డీసీసీబీ అధికారుల అత్యుత్సాహం
మదనాపురం: రైతు తీసుకున్న రుణాన్ని పూర్తిస్థాయిలో చెల్లించలేదని ఆత్మకూర్ డీసీసీబీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా గ్రామంలో డప్పు మోగిస్తూ.. సదరు రైతు భూమిని వేలం వేస్తామంటూ దండోరా వేశారు.
వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన రైతు లచ్చాగౌడ్ 2019లో గేదెల పెంపకం కోసం ఆత్మకూర్ డీసీసీబీలో తన రెండెకరాల పొలాన్ని కుదువపెట్టి రూ. 3.50 లక్షల అప్పు తీసుకున్నారు. దాదాపుగా రూ. 5 లక్షలకు పైగా బ్యాంక్‌కు చెల్లించినా అప్పు తీరలేదు.
ఇంకా రూ.1.75 లక్షల బకాయి ఉందని.. బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైతు లచ్చాగౌడ్ భూమిని వేలం వేస్తామంటూ మంగళవారం గ్రామంలోని ప్రధాన వీధుల్లో డప్పు మోగిస్తూ.. మైక్‌లో చాటింపు చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో కట్టలేదు..
నేను అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు రూ. లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. పంటలు సరిగ్గా పండక పెట్టుబడులు మీద పడి నష్టం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల రూ. 1.75 లక్షల రుణం కట్టలేదు. నాకు రుణమాఫీ కూడా వర్తించలేదు. భూమి వేలం వేస్తామంటూ గ్రామంలో దండోరా వేయడం చాలా బాధగా ఉంది. – లచ్చాగౌడ్, రైతు, మదనాపురం
Comments
Please login to add a commentAdd a comment