యూరియా...మాఫియా | Fertilizer sales in black market | Sakshi
Sakshi News home page

యూరియా...మాఫియా

Published Wed, Oct 1 2014 1:55 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM

Fertilizer sales in  black market

సాక్షి, ఒంగోలు: ఎరువుల విక్రయాల బ్లాక్‌మార్కెట్ దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. యూరియా బస్తాలను అక్రమంగా నిల్వ చేస్తూ దొంగచాటు విక్రయాలకు కొందరు పాల్పడటంపై ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. బ్లాక్‌మార్కెట్‌లో ఎరువుల విక్రయాల్ని అరికట్టేందుకు వ్యవసాయ శాఖకు చెందిన యంత్రాంగం, ప్రత్యేక తనిఖీ బృందాలు, విజిలెన్స్ అధికారులు వరుస దాడులకు సిద్ధపడ్డాయి. దీంతో డీలర్లు కొత్తమార్గాలను ఎంచుకుంటున్నారు.

ఎమ్మార్పీ ధరకే యూరియా బస్తాలను అమ్ముకోలేని కొందరు డీలర్లు అసలు నిల్వల్నే తెప్పించకుండా మిన్నకుంటున్నారు. మరికొందరేమో తమకు పరిచయమున్న రైతులకే విక్రయిస్తున్నారు. కంపెనీలు రవాణా చార్జీలను రిటైల్ డీలర్లపైనే మోపడంతో, లింకు ఉత్పత్తులు కొనుగోలు చేస్తేనే యూరియా సరఫరా చేస్తామనడంతో డీలర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మార్పీ కన్నా అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది.

 జిల్లాలో ఎరువుల కొరతను నివారించి రైతులందరికీ సకాలంలో వాటిని అందించాలనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా బఫర్‌స్టాక్‌ను మార్క్‌ఫెడ్ గోడౌన్‌లో నిల్వచేశారు. ఇప్పటికే జిల్లాలో రైతులకు అవసరమైన 9 వేల క్వింటాళ్ల యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వీటిని సకాలంలో సొసైటీలకు పంపి రైతులకు అందజేయడంలో ఆలస్యమవుతోంది. ఈ క్రమంలో ఎరువులు వినియోగానికి పనికిరాకుండా వృథా అవుతున్నాయి. ఇటీవల విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో విభిన్న ప్రాంతాల్లో 46 బస్తాల యూరియా పొడిగా మారినట్లు గుర్తించారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే.. గత ఏడాది నిల్వలు పాడయ్యాయని చెప్పారు.

 ప్రణాళిక ప్రకారం ఎరువులు కొరత లేకుండా చూడాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా, ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎరువుల విక్రయాల్లో సొసైటీలు సైతం క్రియాశీలకంగా వ్యవహరించకపోవడం రైతులకు శాపంగా మారింది. సొసైటీలు సక్రమంగా పనిచేస్తే జిల్లాలోని అన్ని మండలాల్లో కేంద్రాలు ఏర్పాటుచేసి ఎరువులు విక్రయిస్తే, ప్రయివేటు డీలర్ల హవాకు అడ్డుకట్ట పడేది. వీటితోపాటు సొసైటీలు లేని మండలాలు, పెద ్ద గ్రామాల్లో డీసీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎరువులు అందిస్తే కొరత నివారించవచ్చునని పలువురు రైతులు సూచిస్తున్నారు.

 అనధికార అమ్మకాలపై నిఘా శూన్యం
 జిల్లాలో రీటైల్ ఎరువుల డీలర్లు ఎమ్మార్పీకి యూరియాను విక్రయిస్తే నష్టాలు వస్తాయని, అదే సమయంలో ఎమ్మార్పీకంటే అదనంగా అమ్మితే దాడుల్లో పట్టుబడతామని భావించి కొత్తమార్గాల్ని అన్వేషిస్తున్నారు. కంపెనీ ఎమ్మార్పీ ధర ఒక్కో బస్తా రూ.285కు అందజేయాల్సి ఉంది. అయితే, రిటైల్ డీలర్ వద్ద ఉన్న ఎరువుల నిల్వలను తమకు తెలిసిన రైతులకే ఒక్కొక్కరి పేరుతో 20 నుంచి 30 బస్తాల యూరియాకు బిల్లులు రాసి గోప్యంగా నిల్వలు దాచేస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో రైతుల ఇళ్లల్లోనే బస్తాలను నిల్వ పెడుతున్నారు. కొత్తవారు యూరియా కొనుగోలుకు వస్తే స్టాక్ లేదంటూ వెనక్కితిప్పి పంపుతున్నారు. రెగ్యులర్‌గా వచ్చే రైతులు, ముఖ పరిచయం ఉన్నవారికి మాత్రమే బస్తా రూ.350 నుంచి రూ.370 వరకు విక్రయించి రైతుల ఇళ్లనుంచి సరఫరా చేస్తున్నారు. అద్దంకిలో ఒక డీలర్ 450 బస్తాల యూరియాను తొమ్మిదిమంది రైతుల పేర్లతో బిల్లులు రాసి గోడౌన్‌లో నిల్వచేశారు.

దీనిపై సమాచారమున్న అధికారులు దాడులకు సిద్ధపడగా, స్థానిక అధికారపార్టీ నేతల వత్తిళ్ల నేపథ్యంలో వెనుకంజవేసినట్లు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మిగతాచోట్ల డీలర్లు జాగ్రత్తపడ్డారు. విజిలెన్స్ అధికారులు దాడులు చేయడంతో జిల్లాలో రెండుప్రాంతాల్లో ఇలాంటి అక్రమాలు వెలుగులోకొచ్చాయి.

 గిట్టుబాటు లేకనే అధిక దరలు..
 ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా ఎమ్మార్పీకి అమ్మితే నష్టపోవాల్సి వస్తుందని డీలర్లు వాపోతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో సహకార సంఘాలు క్రియాశీలకంగా నడవకపోవడం, ప్రయివేటు డీలర్లు యూరియాను తెప్పించకపోవడంతో రైతులు ఇతరప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది. జిల్లాలో కొందరు వ్యాపారులు అనుమతులు లేకుండానే ఎరువులు విక్రయిస్తున్నారు. కనిగిరి, మార్కాపురంలోని తొమ్మిది దుకాణాల యాజమాన్యాలు అనుమతిలేకుండానే పురుగు మందులు, ఎరువులు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో దుకాణాలకు ఎరువులు సొసైటీల నుంచి వచ్చినట్లు తేలిపోయింది. దాడుల్లో పట్టుబడుతున్న ఎరువుల్లో అత్యధికశాతం డీసీఎంఎస్ నుంచి కొనుగోలు చేసినట్లు తేలింది. సొసైటీలకు రవాణా చేసిన ఎరువులు అనుమతిలేని డీలర్ల వద్దకు ఎలా వచ్చాయనేది వ్యవసాయాధికారులు దృష్టిపెడితే..అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఎరువులు చేతులు మారడం వెనుక కొందరు అధికారులతోపాటు దళారులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రైతులకు సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నారన్న ఫిర్యాదులు విజిలెన్స్ అధికారులకు అందడమే పరిస్థితికి నిదర్శనం.

 ప్రభుత్వజోక్యంతో ఎమ్మార్పీ అమలు
 జిల్లాలో ప్రయివేటు డీలర్‌లకు ఎరువులు సరఫరా చేస్తున్న కంపెనీలు రవాణాచార్జీలను డిస్ట్రిబ్యూటర్‌లు, రిటైల్ డీలర్‌లపై భారం మోపుతున్నాయి. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యరగొండపాలెం, దర్శి తదితర ప్రాంతాలకు బస్తాకు రూ.20వరకు రవాణాచార్జీ అవుతుంది. దీనికి తోడు లింకు ఉత్పత్తులు అంటగట్టడం మరింత ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో డీలర్లు బస్తాకు రూ.50 నుంచి రూ.70వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.

అధిక ధరకు అమ్మలేని డీలర్లు యూరియా తీసుకోవడానికి వెనుకంజవేస్తున్నారు. లింకు ఉత్పత్తులు లేకుండా యూరియా సరఫరా చేయాలంటే డిస్ట్రిబ్యూటర్‌కు బస్తా రూ.10 అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ జోక్యం చేసుకుని రవాణా చార్జీలను కంపెనీలే చెల్లించేలా వత్తిడి తెచ్చి, లింకు ఉత్పత్తులు అంటగట్టనప్పుడే జిల్లాలో ఎమ్మార్పీ అమలవుతోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement