
పెన్‌పహాడ్, హాలియా: ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని సూర్యాపేట–గరిడేపల్లి ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు రాస్తారోకో చేశారు. పంటలకు సరైన సమయంలో యూరియా వేయకపోవడంతో వాటి ఎదుగుదల లేక.. దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులు స్పందించి.. సరిపడా యూరియాను త్వరితగతిన సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనుముల మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం ఎదుట శుక్రవారం యూరియా కోసం రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. అందరికీ అందక నిరాశతో వెనుదిరిగారు.