నిర్వికార నిరహంకారుడు ఐనవోలు మల్లికార్జునుడు
శతాబ్దాల సంప్రదాయం.. ఘనమైన చరిత్ర
జనపదుల సంస్కృతే మల్లన్న ఆచారం
పరంపరానుగతంగా కాపాడుకుంటున్న భక్తులు
నేడు బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఐనవోలు: కాకతీయుల రాజధాని ఓరుగల్లులో జాతరలకు ప్రత్యేక స్థానం ఉంది. రెండేళ్లకోసారి సమ్మక్క, సారలమ్మ జాతర, ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు మల్లన్న జాతరలు వైభవంగా జరుగుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మల్లన్న జాతరలు 13 ప్రదేశాల్లో జరుగుతాయి. ఐనవోలు మండల కేంద్రంలో జరిగే మల్లన్న జాతరకు విశిష్టత ఉంది. ఇక్కడి ఆలయం పురాతనమైనదే కాకుండా చారిత్రకంగా ప్రత్యేకతను నిలుపుకొంది.
జాతర సందర్భంగా ఆలయంలో భక్తులు సమర్పించే బోనాలు, మొక్కుబడులు, ఒగ్గు పూజారులు వేసే పట్నాలు, అర్చకులు చేసే పూజలు.. భక్తుల నమ్మక వ్యవస్థ గత సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. మల్లన్న దేవుని మీద, ఆలయ చరిత్రపై ఉన్న మౌఖిక కథనాలు ప్రత్యేకత చాటుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐనవోలు గ్రామం వర్ధన్నపేట మండల పరిధిలో ఉండేది.
జిల్లా, మండలాల పునర్విభజనలో బాగంగా ఐనవోలును నూతన మండలంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది హనుమకొండ జిల్లా పరిధిలో ఉంది. వరంగల్ బస్టాండ్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర ప్రాంతాలు, విదేశాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
భక్తులు బోనం, పట్నం, వరం పట్టడం తదితర మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఆది, బుధవారాలు మల్లన్నకు ప్రీతికరమని పండితులు చెబుతారు. కాగా, మకర సంక్రాంతి నుంచి ఉగాది వరకు జాతర జరుగుతుంది. ఆది, బుధవారాలు ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. మిగిలిన రోజుల్లో సైతం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. జనవరి 12 నుంచి మార్చి 30 వరకు సంక్రాంతి జాతర, బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
పట్నం మల్లన్నకే ప్రత్యేకం
శైవ ఆగమం ప్రకారం ఆలయంలో తమ్మల్ల, బ్రాహ్మణులు పూజలు నిర్వహిస్తున్నారు. పూర్వాచారం ప్రకారం స్వామి వారి మేలుకొలుపు ఒగ్గు పూజారులతోనే ప్రారంభమవుతుంది. పవళింపు సేవలు సైతం వీరితోనే ముగుస్తాయి. మల్లన్న ఆలయంలో ఒగ్గు పూజారులకు విశిష్ట స్థానం ఉంది.
కర్ణాటకలో పుట్టిన ఖండేలు రాయుడు కర్ణాటక నుంచి మహారాష్ట్ర వరకు పరిపాలించాడని, ఆయన ఇద్దరి భార్యల్లో బలిజ మేడలమ్మ కర్ణాటక ప్రాంత వాసి కాగా, గొల్లకేతమ్మ మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ వాసిగా చెబుతారు. వీరే మల్లన్న క్షేత్రంలో ఉన్నట్లు ప్రజల భావనగా ఉంది. అందుకే గొల్ల, కురుమ, బలిజలకు ప్రాధాన్యం ఏర్పడింది. వీరే ఒగ్గు కథలు, పట్నాలు వేస్తూ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
శివసత్తుల విన్యాసాలు
జాతరలో ఆద్యంతం శివసత్తుల పూనకాలే కనిసిస్తాయి. శివసతులనే శివసత్తులుగా పిలుస్తున్నారు. శివునికి నాట్యమంటే ఇష్టం. స్త్రీలు శివుడిని కల్యాణం చేసుకునే సంప్రదాయం ఉంది. ఇక్కడ మహిళలు బోనం ఎత్తుకుని నృత్యాలతో పూనకాలు చేస్తుంటారు. పురుషులు కూడా మహిళల వేషధారణలో నృత్యం చేస్తూ తన్మయత్వం పొందడం గమనార్హం.
వరం పట్టడం.. టెంకాయ బంధనం
శివుడి వాహనం నంది. కోరికలు తీరితే భక్తులు కోడె(నంది)ను కడతారు. ఆలయం వెనుక భాగంలో వరం పడతారు. సంతానం కోసం టెంకాయ బంధనం, తొట్టెను కడతారు. ఎలాంటి దుష్టశక్తులు పట్టి పీడించకూడదని స్వామి వారికి మొక్కుకుంటారు. కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్కతో ముడుపు కడతారు. కోరికలు తీరిన తర్వాత ముడుపులు విప్పి మొక్కులు చెల్లిస్తారు.
ఒడి బియ్యం.. శావలు
పసుపు, నూనెతో కలిపిన బియ్యమే ఒడి బియ్యం. పోక, కర్జూర, గొల్లకేతమ్మ, బలిజమేడలమ్మ అమ్మవార్లకు చీరలు, గాజులు, జాకెట్ ముక్కలను, స్వామి వారికి దోతి, కండువాను సమర్పిస్తూ ఒడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకుంటారు. గండాలు తీరితే గండ దీపం పెడుతారు.
తలపై దీపం పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. కొంతమంది కోరికలు తీరితే స్వామి వారికి శావ తీస్తారు. స్వామి వారి బేల విగ్రహాలు రథంలో ఉండగా భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణగా తిప్పడాన్నే శావ తీయడం అంటారు. కొంతమంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారు.
పుట్టమట్టికి ప్రాధాన్యం
స్వామి వారు పుట్టమట్టి రూపంలోనే మొదట కొలువయ్యాడని ఇక్కడి గొల్ల, కురుమలు, యాదవుల నమ్మకం. దీంతో మల్లన్నను ఇలవేల్పుగా భావించే గొల్ల, కురుమలు జాతరకు ముందు తమ ఇళ్లలో పుట్టమట్టితో మల్లన్న గద్దెలు నిర్మించుకుంటారు.
రోజూ రాత్రి గద్టెలకు ప్రత్యేక పూజలు చేస్తారు. జాతర జరిగే రోజులు మద్యం, మాంసాహారం ముట్టకుండా స్వామివారి దర్శనం చేసుకుంటారు. బండారి రాసుకున్న భక్తులు కాకతీయుల నృత్య మండపంలో కొరడాల మధ్య నాట్యం చేయడం జాతరలో ప్రత్యేకం.
పట్నంలో రకాలు
పట్నంలో ప్రధానంగా చెలక పట్నం, నజరు పట్నం ఉంటాయి. పెద్దపట్నం మాత్రం మహాశివరాత్రి నాడు నిర్వహిస్తారు. చెలకపట్నం అంటే.. భక్తులు ఆలయ ప్రాంగణంలో విడిది చేసే ప్రాంతంలో వేసేది. నజరు పట్నం స్వామి వారి ఎదురుగా ప్రతినెల మాస శివరాత్రి రోజు వేస్తారు.
పట్నాలు మూడు రకాలుగా ఉన్నప్పటికీ.. చేయించుకునే వారి పూర్వీకులను స్తుతించడం, స్వామివారిని కీర్తించడం, కల్యాణం చేయడం ప్రధానంగా కనిపిస్తుంది. పట్నాలు వేసిన భక్తులు బోనాలు వండి స్వామి వారికి నైవేద్యం సమర్పిస్తారు.
బోనాల సమర్పణ
కుంభాకారంలో ఉండే పాత్రల్లో బియ్యం, పాలు, బెల్లం, వంకాయ, గుమ్మడికాయ, చిక్కుడు కాయ, కాకరకాయతో పరమాన్నం వండుతారు. పచ్చి పులుసుతో కలిపి స్వామి వారికి నివేదన చేస్తారు. ఒగ్గు పూజారులు పాటల రూపంలో ఢమరుక నాధాల మధ్య దీవెనలు అందిస్తారు.
తెల్లవార్లూ ప్రభబండ్ల ప్రదక్షిణ
ఏటా సంక్రాంతి పర్వదినం రోజు ప్రభ బండ్లు (ఎడ్ల బండ్లు) ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. పరిసర ప్రాంతాల ప్రజలు సంక్రాంతి సమయంలో రైతులు మొదటి పంటను తీసుకున్న తర్వాత ఉత్సాహంగా తమ ఎడ్లబండ్లతో ఆలయానికి చేరుకుంటారు.
మార్నేని వంశస్తులు రథాన్ని అందంగా అలంకరించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఆలయానికి చేరుకుంటారు. ఆలయ తూర్పు కీర్తితోరణం నుంచి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. మిగిలిన గ్రామాల నుంచి వచ్చిన ఎడ్లబండ్లు దానిని అనుసరిస్తాయి. రాత్రి ప్రభబండ్ల ముందు భక్తులు కోలాటాలు, నృత్యాలు చేస్తూ తెల్లవారే వరకు ప్రదక్షిణ చేస్తారు.
బండారి పసుపు విశిష్టత
తెల్లబొట్టు (విబూది) పెటు కున్న వారితో మరణం ఉండకూడదని మణిమల్లాసు రులనే రాక్షసులు బ్రహ్మ నుంచి వరం పొందారు. దీంతో ఆ రాక్షసులను సంహరించేందుకు మల్లికార్జునస్వామి పసుపు(బండారి) బొట్టు పెట్టుకుని గజ్జెలలాగు తొడిగి జాలి ముసుగు వేసుకుని కొరడా, త్రిశూలం, ఢమరుకంతో ప్రత్యక్షమై రాక్షసులను సంహరించాడని భక్తుల నమ్మకం. దీంతో ఆలయంలో బండారికి ప్రాధాన్యం ఏర్పడింది. భక్తులు బండారిని తీసుకొచ్చి.. కొంత స్వామి వారికి సమర్పించి.. కొంత వెంట తీసుకెళ్లడం ఆనవా యితీగా వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment