీ విధుల నుంచి తప్పించి కలెక్టర్ ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. నివేదికను డైరెక్టర్‌కు పంపారు. ఈ క్రమంలో వ్యవసాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు బుధవారం గుంటూరులో డైరెక్టర్‌ను కలినట్లు తెలిసింది. ఫర్టిలైజర్స్ డీలర్ల సమావేశంలో ఉండగా.. వీరు డైరెక్టర్‌ను కలిసినట్లు తెలుస్తోంది.
వ్యవహారంలో ఏడీఏలకు సంబంధం లేదని, వారు విధులకు హాజరయ్యేలా చూడాలని, అసలు బాధ్యులు వేరే ఉన్నారని డైరెక్టర్‌ను కోరినట్లు సమాచారం. దీంతో డైరెక్టర్ తీవ్రంగా స్పందించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ‘రైతులకు చేరాల్సిన సబ్సిడీ ఎరువులు మిక్సింగ్‌ప్లాంటుకు ఎలా చేరతాయి? పైగా ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చి నేను చూసేదాకా సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ఈ వ్యవహారంలో ఎంతమంది బాధ్యులు ఉన్నారో అందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం. ఏఒక్కరినీ వదిలేది లేదు. పైగా అనంతపురం కరువు జిల్లా. ఇలాంటి జిల్లాలో రైతులకు ఉపయోగపడాల్సింది పోయి ఎరువులను ప్లాంటుకు తరలిస్తారా?’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. దీనిపై శాఖాపరంగా కూడా విచారణ చేయించేందుకు డైరెక్టర్ సిద్ధమైనట్లు తెలిసింది.
తెరపైకి మార్క్‌ఫెడ్
ఎరువుల కుంభకోణంలో మార్క్‌ఫెడ్‌లోని ఓ అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రేక్ రైల్వేస్టేçÙన్‌కు వస్తూనే 50 శాతం ఎరువులు మార్క్‌ఫెడ్‌కు చేరాలి. ఈ నెల 4న వచ్చిన రేక్‌లో 2,600 టన్నుల ఎరువులు ఉన్నాయి. ఇందులో 1300 టన్నులు మార్క్‌ఫెడ్‌కు చేరాలి. అయితే పక్కాప్రణాళికతో మార్క్‌ఫెడ్ అధికారి, వ్యవసాయశాఖలోని మరో ఇద్దరు అధికారులు కలిసి ఎరువుల లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా ప్లాంటుకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత బయటపడేందుకు మార్గాలు వెతికే ప్రయత్నం చేశారు. తనవద్ద బఫర్‌స్టాకు అధికంగా ఉందని, ఎరువులు తనకు అవసరం లేదని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ బాల భాస్కర్ క్రిబ్‌కో కంపెనీకి చెప్పినట్లు చెబుతున్నారు.
అయితే ఈనెల 3వ తేదీ వరకూ 5వేల టన్నుల బఫరే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ 6,560 టన్నులు బఫర్ ఉన్నట్లు భాస్కర్ చెబుతున్నారు. మార్క్‌ఫెడ్ గోదాముల్లో ఎంత స్టాకు ఉన్నా రేక్‌లోని ఎరువులు వద్దనే ప్రస్తావన వస్తే లిఖిత పూర్వకంగా జేడీకి సమాచారం అందించాలి. లేఖ ఆధారంగా ఎరువులను ఎవరికి ఇవ్వాలనేది జేడీఏ నిర్ణయం తీసుకుంటారు. అయితే మార్క్‌ఫెడ్, జేడీఏ ఇద్దరికీ తెలీకుండా ఎరువులు ఎలా మిక్సింగ్‌ప్లాంటుకు వెళ్లాయనేది తేలాల్సి ఉంది. పైగా మార్క్‌ఫెడ్‌కు వెళ్లాల్సిన 1300 టన్నుల్లో 812 టన్నులు తీసుకున్నామని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ బాలభాస్కర్ చెబుతున్నారు. మార్క్‌ఫెడ్ చెప్పేది నిజమే అయితే భాస్కర్ ఫర్టిలైజర్స్‌లో సీజ్ చేసిన 1300 టన్నులు ఎలా వచ్చాయనేది తేలాలి. అంటే మార్క్‌ఫెడ్ నుంచి 488 టన్నుల ఎరువులు, డీలర్లకు వెళ్లాల్సిన 812 టన్నులు దారి మళ్లాయని తెలుస్తోంది. మరి ఈ లెక్కల గుట్టు తేలాలంటే మార్క్‌ఫెడ్‌తో పాటు డీలర్లకు కేటాయించిన ఎరువుల రికార్డులను తనిఖీ చేయాల్సి ఉంది.
మిక్సింగ్ ప్లాంటుకు
రూ.1.87 కోట్ల ఆదాయం
ఒక యూరియా బస్తా విలువ వెయ్యి రూపాయలకు పైగానే ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రూ.720 సబ్సిడీ ఇస్తుంది. మార్కెట్లో రైతులకు రూ.280కి విక్రయిస్తారు. 1300 టన్నుల ఎరువులు అంటే 26 వేల బస్తాలు. ఈ లెక్కన 26 వేల బస్తాలపై సబ్సిడీ రూపంలో రూ.1.87 కోట్ల ఆదాయం మిక్సింగ్‌ప్లాంటుకు చేకూరిన ట్లే!