ఎరువులపై సబ్సిడీ కంపెనీలకే
పీవోఎస్ మెషీన్ల ద్వారా ఎరువులు కొంటేనే ఇక రాయితీ
- కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
న్యూఢిల్లీ: ఎరువుల రంగంలో ఈ ఏడాది జూన్ నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్ల ద్వారా రైతులు ఎరువుల కొలుగోలుపై చెల్లింపులు చేసినట్లయితే, నేరుగా కంపెనీ ఖాతాలోకే సబ్సిడీ మొత్తాన్ని వేయాలని కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. దేశంలోని 17 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ విధానం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఈ డీబీటీ విధానాన్ని దశల వారీగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా అక్రమ మళ్లింపులు, లీకేజీలకు చెక్‌పెట్టి ఎరువులపై ఇస్తున్న సబ్సిడీని 20 శాతం వరకు తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం జిల్లాల్లో రసీదులను సమర్పించడం ద్వారా లేక ప్లాంటు నుంచి ఎరువులు బయటకు వెళ్తే కంపెనీలకు సబ్సిడీ అందేది. అయితే ఈ ఏడాది ఖరీఫ్ కాలం నుంచి మాత్రం పీవోఎస్ మెషీన్ల ద్వారా ఎరువుల అమ్మకాలు జరిగితే నేరుగా కంపెనీ ఖాతాలోకి సబ్సిడీ మొత్తం చేరుతుందని ఎరువుల శాఖ కార్యదర్శి భారతి శివస్వామి సిహాగ్ తెలిపారు. కేంద్రం ఇప్పటికే రిజిస్టర్ అయిన 2 లక్షల రిటైల్ ఔట్‌లెట్లను మే 31 నాటికి పీవోఎస్ మెషీన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. దీంతో జూన్ నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని శివస్వామి తెలిపారు.
అలాగే కొనుగోలు విధానాన్ని త్వరలోనే రూపొందిస్తామని, ఇందులో భూసార కార్డులు, భామి పత్రాలను రాబోయే మూడేళ్ల కాలానికి అనుసంధానం చేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే లబ్ధిదారుడిని ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ విధానం, ఓటర్ గుర్తింపు కార్డు, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా గుర్తిస్తామన్నారు. రైతుల వివరాలు సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానించడం పీవోఎస్ మెషీన్లు కొనుగోలుదారుడి వివరాలను గుర్తిస్తాయని వివరించారు. ఈ నూతన విధానంపై కంపెనీలు అంగీకరిస్తాయా అనే ప్రశ్నకు వాటికి ఎన్ని సమస్యలు ఉన్నా, ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది కాబట్టి, ఈ విధానాన్ని పాటించాల్సిందేనన్నారు.