గరుడాద్రి కొండపై రంగనాథుడు
కవి, పండితుల ఆస్థానంగా భాసిల్లిన క్షేత్రం
వనపర్తి సంస్థానాధీశుల కాలంలో సభలు, సమావేశాలకు ఆతిథ్యం
ఇక్కడే రాష్ట్ర స్థాయి తెలుగు మహాసభలు
వనపర్తి: తమిళనాడులోని శ్రీరంగం రంగనాయకుడిని వనపర్తి సంస్థానాధీశులు ఇంటి దైవంగా కొలుస్తూ పూజించేవారు. తమ సంస్థానంలోని కొర్విపాడు (పెబ్బేరు మండలం శ్రీరంగాపురం) గ్రామంలోని రంగసముద్రం చెరువు ఒడ్డున ఉన్న గరుడకొండపై శ్రీరంగాన్ని పోలిన రంగనాథస్వామి ఆలయాన్ని 345 ఏళ్ల క్రితం అప్పటి సంస్థానాధీశుడు గోపాలరావు నిర్మించినట్టు స్థలపురాణం చెబుతోంది. అనంతరం కొర్విపాడు పేరును శ్రీరంగాపురంగా మార్చారు.
ద్వీపకల్పంగా దర్శనమిచ్చే ఈ దేవాలయానికి రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకత ఉంది. పురాతన ఆలయాల మాదిరిగా నేలమాలిగలను సైతం నిర్మించి.. అందులో పురాతనమైన తంజావూరు పెయింటింగ్స్‌ను భద్రపరిచారు. దేవాలయాన్ని, అందులో కొలువుదీరిన స్వామివారి మూలవిరాట్‌ను తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో మాదిరిగానే ప్రతిష్ఠించారు. సంస్థానాధీశుల కాలంలో శ్రీరంగాపురం క్షేత్రం కవి, పండితులకు ఆస్థాన కేంద్రంగా భాసిల్లింది. సభలు, సమావేశాలకు ఆతిథ్యమిచ్చింది.
ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాల సమయంలో చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. తిరుపతి వేంకటకవులు లాంటి మహోన్నత వ్యక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించి.. ఆతిథ్యం తీసుకున్నట్టు చరిత్ర చెబుతోంది. ఇటీవల కాలంలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి తెలుగు మహాసభలను ఇక్కడ నిర్వహించారు.
వనపర్తి–పెబ్బేరు ప్రధాన రహదారిలోని కంచిరావుపల్లి గ్రామం నుంచి శ్రీరంగాపురం ఆలయానికి చేరుకోవచ్చు. పెబ్బేరులోని 44వ నంబర్ జాతీయ రహదారి నుంచి ఈ ఆలయం 11 కి.మీ. దూరంలో ఉంటుంది. ఏటా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నుంచి ఉగాది పండుగ వరకు సుమారు 15 రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
ఉట్టిపడే శిల్పసంపద
శ్రీరంగనాయకస్వామి ఆలయంలో నిర్మించిన అద్భుతమైన శిల్పసంపద భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వివిధ శిల్ప సంప్రదాయాలతోపాటు ద్వారపాలక శిల్పాలతో ఆకాశాన్నంటే అంతస్తులతో ఆలయ గోపురం భక్తులకు స్వాగతం పలుకుతోంది. శేషశయనుడై అభయహస్తం చూపుతూ స్వామివారు, ఆయనకు ఎడమవైపున చతుర్భుజ తాయారు ఆలయంలో శ్రీలక్ష్మీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
ఆలయం పక్కనే ఏడాది పొడవునా నీటితో కళకళలాడే రంగసముద్రం రిజర్వాయర్ ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఈ ఆలయంలో పలు సినిమాల షూటింగ్ నిర్వహిస్తారు. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు చేస్తున్నా.. నేటికీ కార్యరూపం దాల్చలేదు.
Comments
Please login to add a commentAdd a comment