పుడమి తల్లికి తూట్లు! | Excessive use of chemical fertilizers and pesticides is harmful | Sakshi
Sakshi News home page

పుడమి తల్లికి తూట్లు!

Published Fri, Jun 30 2023 3:54 AM | Last Updated on Fri, Jun 30 2023 8:23 AM

Excessive use of chemical fertilizers and pesticides is harmful - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌ : పుడమి తల్లి నిస్సారంగా మారిపోతోంది. చాలాకాలంగా నత్రజని, భాస్వరం, పొటాషియం తదితర రసాయన ఎరువులకు తోడు పురుగు మందులు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పంటల దిగుబడిని పెంచుకోవడానికి, క్రిమిసంహారానికి మోతాదుకు మించి వాడుతున్న రసా యన ఎరువులు, మందుల కారణంగా సారవంతమైన నేల కాస్తా గుల్ల అవుతోంది.

రసాయన ఎరువుల వాడకం పుడమి కాలుష్యంతో పాటు, వాయు, నీటి కాలుష్యానికి కూడా దోహదపడుతోంది. ఒక టన్ను రసా యన ఎరువులను వినియోగిస్తే.. అందులో కేవలం మూడున్నర క్వింటాళ్ల రసాయన ఎరువులను మాత్రమే పంటలు స్వీకరిస్తాయని, మిగిలిందంతా పుడమిలోకి ఇంకిపోవడం, వర్షాలు పడినప్పుడు చెరువులు, నదులు, వాగులు, ఇతర నీటి వనరుల్లోకి వెళ్లిపోవడం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాలతో పోల్చిచూస్తే..మన దేశంలో వీటి విని యోగం తక్కువగా ఉన్నా.. ప్రస్తుతం వాడుతున్న ఈ రసాయన ఎరువుల వల్ల పర్యావరణంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. 

ఆర్గానిక్‌తో మేలు..
దిగుబడి పెంచుకోవడానికి వినియోగించే ఎరువుల్లో ఆర్గానిక్, ఇనార్గానిక్‌ అనే రెండు రకాలు ఉన్నాయి. ఆర్గానిక్‌ ఎరువులు ప్రకృతి సిద్ధమైనవి. పంట వ్యర్థాలు, మొక్కలు, జంతువుల వ్యర్థాలు, మునిసిపల్‌ వ్యర్థాల నుంచి వచ్చే ఎరువులను ఆర్గానిక్‌ ఎరువులుగా పరిగణిస్తారు. ఆర్గానిక్‌ ఎరువుల వాడకం వల్ల భూసారం పెరగడంతో పాటు, వాన పాములు, సూక్ష్మజీవుల పునరుత్పత్తికి దోహద పడుతుంది.

ఇక రసాయనాలను వినియోగించి తయారు చేసేవే ఇనార్గానిక్‌ ఎరువులు. పంటల ఎదుగుదలకు నత్రజని ఉపయోగపడుతుంది. ఫాస్ఫేట్‌ మొక్కలకు ముఖ్యమైన పోషక విలువలను అందిస్తుంది.  వీటితో పాటు పొటాషియం భూమిలో నీటి సామర్థ్యాన్ని, భూ సాంద్రతను పెంచుతాయనే వాదన ఉన్నా.. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలోని ఆమ్లాలు చర్మంపైన, శ్వాసపైనా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

సేంద్రీయ సేద్యం పెరుగుతున్నా
దేశంలో సేంద్రీయ సేద్యం పెరుగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించే గణాంకాలు చెబు తున్నా.. రసాయన ఎరువుల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలి గించే అంశం. మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు రసాయన ఎరువుల వాడకంలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ ఎరువులు భూమిలో ఉండే సూక్ష్మక్రిములను చంపే యడంతో భూమి తన సారాన్ని కోల్పోతోందని నిపుణులు చెబుతున్నారు.

పంటల దిగు బడి కోసం శాస్త్రీయ ఎరువులు వినియోగించకుండా కేవలం రసాయన ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల భూసారం తగ్గి, తదనంతర కాలంలో పంటల దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దశాబ్ద కాలంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం దాదాపు 50% మేరకు పెరిగినట్లు అగ్రికల్చర్‌ ఇన్‌పుట్‌ సర్వే వెల్లడిస్తోంది. 

చైనాలో హెక్టార్‌కు 13.06 కిలోలు
చైనా ఒక హెక్టార్‌కు 13.06 కిలోల పురుగు మందులు వాడుతుంటే, జపాన్‌ 11.85 కిలోలు, బ్రెజిల్‌ 4.57 కిలోలు వినియోగిస్తున్నాయి. లాటిన్‌ అమెరికా దేశా ల్లోనూ ఇలాంటి మోతాదుల్లోనే వినియోగిస్తున్నారని సమాచారం. మన దేశంలో అత్యధికంగా పంజాబ్‌లో ప్రతి హెక్టార్‌కు 0.74 కిలోలు వినియోగిస్తున్నారు.

పంజాబ్, హరియాణాలు పంటల దిగుబడి కోసం అత్యధికంగా రసాయన ఎరువులు వినియోగి స్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హరియాణాలో 0.62 కిలోలు, మహారాష్ట్రలో 0.57 కిలోలు, కేరళలో 0.41 కిలోలు, ఉత్తరప్రదేశ్‌లో 0.39 కిలోలు, తమిళనాడులో 0.33 కిలోల రసాయన ఎరువులు వాడుతున్నారు. జాతీయ సగటు 0.29 కిలోలుగా ఉంది. జాతీయ సగటు కంటే తెలుగు రాష్ట్రాల్లో వినియోగం తక్కువగా ఉన్నట్లు ఆ గణాంకాలు పేర్కొంటున్నాయి.

యూరియానే అత్యధికం..
ఎరువుల్లో యూరియా వినియోగం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. రైతులు అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, ఒక బస్తా యూరియా వేయాల్సిన చోట పంట ఎదుగుదల, దిగుబడి కోసం రెండు మూడు బస్తాలు వినియోగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల కంటే దీని ధర తక్కువగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం సైతం యూరియాపై ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం వల్ల రైతులు ఎక్కువగా యూరియా వినియోగిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. యూరియాపై కేంద్రం దాదాపు 75 శాతం మేరకు సబ్సిడీ అందిస్తుంటే.. డీఏపీ లాంటి ఎరువులపై 35 శాతం మాత్రమే ఇస్తోంది.

భూసార పరీక్షల ఆధారంగా వాడాల్సి ఉన్నా..
భూసార పరీక్షల నిర్వహణ ద్వారా ఏయే భూములకు ఎలాంటి పోషకాలు కావాలి, అవి ఏయే రసాయన ఎరువుల్లో ఉంటాయో తెలుసుకుని, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వాడాల్సి ఉన్నా.. రైతులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. తమకు తెలిసిన ఎరువులను యథేచ్ఛగా వాడుతున్నారు. తద్వారా ఒక్కోసారి ఆశించిన స్థాయిలో దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి, వరి, గోధుమ, చెరకు పంటలకు ఎక్కువగా పురుగుల మందులు వాడుతున్నారు. 

పంజాబ్‌లో కేన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు
రసాయన ఎరువుల అధిక వినియోగంతో ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో నష్టాలు పెరుగుతున్నాయి. ప్రత్యక్షంగా చూస్తే.. నత్రజని కాలుష్యం పెరగడం వల్ల ఆహార ఉత్పత్తుల ద్వారా కేన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. పంజాబ్‌లో ఈ సమస్య తీవ్రస్థాయికి చేరింది. కొంతకాలం ఎరువుల వినియోగం తర్వాత భూమి లోపల ఉండే బ్యాక్టీరియా చచ్చిపోయి, కార్బన్, మినరల్స్‌ వంటివి పోయి ఈ రసాయనాలే డామినేట్‌ చేస్తాయి.

మొక్కకు సహజ సిద్ధమైన బలం చేకూరకుండా నేరుగా రసాయనాలే ప్రభావితం చేస్తాయి. పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. రెండు, మూడు పంటలు వచ్చే ఉమ్మడి నల్లగొండ పరిధిలోని మిర్యాలగూడ, తదితర ప్రాంతాల్లో వరి పొలాల్లో విపరీతంగా యూరియా ఇతర రసాయనాల వినియోగం కారణంగా నేల మొత్తం రసాయనాలే నిండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమస్యను అధిగమించాలంటే రసాయనేతర ఎరువులైన ఆవు, ఇతర జంతువుల పేడ, గృహాల నుంచి వచ్చే చెత్తతో తయారుచేసిన ఎరువుల వినియోగం పెంచాలి. – డా. దొంతి నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు, పాలసీ అనలిస్ట్‌

రసాయన, సేంద్రీయ కాంబినేషన్‌ మంచిది 
రసాయన ఎరువుల అధిక వాడకం వల్ల భూమి తన నిజ స్వరూపం, సారాన్ని కోల్పోతుంది. భూమిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్‌ కూడా చనిపోతాయి. ఎరు వులు వాడితే మొక్కల్లో నీటి నిల్వశాతం కూడా తగ్గు తుంది. వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. మొక్క కు రసాయన ఎరువు, సేంద్రీయ ఎరువులు కాంబినేషన్‌గా అందించాలి.

ఉదాహరణకు మొత్తం పది బస్తాల ఎరువులు వినియోగిస్తామను కుంటే.. అందులో ఆరు బస్తాలు రసాయన ఎరువులు, 4 బస్తాల సేంద్రీయ ఎరువులు ఉండేలా చూడాలి. దీనితో సమతుల్యత ఉంటుంది. పురుగుల మందుల వల్ల బీపీ, షుగర్, కిడ్నీ పేషంట్లు పెరుగుతున్నారు.  – కె.రాములు ఎండీ, ఆగ్రోస్‌ లిమిటెడ్‌

సబ్సిడీలు తగ్గించుకునేందుకే..
కేంద్ర ప్రభుత్వం పీఎం ప్రణామ్‌లో భాగంగా ఎరువుల వినియోగం తగ్గించడం ద్వారా రైతులకిచ్చే సబ్సిడీలు కూడా తగ్గిస్తోంది. శ్రీలంక తరహాలో సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సహించాలని చూస్తోంది. సేంద్రీయ, రసాయన ఎరువులు కలగలిపి ఉపయోగించడం ద్వారా సేంద్రీయ వ్యవసాయం చేయాలి. కానీ ఒక్క సేంద్రీయ లేదా రసాయన ఎరువుల వాడకంతో పంటలు పండవు. చైనా, అమెరికాతో పోల్చితే భారత్‌లో తక్కువగానే ఎరువులు వాడుతున్నారు నిజమే.

అయితే చైనాలో హెక్టార్‌కు 80 క్వింటాళ్లు, అమెరికాలో 60 క్వింటాళ్లు   పండిస్తున్నారు. కానీ మన దేశంలో 25 క్వింటాళ్లే దిగుబడి వస్తోంది. 1991లో మనం ఎగుమతులు చేసే దశ నుంచి, ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులు సహా, పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు, మాంసం, నూనెలు, పప్పుధాన్యాలు, పంచదార వంటివి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్‌ దిగుమతులకు డంపింగ్‌ కేంద్రంగా మారింది. భారత్‌లో ఉత్పత్తులను దెబ్బతీసి దిగుమతులపై ఆధారపడేలా చేసే ధనిక దేశాల ప్రయత్నాలకు కేంద్రం లొంగిపోతోందనడానికి ఇదో ఉదాహరణ.  – సారంపల్లి మల్లారెడ్డి, రైతుసంఘం నేత, వ్యవసాయ నిపుణులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement