తీరనున్న రైతుల కష్టాలు | solving the farmers problems | Sakshi
Sakshi News home page

తీరనున్న రైతుల కష్టాలు

Published Mon, Sep 29 2014 3:13 AM | Last Updated on Mon, Oct 1 2018 6:45 PM

solving the farmers problems

- మంచిర్యాలలో ఎరువుల దిగుమతి కేంద్రం
- పది రోజుల్లో దిగుమతి కానున్న ఎరువులు

మంచిర్యాల రూరల్ : తూర్పు ప్రాంత రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎరువుల దిగుమతి కేంద్రం(రాక్ పాయిం ట్)ను మంచిర్యాలలో నెలకొల్పేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎరువులను దిగుమతి చేసేందుకు అవసరమైన గోదాములను మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్‌లో గల స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్‌కు చెందిన గోదాముల్లో ఎరువులను నిల్వ చేసేందుకు అనుమతులు పూర్తయ్యాయి. రైల్వే వ్యాగన్ల ద్వారా వచ్చిన ఎరువులను రవాణా చేసేందుకు లారీ ట్రాన్సుపోర్టు, బస్తాలను వ్యాగన్ల నుంచి లారీలో వేసేందుకు హమాలీల సంఘంతో అగ్రిమెంట్లు పూర్తి చేసి, ఎరువుల కంపెనీల నుంచి ఎరువులను దిగుమతి చేసుకునేందుకు అన్ని రకాల అనుమతులను అవంతి వేర్ హౌస్ అనే హ్యాండ్లింగ్ సంస్థ పొందినట్లు మండల వ్యవసాయాధికారి చంద్రన్ కుమార్ తెలి పారు. మరో పది రోజుల్లో మంచిర్యాల రేక్ పాయింట్‌కు  ఒక రేక్‌లో 2500 మెట్రిక్ టన్నులు(50 వేల బస్తాలు) ఎరువులు దిగుమతి కానున్నట్లు తెలిపారు.
 
నాలుగేళ్లకు మోక్షం
జిల్లా కేంద్రంలో ఉన్న ఎరువుల దిగుమతి కేంద్రం నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు రవాణా చేయడం ఖర్చుతో కూడుకున్నది. ఫలితంగా రైతులకు ఒక్క బస్తాపై రూ.40 నుంచి రూ.60 వరకు అదనంగా భారం పడుతోంది. జిల్లా కేంద్రం నుంచి తూర్పు ప్రాంతాలకు దాదాపు 350 కిలోమీటర్లు ఉం డటం, కవ్వాల్ అభయారణ్యంలో రాత్రి సమయాల్లో భారీ వాహనాలకు అనుమతులు లేకపోవడంతో లారీల్లో లోడ్ చేసిన ఎరువులు రెండు రోజులకు గానీ జిల్లాలోని చివరి మండలాలైన బెజ్జూరు, సిర్పూరు, కౌటాల, కోటపల్లి, వేమనపల్లి మండలాలకు చేరడం లేదు. దీంతో రవాణా ఖర్చుతోపాటు, లారీలకు అదనంగా అద్దె చెల్లించడంతో ఎరువులను రవాణా చేసేందుకు అధికంగా ఖర్చవుతుంది.

తూర్పు ప్రాంతం కేంద్రంగా ఉన్న మంచిర్యాలలో ఎరువుల దిగుమతి కేంద్రంను ఏర్పాటు చేయడం వల్ల తూర్పు ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాల్లోని 24 మండలాల రైతులకు మేలు చేకూరుతుందని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, రైతులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం ఎరువుల దిగుమతి కేంద్రంకు అనుమతి విషయమై సానుకూలంగా స్పందించిం ది. రైలు ద్వారా పెద్దపల్లిలోని రాక్ పాయింట్ వరకు ఎరువులను సరఫరా చేస్తున్న కంపెనీలు, దగ్గరలోని మంచిర్యాల వరకు సరఫరా చేయడం కష్టమేమి కాకున్నా, ఇక్కడి స్థానిక సమస్యలతో ఇన్నాళ్లు పూర్తిస్థాయి అనుమతులు రావడంలో ఆలస్యం జరిగింది. ఇన్నాళ్లు ఎరువులను నిల్వ చేసేందుకు గోదాములను గుర్తించడం, హమాలీలు, లారీట్రాన్సుపోర్టు వారితో అగ్రిమెంటు చేసుకునే విషయంలో హ్యాండ్లింగ్ ఏజెన్సీతో ఒప్పందాలు జరిగేందుకు నాలుగేళ్ల సమయం పట్టింది. ఎట్టకేలకు అన్ని రకాల అనుమతులు రావడంతో మరో పది రోజుల్లోగా మొదటి దశ ఎరువులు మంచిర్యాలకు దిగుమతి కానున్నట్లు వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
 
తగ్గనున్న ధరలు

జిల్లా కేంద్రం నుంచి ఎరువులను దిగుమతి చేసుకోవడం కోసం రవాణా, హమాలీ చార్జీల కింద ఒక్కో ఎరువుల బస్తాపై రూ.40 నుంచి రూ.60 వరకు దుకాణదారులు రైతుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలు తప్పే అవకాశం ఉంది. దీంతో పాటు  ఎరువులు దిగుమతైన వెంటనే అదేరోజు మారుమూల ప్రాంతాల్లోని మండలాలకు రవాణా చేసేందుకు అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement