నానో డీఏపీని విడుదల చేస్తున్న అమిత్‌షా
న్యూఢిల్లీ: రైతులు సాగులో ద్రవరూప నానో డీఏపీ, యూరియాను వినియోగించాలని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌షా సూచించారు. ఈ ఉత్పత్తులను విరివిగా ఉపయోగించడం ద్వారా ఎరువుల తయారీలో దేశాన్ని స్వావలంబన భారత్‌గా మార్చాలని రైతులకు పిలుపునిచ్చారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. ఇఫ్కో నానో (ద్రవరూప) డీఏపీ వాణిజ్య విక్రయాలను మంత్రి బుధవారం ఢిల్లీలో ప్రారంభించి, మాట్లాడారు.
ఇఫ్కో ద్రవరూప నానో డీఏపీ 500 ఎంఎల్ బాటిల్‌ను రూ.600కు విక్రయించనున్నారు. అదే సంప్రదాయ 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.1,350గా ఉంది. సాగులో ద్రవరూప ఉత్పత్తులను వినియోగించడం వల్ల నాణ్యతతోపాటు దిగుబడి కూడా పెరుగుతుందని మంత్రి అమిత్‌షా అన్నారు. భూసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. ద్రవరూప డీఏపీతో సాగు ఖర్చులు 6 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గుతాయని చెప్పారు.
అలాగే ద్రవరూప ఎరువుల రవాణా, నిల్వ కూడా సులభం. ద్రవరూప ఎరువులు భారత్‌ను స్వావలంబన దిశగా నడిపిస్తాయన్నారు. 2021–22లో 91.36 లక్షల టన్నుల యూరియా, 54.62 లక్షల టన్నుల డీఏపీ, 24.60 లక్షల టన్నుల ఎంవోపీ, 11.70 లక్షల టన్నుల ఎన్‌పీకే ఎరువులను దిగుమతి చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇఫ్కో తయారు చేసిన నానో డీఏపీకి 20 ఏళ్ల కాలానికి పేటెంట్ వచ్చినట్టు మంత్రి అమిత్‌షా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment