
స్టీల్, సిమెంటు ఖర్చు తగ్గించేలా అడుగులు
బడ్జెట్ సరిపోక అసంపూర్తిగా వదిలేస్తారన్న ఉద్దేశంతో గృహనిర్మాణ శాఖ కసరత్తు
నాలుగు పద్ధతులపై లబ్దిదారులకు అవగాహన
నిర్మాణ తీరుపై లబ్దిదారులకు స్వేచ్ఛ ఉంటుందన్న యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: లబ్దిదారులు ఇందిరమ్మ ఇళ్లను రూ.లక్షల్లో వెచ్చిoచి పూర్తి చేసుకోగలరా? పిల్లర్లతో కూడిన నిర్మాణంలో వ్యయం పెరిగి ఇళ్లను అసంపూర్తిగా ఆపేస్తే ఎలా? ఇది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం ముంగిట ప్రభుత్వానికి వచ్చిన సందేహాలు. నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో లబ్దిదారులు అవసరానికి మించిన విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టి నిధులు చాలక అసంపూర్తిగా ఆపేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న ఆందోళనే దీనికి కారణం.
మండలానికొక మోడల్ ఇల్లు
ప్రస్తుతం భవనాలను నిర్మిస్తున్నట్టుగా పిల్లర్లు, బీములతో కూడిన నిర్మాణ పద్ధతి కాకుండా, ఖర్చు తక్కువయ్యే ఇతర పద్ధతులపై లబ్దిదారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మండలానికి ఒకటి చొప్పున, వేర్వేరు పద్ధతుల్లో మోడల్ ఇళ్లను నిర్మిస్తోంది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వీలైనంత ఎక్కువ మంది మేస్త్రీలకు ఆయా పద్ధతుల్లో ఇళ్ల నిర్మాణంపై శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది.
తొలుత హైదరాబాద్ చుట్టూ ఉన్న ఏడు జిల్లాలకు చెందిన 113 మంది మేస్త్రీలకు నగరంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)లో శిక్షణ ఇచ్చింది. వీరు జిల్లాల్లోని మరికొందరు మేస్త్రీలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 28 నుంచి జిల్లాల్లోని న్యాక్ సెంటర్లలో నిపుణుల ఆధ్వర్యంలో కూడా మేస్త్రీలకు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. వారం రోజులపాటు జరిగే శిక్షణ తరగతులకు ఒక్కో మేస్త్రీకి రూ.8 వేల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
లబ్దిదారు ఇష్టం ప్రకారమే!
ప్రభుత్వం ఒక్కో ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. ఆ మొత్తంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోలేని ఆర్థిక పరిస్థితి ఉన్నవారికి ఉపయుక్తంగా ఉండేలా నాలుగు నిర్మాణ పద్ధతులను అందుబాటులోకి తెచ్చిoది. కానీ, ఆ నాలుగింటిలో కచి్చతంగా ఒకదాన్ని అనుసరించాలన్న నిర్బంధం లేదని అధికారులు చెబుతున్నారు.
లబ్దిదారు సాధారణ పద్ధతిలో అయినా ఇంటిని నిర్మించుకోవచ్చని, ఆర్థిక పరిస్థితి సహకరించని పక్షంలో, నమూనా ఇంటిని చూసి ఆ పద్ధతిలో ఇంటిని నిర్మించుకోవచ్చని అంటున్నారు. ఇంటి విస్తీర్ణం 400 చ.అ.కు తగ్గకుండా ఉండాలని ఇంతకాలం చెబుతూ వచ్చిన అధికారులు, ఇప్పుడు ఆ విస్తీర్ణం 600 చ.అ.కు మించరాదని కూడా బలంగా చెబుతున్నారు. విస్తీర్ణం పెరిగితే ఖర్చు తడిసిమోపెడై, ఇంటిని అసంపూర్తిగా వదిలేస్తారన్న ఉద్దేశంతో ఇలా చెబుతుంటారని అంటున్నారు.
నాలుగు డిజైన్ల ఖరారు..
1. షార్ట్ కాలమ్ కన్‌స్ట్రక్షన్: ఇళ్ల నిర్మాణంలో స్టీల్ వ్యయం చాలా ఎక్కువ. దీన్ని పరిహరించేలా ఈ డిజైన్‌ను అనుసరిస్తారు. పునాదిస్థాయి వరకు మాత్రమే కాలమ్స్ ఉంటాయి. పైన ప్లింథ్ బీమ్స్ ఉంటాయి. మధ్యలో పిల్లర్లు లేకుండా కాంక్రీట్ గోడ ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లలో పై అంతస్తులు ఉండే అవకాశం లేనందున ఈ నమూనా బాగుంటుందని అధికారులు చెబుతున్నారు.
2. షియర్ వాల్ పద్ధతి: ఇందులో ప్రీఫ్యాబ్రికేటెడ్ గోడలను నిర్మాణ స్థలంలోనే ముందుగా సాంచాల ద్వారా కాంక్రీట్‌తో సిద్ధం చేస్తారు. పునాదులపై రంధం డ్రిల్ చేసి రాడ్స్‌తో ఆ గోడలను అనుసంధానిస్తారు. వాటి మీద పైకప్పు వేస్తారు. ఇందులో ఇటుక, స్టీల్ వ్యయం ఉండదు.
3. స్టోన్ రూఫింగ్ విధానం: కాంక్రీటు గోడలు నిర్మించిన తర్వాత పైన పూర్వకాలపు దూలాల తరహాలో ఆర్‌సీసీ రాఫ్టర్స్ ఏర్పాటు చేస్తారు. వాటి మీద షాబాద్ బండలు పరుస్తారు. ఆ బండల మీద తక్కువ మందంతో కాంక్రీట్ పొర వేస్తారు. షాబాద్ బండల లభ్యత అధికంగా ఉండే ప్రాంతాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తాండూరు లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది ఇళ్ల కప్పులుగా తాండూరు బండలనే వాడుతున్నారు.
4. పిల్లర్ రూఫింగ్ నిర్మాణం: గోడలపై ఆర్‌సీసీ రాఫ్టర్లు అమర్చి వాటి మీద పూర్వ కాలం తరహాలో బెంగళూరు పెంకులు పరుస్తారు. పెంకుల మీద రెండున్నర అంగుళాల మందంతో శ్లాబ్ వేస్తారు. దీనిలో ఇటుక, స్టీల్ వ్యయాన్ని పరిహరించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment